సేఫ్.. సేఫర్.. సేఫెస్ట్
దీపావళి
దీపావళి జ్ఞాపకాలు ఆనందదాయకంగానే ఉండాలి. దేహం మీద గాయాలను చూసుకుని ఫలానా ఏడాది దీపావళి టపాకాయలు కాలుస్తున్నప్పుడు అంటూ... చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకునే పరిస్థితి రాకూడదు. దీపావళి గాయాలకు ప్రధానంగా దీపాలు, టపాకాయలు, ఇంటికి మంటలంటుకోవడం అనే మూడు కారణాలు ఉంటాయి. దుస్తులకు దీపం తగిలి మంటలు వ్యాపిస్తాయి. అలాగే బాణాసంచా నుంచి వచ్చే నిప్పురవ్వలు దుస్తులమీద, ఒంటి మీద పడి ఒళ్లు కాలడం సాధారణంగా సంభవించే ప్రమాదం. కొన్ని సందర్భాల్లో వెలుగుతున్న దీపం ప్రమిద లేదా కొవ్వొత్తి ఒలికి పోయి కర్టెన్లు, సోఫాల వంటివి అంటుకుని మంటలు ఇల్లంతా వ్యాపిస్తాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ దీపావళి మీకు సేఫ్.. సేఫర్.. సేఫెస్ట్ దీపావళి కావాలని సాక్షి ఆకాంక్షిస్తోంది...
గెట్ రెడీ!
టపాకాయలు కాల్చేటప్పుడు నూలు దుస్తులనే ధరించాలి. లో దుస్తులు కూడా నూలువే ఉండాలి. పట్టు వస్త్రాలు, నైలాన్‌వంటి సింథటిక్ దుస్తులను ధరించరాదు. వదులుగా విచ్చుకున్నట్లు ఉండే పావడాలు, ఘాగ్రాలు వద్దు. చీరలకు పల్లును నడుముకు చుట్టుకోవాలి. అలాగని మరీ బిగుతు దుస్తులు వేసుకున్నా కష్టమే. దుస్తుల మీద నిప్పురవ్వలు పడితే తక్షణం తొలగించడానికి వీలుగా ఉండాలి. మందుగుండు కాల్చిన వెంటనే ఆ పొగ గాలిలో కలిసిపోవాలి. కాబట్టి విశాలమైన ఖాళీ ప్రదేశంలో మాత్రమే కాల్చాలి. అన్ని వైపుల గోడలతో క్లోజ్‌డ్ ఏరియాలో కాలిస్తే పొగ ఆ ఆవరణలోనే తిరుగుతూ ఉంటుంది. దాంతో ఊపిరితిత్తుల సమస్య తలెత్తవచ్చు. చంటి పిల్లలకు, వృద్ధులకు, ఆస్త్మా పేషెంట్లకు ఇది చాలా ప్రమాదకరం.
టపాకాయలు కాల్చేటప్పుడు నీటి బకెట్‌ని కానీ, ఇసుక తొట్టెని కానీ దగ్గర ఉంచుకోవాలి. కాకరపూల వంటి వాటిని కాల్చిన వెంటనే ఆ ఇనుప కడ్డీలను నీటిలో కానీ ఇసుకలో కానీ వేయాలి. చిచ్చుబుడ్లు, బాంబులు ఇతర ఏ రకమైన టపాకాయనైనా ఒకసారి కాల్చినప్పుడు వెలగకపోయినా, ఒత్తి వరకు వెలిగి ఆరిపోయినా దగ్గరగా వెళ్లి ఊదడం, కదిలించడం ప్రమాదం. అవి ఎప్పుడైనా పేలవచ్చు. టపాకాయలు కాల్చేటప్పుడు కాళ్లకు చెప్పులు వేసుకోవాలి.
సివిక్‌సెన్స్
రాకెట్‌లు అన్నిసార్లూ నేరుగా ఆకాశంలోకి వెళ్తాయని చెప్పలేం. దిశ మార్చుకుని ఇళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అపార్ట్‌మెంట్‌ల దగ్గర నివసించే వాళ్లు రాకెట్‌లను అసలే కాల్చకూడదు. టపాకాయలు కాల్చే వేళలో ఎవరూ దుస్తులు బయట ఆరవేయకూడదు. పక్కింటి నుంచి వచ్చిన నిప్పురవ్వల కారణంగా దుస్తులు పావడమే కాకుండా, ఆ సమయంలో చూసుకోకపోతే మంటలు వ్యాప్తి చెందవచ్చు. కరెంటు ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లు, ఇతర ఎలక్ట్రికల్ పరికరాల దగ్గర టపాకాయలు కాల్చకూడదు. సాయంత్రం ఐదుగంటలకు ముందు, రాత్రి తొమ్మిది దాటిన తర్వాత టపాకాయలు కాల్చరాదు. స్కూళ్లు, పనుల నుంచి ఇళ్లకు చేరేవారికి ఇబ్బంది. రాత్రి తొమ్మిది దాటినా శబ్దాలు వస్తుంటే ఆ పరిసరాల్లోని పెద్దవారికి ఆరోగ్యం పాడవుతుంది.
ఫస్ట్ ఎయిడ్
ఒళ్లు కాలిన వెంటనే దుస్తులు తొలగించాలి. గాయపడిన వాళ్లు భయంతో పరుగెడుతుంటారు. కానీ ఉన్నచోటనే నిలబడాలి. పరుగెత్తితే గాలిలోని ఆక్సిజెన్ గాయాల తీవ్రతను పెంచుతుంది. గాయం మీద పదిహేను నిమిషాల పాటు నీటిని (చన్నీరు, వేడి నీరు పోయరాదు) ధారగా పోయాలి లేదా నీటి కుళాయి కింద పెట్టాలి. గాయమైన అరగంట లోపల ఈ చికిత్స జరగాలి. ఇలా చేయడం వల్ల వేడి తగ్గిపోతుంది. గాయం తీవ్రత తగ్గుతుంది. చర్మం మీద వేడి ఎక్కువ సేపు ఉంటే గాయం తీవ్రత పెరుగుతుంది. ఈ జాగ్రత్త తీసుకోకపోతే ఫస్ట్ డిగ్రీ బర్న్ కూడా సెకండ్ డిగ్రీ లేదా థర్డ్ డిగ్రీ బర్న్ స్టేజ్‌కి వెళ్లిపోతుంది. గాయం థర్డ్ డిగ్రీకి వెళ్లిన అనేక సందర్భాల్లో ఆపరేషన్ చేసి కొత్త చర్మాన్ని అతికించాల్సి వస్తుంది. గాయం మీద నీటిని పోయడం అనే చిన్న జాగ్రత్త తీసుకోవడం వల్ల గాయం తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు.
కళ్లకు గాయం అయితే...
కంటికి చువ్వలాంటిది తగిలి గాయం అయినప్పుడు వెంటనే చేత్తో కానీ కంటిని రుద్దుతారు. ఇది చాలా ప్రమాదం. గాయం తీవ్రత పెరగడానికి, గాయం విస్తరించడానికి కారణం అవుతుంది. కంటికి క్లాత్‌తో గట్టిగా కట్టు కట్టకూడదు. ఇలా చేస్తే కంట్లో గుచ్చుకున్న నలుసు మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గాయమైన కంటిని కప్పు లేదా షీల్డుతో కప్పి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.రసాయనాలు కంట్లో పడితే కంటిని పరిశుభ్రమైన నీటితో కడగాలి. కంటిని రుద్దకుండా దోసిలితో నీటిని తీసుకుని కంటికి తగిలేటట్లు చేస్తూ శుభ్రం చేయాలి. తీవ్రమైన గాయాలే కాక కంటికి ఏ చిన్న గాయమైనా సరే దానిని నిర్లక్ష్యం చేయరాదు. ఒకసారి కంటి వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, చికిత్స చేయించుకోవాలి. ఈ చిన్న గాయం భవిష్యత్తులో దృష్టిలోపానికి దారి తీయకుండా ఉండడానికే ఈ జాగ్రత్త.
చెవి ప్రమాదాలు ఇలా!
బాణాసంచా కాల్చినప్పుడు వెలువడే శబ్దం, పొగ, రసాయనాలు రకరకాల దుష్ర్పభావాలకు కారణాలవుతుంటాయి. ఇతర ప్రభావాలెలా ఉన్నా శబ్దం ప్రతి ఒక్కరినీ బాధించే దుష్పరిణామం. ఇది స్వయంగా కాల్చే వారినే కాకుండా దూరంగా ఉన్న వారినీ వదలదు. శబ్దం వల్ల చంటిబిడ్డలు, పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతుంటారు. అకస్మాత్తుగా పెద్ద శబ్దాన్ని విన్నప్పుడు కలిగే అసౌకర్యాన్ని ఇంపల్స్ సౌండ్ ఎఫెక్ట్ అంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే...
అకస్మాత్తుగా చెవి దిబ్బడ పడినట్లు ఉండడం (ఇయర్ బ్లాక్) చెవిలో నొప్పి, గుయ్‌ఁ మంటూ శబ్దం వినిపించే టినిటస్ వంటివి రావచ్చు నరం దెబ్బతిని పూర్తిగా వినిపించకపోవడం ఇయర్ డ్రమ్ దెబ్బతినవచ్చు టెంపరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్... ఈ స్థితిలో తాత్కాలికంగా వినికిడి లోపిస్తుంది. 16-48 గంటల్లో దానంతట అదే సర్దుకుంటుంది. ఈ కాలవ్యవధిలో తగ్గకపోతే చికిత్స తప్పనిసరి.
ఎప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి?
సాధారణంగా ఫస్ట్ డిగ్రీ బర్న్స్‌కి హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉండదు. అవుట్ పేషెంటుగానే చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు. చేతులు, ముఖం మీద చిన్నపాటి గాయం అయినా సరే ఆసుపత్రికి తీసుకురావాలి. అలాగే పొగను ఎక్కువగా పీల్చినా కూడా ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ చేత చికిత్స చేయించుకోవాలి. అయితే చిన్న పిల్లలు, వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు మాత్రం చిన్నపాటి గాయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
జాగ్రత్తలు
చెవిలో దూది పెట్టుకోవడం వల్ల ఏడు డెసిబుల్స్‌ను మాత్రమే నియంత్రించవచ్చు. కానీ దీపావళి టపాకాయల శబ్దం 100-120 డెసిబుల్స్ వరకు ఉంటుంది. కాబట్టి దూది వల్ల పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదు. శబ్దానికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు చెవిలో ఏర్పడిన అసౌకర్యం తగ్గడానికి నూనెలు, నీళ్లు, ఇయర్ డ్రాప్స్ వేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలేవీ చేయకుండా ఇఎన్‌టి నిపుణులను సంప్రదించాలి. మైక్రోస్కోప్, ఆడియోమెట్రీ పరీక్షలు చేసి చెవికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి చికిత్స చేయాల్సి ఉంటుంది.
బాణాసంచా కాల్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. గొంతులో నీళ్లు పోసుకుని గార్గిలింగ్ చేయాలి. పిల్లలు టపాకాయలను కాల్చిన చేతులతోనే ముక్కు, చెవులు, కళ్లను రుద్దుకుంటారు. ముక్కు దగ్గర రుద్దితే రసాయనాల ప్రభావం వల్ల ముక్కు నుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.
అపోహ వాస్తవం
అపోహ: కాలిన గాయం మీద నీటిని పోయరాదు. నీటిని పోస్తే బొబ్బలొస్తాయి.
వాస్తవం: నీటిని పోయడం వల్ల గాయం వేడి తగ్గి తీవ్రత తగ్గుతుంది. గాయం త్వరగా మానుతుంది.