మాటవరసకు తుమ్ము వస్తుంది. దానిని హెచ్1ఎన్1బి1సి1 ఇన్‌ఫ్లూయెంజా అని భయపడిపోయి ఆ పూటకు లీవ్ పెట్టి డాక్టర్ దగ్గరకు పరిగెట్టడమే.పొద్దున బ్రష్ చేస్తుంటే అందరికీ వచ్చినట్టే చిగుళ్ల నుంచి కొంచెం రక్తం కారుతుంది. ఓరి బాబోయ్... ఇది కేన్సరే. ఆ పూట మోషన్ డిలే అవుతుంది. ఇది పెద్ద పేగు కేన్సర్‌కు చిహ్నమే తప్ప మరొకటి కాబోదు. రోగం... రోగం... రోగం.... రోగం ఉందనుకోవడమే అన్నింటికన్నా చెడ్డరోగం. దానికి ఓ పేరు కూడా ఉంది. అదే ‘ఇల్‌నెస్ యాంగై్జటీ డిజార్డర్’ రోగభయంతో బాధ పడటమే అన్నింటికన్నా పెద్దబాధ నీడకు భయపడటం మానండి. వెలుతురులోకి రండి.
రమేశ్ వయసు కేవలం 35 ఏళ్లు.ఎందుకో ఉదయం పూట తలనొప్పిగా అనిపించింది. ముఖం కడుక్కుంటున్నప్పుడు నోట్లోకి వేళ్లుపెట్టుకొని శుభ్రం చేసుకోవడం రమేశ్ అలవాటు. రాత్రి అజీర్తి చేసిందేమో వాంతిలో కాస్త అన్నం మెతుకులు కూడా కనిపించేసరికి రమేశ్ గుండె ఆందోళనతో కొట్టుకుంది. అంతే. అన్ని పనులూ పక్కన బెట్టి నేరుగా న్యూరాలజిస్ట్‌ను కలిశాడు. రమేశ్ ఆందోళనకు కారణం కూడా ఉంది. అదే విషయం డాక్టర్‌కు చెప్పాడు రమేశ్.
‘సర్... వినోద్ కూడా నా ఈడువాడే. అతడికీ ఉదయం వేళల్లో తలనొప్పి వచ్చేది. వాంతులూ అయ్యేవి. ఒకసారి డాక్టర్‌ను కలువురా అన్నాను. అయినా వాడు విన్లేదు. తలనొప్పికి డాక్టర్‌ను కలవడం ఏమిట్రా అంటూ నా సలహాను తీసిపారేశాడు. కానీ ఆ తర్వాత తేలింది– వాడికి బ్రెయిన్ క్యాన్సర్ అని. మామూలు తలనొప్పే కావచ్చునంటూ నిర్లక్ష్యం చేయడం వల్ల వాడి బ్రెయిన్ క్యాన్సర్ కాస్తా అడ్వాన్స్‌డ్ దశకు చేరుకుంది. ఈమధ్యే వాడు పోయాడు. నా పరిస్థితీ అంతేకావచ్చేమోనని భయంగా ఉంది డాక్టర్’ అంటూ వాపోయాడు రమేశ్.
డాక్టర్ కొన్ని సాధారణ పరీక్షలు చేశారు. రెండు మూడు రోజుల్నుంచి ఏం తిన్నారంటూ అడిగారు. ‘ఫంక్షన్లు ఉండటంతో వరసగా మూడురోజులూ బిర్యానీలూ, బగారా అన్నం తిన్నా’ అంటూ జవాబిచ్చాడు రమేశ్. డాక్టర్‌కు కేసు అర్థమైంది. ‘రమేశ్ గారూ... మీకు కేవలం అజీర్తి. వరసగా మసాలాలతో భోజనం చేయడం వల్ల ఈ ప్రాబ్లం. అసలు మీకు ఎలాంటి సమస్యా లేదు’ అనిమందులు రాశాడు. నమ్మలేదు రమేశ్. ‘నాకు అయిన వాంతి బ్రెయిన్ క్యాన్సర్‌కు సంబంధించిందా? లేక... కడుపులో అల్సర్లూ గట్రా ఏమైనా అయ్యాయా? లేదా క్యాన్సర్ మెదడు నుంచి కిందికి పాకుతూ కడుపు వరకూ వచ్చిందా?’ అనే సందేహాలు రమేశ్‌ను నిలవనివ్వలేదు.
అట్నుంచి అటు మరో న్యూరాలజిస్టు దగ్గరకు వెళ్లడంతో పాటు... పనిలోపనిగా ఎందుకైనా మంచిదని గ్యాస్ట్రో ఎంటరాలజిస్టునూ కలిశాడు. ఆ ఇద్దరూ క్షుణ్ణంగా పరీక్షలు చేశారు. న్యూరాలజిస్టు ఎందుకైనా మంచిదని బ్రెయిన్ సీటీ, ఎమ్మారైలు తీయిస్తే... గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించారు. ఎలాగూ ఈ పరీక్షలు చేయిస్తున్నాను కదా పనిలో పనిగా అనుకుంటూ టోటల్ బాడీ చెకప్ చేయించాడు రమేశ్. రిజల్ట్స్ అన్నీ నార్మల్. కాకపోతే... రక్తపరీక్షల్లో తెల్లరక్తకణాలు కాస్త ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది. అది కూడా నార్మలేననీ... దాన్ని అంతగా సందేహించక్కర్లేదనీ అన్నారు డాక్టర్లిద్దరూ.
బ్లడ్ క్యాన్సర్లలో తెల్లరక్తకణాలు ఎక్కువగా ఉంటాయని ఎక్కడో చదివాడు రమేశ్. తనకు బ్లడ్ క్యాన్సర్ కూడా ఉందేమోనంటూ అతడిలో మరో సందేహం. వెంటనే హీమటాలజిస్ట్‌ను కలిశాడు. అక్కడ హీమటాలజిస్ట్ ఆయన రిపోర్టు చూసి నవ్వి... ‘రమేశ్‌గారూ... బ్లడ్ క్యాన్సర్‌లో తెల్లరక్తకణాలు పెరుగుతాయన్న మాట నిజమే. కానీ... వాటి కౌంట్ చాలా అనూహ్యమైనంత ఎక్కువగా ఉంటుంది. ఇలా కొద్దిగా కాదు. మీరు న్యూస్‌పేపర్లలో చదివో, టీవీల్లో చూసో ఇలాంటి అపోహలు పెంచుకుంటారు. కానీ ఇలా కొద్దిగా పెరిగిన తెల్లరక్తకణాల కౌంట్ బ్లడ్‌క్యాన్సర్‌దో కాదో మాకు ఇట్టే తెలిసిపోతుంది. మీకు ఎలాంటి సమస్యా లేదు.
నిశ్చింతగా ఉండండి’అంటూ ఆందోళన తగ్గడానికి కొన్ని మందులు రాసి ఇచ్చారాయన. అయినా రమేశ్‌లో ఆందోళన తగ్గలేదు. ‘డాక్టర్లు అలాగే చెబుతారు. ఆయన మాటలు నమ్మి రేప్పొద్దున నేను చచ్చిపోతే... నా భార్య, చిన్న చిన్న పిల్లల పరిస్థితేమిటి?’... అనుకుంటూ స్వయంగా గూగుల్‌లో ఆయా వ్యాధుల గురించి తెలుసుకోడానికి చేసే ప్రయత్నంలో భాగంగా విపరీతంగా రకరకాల హెల్త్ వెబ్‌సైట్స్ చూడటం మొదలుపెట్టాడు. అంతకు ముందు ఉన్న కొండంత డౌట్లకు మరికొన్ని తోడయ్యాయి. ఆ తాజా సందేహాలు ఆకాశమంత ఎత్తున్న పర్వతాలుగా పెరిగిపోయి డాక్టర్లను చూస్తూ... పరీక్షలు చేయిస్తూ... అనవసరంగా మందులు మింగుతూ నిజంగానే పేషెంట్‌లా మారిపోయాడు.
మునపటిలా హుషారుగా కాకుండా ఎంతో కుంగిపోయి ఉన్న రమేశ్‌ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు స్నేహితులు. అతడి పరిస్థితి క్షుణ్ణంగా విన్న డాక్టర్ కొన్ని ప్రశ్నల తర్వాత అతడి జబ్బును తెలుసుకున్నారు. ‘మీ రమేశ్‌కు ఎలాంటి వ్యాధీ లేదు. అతడికి ఉన్న జబ్బు పేరు ‘ఇల్‌నెస్ యాంగై్జటీ డిజార్డర్’. గతంలో దీన్నే ‘హైపోకాండ్రియాసిస్’ అనేవారు. సింపుల్‌గా తెలుగులో చెప్పాలంటే ‘లేని వ్యాధుల గురించి ఆందోళన పడే రుగ్మత’గా అనుకోవచ్చు’ అన్నారు డాక్టర్.
ఇల్‌నెస్ యాంగై్జటీ డిజార్డర్‌కు ఇవే కారణాలు...
♦ తమ కుటుంబంలోని లేదా అతి దగ్గరి వ్యక్తులు చిన్న వయసులో జబ్బు పడి వ్యాధి ముదిరాక ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్లడం లేదా మృతి చెందడం.
♦ వైద్యానికి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం కోసం గూగుల్ వంటి సమాచార మా«ధ్యమాలను ఆశ్రయించడం. అక్కడి విస్తృతమైన సమాచారాన్ని చదువుతూ, తమకు సంబంధించిన అంశాలను తమకు ఆపాదించుకోవడం.
♦అధునాతన పరీక్షలు చేయిస్తే తప్ప తమకు వచ్చిన జబ్బు కరెక్టో కాదో నమ్మలేని స్థితికి వెళ్లడం... దగ్గరిలోని చిన్న ల్యాబ్‌ల పట్ల నమ్మకం లేకపోవడం...
♦తాము ఎలాంటి ఛాన్సూ తీసుకోడానికి ఇష్టపడని వైద్యులు 100 శాతం నమ్మకం కోసం ఇప్పుడు అందుబాటులో ఉన్న పరీక్షలన్నింటినీ చేయిస్తున్నారు. అలా రాసి పరీక్షల ద్వారా ఏమీ లేదని చెప్తే తప్ప నమ్మలేని స్థితికి వెళ్లడం. ఒకవేళ పరీక్షల్లో ఏమీ లేదని తేలినా జబ్బే లేకపోతే లక్షణాలు ఎందుకు కనిపిస్తున్నాయంటూ వాదిస్తుంటారు.
♦క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బుల్లోనూ సాధారణ జబ్బులకు ఉండే లక్షణాలు ఉంటాయి. ఆ సాధారణ చిన్న లక్షణాలను ప్రమాదకరమైన జబ్బుకు సంబంధించినవిగా అనుమానించి డాక్టర్లచుట్టూ, డయాగ్నస్టిక్ సెంటర్ల చుట్టూ తిరగడం.
♦ ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల టీవీల్లో, పత్రికల్లో కేవలం ప్రాథమిక అవగాహన కోసం ఇస్తున్న కథనాలతో బెంబేలెత్తుతూ... అవన్నీ తమకు ఆపాదించుకొని అనవసరమైన ఆందోళనకు గురవుతుండటం.
మరికొన్ని సామాజిక సమస్యలకూ కారణం
ఇలా ‘రోగులు కాని రోగుల’తో చాలా సమస్యలు సామాజికంగానూ వస్తున్నాయి. వాటిలో కొన్ని ఇవి...
♦ ఈ ‘రోగులు కాని రోగుల’ అపాయింట్‌మెంట్ల వల్ల నిజంగా జబ్బుతో బాధపడుతున్న అసలు రోగికి చికిత్స అందడంలో ఆలస్యం అవడం. మన వైద్యసేవల వ్యవస్థపై భారం పడటం. మన దగ్గర వేల సంఖ్యలో రోగులకు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కూడా అందుబాటులో లేడు. ఇలాంటి పరిస్థితుల్లో రోగులు కాని రోగుల వల్ల టెరిషియరీ వైద్యసేవల వద్ద అనవసరమైన భారమూ పడుతోంది.
♦ తాము సంపాదించే డబ్బునే తమ నమ్మకం కోసం డాక్టర్లకూ, డయాగ్నసిక్ పరీక్షలకూ ఖర్చు పెడుతున్నామంటూ వీరు వాదిస్తుండవచ్చు. నిజానికి వీళ్లు చేసేది పదే పదే పరీక్షలతో డబ్బు వృధా చేయడం. ఈ అనుమాన గుణం నుంచి బయటపడితే ఆ విలువైన సంపాదనను మరికొన్ని ఇతర ముఖ్యమైన అవసరాలకు ఖర్చు చేయవచ్చు.
చికిత్స :
♦ ఒక మంచి డాక్టర్‌ను తన ఫ్యామిలీ ఫిజీషియన్‌గా ఎంచుకోవాలి. ఏ చిన్న లక్షణం కనిపించినా ఆయనను సంప్రదిస్తూ ఉండాలి. ఇలా దీర్ఘకాలంలో రోగికి తన వైద్యుడిపై నమ్మకం పెరగడం వల్ల ఆయన మాటపై భరోసాతో అనవసరమైన ఆందోళనలు లేకుండా ప్రశాంతమైన జీవనం సాగించగలుగుతారు.
♦ రోగి తనకు చాలా పెద్ద సమస్య ఉందని చెబుతూ ఉంటే, అతడి మాటలు కొట్టేయకుండా నెమ్మదిగా నచ్చజెప్పి, సైకియాట్రిస్ట్‌కు చూపించాలి. రోగికి జబ్బు వల్ల కలిగే మానసిక ఒత్తిడినీ, యాంగై్జటీని తొలగించడానికే సైకియాట్రిస్ట్‌ను కలుస్తున్నామనీ, రోగికి ఉన్న (అతడు అనుమానిస్తున్న) వ్యాధికీ, అతడి మానసిక స్థితికీ ఈ రెండింటికీ ఏకకాలంలో చికిత్స చేయిస్తున్నామనే విశ్వాసాన్ని రోగిలో పాదుగొల్పాలి.
మందులు : ఇలా మాటిమాటికీ అవే ఆలోచనలు పదే పదే వస్తుండే రోగుల్లో అలాంటి ఆలోచనలు రాకుండా నియంత్రించే మందులు కొన్ని అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి రోగులకు అలాంటి మందుల వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
కౌన్సెలింగ్ : మందులతో పాటు రోగికి తగిన కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా కూడా అతని పరిస్థితిని మరింత చక్కబరచవచ్చు. రోగికి ఉన్న తీవ్రతను బట్టి తగిన ట్రీట్‌మెంట్ ప్లాన్‌తో ఈ సమస్యను నయం చేయవచ్చు.
డాక్టర్ షాపింగ్ ఈ రోగుల ప్రత్యేకత...
ఇల్‌నెస్ యాంగై్జటీ డిజార్డర్ వ్యాధి ఉన్నవారు వరసబెట్టి డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటారు. న్యూరాలజిస్టు, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు, పల్మనాలజిస్టు, ఈఎన్‌టీ, ఆంకాలజిస్ట్, హిమటాలజిస్టు, ఇలా అన్నిరకాల స్పెషలిస్టులనూ మార్చిమార్చి కలుస్తుంటారు. వారు చెప్పిన పరీక్షలు చేయిస్తుంటారు. ఆ పరీక్షలు నార్మల్‌గా వచ్చినా డాక్టర్ ఏమీ లేదని చెప్పినా వాళ్లు నమ్మరు. పైగా వయసును బట్టి వైద్యపరీక్షల్లో వచ్చే కొద్దిపాటి తేడాలను పట్టుకొని ఆ తేడా ఎందుకుందంటూ ప్రశ్నిస్తుంటారు.
మరోడాక్టర్... ఇంకోడాక్టర్... వేరే డాక్టర్ అంటూ పలువురు వైద్యులను కలిసి ఆర్థికంగానూ, మానసికంగానూ నష్టపోతుంటారు. ఇలా మార్చిమార్చి డాక్టర్స్ దగ్గరకు వెళ్లడాన్ని ‘డాక్టర్ షాపింగ్’గా నిపుణులు పేర్కొంటుంటారు. వ్యాధి ఉన్నట్లు అనుమానించే చాలామంది రోగులు ఇలాంటి డాక్టర్ షాపింగ్ చేస్తుంటారు. ఇక ఇల్‌నెస్ యాంగై్జటీ డిజార్డర్ ఉన్నట్లయితే చెప్పనక్కర్లేదు.
- డాక్టర్ ఎం.ఎస్.రెడ్డి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, డైరెక్టర్, ఆశా బైపోలార్ క్లినిక్, ఆశా హాస్పిటల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment