Each One Teach One
-
ఈచ్ వన్–టీచ్ వన్‌కు పుస్తకం పనిముట్టు
33వ జాతీయ పుస్తకప్రదర్శన హైదరాబాద్ మహానగరంపై చెరిగిపోని సంతకం చేసింది. మాకు కొండంత అండగా ఉన్న రాష్ట్రముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖరరావుకు హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అభినందనలు తెలియజే స్తుంది. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు సాగిన ఈ పుస్తక ప్రదర్శనలు విజయవంతంగా ముగిశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ‘ఈచ్ వన్–టీచ్ వన్’ పిలుపునందుకుని ఈ పుస్తక ప్రదర్శనలను ఒక ఉద్యమంగా గ్రామగ్రామానికి తీసుకుపోతామని బుక్‌ఫెయిర్ నిర్వాహక కమిటీ ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలలు, గ్రామ పంచాయ తీలు, పోలీస్స్టేషన్లు, మున్సిపాల్టీలు, పట్టణాల లోని అపార్ట్మెంట్ల దాకా పుస్తక ప్రదర్శనలను తీసుకుపోయేందుకు కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకుంది. మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పలు హోదాలలో వున్న ప్రతినిధులు, పాలనారంగానికి చెందిన ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అన్ని కార్యక్రమాలకు పూలదండలు, శాలువాలు, బోకేలకు బదులుగా పుస్తకాలను బహుమతులుగా ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని పుస్తక ప్రదర్శన కోరుతుంది. బహుమతులుగా ఇచ్చిన పుస్తకాలను తిరిగి పేద విద్యార్థులకు, విద్యాసంస్థలకు బహూకరిస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. హైదరాబాద్ మహానగరం నుంచి 33 జిల్లాల వరకు పుస్తక ప్రదర్శనలను తీసుకుపోవడమే కాకుండా ఇకపై చేయబోయే పుస్తక ప్రదర్శనలను ‘‘టీచ్ వన్–ఈచ్ వన్’’ నినాదంగా ముందుకు తీసుకుపోవాలి. జ్ఞాన తెలంగాణ కోసం 2020 సంవత్సరం పొడుగుతా పుస్తక ప్రదర్శనలను కొనసాగించి ‘అక్షర తెలంగాణ’గా రూపొందించేందుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కేజీ టు పీజీ విద్యను పటిష్టం చేసేందుకు పుస్తక ప్రదర్శనలను ఒక పని ముట్టుగా అందించాలన్న దీక్షతో కృషి చేయాల్సి ఉంది. పుస్తక ప్రదర్శనలంటే అమ్మకాలు, కొనుగోలు కార్యక్రమాలు అన్న దృక్పథాన్ని మార్చి పుస్తక ప్రదర్శనలను కూడా నాలెడ్జ్ సెంటర్లుగా మార్చేం దుకు ప్రయత్నించడం ఒక పరిణామం. తెలంగాణ రాష్ట్రంలో ఆరేళ్లుగా పుస్తక ప్రదర్శనల సందర్భంగా వందల కాలేజీల్లో, స్కూళ్లలో సెమినార్లు నిర్వహించడం జరిగింది. పిల్లలతో వక్తృత్వ, వ్యాస రచన పోటీలు నిర్వహించి పుస్తకంపై ప్రచారం కొనసాగించారు. మాతృభాషను సంరక్షించుకునే పనిని, తెలుగు భాషపై ప్రేమను, మమకారాన్ని పెంచేం దుకు, కొత్త తరానికి తెలంగాణ సంస్కృతిని, చరిత్రను, సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని అందించే విధంగా పుస్తక ప్రదర్శనలను తీర్చిదిద్దాలన్న తలంపుతో బుక్‌ఫెయిర్ కమిటీ ముందుకు సాగడం మొత్తం సమాజం ఆహ్వానించదగింది. పుస్తకాలు చదవటంపై అభిలాషను పెంచటం పుస్తక ప్రదర్శన లక్ష్యం. గ్రంథాలయాలు చేసే పనిని బుక్‌ఫెయిర్ కూడా తమ శక్తి మేరకు చేయా లని తలంచటం రాష్ట్ర గ్రంథాలయాల పునర్నిర్మాణ ఉద్యమానికి దోహదపడుతుంది. ఆసక్తిగల పాఠకులతో బుక్‌లవర్స్ గ్రూప్స్ ఏర్పాటు చేసి సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాల్సి ఉంది. సంపూర్ణ అక్షరాస్యతకు కావాల్సిన సాహిత్యాన్ని శక్తికొద్దీ బుక్‌ఫెయిర్ ద్వారా కూడా అందించే ప్రయత్నం ముమ్మరంగా జరగాలి. ఇప్పటికే వయోజన విద్యాకేంద్రాల ద్వారా సాహిత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. బుక్‌ఫెయిర్ నిర్వహణదారులు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు సంపూర్ణ అక్షరాస్యతకు ప్రోత్సాహం కల్గించే విధంగా సాహిత్యాన్ని తయారుచేసి అందించే పనిని శక్తికొద్దీ చేయాలని నిర్ణయం తీసుకోవడం శుభసూచకం. ఈ స్ఫూర్తితో 2020 సంవత్సరానికి 2020 పుస్తక ప్రదర్శనలు జరపాలని బుక్‌ఫెయిర్ తీసుకున్న నిర్ణయం విజయవంతమైతే అది ‘ఈచ్ వన్–టీచ్ వన్’ నినాదానికి అండగా మారుతుంది. వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్, అధ్యక్షులు, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ -
విద్యార్థులకూ నేరుగా నగదు!
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బదులుగా విద్యార్థులకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతే కాకుండా ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థలో చదువుకునే విద్యార్థులకు చదువుకోవడానికి ఆర్థిక సాయం అందించే వారితో కలిసి ని«ధుల్ని సమీకరించడానికి ఒక వేదిక ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈచ్ వన్, టీచ్ వన్ (ప్రతీ ఒక్కరూ, ఒక్కరిని చదివించాలి) అనే నినాదంతో జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని లేవనెత్తడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈచ్ వన్, టీచ్ వన్: ధనిక వర్గాల్లోని ఒక్కో కుటుంబం ఒక నిరుపేద విద్యార్థికి చదవించడానికి ముందుకు రావాలని కేంద్రం పిలుపునివ్వనుంది. ఈ విధానంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా, ఇచ్చిన డబ్బులు వృథా కాకుండా ఒక డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను ఏర్పాటు చేయనుంది. విద్యాదాన్ పోర్టల్ తరహాలో రూపొందించే ఈ కొత్త పోర్టల్‌లో విద్యార్థులు, వారి చదువుకి సాయం అందించే దాతలు, విద్యాసంస్థల్ని అనుసంధానం చేస్తారు. మొత్తమ్మీద రూ.25 వేల కోట్ల నిధుల్ని సమీకరిస్తారు. వీటిని పూర్తి పారదర్శకంగా ఖర్చు చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. 10 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరుతుంది. ఈ సిఫారసుల్ని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణులతో కూడిన 10 గ్రూపులు మేధోమథనం నిర్వహించి (ఎడ్యుకేషన్ క్వాలిటీ అప్‌గ్రెడేషన్ అండ్ ఇన్‌క్లూజన్ ప్రోగామ్ (ఎక్విప్)) రూపొందించారు. ఉన్నత విద్యా వ్యవస్థను ప్రక్షాళన కోసం వచ్చే అయిదేళ్లలో ఏయే నిర్ణయాలు తీసుకోవాలో ప్రతిపాదనలు చేశారు. ఈ గ్రూపులకు పలువురు ప్రముఖులు నేతృత్వం వహించారు. మాజీ రెవిన్యూ సెక్రటరీ హస్ముఖ్ అదిహ, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ కె. విజయరాఘవన్, రీడిఫ్ వ్యవస్థాపకుడు అజిత్ బాలకృష్ణన్, ఇన్ఫోసిస్ మాజీ సీఈవో క్రిస్ గోపాల్‌కృష్ణన్ వంటి ప్రముఖులు వీరిలో ఉన్నారు. సిఫారసులు ► ఫీజు రీయింబర్స్మెంట్కి బదులుగా విద్యార్థుల బ్యాంకు అకౌంట్లకే నేరుగా నగదు బదిలీ చేయాలి. ► ఇతర విద్యార్థులకు రుణాలు మంజూరు చేయాలి. విద్యార్థులను చదివించడానికి ముందుకు వచ్చేవారికి వారు అందించే ఆర్థిక సహకారంపై ఆదాయపు పున్ను మినహాయింపు కల్పించాలి. ► ఐఐటీ సహా దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో దాతృత్వ కార్యాలయాల ఏర్పాటు. ► 16 లక్షల మంది బీసీ విద్యార్థుల కోసం 8 వేల హాస్టళ్లు. దూర విద్య ద్వారా విద్యనభ్యసించే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజుల్లో 50 శాతం రాయితీ. ► ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 500 వృత్తివిద్యా డిగ్రీ కాలేజీల ఏర్పాటు. ► ప్రపంచస్థాయి ప్రమాణాల కోసం ఎంపిక చేసిన 40–50 విద్యాసంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి. ► విద్యార్థుల పరిశోధనలకు ఆర్థిక సహకారం కోసం జాతీయ అధ్యయన ఫౌండేషన్ ఏర్పాటు. -
ఈచ్ వన్ టీచ్ వన్!
ఉత్తరప్రదేశ్‌లోని ‘గులాబ్ గ్యాంగ్’ ఉద్యమం ఎంతో మంది మహిళలను ప్రభావితం చేసింది. మాధురిదీక్షిత్ ప్రధాన పాత్రలో ఇటీవల బాలీవుడ్లో ‘గులాబ్ గ్యాంగ్’ అనే పేరుతో సినిమా కూడా వచ్చింది. విశేషమేమిటంటే, గులాబ్ గ్యాంగ్ ఇచ్చిన స్ఫూర్తి మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. దేశదేశాలకు వ్యాపించింది. అందరిలోనూ కసి రగలించింది. జర్మనిలో అన్నెసెమెసిక్ నాయకత్వంలోని అయిదు మంది మహిళల బృందం ‘గులాబ్ గ్యాంగ్’ గురించి గొప్పగా విని, చదివి ప్రభావితమైంది. ఆ ప్రభావంతో ‘ఈచ్ వన్ టీచ్ వన్’ పేరుతో మహిళలపై జరిగే రకరకాల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రచార కార్యమ్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల మన దేశానికి కూడా ఈ బృందం వచ్చింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలు, విద్యాలయాలకు వెళ్లి ‘ఈచ్ వన్ టీచ్ వన్’ పేరుతో రోజంతా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. ఇందులో డాక్యుమెంటరీ ప్రదర్శన, చర్చా కార్యక్రమం, ఆర్ట్స్వర్క్స్... మొదలైనవి ఉంటాయి. స్త్రీలపై జరిగే హింసను నిరోధించడానికి ఎలాంటి పద్ధతులు అవలంబిస్తే బాగుంటుందనే దానిపై ముఖ్యమైన సలహాలను మహిళల నుంచి ఆహ్వానిస్తారు. ‘‘ఒక సందేశాన్ని ప్రజలకు చేరువ చేయడానికి కళను మించిన ప్రత్యామ్నాయం లేదు. భాషతో పని లేదు’’ అంటున్నారు అన్నే. వర్క్‌షాప్‌లో ప్రదర్శించిన రకరకాల కళాకృతులు స్త్రీ సాధికారత, రక్షణ, హక్కులపై విలువైన సందేశాలని చెప్పకనే చెబుతున్నాయి. ‘ప్రతివ్యక్తి ఎదుటివ్యక్తి నుంచి నేర్చుకోవాల్సింది... తెలుసుకోవాల్సింది ఎంతో కొంత ఉంటుంది. ప్రతి వ్యక్తి తోటివ్యక్తికి చెప్పాల్సింది...నేర్పాల్సింది ఎంతో కొంత ఉంటుంది’ అనేది ‘ఈచ్ వన్ టీచ్ వన్’ సిద్ధాంతం. దీనిని ఈ ఒక్క విషయంలోనే కాదు... ప్రతి విషయంలోనూ అనుసరిస్తే పోోయేదేముంది... అజ్ఞానం తప్ప!