విలువైన జీవితాన్నివ్యర్థంగా వృథా చేసుకోవద్దు
సృష్టిలోని అన్నింటికంటే మనిషి అంటేనే భగవంతునికి ఇష్టమట. ఎందుకంటే, మరేప్రాణీ భగవంతునికి రెండు చేతులూ జోడించి ప్రార్థించలేవు. కేవలం మనిషి ఒక్కడే ఈ పని చేయగలడు. తను సృష్టించిన మనిషి తన గురించి గొప్పగా భక్తిశ్రద్ధలతో కీర్తిస్తుంటే భగవంతుడు ఎంతో ఆనందిస్తాడట. దేవుణ్ణి ప్రార్థించడమనే గొప్ప అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం? మనం చేసే ప్రార్థనలో అర్థంలేని కోరికలు, విపరీతమైన ఆశలు, దేవుడి నుంచి ఎక్కువగా ఆశించటాలూ ఇమిడి ఉంటాయి.
మన కోరికలు తీరగానే దేవుడు కరుణించాడని సంబరపడతాం. తీరకుంటే దేవుడు లేడని, ఉంటే.. ఇలా తన కష్టాలను చూస్తూ కూర్చోడనే తీర్మానానికి వచ్చేస్తాం. కానీ నిజమైన ప్రార్థనకు అర్థం అది కాదు. ప్రతిఫలం కోరనిదే నిజమైన ప్రార్థన. మన ప్రార్థనకే దేవుడు కదులుతాడు. అందుకే మన ప్రార్థనల్లో విపరీతమైన కోరికలు ఉండకూడదు. కోరికలే లేనప్పుడు మనం బాధపడే ప్రసక్తే లేదు. మనకేం కావాలో, ఏం వద్దో ఆ భగవంతుడికి తెలుసు. మనం చేయవలసిందల్లా మనల్ని పుట్టించినందుకు, ఈ స్థితి కల్పించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రార్థించడమే!
ఎనభై నాలుగు లక్షల జన్మల తరువాత లభించిన అదృష్టం ఈ మానవ జన్మ. ఇంత గొప్ప జన్మ ద్వారా లభించే జీవితం ఒకే ఒక్కటి. అది మళ్లీ మళ్లీ రాదు. అలాంటి అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నామన్న దానిని బట్టి జీవిత పరమార్థం ఉంటుంది. చిన్న పిల్లలకు ఏదైనా వస్తువిస్తే ఏం చేస్తారు? తెలిసీ తెలియనితనంతో దాన్ని ఏ కీలుకి ఆ కీలు విడదీస్తారు. దాని స్వరూపాన్ని మార్చేస్తారు. చివరికి అదెందుకూ పనికిరాకుండా పోతుంది. ఇది తెలిసీ మరోసారి పిల్లలకు అలాంటి వస్తువులు ఇవ్వం కదా! దాని విలువను తెలుసుకున్నారనే నమ్మకం కలిగిన తర్వాతే ఇస్తాం. భగవంతుని ఎదుట మనం కూడా పిల్లలమే!
తండ్రిలాంటి భగవంతుడు పిల్లలం వంటి మనకు ఈ విలువైన జీవితాన్నిచ్చాడు. మనం ఈ అవకాశాన్ని సార్థకం చేసుకోవాలి. అంతే తప్ప విందు వినోదాలు, ఆటపాటలతో, కోపతాపాలతో, కాలక్షేపం కబుర్లతో, అహంకార మమకారాలతో, సుఖాలపై మోజుతో, అర్థంపర్థం లేని కోరికలతో నిస్సారం చేసుకోకూడదు. మళ్లీ అలాంటి అవకాశం లభించక పోవచ్చు. అందుకనే జీవితాన్ని చక్కగా వినియోగించుకోవాలి. మంచి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఫలితం ఆశించకుండా పని చేసుకుపోవాలి. చేతనైనంతలో తోటివారికి సాయపడాలని చెబుతుంటారు బాబా.
శ్రీసాయి చేసిన ఉపదేశాల సారాన్ని పరిశీలిస్తే అహంకారాన్ని వదులుకొమ్మనే హితోక్తే ఎక్కువగా వినబడుతుంటుంది. తాను కూడ గురువు పాదాల వద్ద అహంకారాన్ని వదులుకున్నాక కానీ పరిపూర్ణ మానవుడిని కాలేకపోయానని చెప్పుకున్న గొప్ప నిరాడంబరులు బాబా. మనిషికి అహంకారం దీర్ఘశత్రువు. సమతా లక్షణం మచ్చుకైనా కలగనివ్వని చెడ్డగుణం ఇది. ఈ గుణం ఉన్న మనిషి ఎవరినీ తనతో సమానమని, అందరిలోనూ దేవుడున్నాడని అనుకోడు. అలా ఆలోచించనివ్వకపోవడమే అహంకార లక్షణం.
అహంకారం ఉన్న మనిషి తనకంటే బలహీనమైన వారిని లొంగదీసుకుని, తనకంటే బలవంతులైన వారిని బుట్టలో వేసుకుని ఇదే జీవితమనే ధోరణిలో గడిపేస్తాడు. ఈ రెండూ సాధ్యం కాని పక్షంలో మిగిలేది దుఃఖం. అహంకారంతో బతికే వారికి శాంతి ఉండదు. జీవితంలో శాంతిని పొందడం కంటే అదృష్టం మరొకటి లేదు. అందుకే నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకునేవారు ఈ దుర్లక్షణాన్ని వదులుకోవాలని చెప్పే బాబా సూక్తి సదా స్మరణీయం. ఆచరణీయం.
- డా. కుమార్ అన్నవరపు
బాబా చెప్పిన మంచిమాటలు
ఏకాగ్రతతో పని చేయండి. కార్యసాధనలో బద్దకం, అలసత్వం, సోమరితనం, వాయిదాలు వేసే తత్వాన్ని వీడండి.
మనసును నిత్యం నిర్మలంగా ఉంచుకోందడి.
అనవసర చర్చలు, వాదులాటలు, కీచులాటలు మానండి. మంచి పని చేసి అందులో ఉన్నతిని సాధించడానికి సదా ప్రయత్నించండి.
ప్రశాంతంగా ఉండండి. కష్టాలు, బాధలు, ఇబ్బందులూ వాటికవే కుదుటపడతాయి.
సమయాన్ని వాగ్వివాదాలతో, వాదులాటలతో వృథా చేయవద్దు. కాలక్షేపం కబుర్లతో పొద్దుపుచ్చకండి.
హారతి ఎందుకు?
ఆలయంలోని మూలమూర్తికి ధూపదీపనైవేద్యాది సకలోపచారాలు సమర్పించాక, ఆ విగ్రహాన్ని ‘పాదాది శిరఃపర్యంతం’ వీక్షించటానికి అర్చకులు కర్పూర నీరాజనం సమర్పిస్తారు. మన ఇండ్లలో చేసుకునే పూజలలో కూడా భగవంతునికి హారతి సమర్పించడం పరిపాటి. ‘హారతి అంటే హరించుకుపోవడం’ అని అర్థం.‘పవిత్రమైనది’ అనే అర్థం కూడా ఉంది. భగవంతునికి మనకి మధ్య ఉన్న చీకటిని పారద్రోలేది కూడా (ఈ) హారతేనని ఆధ్యాత్మిక ప్రవచకులంటారు. హారతినే కర్పూర నీరాజనం అని కూడా అంటారు. నీరాజనం అంటే మిక్కిలి ప్రకాశింపచేసేది అని అర్థం.
మానవ జీవితంలోని చతుర్విధ పురుషార్థ్థాలను సక్రమ మార్గంలో అవలంబించేలా శక్తినిమ్మని భగవంతుని ప్రార్థిస్తూ, హారతి ఇవ్వడం ఆచారం. ఆలయంలోని మూలమూర్తిని విద్యుద్దీపాల వెలుగులోగాక, హారతి ద్వారా దర్శించుకోవడం అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. భగవంతునికి మనల్ని మనం సమర్పించుకోవడం ఇందులోని అంతరార్థం కావచ్చు. ఆయన దర్శనం మంగళప్రదమైనది కాబట్టే దానిని మంగళహారతి అని కూడా అంటారు.