లండన్ : ఉద్యోగులు కష్టించి పనిచేస్తే ప్రమోషన్లు, వేతనాల పెంపు వాటంతటవే వచ్చేస్తాయని చెబుతుంటారు. అయితే ఒళ్లు అలిసేలా పనిచేస్తే ప్రమోషన్ల సంగతి అటుంచి కెరీర్‌కూ, ఆరోగ్యానికీ అది ప్రమాదకరమని తాజా అథ్యయనం వెల్లడించింది. ఉద్యోగ బాధ్యతల్లో అదనపు శ్రమతో పనిచేసేవారు అనారోగ్యాలకు గురికావడంతో పాటు ఉద్యోగ భద్రత లేకపోవడం, ప్రమోషన్లు దక్కలేదనే అసంతృప్తిలో కూరుకుపోతున్నారని యూనివర్సిటీ ఆఫ్ లండన్, ఈఎస్‌సీపీ యూరప్ బిజినెస్ స్కూల్ చేపట్టిన అథ్యయనం పేర్కొంది.
యాజమాన్యాలు ఉద్యోగులను ఒత్తిడి నుంచి విముక్తి కల్పిస్తూ వారికి అనువైన సమయాల్లో పనిచేసే వెసులుబాటు కల్పిస్తే మెరుగైన ఉత్పాదకత, ఉద్యోగుల నుంచి కంపెనీ పట్ల ఆదరణ పెరుగుతాయని అథ్యయనం తేల్చిచెప్పింది. 36 ఐరోపా దేశాలకు చెందిన 52,000 మంది ఉద్యోగులను రెండు దశాబ్దాల పాటు పరిశోధక బృందం పరిశీలించిన మీదట ఈ వివరాలు వెల్లడించింది.
పని తీవ్రత, డెడ్‌లైన్లు వంటివి ఉద్యోగుల పనితీరును దెబ్బతీస్తున్నాయని అథ్యయన రచయిత డాక్టర్ ఆర్గ్యో అస్తోకి చెప్పారు. పనితీవ్రత పని నాణ్యతను కూడా ప్రభావితం చేస్తోందని ఫలితంగా ఉద్యోగులు ఎంత కష్టపడినా ప్రమోషన్లు దక్కడం లేదని అథ్యయనం స్పష్టం చేసింది. పనితీవ్రతను, అధిక పనిగంటలను నివారిస్తేనే మెరుగైన ఫలితాలు లభిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.
చాలా వృత్తుల్లో ఎక్కువ పనిచేసేందుకు సిబ్బంది మధ్యలో విరామం తీసుకోవడాన్ని విస్మరిస్తారని, అయితే బ్రేక్స్ తీసుకోవాలని తాము వారికి సూచిస్తామన్నారు. విరామం లేకుండా పనిచేస్తే ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment