దూరపుచుట్టం | Encapsulate the history of the world 22 | Sakshi
Sakshi News home page

దూరపుచుట్టం

Published Mon, Feb 2 2015 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

దూరపుచుట్టం

దూరపుచుట్టం

టూకీగా ప్రపంచ చరిత్ర 22

ఆ తరువాతి చరిత్రకు విశాలమైన గండి ఏర్పడింది. రెండవ హిమానీ శకం నాటి ‘హోమో ఎరెక్టస్’ దగ్గరి నుండి మన నడక నాలుగవ హిమానీశకం నాటి ‘నియాండర్‌తల్’ మానవుని దగ్గరికి ఒక్క దూకులో గెంతేసింది. నియాండర్‌తల్ అనేది జర్మనీలో ఒక లోయ. అక్కడ దొరికిన పుర్రె ఆధునిక మానవునికి అత్యంత చేరువగా ఉండేది. అందువల్ల ఆ పుర్రె యజమానినీ, అతని జాతినీ ‘హోమో నియాండర్‌తలెన్సిస్’ అనే పేరుతో పిలిచారు. ఆ తరువాత ఇలాంటి అవశేషాలు బెల్జియం తదితర పశ్చిమ యూరోపియన్ ప్రాంతాల్లో కొల్లలుగా దొరికాయి. విడివిడి అవశేషాలు కాకుండా పూర్తి అస్థిపంజరాలే దొరకడంతో ఆనాటి స్థితిగతులు మరింత వివరంగా తెలుసుకునే వీలు కలిగింది.

 నియాండర్‌తల్ మానవుని ఎత్తు సగటున ఐదడుగులా మూడు అంగుళాలు. పుర్రె సైజు పెద్దది, దాని ఎముకలు దళసరి. మెదడు భరిణ ఆధునిక మానవునికి ఉండేకంటే మరికాస్త పెద్దదే. పుర్రె ఎత్తు తక్కువైనందున తల చప్పిడిగా కనిపిస్తుంది. నుదురు ఏటవాలు, కనుబొమలు ఉబ్బెత్తు. ముక్కు వెడల్పాటిది. బలమైన దవడలూ, బలమైన మెడ. మెడభాగం చాలా కురచగా ఉండడంతో తల నేరుగా భుజాల మీద మోసినట్టుంటుంది. మెదడులో కుడిసగం కంటే ఎడమసగం ప్రస్ఫుటంగా కనిపించడాన్ని బట్టి అతనిది మనలాగే కుడిచేతివాటమని చెప్పొచ్చు. చూపు, స్పర్శలను గ్రహించే పుచ్చెభాగం ఎంత బలకొందో మాటకూ ఆలోచనకూ పీఠమైన ముందుభాగం అంత బలహీనంగా కనిపిస్తుంది. పెపైచ్చు అతని గొంతు కూడా ఇరుకుగా, మాటలు తిరిగేందుకు అసౌకర్యంగా ఉండడంతో, నియాండర్‌తల్ మనిషికి భాష లేదని కచ్చితంగా చెప్పొచ్చు. మహా ఉంటే చిలుకకు మల్లే కొన్ని మాటల వరకు పలికుండొచ్చు.

 వేట నియాండత లెన్సిస్ జీవన విధానం. అయితే కేవలం అతడు మాంసాహారి మాత్రం కాదు; కాయలూ, పండ్లూ, రుచించే ఆకులూ, పుట్టగొడుగులూ వంటివి అతని శాకాహారం, చేపలు కూడా ఆహారంలో భాగమే. అయితే, వాటిని పట్టేందుకు ‘గాలం’ వంటి సాధనం అతనికి అందుబాటులో లేదు. అందువల్ల, నీటిలో చేపను ఎలుగుబంటి ఎంత వడుపుగా నోటితో పట్టేస్తుందో అలా నియాండర్‌తల్ నరుడు చేతులతో చేపలు పట్టుకునేవాడై వుండాలి. లేదా బద్దలాగా చివిరిన కొయ్య టేగ (18-20 అంగుళాల పొడవుండే మొద్దుకత్తి)తో తలమీద కొట్టి, చచ్చిన చేప నీటి మీద తేలగానే సేకరించుకోనుండొచ్చు. టేగతో ఈవిధంగా చేపలను వేటాడే పద్ధతి ఇప్పటికీ మనప్రాంతాల్లో కనిపిస్తుంది. నియాండర్‌తల్ గుహల్లో బొచ్చు ఏనుగూ, దుప్పి, కణితి వంటి పెద్ద జంతువుల ఎముకలు దొరికిన దాన్నిబట్టి ఆ నరుడు వాటిని వేటాడినట్టు ఊహించారుగానీ, అతనికున్న కొయ్యబరిసె, బడితెల వంటి ఆయుధాలతో అంత పెద్ద జంతువులను వేటాడటం సాధ్యమని నమ్మలేం. పైగా ఆ దశలో మానవుడు పెద్ద జంతువులకు ఇంకా ‘వేట’గా ఉన్నాడే తప్ప, వేటగాడు కాలేదు. అతని శక్తికి అవి లోబడేది ఏ పోట్లాటలోనో గాయపడినప్పుడో, ఆరోగ్యంగా లేనప్పుడో, లేదా బురద గుంటల్లో ఇరుక్కున్నప్పుడో మాత్రమే. వేట వాళ్ళకొక సామూహిక యజ్ఞం. జంతువును చంపినచోటనే విందు చేసుకోవడం నియాండర్‌తల్ అలవాటులా కనిపిస్తుంది. తినగా మిగిలిన మాంసాన్నీ, మూలుగులుండే ఎముకలనూ గుహకు చేర్చుకుంటారు. అందుకే వాళ్ళ గుహల్లో తొడ ఎముకలూ, కాలి ఎముకలు మాత్రమే ఉంటాయిగానీ పక్కటెముకలవంటివి కనిపించవు.

రాతి పనిముట్లు చెక్కుకోవడంలో నైపుణ్యం పెరిగింది. పనిముట్ల వైవిధ్యం పెరిగింది. పలురకాల అవసరాలకు వేరువేరు పనిముట్లు వాడకానికొచ్చాయి. గొడ్డళ్ళూ, గునపాలూ, కత్తులూ, రాతితోనే తయారవుతున్నాయి. వాటితోపాటు కొయ్య సామగ్రిని కూడా వాడినట్టు తెలుస్తుందిగానీ, అవి శిధిలమయ్యేవి కావడంతో మనకు దొరికే అవకాశం లేదు. వస్తువుల ఆకారాలను గురించిన విజ్ఞానం పెరగడంతో, ఏ అవసరానికి ఏ ఆకారం అనువుగా ఉంటుందో అదే ఆకారంలో పనిముట్టును తయారుజేసుకున్న లాఘవం కనిపిస్తుంది. రాతి పనిముట్టును చెక్కేముందు కొయ్యనమూనాను ఆధారం చేసుకున్నట్టు గూడా తెలుస్తూంది. ఇనుపరాయిని చెకుముకిరాయితో కొట్టి నిప్పు రాజేసే విధానం అమలులోకి వచ్చింది.

రచన: ఎం.వి.రమణారెడ్డి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement