ఇంద్ర కీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మవారిని భక్తులు దర్శించుకుని పరవశం చెందుతారు. దర్శనానంతరం అమ్మవారి భక్తులు అమ్మవారి ప్రసాదాలను కొనుగోలు చేస్తారు. అమ్మవారికి జరిగే నిత్యపూజలు, ఆర్జిత సేవలలో పాల్గొనే ఉభయదాతలకు దేవస్థానం పులిహోర, లడ్డూ ప్రసాదాలను అందచేస్తుంది. అమ్మవారి ప్రసాదాలుగా లడ్డు, శ్రీచక్ర లడ్డు, పులిహోరలతో పాటు చక్కెరపొంగలిని సైతం దేవస్థానం విక్రయిస్తుంది. మహామండపం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఆరు కౌంటర్ల ద్వారా ఈ ప్రసాదాలను విక్రయిస్తారు. కొండపై నటరాజ స్వామి వారి గుడి, ఓం మలుపు దగ్గర కూడా ప్రసాదాలను విక్రయిస్తారు. దసరా, భవానీ దీక్షల సమయంలో కొండ దిగువన కనకదుర్గనగర్‌లో 13 కౌంటర్ల ద్వారా అమ్మవారి ప్రసాద విక్రయాలు జరుగుతాయి. బస్ స్టాండ్‌లోనూ ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అమ్మవారి ప్రసాదాలను తయారు చేసేందుకు ప్రత్యేకంగా పోటును నిర్వహిస్తారు. లడ్డూ ప్రసాదం తయారీకి శిక్షకులైన వంట వారితో పాటు లడ్డూను చుట్టేందుకు మహిళలు పనిచేస్తారు. పులిహోర, చక్కెరపొంగలి తయారుచేసేందుకు సిబ్బందిని దేవస్థానం నియమిస్తుంది.
ఉచితంగా అప్పాల ప్రసాదం...
ఈ దసరా ఉత్సవాల నుంచి అమ్మవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి అప్పం ప్రసాదంగా అందచేస్తున్నారు. ఇందుకుగాను అప్పాలు తయారు చేసేందుకు ప్రత్యేకంగా వంటశాలను కొండపై సిద్ధం చేశారు. దసరా ఉత్సవాలలో సుమారు 15 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక కౌంటర్..
ఇతర రాష్ట్రాలలోని అమ్మవారి భక్తులకు ప్రసాదాలు అందాలనే భావనతో దుర్గ గుడి అధికారులు రైల్వే స్టేషన్ తూర్పు కౌంటర్ దగ్గర ప్రత్యేక ప్రసాదం కౌంటర్‌ను నడుపుతోంది. ఇక్కడ పులిహోర, లడ్డూ ప్రసాదాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. విజయవాడ మీదుగా ప్రయాణించే సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ కౌంటర్‌లలో ప్రసాదాలను కొనుగోలు చేసి, బంధువులకు, మిత్రులకు అందచేస్తారు. అమ్మవారిని దర్శించుకోలేకపోయినా, ప్రసాదాలను స్వీకరించే భాగ్యమైనా దక్కిందని భక్తులు తృప్తిచెందుతారు. త్వరలో బస్టాండ్‌లో సైతం అమ్మవారి ప్రసాదాలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.
దివ్య దర్శనం భక్తులకు చిన్న లడ్డు...
రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అమ్మవారి దర్శనానికి విచ్చేసే దివ్య దర్శనం భక్తులకు దేవస్థానం ప్రత్యేకంగా ప్రసాదాలను అందచేస్తుంది. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందచేసి, దేవస్థానం తరపున రవిక, అమ్మవారి కుంకుమ ప్రసాదంతో పాటు చిన్న సైజు లడ్డూను అందచేస్తారు. అనంతరం అన్న ప్రసాదాన్ని సైతం అందిస్తారు.
అమ్మవారి ప్రసాదాలు – ధరలు
పులిహోర – రూ. 5లు
లడ్డూ – రూ. 15లు
శ్రీచక్ర లడ్డూ – రూ. 100
చక్కెర పొంగలి – రూ. 20
– ఉప్పులూరి శ్యామ్‌ప్రకాశ్, సాక్షి, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment