పేరులో నేముంది దుబాయ్...
జీవితంలో ఒక్కసారైనా దుబాయ్‌లో షాపింగ్ చేయాలని కోరుకునేవారు చాలామంది ఉంటారు ప్రపంచంలో. షాపింగ్‌కి అంత పేరు గడించిన నగరం మరొకటి లేదేమో. యు.ఏ.ఇలో ఒక ముఖ్య నగరంగా ఉన్న దుబాయ్ పేరు ‘బా’ అనే అక్షరం నుంచి వచ్చి ఉండొచ్చని అంటారు. అంటే ‘సంత’ అని అర్థం. దుబాయ్ ముందు నుంచి సంత ప్రాంతంగా ప్రసిద్ధి అట. అలాగే ‘దబా దుబయ్’ అనే అరబిక్ సామెత నుంచి కూడా దుబాయ్ వచ్చి ఉండొచ్చని అంచనా.
అంటే ‘వాళ్లు చాలా సంపదతో వచ్చారు’ అని అర్థం అట. దుబాయ్‌లో అతి మెల్లగా పారే ఉప్పునీటి కాలువ ఉంది. అలాంటి ప్రవాహాన్ని అరబిక్‌లో ‘దబా’ అంటారట. దాని నుంచి కూడా దుబాయ్ అయి ఉంటుంది. ఇక ఇంకొక థియరీ ఏమిటంటే ఒకప్పుడు ఏమీ లేని ఈ ఏడారిలో పిల్ల మిడతలు చాలా కనిపించేవట. అరబిక్‌లో వాటిని పిలిచే మాట మీదుగా కూడా దుబాయ్ వచ్చి ఉండవచ్చు. ఎలా వచ్చినా అది నేడో నిలువెత్తు నగరం. నోరెళ్ల బెట్టి చూడాల్సిన నగరం.