ఆ అపరిచిత జీవుల ఆచూకీ తెలియనుంది!
సుమారు 180 సంవత్సరాల క్రితం చార్లెస్ డార్విన్ సేకరించిన కొన్ని జంతువులకు సంబంధించిన శిలాజాలపై మళ్లీ సరికొత్త రీతిలో పరిశోధన ప్రారంభమైంది. ఈ శిలాజాలు ఏ జంతువులకు సంబంధించినవనేది ఇప్పటి వరకు తెలియదు. డీఎన్‌ఏ ప్రయోగాలతో సహా రకరకాల ప్రయోగాలేవి వీటికి సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వలేదు.
అయితే ఇప్పుడిప్పుడే ఆ వింత జంతువులు ఏమిటి? అనేదాని గురించి ఒక అవగాహన రానుంది. ఇప్పటి గుర్రాలు, ఒంటెలు, ఏనుగులతో వాటికి దగ్గరి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
డార్విన్‌ను పజిల్‌కు గురి చేసిన సమస్యను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించి పరిష్కరించడానికి పురాజీవ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ‘స్ట్రక్చరల్ ప్రొటీన్’గా పిలువబడే జంతువుల ఎముకలలో కనిపించే కొలాజెన్‌ను విశ్లేషించనున్నారు. మొత్తానికైతే... రకరకాల మార్గాల ద్వారా ఆ అపరిచిత జీవుల డీఎన్‌ఏ కోడ్ తెలుసుకోనున్నారు.