M. V. Ramanaa Reddy
-
కొత్త దొంతర
టూకీగా ప్రపంచ చరిత్ర 31 రెండవది, అమితంగా ఇష్టపడే బలిపశువు మీద వ్యామోహం చంపుకోలేక గాలింపుకు తెగించే సాహసికుల సంచారం. అలా మృగాలను వెంబడిస్తూ ఏడాది పొడవునా సంచరించే అటవిక తెగలు ఇప్పటికీ కొన్ని చోట్ల మిగిలున్నాయి. వాటిల్లో చెప్పుకోదగ్గది కెనడా ఈశాన్యరాష్ట్రమైన ‘లేబ్రడార్’లోని రెడ్‌ఇండియన్ల తెగ. వాళ్ళ ప్రాంతానిది ఇంచుమించు దక్షిణభారత దేశంతో సమానమైన విస్తీర్ణం. జనసంఖ్య కొన్ని వేలు మాత్రమే. నాలుగుకు మించి లెక్కించడం వాళ్ళకు చేతగాదు. నాలుగు దాటిన అంకెలకు వాళ్ళ భాషలో మాటలు లేవు. ‘క్యారిబూ’ అనే దుప్పిజాతి జంతువు వాళ్ళకు ఇష్టమైన ఆహారం. వాతావరణాన్ని బట్టి ఆ మందలు దేశం పొడవునా ఉత్తరానికీ దక్షిణానికీ నివాసం మార్చుకుంటూ తిరుగుతుంటాయి. వాటిని అనుసరించి ఆ ఇండియన్లు ఆ రాష్ట్ర విస్తీర్ణం పర్యంతం నిర్విరామంగా సంచరిస్తూ జీవిస్తారు. అది ఎంత కష్టతరమైన జీవితమైనా, ఏడాదిలో ఏదోవొక రోజు పుట్టిన ప్రదేశాన్ని చూసుకునే అదృష్టం లేబ్రడార్ ఇండియన్లకు ప్రాప్తిస్తుంది. కానీ, కొత్త రాతియుగం వేటగాడు వెంబడించిన ధ్రువపు జింకలూ, బొచ్చు ఏనుగులూ, బొచ్చు వృషభాలూ ఇక ఎన్నటికీ వాపసు తిరిగిరానివి. మంచు కురిసే వాతావరణం కోసం అవి ఉత్తరానికి సర్దుకుంటూ సర్దుకుంటూ దారివెంట క్రమేణా అంతరించాయి. వాటిని వెన్నంటి ఉత్తరార్థగోళం చేరిన మానవుడు మాత్రం, వాపసు తిరిగొచ్చే అవసరం లేక, అక్కడే ఆగిపోయాడు. ఇక్కడ ‘మానవుడు’ అనే పదాన్ని కొద్దిగా వివరించడం మంచిదనుకుంటా. మనపాఠంలో అతి తరచుగా ఉపయోగించిన ఈ మాట, ఇక్కడి సందర్భాన్నిబట్టి, ఏకవచనమూ కాదు, పులింగమూ కాదు. ‘మానవుడు’, ‘మనిషి’ అనే పదాలు ఒకే తరహా నిర్వహణలో నిమగ్నమైన సమూహానికి సంకేతంగా వర్తించే నామవాచకాలు. వేటకోసం వలసవెళ్ళే గుంపుల్లో పురుషులూ ఉంటారు, స్త్రీలూ ఉంటారు. అప్పట్లో గుంపుకూ కుటుంబానికీ తేడాలేదు. వావి వరుసలు ఏర్పడక పూర్వం తయారైన కుటుంబాలు గుంపులే తప్ప, సంసారాలు కావు. వావివరుసలు లేని సామాజిక దశ యూరప్‌లో మాత్రమే కాదు, ఒకానొకనాడు ప్రపంచవ్యాప్తంగా నడిచింది. ఆసియా దేశాల్లో ఈ దశను వెల్లడించే నిదర్శనం మనకు భాగవతంలో కనిపిస్తుంది. స్వాయంభవు మనవు కుమార్తె ఆకూతి. ఆమెకు రుచిప్రజాపతితో వివాహమై, యజ్ఞుడు అనే కుమారుడూ దక్షిణ అనే కూతురూ జన్మిస్తారు. పెరిగి పెద్దయిన తరువాత, యజ్ఞుడు తనకు స్వయానా చెల్లెలైన దక్షిణను పెళ్ళాడతాడు. ‘వారు ఆది మిథునంబు గావున అది నిషిద్ధంబు గాకుండె.’ అంటూ భాగవతం ఆ పెళ్ళిని సమర్ధించింది. కారణం ఏదైనా, వలసమార్గం పట్టే మనుషుల గుంపుకూ పశువుల మందకూ బాదరబందీలో పెద్ద తేడా కనిపించదు. వలస జంతువుల మందలో చూలుతో ఉండేవి కొన్ని, దారిలో ఈనేవి కొన్ని, దూడతో ఉండేవి కొన్ని కలగాపులగంగా ఎలా పయనిస్తుంటాయో, అదే రీతిలో సాగుతుంది మనుషుల కదలికగూడా. ఐతే, ప్రయోజనంరీత్యా ఈ రెండు ప్రయాసల మధ్య తేడా ఒకటుంది. అలవాటే తప్ప ఆ ప్రయాణంలో జంతువు సంపాదించుకునే అనుభవం ఏమాత్రం ఉండబోదు. అడుగడుగునా సముపార్జించే అనుభవం మనిషి మేధస్సును అంచెలంచెలుగా పెంచుకుంటూపోతుంది. ఏ ఆలోచనకైనా ‘కోరిక’ పునాది. కలిగిన కోరికను సాధించుకునేందుకు చేసే ‘ప్రయత్నం-ఆలోచన- ప్రయత్నం- ఆలోచన’ అనే గొలుసుకట్టు పరిజ్ఞానం అనుభవంగా ఎలా రూపొందుతుందో తెలుసుకునేందుకు మన ఇంట్లో చిన్న పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తే చాలు. అందకుండా దాచిన బిస్కట్లనూ, చాక్లెట్లనూ ప్రయత్నం మీద ప్రయత్నంతో సాధించుకునే విధానంలో, వాళ్ళ స్పృహతో నిమిత్తం లేకుండా, వాళ్ళల్లో తెలివి పుట్టుకొస్తుంది. అదే మనిషిలోవుండే పెద్దమెదడు ప్రత్యేకత. జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించే ప్రతి విషయాన్నీ అది తన పొరల్లో నమోదు చేసుకుంటుంది. ‘జ్ఞాపకం’ రూపంలో వాటితో బొక్కసం నిర్మిస్తుంది. తరువాతి ప్రయత్నానికి ఆ జ్ఞాపకాలను కొక్కిలాగా తగిలిస్తుంది. ఆ సమన్వయమే మనిషిలో ఏర్పడే మేధస్సు. అలాంటి జ్ఞాపకాల సముదాయాన్ని రాతియుగం మానవుడు దొంతరగా సంపాదించుకుంటూ తన ప్రయాణం సాగిస్తున్నాడు. దారివెంట పరిచయమయ్యే కొత్త పరిసరాలూ, కొత్త జంతువులూ, వింతవింత వృక్షాలూ, అందుబాటులో ఉంచుకోదగిన నీటివనరులూ తదితర పరిజ్ఞానం అతని భాషకు నామవాచకాలను జోడిస్తుండగా, కొత్త తెగలతో పోరాటం, సమ్మేళనం వంటివి అతని భాషను విస్తృతపరిచాయి. ఇప్పుడు అతని భాషకు వ్యావహారిక స్వరూపం ఏర్పడింది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
వెనుక తరాలు
టూకీగా ప్రపంచ చరిత్ర - 29 మచ్చలుమచ్చలుగా, పొడలు పొడలుగా రంగులు వేసిన నున్నటి గులకరాళ్ళు వాళ్ళ గుహల్లో చాలాచోట్ల కనిపిస్తాయి. వాటి ప్రయోజనం తెలుసునేందుకు ఆధారాలు దొరకలేదు. అవి ఆటలో ఉపయోగించే పాచికలైనా అయ్యుండాలి, లేదా తాంత్రిక తంతుల్లో ఉపయోగించే పిక్కలవంటివైనా అయ్యుండాలి. వాటితో జ్యోతిష్యం వంటిది చెప్పుకోనుంటారనే వాదనకు అవకాశం లేదు. ఎందుకంటే ఆనాటి మానవునికి ‘రేపు’ అనేది తెలీదుగాబట్టి. క్రోమాన్యాన్ మానవునికి తెలిసింది పగలు, రాత్రి మధ్య వ్యత్యాసం మాత్రమే; అంతకుమించిన కాలజ్ఞానంతో అతనికి అవసరమూలేదు, అవగాహనా లేదు. చీకటంటే భయం; అతని ఆందోళనకు ఉషోదయం ఊరట; సూర్యోదయంతో ధీమా తిరిగొస్తుంది. ఆ కారణంగానే మనిషి బుర్రలో విశ్వాసాలు ఏర్పడిన తొలిదశలోనే సూర్యుడు ఆరాధ్యుడైనాడు. సూర్యుడే మిత్రుడు, సూర్యుడే ప్రాణదాత. నైలునదీ నాగరికతలో చివరిదాకా సూర్యుడు ప్రధానమైన దేవత; ఫారో (చక్రవర్తి) సూర్యాంశ సంజాతుడు. చనిపోయిన ఆత్మీయులను ఖననం చేసే ఆచారాన్ని క్రోమాన్యాన్ మానవుడు విధిగా పాటించడంలో సాంస్కృతికమైన ఎదుగుదల కనిపిస్తుంది. అంటే, అతనిది కేవలం అన్యోన్యతలు ఏర్పడిన కుటుంబం మాత్రమే గాదు; అనుబంధాలు ఏర్పడిన కుటుంబం. సమాధుల్లో రాలిపడిన ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు రంగు పొడులను బట్టి, పూడ్చేముందు భౌతిక కాయాన్ని రంగులతో అలంకరించినట్టు తెలుస్తుంది. బహుశా, రెడ్ ఇండియన్లలాగా బతికున్నప్పుడు కూడా శరీరాన్ని రంగులతో అలంకరించుకునే అలవాటు వాళ్ళకు ఉండేదేమో. శవంతోపాటు పాతిపెట్టిన వస్తువుల్లో ఆయుధాలూ, తిండి పదార్థాలూ ఉంటాయి. అంటే, చనిపోయిన మనిషి ఎక్కడో వున్న తమ పూర్వీకులను కలుసుకునేందుకు ప్రయాణమై వెళ్ళాడని వాళ్ళ భావన కావచ్చు. అక్కడ అలంకరించుకునేందుకు కాబోలు, కొన్నిచోట్ల గవ్వలతో కూర్చిన ఆభరణాలూ పాతిపెట్టి కనిపిస్తాయి. ఆభరణాలు తప్పనిసరిగా చనిపోయిన మనిషి తాలూకువే అయ్యుండాలి. ఎందుకంటే, ఈ ఆచారం ఈజిప్టు పిరమిడ్లల్లో కూడా కనిపిస్తుంది కాబట్టి. కానీ, పనిముట్లు సొంతానివి కాదా అనేది కచ్చితంగా చెప్పలేం. అప్పటికి పనిముట్ల మీద ఏర్పడిన హక్కు వ్యక్తిగతమైనదో సామూహికమైనదో వెల్లడించే ఆధారాలు మనకు దొరకలేదు. కొన్నిరకాల పనిముట్లు సామూహికమైనవిగానూ, మిగిలినవి వ్యక్తిగతమైనవిగానూ వేరుపాటైవున్నా, ‘వ్యక్తిగత హక్కు’లకు పునాది అదే అవుతుంది. పునర్జన్మకు సంబంధించిన ఆలోచన అప్పటికి ఏర్పడినట్టు కనిపించదు. ఆ ఆలోచనే ఉంటే ఆయుధాలను అందుబాటులో ఉంచే అవసరమే వచ్చిఉండేదిగాదు. అక్కడక్కడ కొన్ని గుహల్లో చితకగొట్టిన పుర్రెలు ఉండడాన్నిబట్టి, క్రోమాన్యాన్ మానవునికి ‘కెనబాలిజం’ - అంటే స్వజాతిమాంసం తినే అలవాటు ఉందేమోనన్న సందేహం కలుగుతుంది. పరస్పరం ఏర్పడిన ఆత్మీయతలూ, సంతానోత్పత్తి పట్ల పెరిగిన ఆకాంక్ష తదితర విషయాల్లో వెల్లడయ్యే దృక్పథాలు అందుకు భిన్నమైన సంకేతాలను సూచిస్తున్నాయి. మొత్తంగా పరిశీలించి, ఎల్లప్పుడూ కాకపోయినా, ఏవో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ‘మనిషి మాంసం’ తినే ఆచారం అతనికి ఉండొచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. నాలుగవ హిమానీశకం ముగిసిన తరువాత క్రోమాన్యాన్ మానవుడు గుహలను వదిలేసి ఆరుబయటి జీవితానికి తిరిగొచ్చాడు. జంతుచర్మాలను కలిపికుట్టి, వాటితో గుడారాలు వేసుకునేవాడు. చర్మాల వాడకం పెరిగిన దరిమిలా, వేటాడిన జంతువులను నివాసస్థలానికి మోసుకొచ్చుకోవడం అవసరమయింది. నిప్పు మీద కాల్చుకు తినేది ఎముకలకే పరిమితమో లేక కండలుగూడా కాల్చుకునేవాడో చెప్పలేం. అప్పటికిగూడా మనిషి దగ్గర పెంపుడు జంతువు లేదు. కుక్క గూడా ఇంకా మచ్చిక జంతువు కాలేదు. కొన్ని గుహాచిత్రాల్లో గుర్రం తలమీద కల్లెంవిట గుర్తులు ఉన్నందున, అతడు గుర్రాన్ని మచ్చిక చేసుకున్నాడని కొందరు ఊహిస్తున్నారు. కానీ, ఆ మచ్చిక జంతువుతో అతనికి ప్రయోజనం లేదు. యూరప్‌లో దొరికే గుర్రపుజాతి గిటకరకం ‘పోనీ’. మనిషిని మోసుకుపోయేందుకు అది ఏమాత్రం పనికొచ్చేదిగాదు. పోనీ, పాలకోసం అనుకుందామంటే, పాలను ఆహారంగా తీసుకునే ప్రకృతి విరుద్ధమైన అలవాటు ఆ దశలో ఊహాతీతం. రచన: ఎం.వి.రమణారెడ్డి -
దూరపుచుట్టం
టూకీగా ప్రపంచ చరిత్ర 22 ఆ తరువాతి చరిత్రకు విశాలమైన గండి ఏర్పడింది. రెండవ హిమానీ శకం నాటి ‘హోమో ఎరెక్టస్’ దగ్గరి నుండి మన నడక నాలుగవ హిమానీశకం నాటి ‘నియాండర్తల్’ మానవుని దగ్గరికి ఒక్క దూకులో గెంతేసింది. నియాండర్తల్ అనేది జర్మనీలో ఒక లోయ. అక్కడ దొరికిన పుర్రె ఆధునిక మానవునికి అత్యంత చేరువగా ఉండేది. అందువల్ల ఆ పుర్రె యజమానినీ, అతని జాతినీ ‘హోమో నియాండర్తలెన్సిస్’ అనే పేరుతో పిలిచారు. ఆ తరువాత ఇలాంటి అవశేషాలు బెల్జియం తదితర పశ్చిమ యూరోపియన్ ప్రాంతాల్లో కొల్లలుగా దొరికాయి. విడివిడి అవశేషాలు కాకుండా పూర్తి అస్థిపంజరాలే దొరకడంతో ఆనాటి స్థితిగతులు మరింత వివరంగా తెలుసుకునే వీలు కలిగింది. నియాండర్తల్ మానవుని ఎత్తు సగటున ఐదడుగులా మూడు అంగుళాలు. పుర్రె సైజు పెద్దది, దాని ఎముకలు దళసరి. మెదడు భరిణ ఆధునిక మానవునికి ఉండేకంటే మరికాస్త పెద్దదే. పుర్రె ఎత్తు తక్కువైనందున తల చప్పిడిగా కనిపిస్తుంది. నుదురు ఏటవాలు, కనుబొమలు ఉబ్బెత్తు. ముక్కు వెడల్పాటిది. బలమైన దవడలూ, బలమైన మెడ. మెడభాగం చాలా కురచగా ఉండడంతో తల నేరుగా భుజాల మీద మోసినట్టుంటుంది. మెదడులో కుడిసగం కంటే ఎడమసగం ప్రస్ఫుటంగా కనిపించడాన్ని బట్టి అతనిది మనలాగే కుడిచేతివాటమని చెప్పొచ్చు. చూపు, స్పర్శలను గ్రహించే పుచ్చెభాగం ఎంత బలకొందో మాటకూ ఆలోచనకూ పీఠమైన ముందుభాగం అంత బలహీనంగా కనిపిస్తుంది. పెపైచ్చు అతని గొంతు కూడా ఇరుకుగా, మాటలు తిరిగేందుకు అసౌకర్యంగా ఉండడంతో, నియాండర్తల్ మనిషికి భాష లేదని కచ్చితంగా చెప్పొచ్చు. మహా ఉంటే చిలుకకు మల్లే కొన్ని మాటల వరకు పలికుండొచ్చు. వేట నియాండత లెన్సిస్ జీవన విధానం. అయితే కేవలం అతడు మాంసాహారి మాత్రం కాదు; కాయలూ, పండ్లూ, రుచించే ఆకులూ, పుట్టగొడుగులూ వంటివి అతని శాకాహారం, చేపలు కూడా ఆహారంలో భాగమే. అయితే, వాటిని పట్టేందుకు ‘గాలం’ వంటి సాధనం అతనికి అందుబాటులో లేదు. అందువల్ల, నీటిలో చేపను ఎలుగుబంటి ఎంత వడుపుగా నోటితో పట్టేస్తుందో అలా నియాండర్తల్ నరుడు చేతులతో చేపలు పట్టుకునేవాడై వుండాలి. లేదా బద్దలాగా చివిరిన కొయ్య టేగ (18-20 అంగుళాల పొడవుండే మొద్దుకత్తి)తో తలమీద కొట్టి, చచ్చిన చేప నీటి మీద తేలగానే సేకరించుకోనుండొచ్చు. టేగతో ఈవిధంగా చేపలను వేటాడే పద్ధతి ఇప్పటికీ మనప్రాంతాల్లో కనిపిస్తుంది. నియాండర్తల్ గుహల్లో బొచ్చు ఏనుగూ, దుప్పి, కణితి వంటి పెద్ద జంతువుల ఎముకలు దొరికిన దాన్నిబట్టి ఆ నరుడు వాటిని వేటాడినట్టు ఊహించారుగానీ, అతనికున్న కొయ్యబరిసె, బడితెల వంటి ఆయుధాలతో అంత పెద్ద జంతువులను వేటాడటం సాధ్యమని నమ్మలేం. పైగా ఆ దశలో మానవుడు పెద్ద జంతువులకు ఇంకా ‘వేట’గా ఉన్నాడే తప్ప, వేటగాడు కాలేదు. అతని శక్తికి అవి లోబడేది ఏ పోట్లాటలోనో గాయపడినప్పుడో, ఆరోగ్యంగా లేనప్పుడో, లేదా బురద గుంటల్లో ఇరుక్కున్నప్పుడో మాత్రమే. వేట వాళ్ళకొక సామూహిక యజ్ఞం. జంతువును చంపినచోటనే విందు చేసుకోవడం నియాండర్తల్ అలవాటులా కనిపిస్తుంది. తినగా మిగిలిన మాంసాన్నీ, మూలుగులుండే ఎముకలనూ గుహకు చేర్చుకుంటారు. అందుకే వాళ్ళ గుహల్లో తొడ ఎముకలూ, కాలి ఎముకలు మాత్రమే ఉంటాయిగానీ పక్కటెముకలవంటివి కనిపించవు. రాతి పనిముట్లు చెక్కుకోవడంలో నైపుణ్యం పెరిగింది. పనిముట్ల వైవిధ్యం పెరిగింది. పలురకాల అవసరాలకు వేరువేరు పనిముట్లు వాడకానికొచ్చాయి. గొడ్డళ్ళూ, గునపాలూ, కత్తులూ, రాతితోనే తయారవుతున్నాయి. వాటితోపాటు కొయ్య సామగ్రిని కూడా వాడినట్టు తెలుస్తుందిగానీ, అవి శిధిలమయ్యేవి కావడంతో మనకు దొరికే అవకాశం లేదు. వస్తువుల ఆకారాలను గురించిన విజ్ఞానం పెరగడంతో, ఏ అవసరానికి ఏ ఆకారం అనువుగా ఉంటుందో అదే ఆకారంలో పనిముట్టును తయారుజేసుకున్న లాఘవం కనిపిస్తుంది. రాతి పనిముట్టును చెక్కేముందు కొయ్యనమూనాను ఆధారం చేసుకున్నట్టు గూడా తెలుస్తూంది. ఇనుపరాయిని చెకుముకిరాయితో కొట్టి నిప్పు రాజేసే విధానం అమలులోకి వచ్చింది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
చుట్టరికాలు
టూకీగా ప్రపంచ చరిత్ర 16 మనిషి, లేదా మనిషిని పోలిన జంతువు అప్పట్లో ఉండే వుండాలని గట్టిగా నమ్మేందుకు దొరికిన మొట్టమొదటి ఆధారాలు ‘రాతి పనిముట్లు.’ అవి చెకుముకిరాయి వంటి కఠినాతి కఠినమైన రాళ్ళతో అతి మోటుగా చెక్కిన పరికరాలు. వాటిల్లో కోసేందుకు ఉపయోగించేవి కొన్ని, గోకేందుకు ఉపయోగించేవి కొన్ని. ఇలాంటివన్నీ ఒకే తావున కూటమిగా దొరకడంతో అనుమానం తలెత్తింది. వాటిది ప్రకృతిసిద్ధమైన ఆకారమో, కృత్రిమంగా తయారైన ఆకారమో తెలుసుకోవడం ఆ శాస్త్రంలో నిపుణులకే వీలౌతుంది. అవి ఎవరో తయారుచేసినవా కాదా అనే వాదోపవాదాలు సుదీర్ఘంగా జరిగి, చివరకు పనిముట్లేనని శాస్త్రజ్ఞులందరూ తీర్మానించారు. వాటితోపాటు ఆ తయారుచేసిన వారి అవశేషం ఏవొక్కటీ, ఏవొక్క తావులో దొరకలేదు. వాటిల్లో అతి పురాతనమైనవి సీనోజోయిక్ యుగంలోని తొలిఘట్టానికి చివరిదైన ప్లియోసీన్ శకానివని నిర్ధారించారు. అంటే, ప్రైమేట్లకు అవి కోటి సంవత్సరాల తరువాతివి, మనకు ఇరవై లక్షల ఏళ్ళ పూర్వానివి. ‘మనిషి పనిముట్టును తయారుచేశాడా లేక పనిముట్టు మనిషిని తయారుచేసిందా?’ అనేది ఒక పట్టాన తెగే తర్కం కాదు. దాన్ని వదిలేసి, పనిట్టును వాడడానికీ, పనిముట్టును తయారుచేయడానికి మధ్యనుండే తేడాను కొద్దిగా పరిశీలిద్దాం. పనిముట్టును వాడడమనేది మనిషొక్కడే నేర్చిన నైపుణ్యం గాదు. చింపాంజీ, గొరిల్లాలవంటి వాలిడి తెగలన్నీ పనిముట్లను వాడగలవు. అవి కర్రలతో బండలు పెకలిస్తాయి, పొదలను కుళ్ళగిస్తాయి; గుండ్రాళ్ళతో కాయలను పగలగొట్టుకుంటాయి; రాళ్ళు విసిరి శత్రువులను పరిగెత్తిస్తాయి; చింపాంజీలు చెట్లమీదనే కొమ్మలు అల్లుకుని గుడిసె కప్పులా తయారుజేసుకుంటాయి. అయితే, అవి సిద్ధంగా దొరికిన పనిముట్టును వాడగలవే గానీ, తమకు తాముగా పనిముట్టును తయారుచేసుకోలేవు. పనిముట్టును తయారుజేసుకునే మేధస్సు కలిగిన ఒకే జంతువు ‘మనిషి.’ ఆదిమకాలం పనిముట్లన్నీ రాతివే దొరకడం వల్ల ఇతర ముడిసరుకుతో తయారుచేసిన సామగ్రి ఉండేదికాదనే అభిప్రాయం సరిగాదు. వెదురుతోనూ, కలపతోనూ తయారైన సాధనాలను అప్పటి మనుషులు ఉపయోగించే ఉండొచ్చు. అవి దీర్ఘకాలం మన్నికయ్యేవి కాకపోవడంతో మనకు దొరికుండవు. ఉండేవని ఎందుకు భావిస్తున్నామంటే - పవిత్రమైన కార్యాలకు శాఖాసంబంధమైన సామగ్రిని విధిగా వాడే సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉందిగాబట్టి. యాగశాలను నిర్మించేందుకు వేదాలలో విధించిన నిబంధనలు పరిశీలిస్తే, ఇటుకలతో నిర్మించేది ఒక్క యజ్ఞకుండమే తప్ప, పాకలూ చాపలూ స్తంభాలవంటివన్నీ - గరిటెలతో సహా, శాఖావయవజనితాలే. నిప్పును ‘అరణి’తో- ఎండిన జమ్మి లేక రావి కట్టెల రాపిడితో - పుట్టించాలి. ఈ ఆచారం కొన్నిచోట్ల ఇప్పటికీ ఉంది. మనిషి పూర్వీకుల కోసం జరుగుతున్న అన్వేషణలో, భారతదేశంలోని సిమ్లా సమీపాన, హిమాలయ పర్వత శ్రేణుల్లోని శివాలిక్ కొండల తవ్వకాల్లో దొరికిన దవడ ఎముకలు ఆసక్తిని రేకెత్తించాయి. మనిషికి దగ్గర పోలికలు ఉన్నాయనే కారణంగా దాన్ని ‘శివా పిథికస్’ అన్నారు. ‘పిథికస్’ అంటే నరవానరం. నేలపొరను బట్టి దాని వయసు ఒక కోటీ నలభై లక్షల సంవత్సరాలదని అనుకున్నారు. దవడ ఎముకనుబట్టి నిటారుగా నడిచేదని చెప్పేందుకు వీలుపడదుగానీ, ఆ జీవి వాలిడికంటే పైస్థాయి పరిణామదశకు చేరిందని కచ్చితంగా తెలుసుకోవచ్చు. దానికి కారణం - పై దవడకు 16, కింది దవడకు 16 దంతాలుండేది మనిషికీ, వానరాలకు మాత్రమే. అందులో తోకకోతుల దవడ దంతానికి నాలుగు శిఖరాలే ఉండగా, హోమినాయిడీల దవడపళ్ళకు ఐదేసి శిఖరాలుంటాయి. అయితే, వాలిడి జాతుల దవడ ముందుభాగం, కోరపళ్ళదాకా, చాపంలా వంగివున్నా, వెనకభాగం - అంటే, దవడ దంతాలూ, మునిదవడ దంతాలూ ఉండే భాగం, సమాంతరంగా రైలుపట్టాల్లా ఉంటుంది. అంగిలి బల్లపరుపుగా ఉంటుంది. మనిషి దవడలు ఆసాంతం చాపంలాగే ఉంటాయి. చివరకు పోనుపోనూ కుడి ఎడమ దంతాల మధ్యదూరం పెరుగుతూ పోతుంది. పైగా, అంగిలి బల్లపరుపుగా కాక, కమానులాగా (‘డోమ్’లాగా) వంగివుంటుంది. క్రీస్తుశకం ఇరవయ్యో శతాబ్దపు తొలిరోజుల్లో ఇండియా, పాకిస్థాన్, నేపాల్ దేశాల్లో అనేకచోట్ల ఇదే జాతికి చెందిన జంతువుల అస్థిపంజరాలు మొత్తంగా దొరకడంతో ఆశ నిరాశైంది. అది ఇంకా శాఖాజీవితం మానుకోని జంతువు. ఎత్తు ఐదూ ఐదున్నర అడుగులు ఉంటుంది. దంతాలు కాయలూ పళ్ళ వంటి మృదువైన ఆహారాన్ని తీసుకునేందుకు మాత్రమే అనుకూలించేవి. కాకపోతే అది, చింపాంజీలకంటే పైస్థాయికి ఎదిగి, ఆ తరువాత అంతరించి పోయిన జాతి. మనం వెదుకుతున్నది దీనికోసం కాదు. మనకు కావలసింది నేలమీద పరిగెత్తుతూ, కొండల్లో గుట్టల్లో దాక్కున్న నరవానరం. బహుశా, సేబర్ టీత్ టైగర్ వంటి క్రూరమృగం వదిలేసిన జంతుమాంసాన్ని ఇప్పటి నక్కలాగా పొంచేసుకుని శుభ్రం చేసిన నరవానరం. శాఖాజీవితానికి స్వస్తిపలికి, నేలమీదికి నివాసం మార్చుకున్న నరవానరం. రచన: ఎం.వి.రమణారెడ్డి -
లోగిలి
టూకీగా ప్రపంచ చరిత్ర 15 ఈ తెగల్లో అన్నికంటే భారీ జంతువు గొరిల్లా. ఆరడుగుల ఎత్తుకు పెరగడమే గాక, చాలా బలిష్టంగా ఉంటుంది. చూసేందుకు క్రూరంగా కనిపించినా, హాని కలిగించే జంతువు గాదు. ఇవి కూడా చిన్న చిన్న కుటుంబాలుగా జీవించేవే. పగటిపూట నేలమీదనే ఉంటాయిగానీ, నడిచేది మాత్రం నాలుగు కాళ్ళతోనే. నిటారుగా వెనకకాళ్ళ మీద నిలబడగలిగినా, రెండుకాళ్ళ మీద కొన్ని అడుగులకు మించి నడవవు. చీకటి పడగానే చెట్టెక్కి పంగల్లో పడుకుంటాయి. గడ్డితో కొమ్మలతో కప్పును తయారుజేసుకుంటాయి. బృందానికి నాయకత్వం ఏర్పాటు చేసుకునే సంప్రదాయం వీటికుంది. వయసులో అన్నిటికంటే పెద్ద జంతువును నాయకుడిగా అంగీకరిస్తాయి. నాయకుడు నడుస్తూంటే గౌరవసూచకంగా దారిని విడుస్తుంటాయి. శరీర పరిమాణంలో గొరిల్లాలకంటే చింపాంజీలు చిన్నవేగానీ, తెలివికి ముందంజలో ఉంటాయి. తర్ఫీదిస్తే సైకిలు తొక్కడం వంటి పనులు చేసేందుకు వీలుగా వీటి కాళ్ళూ చేతులూ ఏర్పడివుంటాయి. నిద్రపోయేందుకు తప్ప మిగతా సమయాల్లో నేలమీదనే ఉంటాయి. నిటారుగా నిలబడి గొరిల్లాకంటే ఎక్కువ దూరం నడవగలవుగానీ, అవసరమైనప్పుడు తప్ప అలా నడవవు. చింపాజీ, గొరిల్లా, ఒరాంగుటాన్ల శరీర పరిమాణం పెద్దగా ఉండడం వల్ల వీటిని ‘గ్రేట్ ఏప్స్’ అంటారు. అంత పెద్ద శరీరాలతో కొమ్మల మీద ఎల్లప్పుడు జీవించడం ఇబ్బందిగా ఉండడం వల్ల ఇవి నేలకు దిగివచ్చినా, శాఖాజీవితాన్ని సంపూర్ణంగా వదిలేయలేదు. సీనోజోయిక్ యుగంలో తొలిఘట్టం ముగిసేనాటికి పులి, సింహం వంటి మినహాయింపులు పోను, ఇప్పుడు భూమిమీద ఉనికిలోవుండే జంతువులకంటే ఇంకా ఎక్కువే తెరమీదికి వచ్చాయి. ఇంతవరకు ఆరంగేట్రం చేయనిది ఒక్క మానవుడే. ఇంతకుముందు ‘హోమినాయిడీ’ విభాగాన్ని గురించి చర్చిస్తూ, అందులో ‘పాంజిడీ’ జాతికి చెందిన వాలిడులను మాత్రమే చెప్పుకున్నాం. అందులో మరోజాతిగావున్న ‘హోమినిడీ’ని వదిలేశాం. ఆ హోమినిడీలో ఉండేది ఒకేవొక జీవి. దాన్నే ‘మనిషి’ అంటారు. ఆనాటికి పులి, సింహం లేకపోయినా, వాటిగా పరిణామం చెందబోయే పూర్వజంతువుల ఆనవాళ్ళైనా ఉన్నాయి. మనిషికి పూర్వజంతువేదో దాని జాడలు వెదకడమే అనితరసాధ్యమయింది. తెలివిలోనూ, శరీర నిర్మాణంలోనూ వాలిడి జాతులు మనిషిని పోలినవిగా కనిపించినా, అవి మనిషికి ముందుతరాలు కానేకావు. స్థూలదృష్టికి శరీరాలు ఒకేలా కనిపించినా, సూక్ష్మంగా పరిశీలిస్తే చాలా తేడాలు తెలిసొస్తాయి. ఏ తెగ వాలిడిని తీసుకున్నా దాని చేతుల జంపు కాళ్ళకంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్లే వాటి జీవితానికి కొమ్మలతో సంబంధం తెగలేదు. అవి రెండుకాళ్ళ మీద నడవడం యాదృచ్ఛికం; నడిచే విధానంలో బొటన వేలిమీద ఆధారపడకుండా, భారమంతా పాదం వెలుపలివైపు మోస్తుంది. నడకలో మనిషి తన బరువును మోపుకునేది మడమ, బొటనవ్రేళ్ళమీద. చెట్టెక్కాలంటే జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కాలి. వాలిడికి పరిగెత్తడం రాదు. మనిషి నడకగానీ, పరుగుగానీ పరిశీలిస్తే, అంత తేలిగ్గా వాటిని నిర్వర్తించే అవయవ నిర్మాణం కోట్లాది సంవత్సరాలకు పూర్వం మొదలయిందే తప్ప, అంతకు తక్కువ వ్యవధిలో సాధ్యమయ్యే పరిణామం కాదని తెలుస్తుంది. అంటే, సీనోజోయిక్ యుగం తొలిఘట్టంలోనే ఎప్పుడోవొకప్పుడు, నేలమీద పరిగెత్తే వాలిడివంటి జంతువు, కొమ్మల చాటున కాకుండా గుట్టల్లో దాక్కున్న జంతువు, కేవలం శాఖాహారం మీదే ఆధారపడకుండా భోజనానికి మాంసాన్ని తోడుజేసుకున్న జంతువు, తరువాతి తరువాతి కాలంలో మనిషిగా మారేందుకు తగిన సాధనసంపత్తిని అవయవాల్లో ప్రోగుచేసుకున్న జంతువు నిస్సందేహంగా జీవించివుండాలి. కానీ, దాని ఆనవాళ్ళు మాత్రం దొరకడం లేదు. దీనికి కారణాలు అనేకం. సరీసృపాల కాలం నుండి జంతువులు నీటికి దూరంగా జీవితాన్ని సాగించడం మొదలెట్టాయి. ప్రవాహాల విషయంలో మనిషి జాగరూకత మరింత ఎక్కువ. ఎందుకంటే, తర్ఫీదు ద్వారా తప్ప ఈతను సాధించుకోలేని జీవి ప్రకృతి మొత్తానికి మనిషి ఒక్కడే. అందువల్ల, సముద్రం పొరల్లో అవశేషాలు దుర్లభమైనాయి. నేల పొరల్లో సాధ్యమేగానీ, ఆ దిశగా ఇప్పుడు జరుగుతున్న పరిశోధన, ఉత్సాహం చూపించే శాస్త్రజ్ఞుల సంఖ్య చాలినంత లేదు. అయితే, వెలుతులు లేకుండా మానవుని చరిత్రను నిర్మించేందుకు తగిన ఆధారాలు ఏదోవొకరోజు నేలపొరల్లో బయటపడకమానవు. దానికోసం ఎంతకాలం నిరీక్షించాలో ఇప్పుడు చెప్పలేంగానీ, సంపన్నదేశాలు యుద్ధసామాగ్రి ఆధునీకరణకు చూపించే ఆసక్తిలో ఏ నూరోవంతుకు సమానమైన శ్రద్ధ ఇటువైపు మళ్ళించినా దశాబ్దకాలంలో వెలితిలేని మానవచరిత్ర నిర్మాణం కావచ్చు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
ముంగిలి
సలసల మరిగే నీటి ప్రవాహాల వెల్లవలూ, అలలూ ఒడ్డును కప్పేస్తూ వెనక్కు తగ్గుతూవుండే తావుల్లో మొట్టమొదటి ప్రాణి తన జీవితాన్ని ప్రారంభించింది అనే విషయంలో శాస్త్రజ్ఞులందరూ ఏకీభవిస్తున్నారు. రచన: ఎం.వి.రమణారెడ్డి టూకీగా ప్రపంచ చరిత్ర పొట్టలో ఎన్ని ప్రొటాన్లు ఉంటాయో అదే ఆ అణువుకు కేటాయించబడే సంఖ్య. ఉదాహరణకు హైడ్రోజన్ అణువులో ఉండేది ఒకేవొక్క ప్రొటాన్. అందువల్ల దాని అణుసంఖ్య ‘1’ అన్నారు. ఆ తరువాతిది ‘హీలియం’ అనే మరో వాయువు. అందులో వుండే ప్రొటాన్లు రెండు. అందువల్ల దాని అణుసంఖ్య ‘2’ అయింది. ఇలా మూలకంలోని ప్రొటాన్ల సంఖ్య పెరిగేకొద్దీ అణుసంఖ్య దానికి అనుగుణంగా పెరుగుతూపోతుంది. స్థిరమైన మూలకంలో ప్రొటాన్ల సంఖ్య ఎంత వుంటుందో ఎలెక్ట్రాన్ల సంఖ్య అంతే ఉంటుంది. ఇలాంటి మూలకాలు విడివిడిగా ఉండడమేగాక, రెండో మూడో మరిన్నో కలిసి, ఒకటిగా సంయోగం చెందడంతో, మట్టితో సహా మరెన్నో పదార్థాలు తయారై, వైవిధ్యం కలిగిన ఈ ప్రపంచాన్ని సృష్టించాయి. ఆ విధంగా పంచభూతాత్మకమైన ఈ భూమి మీద ఒకానొకప్పటికి ఏర్పడిన పదార్థాల్లో దేనికీ కొదవలేదు - ఒక్క జీవపదార్థానికి తప్ప; పాలసముద్రాన్ని చిలికితే అమృతానికి ముందుగా ఏవేవో పదార్థాలు పుట్టుకొచ్చాయని చెబుతుంటారే అలా జరిగింది అప్పట్లో! భూగోళం నిప్పులకొలిమిగా ఉన్న రోజుల్లో, పదార్థాలన్నీ ద్రవంగానో వాయువుగానో ఉండక తప్పని పరిస్థితి. వాయువులకంటే ద్రవాలు చిక్కగా తూకంగా ఉంటాయి గాబట్టి... బరువుగా వుండేవి అడుగుకూ- అంటే భూమి గర్భంవైపునకూ, తేలికైనవి పైకీ- అంటే ఉపరితలానికీ సర్దుకున్నాయి. మరింత చల్లబడిన తరువాత కొన్ని ద్రవాలు గడ్డకట్టడం మొదలెట్టాయి. మరుగుతున్న చిక్కని పదార్థం పేరు ‘లావా’. దాని మీద తెట్టెలా తేలాడే ఘనపదార్థం రాబోయే కాలానికి రూపుదిద్దుకుంటున్న ‘నేల’. గడ్డకట్టడం, కరిగిపోవడం, ఉష్ణోగ్రత తగ్గిన వేళల్లో తిరిగి గడ్డకట్టడం మళ్ళీ కరిగిపోవడం జరుగగా జరుగగా, కొన్ని కోట్ల సంవత్సరాలకు ఆ తెట్టె మందం పెరిగి, ఎట్టకేలకు పల్చటి బొప్పిలా భూగోళాన్ని కప్పేసింది. ఈ బొప్పి మందం ఇప్పటికిగూడా 20 మైళ్ళకు మించదు. లోతైన సముద్రాల్లో మరీ పల్చన - రెండున్నర మూడు మైళ్ళు మాత్రమే ఉంటుంది. నాలుగు వేల మైళ్ళుగా ఉండే భూమి వ్యాసార్థంతో పోలిస్తే ఇది యాపిల్‌పండు మీది తొక్కతో సమానం. అప్పుడప్పుడు ఈ తొక్కను తొలుచుకుని లావా బయటికి ఎగజిమ్మడం ఇప్పటికీ వింటూనేవున్నాం. అలా ఏర్పడిన పొక్కును ‘అగ్ని పర్వతం’ అంటుంటాం. ఒక్కోసారి, బయటికి చిమ్మకుండా గర్భంలోనే కుతకుతలాడే లావా ప్రవాహం దురుసుకు నేల పొరులు బలహీనంగావున్న తావుల్లో, ఒత్తిడికి తట్టుకోలేక పొంతన తప్పే పలకచెక్కల్లా ఎగుడుదిగుడైనప్పుడు సంభవించే ఉపద్రవాన్ని ‘భూకంపం’ అంటుంటాం. నేలగా ఏర్పడిన బొప్పి యాపిల్‌పండు తొక్కలాంటిదని అనుకున్నామా ఇంతదాకా- అది కేవలం మందానికి సంబంధించిన పోలికే. ఆకారంలో మాత్రం క్రమాన్ని పాటించని మిట్టలూ పల్లాలతో గతుకులు గతుకులుగా ఉంటుంది. బాగా ఎత్తై మిట్టలు పర్వతాలు; బాగా లోతుండే పల్లాలు సముద్రాలు. వర్షాలు కురిస్తే ఆ వాననీళ్ళు మిట్టల మీదినుండి చదునుకు జారి పల్లాలకు ప్రవహిస్తాయి. ఆ వెల్లువలు నేలను కోసుకుంటూ జాడలు చేసుకున్న గాయాలే వంకలూ, వాగులూ, నదీనదాలూ. మరో యాభైకోట్ల సంవత్సరాల పొడవున జరిగిన పరిణామక్రమంలో, ఆయా వాతావరణ స్థితిగతుల్లో, పలురకాల మూలకాల సంయోగంతో ఎడతెరపి లేకుండా ఎన్నోరకాల పదార్థాలు ఏర్పడుతూవచ్చాయి. అలా ఏర్పడిన వాటిల్లో చిత్రాతి చిత్రమైన పదార్థం ‘క్రోమొజోమ్’. దాని భౌతిక లక్షణాల సముదాయమే ‘ప్రాణం’. ప్రాణమున్న పదార్థం పేరు ‘ప్రాణి లేదా జీవి’. ఇంతవరకు భూమిమీద ఏర్పడిన రసాయనిక సంయోగాలన్నిటిలో అత్యంత క్లిష్టమైన సంయోగం ‘ప్రాణం’. ఇది ఊపిరి పీలుస్తుంది, ఆహారం భోంచేస్తుంది, తనకు తానుగా స్థానం మార్చుకుంటుంది, తనబోటి జీవులను సంతానంగా కంటుంది. దీని సృష్టికి అవసరమైన మూలకాలు యావత్తు భూమిమీద ఇప్పటికీ లభ్యమైనా, ఆ తరహా సంయోగానికి వీలయ్యే భౌతిక పరిస్థితులు మాత్రం ఇప్పుడు లేవు. సలసల మరిగే నీటి ప్రవాహాల వెల్లవలూ, అలలూ ఒడ్డును కప్పేస్తూ వెనక్కు తగ్గుతూవుండే తావుల్లో మొట్టమొదటి ప్రాణి తన జీవితాన్ని ప్రారంభించింది అనే విషయంలో శాస్త్రజ్ఞులందరూ ఏకీభవిస్తున్నారు. అప్పట్లో అల్లకల్లోలంగావున్న ఇలాతల ఉపరితల ఉపద్రవాలను ఎదుర్కుంటూ అది అనేకసార్లు పుట్టనూ పుట్టేది, గిట్టనూ గిట్టేది. చివరకు, ఆత్మరక్షణ కోసం తన చుట్టూ దళసరి పొరను తయారుజేసుకోవడంలో సాఫల్యం సాధించి, అటుపోట్లను తట్టుకుని, నీటిని ఆశ్రయించి, అది తన ఉనికిని సుస్థిరం చేసుకోగలిగింది. ‘జీవి ఎలా తయారైంది?’ అని ఎవరైనా అడిగితే ఒకప్పుడు సమాధానం చెప్పడం కష్టంగా ఉండేది. కొన్నేళ్ళ తరువాత సమాధానం దొరికినా, దాంతో వినేవాళ్ళను నమ్మించడం అసాధ్యంగా ఉండేది. హరగోవింద్ ఖొరానా అనే ‘నాన్ రెసిడెన్షియల్’ భారతీయ శాస్త్రజ్ఞుడు జీవపదార్థాన్ని ల్యాబొరేటరీలో కృత్రిమంగా తయారుజేసి అపరబ్రహ్మ కావడంతో బుల్లిబుల్లి సందేహాలు శాశ్వతంగా అంతరించాయి.