కొత్త దొంతర | Encapsulate the history of the world 31 | Sakshi
Sakshi News home page

కొత్త దొంతర

Published Wed, Feb 11 2015 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

కొత్త దొంతర

కొత్త దొంతర

టూకీగా  ప్రపంచ చరిత్ర 31
 
రెండవది, అమితంగా ఇష్టపడే బలిపశువు మీద వ్యామోహం చంపుకోలేక గాలింపుకు తెగించే సాహసికుల సంచారం. అలా మృగాలను వెంబడిస్తూ ఏడాది పొడవునా సంచరించే అటవిక తెగలు ఇప్పటికీ కొన్ని చోట్ల మిగిలున్నాయి. వాటిల్లో చెప్పుకోదగ్గది కెనడా ఈశాన్యరాష్ట్రమైన ‘లేబ్రడార్’లోని రెడ్‌ఇండియన్ల తెగ. వాళ్ళ ప్రాంతానిది ఇంచుమించు దక్షిణభారత దేశంతో సమానమైన విస్తీర్ణం. జనసంఖ్య కొన్ని వేలు మాత్రమే. నాలుగుకు మించి లెక్కించడం వాళ్ళకు చేతగాదు. నాలుగు దాటిన అంకెలకు వాళ్ళ భాషలో మాటలు లేవు. ‘క్యారిబూ’ అనే దుప్పిజాతి జంతువు వాళ్ళకు ఇష్టమైన ఆహారం. వాతావరణాన్ని బట్టి ఆ మందలు దేశం పొడవునా ఉత్తరానికీ దక్షిణానికీ నివాసం మార్చుకుంటూ తిరుగుతుంటాయి. వాటిని అనుసరించి ఆ ఇండియన్లు ఆ రాష్ట్ర విస్తీర్ణం పర్యంతం నిర్విరామంగా సంచరిస్తూ జీవిస్తారు.

అది ఎంత కష్టతరమైన జీవితమైనా, ఏడాదిలో ఏదోవొక రోజు పుట్టిన ప్రదేశాన్ని చూసుకునే అదృష్టం లేబ్రడార్ ఇండియన్లకు ప్రాప్తిస్తుంది. కానీ, కొత్త రాతియుగం వేటగాడు వెంబడించిన ధ్రువపు జింకలూ, బొచ్చు ఏనుగులూ, బొచ్చు వృషభాలూ ఇక ఎన్నటికీ వాపసు తిరిగిరానివి. మంచు కురిసే వాతావరణం కోసం అవి ఉత్తరానికి సర్దుకుంటూ సర్దుకుంటూ దారివెంట క్రమేణా అంతరించాయి. వాటిని వెన్నంటి ఉత్తరార్థగోళం చేరిన మానవుడు మాత్రం, వాపసు తిరిగొచ్చే అవసరం లేక, అక్కడే ఆగిపోయాడు.
 ఇక్కడ ‘మానవుడు’ అనే పదాన్ని కొద్దిగా వివరించడం మంచిదనుకుంటా. మనపాఠంలో అతి తరచుగా ఉపయోగించిన ఈ మాట, ఇక్కడి సందర్భాన్నిబట్టి, ఏకవచనమూ కాదు, పులింగమూ కాదు. ‘మానవుడు’, ‘మనిషి’ అనే పదాలు ఒకే తరహా నిర్వహణలో నిమగ్నమైన సమూహానికి సంకేతంగా వర్తించే నామవాచకాలు. వేటకోసం వలసవెళ్ళే గుంపుల్లో పురుషులూ ఉంటారు, స్త్రీలూ ఉంటారు. అప్పట్లో గుంపుకూ కుటుంబానికీ తేడాలేదు. వావి వరుసలు ఏర్పడక పూర్వం తయారైన కుటుంబాలు గుంపులే తప్ప, సంసారాలు కావు. వావివరుసలు లేని సామాజిక దశ యూరప్‌లో మాత్రమే కాదు, ఒకానొకనాడు ప్రపంచవ్యాప్తంగా నడిచింది. ఆసియా దేశాల్లో ఈ దశను వెల్లడించే నిదర్శనం మనకు భాగవతంలో కనిపిస్తుంది. స్వాయంభవు మనవు కుమార్తె ఆకూతి. ఆమెకు రుచిప్రజాపతితో వివాహమై, యజ్ఞుడు అనే కుమారుడూ దక్షిణ అనే కూతురూ జన్మిస్తారు. పెరిగి పెద్దయిన తరువాత, యజ్ఞుడు తనకు స్వయానా చెల్లెలైన దక్షిణను పెళ్ళాడతాడు. ‘వారు ఆది మిథునంబు గావున అది నిషిద్ధంబు గాకుండె.’ అంటూ భాగవతం ఆ పెళ్ళిని సమర్ధించింది.

కారణం ఏదైనా, వలసమార్గం పట్టే మనుషుల గుంపుకూ పశువుల మందకూ బాదరబందీలో పెద్ద తేడా కనిపించదు. వలస జంతువుల మందలో చూలుతో ఉండేవి కొన్ని, దారిలో ఈనేవి కొన్ని, దూడతో ఉండేవి కొన్ని కలగాపులగంగా ఎలా పయనిస్తుంటాయో, అదే రీతిలో సాగుతుంది మనుషుల కదలికగూడా. ఐతే, ప్రయోజనంరీత్యా ఈ రెండు ప్రయాసల మధ్య తేడా ఒకటుంది. అలవాటే తప్ప ఆ ప్రయాణంలో జంతువు సంపాదించుకునే అనుభవం ఏమాత్రం ఉండబోదు. అడుగడుగునా సముపార్జించే అనుభవం మనిషి మేధస్సును అంచెలంచెలుగా పెంచుకుంటూపోతుంది.

ఏ ఆలోచనకైనా ‘కోరిక’ పునాది. కలిగిన కోరికను సాధించుకునేందుకు చేసే ‘ప్రయత్నం-ఆలోచన- ప్రయత్నం- ఆలోచన’ అనే గొలుసుకట్టు పరిజ్ఞానం అనుభవంగా ఎలా రూపొందుతుందో తెలుసుకునేందుకు మన ఇంట్లో చిన్న పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తే చాలు. అందకుండా దాచిన బిస్కట్లనూ, చాక్లెట్లనూ ప్రయత్నం మీద ప్రయత్నంతో సాధించుకునే విధానంలో, వాళ్ళ స్పృహతో నిమిత్తం లేకుండా, వాళ్ళల్లో తెలివి పుట్టుకొస్తుంది. అదే మనిషిలోవుండే పెద్దమెదడు ప్రత్యేకత. జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించే ప్రతి విషయాన్నీ అది తన పొరల్లో నమోదు చేసుకుంటుంది. ‘జ్ఞాపకం’ రూపంలో వాటితో బొక్కసం నిర్మిస్తుంది. తరువాతి ప్రయత్నానికి ఆ జ్ఞాపకాలను కొక్కిలాగా తగిలిస్తుంది. ఆ సమన్వయమే మనిషిలో ఏర్పడే మేధస్సు. అలాంటి జ్ఞాపకాల సముదాయాన్ని రాతియుగం మానవుడు దొంతరగా సంపాదించుకుంటూ తన ప్రయాణం సాగిస్తున్నాడు. దారివెంట పరిచయమయ్యే కొత్త పరిసరాలూ, కొత్త జంతువులూ, వింతవింత వృక్షాలూ, అందుబాటులో ఉంచుకోదగిన నీటివనరులూ తదితర పరిజ్ఞానం అతని భాషకు నామవాచకాలను జోడిస్తుండగా, కొత్త తెగలతో పోరాటం, సమ్మేళనం వంటివి అతని భాషను విస్తృతపరిచాయి. ఇప్పుడు అతని భాషకు వ్యావహారిక స్వరూపం ఏర్పడింది.
 
  రచన: ఎం.వి.రమణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement