రుచుల్లో "మున"గండి... | Drumstick Food Varieties Special Story | Sakshi
Sakshi News home page

రుచుల్లో "మున"గండి...

Published Sat, Jul 20 2019 12:50 PM | Last Updated on Sat, Jul 20 2019 1:19 PM

Drumstick Food Varieties Special Story - Sakshi

తెలుగులో మునగకాడ...ఇంగ్లీషులో డ్రమ్‌స్టిక్‌...లేదు మునగకు సాటి... రుచిలో లేదు పోటీ...వెరైటీలో లేదు దీనికి సరిసాటి...విందులో మునగ పరిపాటి...అంటూ... ఈ వంటల రుచులనుడప్పుకొట్టి మరీ ఊరంతా చెప్పొచ్చు...

మునగాకు పప్పుకూర
కావలసినవి:
తాజాగా కోసి, కాడలు లేకుండా శుభ్రపరచుకున్న మునగాకు – ఒక పెద్ద కప్పు; కందిపప్పు – చిన్న గ్లాసుడు; పసుపు – చిటికెడు; ఇంగువ – అర టీ స్పూన్‌; నూనె – 3 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 2; ఆవాలు – అర టీ స్పూన్‌; జీలకర్ర  ఒక టీ స్పూన్‌; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత.
తయారీ:
ముందుగా స్టౌ వెలిగించి, మందపాటి గిన్నెలో కందిపప్పు వేసి, సన్నటి సెగ మీద ఎర్రగా వేయించుకోవాలి ∙వేగిన కందిపప్పును రెండు సార్లు నీళ్లతో కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ∙పప్పు సగం ఉడికాక, కడిగిన మునగాకు జత చేసి కలియబెట్టాలి ∙పసుపు, ఉప్పు, ఇంగువ జత చేయాలి ∙కందిపప్పు ఉడికి బద్దబద్దలుగా ఉన్నప్పుడే నీరంతా ఇగిరి పోయాక దించుకోవాలి ∙వేరే స్టౌ మీద కళాయి పెట్టి  నూనె వేసి పోపు వేయించుకోవాలి ∙ఉడికించుకున్న మునగాకు పప్పు వేసి బాగా కలిపి సన్న సెగ మీద కాసేపు ఉంచి,  స్టౌ మీద నుండి దించి, బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ పప్పుకూరకు మునగాకు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. (కుకర్‌లో వండకూడదు. పప్పు పొడిపొడిలాడుతూ ఉంటేనే చూడటానికి, అన్నంలో తినడానికి  రుచిగా ఉంటుంది).

మునగాకు రసం
కావలసినవి:
మునగాకులు – ఒక కప్పు; మునగకాడలు–1 పసుపు – చిటికెడు; ఉప్పు – తగినంత; చింతపండు – నిమ్మకాయంత; బెల్లం – 2 టీ స్పూన్లు; చారు పొడి – 2 టీ స్పూన్లు; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 2; తరిగిన కొత్తిమీర –  టేబుల్‌ స్పూను; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఇంగువ – అర టీ స్పూను.
పోపు కోసం... ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను.
తయారీ:
మునగాకును నీళ్లల్లో వేసి స్టౌ మీద ఉంచి, మరిగించాలి ∙బాగా మరిగాక ఆకులను వడకట్టగా వచ్చిన నీళ్లలో చిక్కగా తీసిన చింతపండు రసం పోసి, స్టౌ మీద ఉంచాలి ∙మునగ కాడను ముక్కలుగా తరిగి అందులో వేయాలి. పసుపు, ఉప్పు, బెల్లం, టొమాటో తరుగు, ఇంగువ, పచ్చిమిర్చి జత చేసి బాగా మరగనివ్వాలి ∙మరొక స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి ∙ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, మరుగుతున్న మునగాకు రసంలో వేయాలి ∙మరికాస్త మరిగాక చారు పొడి వేసి ఐదు నిమిషాల తర్వాత దింపాలి ∙ఇది చాలా సువాసనతో, రుచిగా బాగుంటుంది (ఇష్టమైతే పోపులో వెల్లుల్లిపాయ దంచి వేసుకోవచ్చు).

మునగాకు పొడి
కావలసినవి:
కాడలు లేకుండా కడిగి నీడలో ఆరపెట్టిన మునగాకు – రెండు కప్పులు; ధనియాలు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 8 టీ స్పూన్లు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 5 టీ స్పూన్లు; నువ్వు పప్పు – 2 టీ స్పూన్లు;ఎండు మిర్చి – 10 ;చింతపండు – చిన్న నిమ్మకాయంత;నూనె – 4 టీ స్పూన్లు.
తయారీ:
స్టౌ వెలిగించి, కడాయి పెట్టి, అందులో నూనె వేసి కాగాక ధనియాలు, సెనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర, నువ్వులు వేసి దోరగా వేగాక, ఎండు మిర్చి జత చేసి అవి కూడా వేగాక, మునగాకు వేసి బాగా కలిపి స్టౌ కట్టేయాలి ∙వేయించుకున్నపదార్థాలు చల్లారాక, కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు జత చేసి మిక్సీలో వేసి పొడి చేసి, (మరీ మెత్తగా ఉండకూడదు), చిన్న చిన్న ఉండలుగా చేసి, తడి లేని సీసాలో భద్ర పరచుకోవాలి ∙ఇది పది రోజుల వరకు నిల్వ ఉంటుంది ∙రోజూ వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలిపి తింటే వాతాన్ని హరిస్తుంది.

మునగాకుపచ్చడి
కావలసినవి:
మునగాకు – 5 కప్పులు; ఎండు మిర్చి – 15; చింతపండు – నిమ్మకాయంత; ఉప్పు – తగినంత; ఇంగువ – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; నూనె – అర కప్పు; ఆవాలు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 4 టీ స్పూన్లు; నువ్వు పప్పు – 2 టీ స్పూన్లు.
తయారీ:
మునగాకు కడిగి నీడలో ఆరపెట్టుకోవాలి ∙చింతపండుకు కొద్దిగా నీళ్లు జత చేసి నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, నువ్వు పప్పు వరుసగా ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా వేగాక ఎండు మిర్చి జత చేసి వేయించి, చల్లార్చాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మునగాకు, పసుపు వేసి కొద్దిగా వేయించి దింపేయాలి ∙వేయించుకున్న పోపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఉప్పు, మునగాకు, నానపెట్టిన చింతపండు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, గిన్నెలోకి తీసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మిరప కారం, ఇంగువ వేసి వేయించి, దింపి, పచ్చడిలో వేసి కలపాలి.

మునగ ఆవకాయ
కావలసినవి:
మునగ కాడలు – 6 ఆవపిండి – 100 గ్రా.; వేయించిన జీలకర్ర పొడి – 50 గ్రా.; వేయించిన మెంతుల పొడి – 2 టీ స్పూన్లు; మిరప కారం – పావు కిలో; ఇంగువ – ఒక టీ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – పావు కిలోకి తక్కువ; పప్పు నూనె/ వేరుసెనగ నూనె – పావు కేజీ; నానబెట్టి రుబ్బిన చింతపండు గుజ్జు – ఒక కప్పు.
తయారీ:
మునగ కాడలను చిన్నచిన్న ముక్కలుగా తరగాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కొద్దిగా కాగాక, తరిగిన మునగ కాడ ముక్కలు, ఉప్పు వేసి మగ్గిన తరవాత దింపేయాలి ∙కాస్త చల్లారి, మెత్తబడ్డాక మిరప కారం, పసుపు, ఇంగువ, జీలకర్ర పొడి, ఆవ పొడి, మెంతి పిండి వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి, నూనె పోసి కొద్దిగా కాచి దింపేయాలి ∙చింతపండు గుజ్జు జత చేసి, బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మునగ కాడల పచ్చడిలో వేసి కలియబెట్టాలి ∙రెండు రోజులకు పులుపు, కారం మునగ కాడలకు పట్టి, ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది.
(గమనిక: లేత కాడలను మాత్రమే ఉపయోగించాలి. ముదురు కాడలను ఉపయోగిస్తే ఆవకాయ రుచిగా ఉండదు)

కొబ్బరి–బెల్లం మునగకాడల కూర
కావలసినవి:
మునగ కాడలు – 6; కొబ్బరి చిప్ప – ఒకటి ; బెల్లం – చిన్న గ్లాసుడు; నానపెట్టిన బియ్యం – చిన్న గ్లాసుడు.
పోపు కోసం... ఎండు మిర్చి – 4; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు– తగినంత; నూనె – ఒక టేబుల్‌ స్పూను.
తయారీ:
ముందు రోజు రాత్రి ఒక గ్లాసు బియ్యాన్ని నీళ్లలో నానబెట్టాలి ∙ మరుసటి రోజు ఉదయం, నీళ్లన్నీ ఒంపేసి, బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి ∙కొబ్బరి, బెల్లం జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙స్టౌ వెలిగించి, దాని మీద బాణలి ఉంచి, అది వేడయ్యాక, ఒక టేబుల్‌ స్పూను నూనె వేసి వేడి చేయాలి ∙పోపు సామానులు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙ఎండు మిర్చి వేసి వేగాక, పోపును ఒక ప్లేట్‌ లోకి తీసుకోవాలి ∙అదే మూకుడులో కొద్దిగా నీళ్లు పోసి అందులో మునగ కాడ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉడికించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, మిక్సీ పట్టిన కొబ్బరి, బెల్లం, బియ్యం ముద్ద జత చేసి కొద్దిసేపు ఉడికించాలి ∙బాగా దగ్గర పడుతుండగా ఉడికించిన మునగ కాడలు, పోపు జత చేయాలి ∙కరివేపాకు, ఉప్పు వేసి గరిటెతో కలిపి కొద్దిసేపు మగ్గిన తరవాత దింపేయాలి ∙అన్నంలో తింటే రుచిగా ఉంటుంది ∙విడిగా టిఫిన్‌లా తిన్నా కూడా బాగుంటుంది.

మునగ –టొమాటో కూర
కావలసినవి:
మునగ కాడలు – 3; టొమాటోలు – అర కిలో; ఉల్లిపాయలు – 2; కొత్తిమీర – చిన్న కట్ట; పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత
పోపు కోసం... ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); పచ్చి సెనగపప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు.
తయారీ:
మునగ కాడలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙టొమాటోలు, ఉల్లిపాయలను కూడా సన్నగా తరగాలి ∙స్టౌ వెలిగించి మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి కాగాక, పోపు దినుసులు ఒకదాని తరవాత ఒకటి వేసి, దోరగా వేయించాలి ∙ఎండు మిర్చి, ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాలి ∙టొమాటో తరుగు, మునగ కాడ ముక్కలు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙ సన్నటి సెగ మీద మగ్గనివ్వాలి∙బాగా ఉడికిన తరవాత, మిరప కారం వేసి బాగా కలిపి ఒక నిమిషం తరవాత దింపేయాలి ∙కూరను ఒక బౌల్‌లోకి తీసుకుని, కొత్తిమీరతో అలంకరించాలి ∙అన్నంలోకి రుచిగా ఉంటుంది.

​​​​​​​– నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement