ప్రతి నీటి చుక్కా ప్రాణప్రదమైనదే. అందుబాటులో ఉన్న నీటిని ఎండాకాలంలో ఎక్కువగా ఆవిరైపోకుండా చూసుకోగలగడం అవసరం. పొలాల్లోని ఫామ్ పాండ్స్ (కృత్రిమ చెరువులు), నీటి కుంటలు, తొట్టెల్లో నిల్వచేసుకున్న నీటిని పంటలకు పొదుపుగా వాడుకోవడం రైతులకు అలవాటు. కానీ వేసవిలో పెరిగే ఉష్ణోగ్రతల వల్ల ఆ కాస్త నీరు వేగంగా ఆవిరైపోతుంటుంది. పరిశ్రమలు తమ అవసరాల కోసం వాడే రిజర్వాయర్ల (నీటి కుంటలు)లో నీరు ఆవిరి కాకుండా తెరలు కప్పుతుంటారు. కానీ ఇది అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్న పని. అయితే, వాడిపారేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో తక్కువ ఖర్చుతోనే సులభంగా నీటి ఆవిరిని సగం వరకు తగ్గించవచ్చంటున్నారు మహారాష్ట్రలోని ‘విజ్ఞానాశ్రమం’ విద్యార్థులు. పుణేకు సమీపాన గల పబల్ గ్రామంలో విజ్ఞానాశ్రమం ఉంది.
కృత్రిమంగా ఏర్పాటు చేసిన 8 తొట్టెల్లో నీటిని నింపి 52 రోజుల పాటు అధ్యయనం చేశారు. రెండు తొట్టెల్లో నీటిపైన ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలతో, మరో రెంటిపై 10 గ్రాములు మట్టి నింపిన ప్లాస్టిక్ డబ్బాలతో కట్టిన తెప్పలను పరిచారు. మరో నాలుగు తొట్టెలపై ఎటువంటి ఆచ్ఛాదన వేయలేదు. ఈ 8 తొట్టెల్లో నీటిమట్టాలను ప్రతిరోజూ నమోదు చేశారు. 52 రోజుల తర్వాత గమనించినదేమిటంటే... సాధారణంగా ఆవిరయ్యే నీటిలో 18 నుంచి 46 శాతం వరకు ఆదా అయినట్లు తేలింది.
నీటి తొట్టెలపై డబ్బాలు గాలికి ఎగిరిపోకుండా, పశువులు నీళ్లు తాగకుండా ప్లాస్టిక్ వైర్‌తో అల్లిన వలలను కప్పి బిగదీసి కట్టారు. అలాగే.. మట్టి నింపిన బాటిళ్లను తెప్పగా వేసిన తొట్టెల్లో అతి తక్కువ నీరు ఆవిరైనట్లు తేలింది. ఈ తెప్పలు కప్పి ఉన్నప్పుడు వర్షం కురిసినా బాటిళ్ల మీద నుంచి జారి నీరు తొట్టెలోకే వెళ్లిందని, నీరు వృథా అవ్వలేదని కూడా గమనించడం విశేషం. ఐడియా బాగుంది కదండీ..!
ఖాళీ సీసాలతో చెరువు నీరు ఆదా!
Published Thu, Apr 16 2015 12:06 AM | Last Updated on Mon, Oct 1 2018 3:56 PM
Advertisement