వెనుక తరాలు | Encapsulate the history of the world - 29 | Sakshi
Sakshi News home page

వెనుక తరాలు

Published Mon, Feb 9 2015 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

వెనుక తరాలు

వెనుక తరాలు

టూకీగా ప్రపంచ చరిత్ర -  29
 
మచ్చలుమచ్చలుగా, పొడలు పొడలుగా రంగులు వేసిన నున్నటి గులకరాళ్ళు వాళ్ళ గుహల్లో చాలాచోట్ల కనిపిస్తాయి. వాటి ప్రయోజనం తెలుసునేందుకు ఆధారాలు దొరకలేదు. అవి ఆటలో ఉపయోగించే పాచికలైనా అయ్యుండాలి, లేదా తాంత్రిక తంతుల్లో ఉపయోగించే పిక్కలవంటివైనా అయ్యుండాలి. వాటితో జ్యోతిష్యం వంటిది చెప్పుకోనుంటారనే వాదనకు అవకాశం లేదు. ఎందుకంటే ఆనాటి మానవునికి ‘రేపు’ అనేది తెలీదుగాబట్టి. క్రోమాన్యాన్ మానవునికి తెలిసింది పగలు, రాత్రి మధ్య వ్యత్యాసం మాత్రమే; అంతకుమించిన కాలజ్ఞానంతో అతనికి అవసరమూలేదు, అవగాహనా లేదు. చీకటంటే భయం; అతని ఆందోళనకు ఉషోదయం ఊరట; సూర్యోదయంతో ధీమా తిరిగొస్తుంది. ఆ కారణంగానే మనిషి బుర్రలో విశ్వాసాలు ఏర్పడిన తొలిదశలోనే సూర్యుడు ఆరాధ్యుడైనాడు. సూర్యుడే మిత్రుడు, సూర్యుడే ప్రాణదాత. నైలునదీ నాగరికతలో చివరిదాకా సూర్యుడు ప్రధానమైన దేవత; ఫారో (చక్రవర్తి) సూర్యాంశ సంజాతుడు.

చనిపోయిన ఆత్మీయులను ఖననం చేసే ఆచారాన్ని క్రోమాన్యాన్ మానవుడు విధిగా పాటించడంలో సాంస్కృతికమైన ఎదుగుదల కనిపిస్తుంది. అంటే, అతనిది కేవలం అన్యోన్యతలు ఏర్పడిన కుటుంబం మాత్రమే గాదు; అనుబంధాలు ఏర్పడిన కుటుంబం. సమాధుల్లో రాలిపడిన ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు రంగు పొడులను బట్టి, పూడ్చేముందు భౌతిక కాయాన్ని రంగులతో అలంకరించినట్టు తెలుస్తుంది. బహుశా, రెడ్ ఇండియన్లలాగా బతికున్నప్పుడు కూడా శరీరాన్ని రంగులతో అలంకరించుకునే అలవాటు వాళ్ళకు ఉండేదేమో. శవంతోపాటు పాతిపెట్టిన వస్తువుల్లో ఆయుధాలూ, తిండి పదార్థాలూ ఉంటాయి. అంటే, చనిపోయిన మనిషి ఎక్కడో వున్న తమ పూర్వీకులను కలుసుకునేందుకు ప్రయాణమై వెళ్ళాడని వాళ్ళ భావన కావచ్చు. అక్కడ అలంకరించుకునేందుకు కాబోలు, కొన్నిచోట్ల గవ్వలతో కూర్చిన ఆభరణాలూ పాతిపెట్టి కనిపిస్తాయి. ఆభరణాలు తప్పనిసరిగా చనిపోయిన మనిషి తాలూకువే అయ్యుండాలి. ఎందుకంటే, ఈ ఆచారం ఈజిప్టు పిరమిడ్లల్లో కూడా కనిపిస్తుంది కాబట్టి. కానీ, పనిముట్లు సొంతానివి కాదా అనేది కచ్చితంగా చెప్పలేం. అప్పటికి పనిముట్ల మీద ఏర్పడిన హక్కు వ్యక్తిగతమైనదో సామూహికమైనదో వెల్లడించే ఆధారాలు మనకు దొరకలేదు. కొన్నిరకాల పనిముట్లు సామూహికమైనవిగానూ, మిగిలినవి వ్యక్తిగతమైనవిగానూ వేరుపాటైవున్నా, ‘వ్యక్తిగత హక్కు’లకు పునాది అదే అవుతుంది. పునర్జన్మకు సంబంధించిన ఆలోచన అప్పటికి ఏర్పడినట్టు కనిపించదు. ఆ ఆలోచనే ఉంటే ఆయుధాలను అందుబాటులో ఉంచే అవసరమే వచ్చిఉండేదిగాదు.

అక్కడక్కడ కొన్ని గుహల్లో చితకగొట్టిన పుర్రెలు ఉండడాన్నిబట్టి, క్రోమాన్యాన్ మానవునికి ‘కెనబాలిజం’ - అంటే స్వజాతిమాంసం తినే అలవాటు ఉందేమోనన్న సందేహం కలుగుతుంది. పరస్పరం ఏర్పడిన ఆత్మీయతలూ, సంతానోత్పత్తి పట్ల పెరిగిన ఆకాంక్ష తదితర విషయాల్లో వెల్లడయ్యే దృక్పథాలు అందుకు భిన్నమైన సంకేతాలను సూచిస్తున్నాయి. మొత్తంగా పరిశీలించి, ఎల్లప్పుడూ కాకపోయినా, ఏవో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ‘మనిషి మాంసం’ తినే ఆచారం అతనికి ఉండొచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
 నాలుగవ హిమానీశకం ముగిసిన తరువాత క్రోమాన్యాన్ మానవుడు గుహలను వదిలేసి ఆరుబయటి జీవితానికి తిరిగొచ్చాడు. జంతుచర్మాలను కలిపికుట్టి, వాటితో గుడారాలు వేసుకునేవాడు. చర్మాల వాడకం పెరిగిన దరిమిలా, వేటాడిన జంతువులను నివాసస్థలానికి మోసుకొచ్చుకోవడం అవసరమయింది. నిప్పు మీద కాల్చుకు తినేది ఎముకలకే పరిమితమో లేక కండలుగూడా కాల్చుకునేవాడో చెప్పలేం. అప్పటికిగూడా మనిషి దగ్గర పెంపుడు జంతువు లేదు. కుక్క గూడా ఇంకా మచ్చిక జంతువు కాలేదు. కొన్ని గుహాచిత్రాల్లో గుర్రం తలమీద కల్లెంవిట గుర్తులు ఉన్నందున, అతడు గుర్రాన్ని మచ్చిక చేసుకున్నాడని కొందరు ఊహిస్తున్నారు. కానీ, ఆ మచ్చిక జంతువుతో అతనికి ప్రయోజనం లేదు. యూరప్‌లో దొరికే గుర్రపుజాతి గిటకరకం ‘పోనీ’. మనిషిని మోసుకుపోయేందుకు అది ఏమాత్రం పనికొచ్చేదిగాదు. పోనీ, పాలకోసం అనుకుందామంటే, పాలను ఆహారంగా తీసుకునే ప్రకృతి విరుద్ధమైన అలవాటు ఆ దశలో ఊహాతీతం.

 రచన: ఎం.వి.రమణారెడ్డి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement