చెవి గురించి చిత్రమైన సంగతులు!
పిల్లల కోసం ప్రత్యేకం
⇒ మన శరీరంలోని అత్యంత చిన్న కండరం మధ్య చెవిలో ఉంటుంది. దీని పేరు స్టెపీడియస్. దీని పొడవు 1.27 మిల్లీ మీటర్లు మాత్రమే. ఇది మన శరీరంలోని అత్యంత చిన్న ఎముక అయిన స్టెపీస్‌ను నియంత్రిస్తుంది. శబ్ద తరంగాలను మెదడుకు చేరవేసేందుకు ఈ స్టెపీస్ ఎముక మరో రెండు ఎముకలతో కలిసి పనిచేస్తుంది. ఆ ఎముకల పేర్లే మెలియస్, ఇన్‌కస్.
⇒ మనకు కనిపించే చెవి కేవలం బాహ్య చెవి మాత్రమే. ఈ చెవితో పోలిస్తే లోపల ఉండే భాగం పరిమాణమే చాలా ఎక్కువ.
⇒ ఎవరు మాట్లాడే మాటలను వారు... గాలి ద్వారా వచ్చే తరంగాల కంటే ముఖంలోని ఎముకల ద్వారా ప్రసరించే తరంగాల ద్వారానే ఎక్కువగా గ్రహిస్తుంటారు. అందుకే ఎవరి మాటల్ని వారు టేప్ చేసి విన్నప్పుడు అవి తమ మాటల్లాగా అనిపించడం లేదని ఫిర్యాదు చేయడం ఎక్కువ.
⇒ వినడంతో పాటు చెవిలో ఉండే ద్రవం వల్ల మనిషి నిటారుగా ఉండటం సాధ్య మవుతుంది. బ్యాలెన్స్‌గా నిలబడేందుకు చెవిలోని ఈ ద్రవం తోడ్పడుతుంది.