నాటి కాలంలో సంపన్నులకూ సంస్థానాధీశులకూ నీలగిరి కొండల్లోని ఊటీలో వేసవి విడిది భవనాలుండేవి. అప్పటి విజయనగర సంస్థానాధీశుడైన అలక్ నారాయణ గజపతి(1930 ప్రాంతం), తన ఆస్థానంలో ఉన్న హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణదాసుతో కలిసి ఊటీకి ప్రయాణం చేస్తున్నారు. గజపతి స్వయంగా కారు డ్రైవ్ చేస్తున్నారు. ఎగుడు దిగుడుగా ఉన్న ఘాట్ రోడ్డు మీద వేగంగా నడుపుతున్నారాయన. ‘‘కారును కొంచెం నెమ్మదిగా నడపండి’’ అన్నారు ఆదిభట్ల. ‘‘అబ్బే మీకేమీ భయం లేదు దాసుగారూ! నేను స్వయంగా నడుపుతున్నాను గదా’’ అన్నారట గజపతి.
‘‘అదేనండి నా భయం’’ అన్నారు దాసు. విషయాన్ని గ్రహించి తేలిగ్గా నవ్వేసి కారును నెమ్మది చేశారు గజపతి.
ఆదిభట్ల నారాయణదాసుకు కవిత్వంలో విచిత్ర విన్యాసాలు చేయడం అలవాటు. ఇంగ్లిష్‌లో పరమేశ్వరుని స్తుతిస్తూ చెప్పిన ఉత్పలమాల పద్యమిది–
హెడ్డున మూను, స్కిన్నుపయి నెంతయు డస్టును, ఫైరు నేత్రమున్
సైడున గ్రేటు బుల్లు, బహుచక్కని గాంజెసు హైరు లోపలన్,
బాడికి హాఫెయౌచు నల పార్వతి మౌంటెను డాటరుండ, ఐ
షడ్డు డివోటు దండములు సోకగ ప్రేయరు సేతు నెప్పుడున్!
- డి.వి.ఎం. సత్యనారాయణ
ఆంగ్లంలో ఉత్పలమాల
Published Mon, Mar 4 2019 12:34 AM | Last Updated on Mon, Mar 4 2019 12:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment