శునకం కేర్ ఆఫ్ సుమతి | Dog care of the fact | Sakshi
Sakshi News home page

శునకం కేర్ ఆఫ్ సుమతి

Published Tue, Mar 18 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM

Dog care of the fact

పెంపుడు జంతువులు అంటేనే ప్రేమ. దానితో ఉన్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కల్మషమైన దాని ప్రేమకు ఎంతటివారైనా ఫిదా అయిపోవాల్సిందే. అలాంటి పెంపుడు జంతువును ఇంట్లో ఒంటరిగా వదిలి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏంటి? తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా... మనసంతా దానిపైనే ఉంటుంది. అలాంటివారి బెంగ తీర్చడంకోసం వెలసిందే ‘పెట్సెట్రా’. వేళకు అన్నంతో పాటు ఇంత ఆప్యాయతను కూడా అందిస్తానంటూ మూడేళ్లక్రితం పెట్స్ కేర్ సెంటర్‌ని నెలకొల్పారు సుమతీ నీలమేఘం.
 
హైదరాబాద్ విమానాశ్రయంలో విమానం బయలుదేరడానికి ఇంకా అరగంట సమయం ఉంది. సుమతి మనసు బరువెక్కుతోంది. జనని మొహం మాత్రం ఆనందంతో వెలిగిపోతోంది. ‘నా బంగారం... రేపొద్దిటికల్లా మనింటికి వెళ్లిపోవచ్చు...’ ఒడిలో కూర్చున్న కుక్క తలపై దువ్వుతూ జనని అంటున్న మాటలకు సుమతికి ఇంకాస్త బెంగగా అనిపించింది.  ‘మళ్లీ ఎన్నాళ్లకు... నిన్ను చూస్తానే..’ అంది సుమతి. ‘ఎందుకండీ అంత బెంగ... మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు స్కైప్‌లో చూడొచ్చు కదా!’ అన్న జనని మాటలతో కాస్త ఊరట చెందిన సుమతి ‘ఓబా’ జాగ్రత్త అంటూ వెనుతిరిగింది.
 
ఎయిర్‌పోర్టులో ఈ కుక్క గోలేమిటి అనుకుంటున్నారా! దీని వెనుక ఓ కథ ఉంది. జనని భర్తకు సింగపూర్‌లో ఉద్యోగం రాగానే భార్యాభర్తలు ఉన్నట్టుండి బయలుదేరాల్సి వచ్చింది. వెళ్లేటప్పుడు వారి పెంపుడు కుక్క ‘ఓబా’ని తీసుకెళ్లడం కుదరలేదు. పొరుగుదేశాలకు పెంపుడు జంతువుల్ని తీసుకెళ్లడం అంత సులువైన పనికాదు. ముందుగా అక్కడ క్వారెంటైన్(పొరుగుదేశాల నుంచి వచ్చిన పెంపుడు జంతువుల్ని అక్కడ ఒక నెలరోజులపాటు పెట్టుకుని ఎలాంటి జబ్బులూ లేవని తెలిశాక అప్పుడు యజమానులకు అప్పగించే సెంటర్)లో పెట్టడానికి స్లాట్ దొరక లేదు. దాంతో  సుమతి నెలకొల్పిన ‘పెట్సెట్రా’లో చేర్పించారు. ఏడు నెలల తర్వాత సింగపూర్ క్వారెంటైన్‌లో స్లాట్ దొరికింది. అప్పుడు హైదరాబాద్‌కి వచ్చి తమ కుక్కను తీసుకెళ్లారు.
 
ఆలోచన వెనక...
 
పదిహేడేళ్లపాటు బహుళజాతి కంపెనీలో పనిచేసిన సుమతి కుక్కలను పెంచడంలోనే ఉన్న ఆనందం ఇంకెక్కడా దొరకదంటారు. ఐదంకెల జీతం వదులుకుని కుక్కల్ని పెంచే సెంటర్ నెలకొల్పడం వెనక సుమతికున్న ప్రేమతో పాటు పెట్స్ ప్రేమికుల అవసరం కూడా ఉంది.  పెట్స్‌ని ఒంటరిగా వదిలివెళ్లలేక చాలామంది ప్రయాణాలకు దూరంగా ఉంటారు. అలాగే పగలు ఇంట్లో చూసుకునేవాళ్లుండరని కుక్కల్ని పెంచుకోలేనివారు చాలామంది ఉన్నారు.  

హైదరాబాద్‌లోని  మణికొండ దగ్గర సుమతి గురించి  ఎవరిని అడిగినా చెబుతారు. ఆమె పేరు చెబితే అడ్రస్ దొరకదు. ‘ఇక్కడ కుక్కలామె ఎక్కడుంటుంది’ అని అడిగితే వెంటపెట్టుకుని మరీ తీసుకెళ్లి చూపిస్తారు. ‘‘నేనలా ఫేమస్ అయిపోయానండీ... పొద్దునే ఓ పది కుక్కల్ని వెంటబెట్టుకుని వాకింగ్‌కి వెళితే అందరికీ తెలియకుండా ఎలా ఉంటుంది! (నవ్వుతూ..) నిన్నమొన్న కొత్తగా వచ్చినవారికి కూడా నా ‘పెట్సెట్రా’ గురించి తెలుసు’’ అని అంటారామె.
 
స్విమ్మింగ్‌పూల్‌తో సహా...
 
ఈ పెట్స్‌కేర్ సెంటర్ నెలకొల్పి మూడేళ్లు దాటుతోంది. మొదట్లో అపార్ట్‌మెంట్‌లో తన ఫ్లాట్‌లోనే కుక్కల్ని పెంచిన సుమతి  ఈ మధ్యనే సొంతింట్లోకి వచ్చారు. కింది అంతస్థు మొత్తం కుక్కలకోసం కేటాయించారు. అక్కడే వాటికోసం స్విమ్మింగ్‌పూల్ కూడా ఏర్పాటుచేశారు. కొందరు పొద్దుటే తమ కుక్కల్ని ఇక్కడ వదిలేసి ఆఫీసు నుంచి ఇంటికెళ్లేటపుడు తిరిగి తీసుకెళ్లిపోతుంటారు.

కొందరు వారాంతపు సెలవుల్లో వదులుతారు. ఇంకొందరు దూరప్రయాణాలపుడు తమ కుక్కల్ని ఇక్కడ అప్పజెప్పేస్తారు. ‘‘కుక్కని ఇక్కడ వదలడానికి ముందు దాని మెడికల్ రిపోర్టు చూస్తాను. ఏమైనా చర్మవ్యాధులుంటే వారికి చెప్పి వైద్యం చేయిస్తాను. లేదంటే మిగతావాటికి వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆ కుక్కలు మొదటిసారి కొంచెం కొత్తగా చేస్తాయి. తర్వాత వాటికి కూడా అలవాటైపోతుంది.

చాలామంది చెబుతుంటారు. ‘సుమతీ ఆంటీ ఇంటికి వెళదామా... అనగానే వెంటనే కారెక్కి కూర్చుంటుందండీ..’ అంటూ తమ పెంపుడు కుక్క గురించి వారు చెబుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది’’ అని చెపుతున్నప్పుడు సుమతి ముఖంలో కించిత్ గర్వం తొణికిసలాడింది.ప’కి 150మంది క్లయింట్స్ ప్రసుప్రస్తుతం ‘పెట్సెట్రా’కి 150మంది క్లయింట్స్ ఉన్నారు. ఇందులో కుక్కలతోపాటు కుందేళ్లు, లవ్‌బర్డ్స్‌కి కూడా ఆశ్రయం ఉంది. సుమతి భర్త  డాక్టర్ కిరణ్ ఒమేగా హాస్పిటల్‌లో మెడికల్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఆయనకు కూడా పెంపుడు జంతువులంటే ప్రాణం. ‘‘సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులప్పుడు నేను గుమ్మం దాటను. ఎందుకంటే అప్పుడే కదా అందరికీ నా అవసరం. మాక్కూడా మూడు కుక్కలున్నాయి. వాటిలో ఒకటి దత్తత తీసుకున్నది. నేను అప్పుడప్పుడు బ్లూక్రాస్‌కి వెళుతుంటాను. అప్పుడు ఎవరో వదిలేసిన కుక్క కనిపిస్తే తెచ్చి పెంచుకున్నాను. వీధి కుక్కల్ని పెంచుకునే ధోరణికి మద్దతునిస్తూ స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాను’’ అని చెప్పారు సుమతి.
 
పొరుగింటివాళ్లనే పెద్దగా పట్టించుకోని ఈరోజుల్లో వారి పెంపుడు జంతువుల్ని చేతుల్లోకి తీసుకుని తియ్యగా మాటలు చెబుతూ ఆటలాడించేవారెవరుంటారు చెప్పండి. ‘ఊరికే ఏం చేయడం లేదు కదా’ అనొచ్చు. డబ్బుతో వాటికి పెట్టే ఆహారాన్ని కొనచ్చు కానీ ప్రేమను కొనలేరు కదా!
 - భువనేశ్వరి; ఫొటోలు: జి బాలస్వామి
 

  •      పెంపుడు కుక్కను వదిలే ముందు దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలి.
  •      మీ పెట్‌కి స్విమ్మింగ్ అవసరమైతే రెండు రోజుల ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి.
  •      మీ పెట్‌ని చూసుకున్నందుకు రోజుకి 300 రూపాయల వరకు తీసుకుంటారు.
  •      మీ పెట్‌కి మీరేం ఆహారం పెడతారో అదే మెనూను ఫాలో అవుతారు.

 
 ‘‘నాకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే ప్రాణం. ఎక్కడ రోడ్డుపైన కుక్కపిల్ల కనిపించినా ఆగిపోయేదాన్ని. ఆ ప్రేమ అక్కడితో ఆగకుండా నన్నిలా వెంటాడి ఏకంగా కేర్  సెంటర్‌నే పెట్టించింది.’’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement