ఈచ్ వన్ టీచ్ వన్!
ఉత్తరప్రదేశ్‌లోని ‘గులాబ్ గ్యాంగ్’ ఉద్యమం ఎంతో మంది మహిళలను ప్రభావితం చేసింది. మాధురిదీక్షిత్ ప్రధాన పాత్రలో ఇటీవల బాలీవుడ్‌లో ‘గులాబ్ గ్యాంగ్’ అనే పేరుతో సినిమా కూడా వచ్చింది. విశేషమేమిటంటే, గులాబ్ గ్యాంగ్ ఇచ్చిన స్ఫూర్తి మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. దేశదేశాలకు వ్యాపించింది. అందరిలోనూ కసి రగలించింది.
జర్మనిలో అన్నెసెమెసిక్ నాయకత్వంలోని అయిదు మంది మహిళల బృందం ‘గులాబ్ గ్యాంగ్’ గురించి గొప్పగా విని, చదివి ప్రభావితమైంది. ఆ ప్రభావంతో ‘ఈచ్ వన్ టీచ్ వన్’ పేరుతో మహిళలపై జరిగే రకరకాల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రచార కార్యమ్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల మన దేశానికి కూడా ఈ బృందం వచ్చింది.
ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలు, విద్యాలయాలకు వెళ్లి ‘ఈచ్ వన్ టీచ్ వన్’ పేరుతో రోజంతా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. ఇందులో డాక్యుమెంటరీ ప్రదర్శన, చర్చా కార్యక్రమం, ఆర్ట్స్‌వర్క్స్... మొదలైనవి ఉంటాయి. స్త్రీలపై జరిగే హింసను నిరోధించడానికి ఎలాంటి పద్ధతులు అవలంబిస్తే బాగుంటుందనే దానిపై ముఖ్యమైన సలహాలను మహిళల నుంచి ఆహ్వానిస్తారు.
‘‘ఒక సందేశాన్ని ప్రజలకు చేరువ చేయడానికి కళను మించిన ప్రత్యామ్నాయం లేదు. భాషతో పని లేదు’’ అంటున్నారు అన్నే. వర్క్‌షాప్‌లో ప్రదర్శించిన రకరకాల కళాకృతులు స్త్రీ సాధికారత, రక్షణ, హక్కులపై విలువైన సందేశాలని చెప్పకనే చెబుతున్నాయి.
‘ప్రతివ్యక్తి ఎదుటివ్యక్తి నుంచి నేర్చుకోవాల్సింది... తెలుసుకోవాల్సింది ఎంతో కొంత ఉంటుంది. ప్రతి వ్యక్తి తోటివ్యక్తికి చెప్పాల్సింది...నేర్పాల్సింది ఎంతో కొంత ఉంటుంది’ అనేది ‘ఈచ్ వన్ టీచ్ వన్’ సిద్ధాంతం. దీనిని ఈ ఒక్క విషయంలోనే కాదు... ప్రతి విషయంలోనూ అనుసరిస్తే పోోయేదేముంది... అజ్ఞానం తప్ప!