రోబో గురువు! | Diwakar Vaish design different types of robots | Sakshi
Sakshi News home page

రోబో గురువు!

Published Mon, Nov 11 2013 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

రోబో గురువు!

రోబో గురువు!

రోబోలు ఫుట్‌బాల్ ఆడుతున్నాయి. భాంగ్రా డాన్సు చేస్తున్నాయి. అలసటగా ఉందని సోఫాలో వాలిపోతే గ్లాసుతో నీళ్లు తెచ్చిస్తాయి... ఇవన్నీ రోబోటిక్ రంగం సాధించిన అద్భుతాలు. ఈ అద్భుతాల ఆవిష్కర్త పాతికేళ్లు నిండని ఒక భారతీయుడు. సాంకేతికాభివృద్ధి అనగానే మన కళ్లు అభివృద్ధి చెందిన దేశాల వైపు చూస్తాయి. ‘ఆ చూపుల్ని ఇటు మరల్చండి’ అంటున్నారు 22 ఏళ్ల దివాకర్ వైష్.
 
పదిరోజుల క్రితం హైదరాబాద్‌లోని ఐఐటి క్యాంపస్‌లో రోబో తయారీ గురించి లెక్చర్ ఇచ్చారు దివాకర్. పాఠాలు చెప్పే పరిణతి ఎక్కడ నుంచి వచ్చిందీ అంటే... తన పరిశోధనల నుంచేనంటారు. న్యూఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ‘ఎ-సెట్ రోబోటిక్స్’ సంస్థని నడుపుతూ రోబోల గురించి క్లాసులు ఇస్తున్నారు దివాకర్. ఇంతకుముందు రూర్కెలా, ఖరగ్‌పూర్, కాన్పూర్, బెనారస్, గౌహతి ఐఐటిల్లోనూ, తమిళనాడులోని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనూ ఈ అంశాల మీద ఉపన్యసించారు.
 
‘‘చిన్నప్పుడు ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్ని చూసినా ‘ఇదెలా పనిచేస్తుంది, ఇది పని చేయడానికి లోపల ఉన్న అమరిక ఎలా ఉంటుంది’ వంటి సందేహాలు కలుగుతుండేవి. విషయం తెలుసుకోవడానికి ఎన్నింటిని పాడు చేశానో లెక్కేలేదు. టెలిఫోన్, సీడీ ప్లేయర్, కంప్యూటర్ ఏది కనిపించినా ఓపెన్ చేసి చూడాల్సిందే. అన్నింటిని నష్టపరిచినా మా అమ్మానాన్నలు నన్నెప్పుడూ తిట్టలేదు’’ గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు దివాకర్.

 ఎలా మొదలైందంటే!

 నేను స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో అంతర్ పాఠశాలల మధ్య రోబోటిక్ కాంపిటీషన్ జరిగింది. నేను ఈ రంగం మీద దృష్టి కేంద్రీకరించడానికి కారణం ఆ పోటీనే. ఆ తర్వాత చాలా పోటీల్లో పాల్గొన్నాను. కొన్నింటిలో గెలిచాను, కొన్నిసార్లు ప్రయత్నం ఫెయిలయ్యేది. ప్రతి ప్రయత్నమూ చక్కటి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్సే.
 
మైలురాయి!

లక్నోలో జరిగిన అంతర్జాతీయ రోబోటిక్ ప్రదర్శనలో మొదటి బహుమతి రావడం నా జీవితంలో మైలురాయి. లక్నో పోటీలో గెలవడంతో నా మీద నాకు నమ్మకం కలిగింది. ఈ రంగంలో ఇంకా లోతుగా అధ్యయనం చేయాలనే తపన కూడా కలిగింది. 12వ తరగతిలో ఉన్నప్పుడు కొంత వైవిధ్యంగా ఏదైనా చేయాలనిపించింది. సొంతంగా ఒక రోబోను తయారుచేయాలనుకున్నాను. నా ప్రయోగానికి చాలా ఖర్చవుతుంది. నా ప్రయత్నం విజయవంతం అవుతుందో కాదోనని, భయపడుతూనే మా అమ్మానాన్నలను ‘నేను తయారుచేయాలనుకుంటున్న రోబో తయారీకి విదేశాల నుంచి కొన్ని విడిభాగాలను తెప్పించుకోవాలి. అందుకోసం డబ్బు కావాలి’ అని అడిగాను. వాళ్లు ఏ మాత్రం సందేహించకుండా డబ్బు అమర్చారు. ఆరు నెలల తర్వాత ఒక రోబోను తయారుచేశాను. అదే నేను చేసిన తొలి రోబో. అదే భాంగ్రా డాన్సు చేసే రోబో. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రయోగం కూడ. గత ఏడాది తయారుచేసిన రోబో... మనిషి మెదడు లోని ఆలోచనను పసిగడుతుంది. మనిషి అలసటగా ఉంటే ఆ విషయాన్ని గ్రహించిన రోబో గ్లాసుతో నీటిని తెచ్చి ఇస్తుంది.
 
రోబో రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు సహాయం చేస్తే మనదేశం నుంచి చాలా అద్భుతాల ఆవిష్కారం జరుగుతుంది అనిపించింది. దాంతో న్యూఢిల్లీ, కరోల్‌బాగ్‌లో ‘ఎ-సెట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ సహకారంతో ఆ సంస్థకి అనుబంధంగా ‘ఎ-సెట్ రోబోటిక్స్’ని 2010లో స్థాపించాను. ఇందులో  నాలుగవ తరగతి విద్యార్థి నుంచి పిహెచ్‌డి స్కాలర్స్ వరకు రోబోల గురించి నేర్చుకోవచ్చు. దీనితోపాటుగా ఇక్కడ అనేక రకాల రోబోల గురించి పరిశోధన జరుగుతూంటుంది.
 
ఐఐటి, విఐటి, బిఐటిఎస్, ట్రిపుల్‌ఐటి వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలతోపాటు మరికొన్ని ప్రముఖమైన విద్యాసంస్థల్లో కూడా లెక్చర్‌లు ఇస్తున్నాను’’ అంటున్నారు దివాకర్.
 
 దివాకర్ విజయాలు:
 2009లో లక్నోలో మలేసియా, రష్యా, చెక్ రిపబ్లిక్ వంటి 40 దేశాల శాస్త్రవేత్తలు పాల్గొన్న పోటీలో విజయం
     
 2010లో దేశంలో మొదటి డ్యాన్సింగ్ హ్యూమనాయిడ్ రోబోను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఆ రోబో హిందీ, పంజాబీ పాటలకు డాన్సు చేస్తుంది
     
 2010లో ‘ఎ- సెట్ రోబోటిక్స్’ స్థాపన (అప్పటికి ఇతడి వయసు 18 ఏళ్లు)
     
 2011లో పరస్పరం ఫుట్‌బాల్ ఆడుకునే మూడు రోబోల తయారీ
     
 2012లో ‘యూ థింక్- దే వర్క్’ పేరుతో ఆలోచనను పసిగట్టే రోబో తయారీ
 
 2013లో పూర్తి స్థాయిలో మనిషి కదలికలను పోలిన హ్యూమన్ రోబో తయారీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement