లోగిలి
టూకీగా ప్రపంచ చరిత్ర 15
ఈ తెగల్లో అన్నికంటే భారీ జంతువు గొరిల్లా. ఆరడుగుల ఎత్తుకు పెరగడమే గాక, చాలా బలిష్టంగా ఉంటుంది. చూసేందుకు క్రూరంగా కనిపించినా, హాని కలిగించే జంతువు గాదు. ఇవి కూడా చిన్న చిన్న కుటుంబాలుగా జీవించేవే. పగటిపూట నేలమీదనే ఉంటాయిగానీ, నడిచేది మాత్రం నాలుగు కాళ్ళతోనే. నిటారుగా వెనకకాళ్ళ మీద నిలబడగలిగినా, రెండుకాళ్ళ మీద కొన్ని అడుగులకు మించి నడవవు. చీకటి పడగానే చెట్టెక్కి పంగల్లో పడుకుంటాయి. గడ్డితో కొమ్మలతో కప్పును తయారుజేసుకుంటాయి. బృందానికి నాయకత్వం ఏర్పాటు చేసుకునే సంప్రదాయం వీటికుంది. వయసులో అన్నిటికంటే పెద్ద జంతువును నాయకుడిగా అంగీకరిస్తాయి. నాయకుడు నడుస్తూంటే గౌరవసూచకంగా దారిని విడుస్తుంటాయి.
శరీర పరిమాణంలో గొరిల్లాలకంటే చింపాంజీలు చిన్నవేగానీ, తెలివికి ముందంజలో ఉంటాయి. తర్ఫీదిస్తే సైకిలు తొక్కడం వంటి పనులు చేసేందుకు వీలుగా వీటి కాళ్ళూ చేతులూ ఏర్పడివుంటాయి. నిద్రపోయేందుకు తప్ప మిగతా సమయాల్లో నేలమీదనే ఉంటాయి. నిటారుగా నిలబడి గొరిల్లాకంటే ఎక్కువ దూరం నడవగలవుగానీ, అవసరమైనప్పుడు తప్ప అలా నడవవు. చింపాజీ, గొరిల్లా, ఒరాంగుటాన్ల శరీర పరిమాణం పెద్దగా ఉండడం వల్ల వీటిని ‘గ్రేట్ ఏప్స్’ అంటారు. అంత పెద్ద శరీరాలతో కొమ్మల మీద ఎల్లప్పుడు జీవించడం ఇబ్బందిగా ఉండడం వల్ల ఇవి నేలకు దిగివచ్చినా, శాఖాజీవితాన్ని సంపూర్ణంగా వదిలేయలేదు.
సీనోజోయిక్ యుగంలో తొలిఘట్టం ముగిసేనాటికి పులి, సింహం వంటి మినహాయింపులు పోను, ఇప్పుడు భూమిమీద ఉనికిలోవుండే జంతువులకంటే ఇంకా ఎక్కువే తెరమీదికి వచ్చాయి. ఇంతవరకు ఆరంగేట్రం చేయనిది ఒక్క మానవుడే. ఇంతకుముందు ‘హోమినాయిడీ’ విభాగాన్ని గురించి చర్చిస్తూ, అందులో ‘పాంజిడీ’ జాతికి చెందిన వాలిడులను మాత్రమే చెప్పుకున్నాం. అందులో మరోజాతిగావున్న ‘హోమినిడీ’ని వదిలేశాం. ఆ హోమినిడీలో ఉండేది ఒకేవొక జీవి. దాన్నే ‘మనిషి’ అంటారు. ఆనాటికి పులి, సింహం లేకపోయినా, వాటిగా పరిణామం చెందబోయే పూర్వజంతువుల ఆనవాళ్ళైనా ఉన్నాయి. మనిషికి పూర్వజంతువేదో దాని జాడలు వెదకడమే అనితరసాధ్యమయింది.
తెలివిలోనూ, శరీర నిర్మాణంలోనూ వాలిడి జాతులు మనిషిని పోలినవిగా కనిపించినా, అవి మనిషికి ముందుతరాలు కానేకావు. స్థూలదృష్టికి శరీరాలు ఒకేలా కనిపించినా, సూక్ష్మంగా పరిశీలిస్తే చాలా తేడాలు తెలిసొస్తాయి. ఏ తెగ వాలిడిని తీసుకున్నా దాని చేతుల జంపు కాళ్ళకంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్లే వాటి జీవితానికి కొమ్మలతో సంబంధం తెగలేదు. అవి రెండుకాళ్ళ మీద నడవడం యాదృచ్ఛికం; నడిచే విధానంలో బొటన వేలిమీద ఆధారపడకుండా, భారమంతా పాదం వెలుపలివైపు మోస్తుంది. నడకలో మనిషి తన బరువును మోపుకునేది మడమ, బొటనవ్రేళ్ళమీద. చెట్టెక్కాలంటే జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కాలి. వాలిడికి పరిగెత్తడం రాదు. మనిషి నడకగానీ, పరుగుగానీ పరిశీలిస్తే, అంత తేలిగ్గా వాటిని నిర్వర్తించే అవయవ నిర్మాణం కోట్లాది సంవత్సరాలకు పూర్వం మొదలయిందే తప్ప, అంతకు తక్కువ వ్యవధిలో సాధ్యమయ్యే పరిణామం కాదని తెలుస్తుంది. అంటే, సీనోజోయిక్ యుగం తొలిఘట్టంలోనే ఎప్పుడోవొకప్పుడు, నేలమీద పరిగెత్తే వాలిడివంటి జంతువు, కొమ్మల చాటున కాకుండా గుట్టల్లో దాక్కున్న జంతువు, కేవలం శాఖాహారం మీదే ఆధారపడకుండా భోజనానికి మాంసాన్ని తోడుజేసుకున్న జంతువు, తరువాతి తరువాతి కాలంలో మనిషిగా మారేందుకు తగిన సాధనసంపత్తిని అవయవాల్లో ప్రోగుచేసుకున్న జంతువు నిస్సందేహంగా జీవించివుండాలి. కానీ, దాని ఆనవాళ్ళు మాత్రం దొరకడం లేదు.
దీనికి కారణాలు అనేకం. సరీసృపాల కాలం నుండి జంతువులు నీటికి దూరంగా జీవితాన్ని సాగించడం మొదలెట్టాయి. ప్రవాహాల విషయంలో మనిషి జాగరూకత మరింత ఎక్కువ. ఎందుకంటే, తర్ఫీదు ద్వారా తప్ప ఈతను సాధించుకోలేని జీవి ప్రకృతి మొత్తానికి మనిషి ఒక్కడే. అందువల్ల, సముద్రం పొరల్లో అవశేషాలు దుర్లభమైనాయి. నేల పొరల్లో సాధ్యమేగానీ, ఆ దిశగా ఇప్పుడు జరుగుతున్న పరిశోధన, ఉత్సాహం చూపించే శాస్త్రజ్ఞుల సంఖ్య చాలినంత లేదు. అయితే, వెలుతులు లేకుండా మానవుని చరిత్రను నిర్మించేందుకు తగిన ఆధారాలు ఏదోవొకరోజు నేలపొరల్లో బయటపడకమానవు. దానికోసం ఎంతకాలం నిరీక్షించాలో ఇప్పుడు చెప్పలేంగానీ, సంపన్నదేశాలు యుద్ధసామాగ్రి ఆధునీకరణకు చూపించే ఆసక్తిలో ఏ నూరోవంతుకు సమానమైన శ్రద్ధ ఇటువైపు మళ్ళించినా దశాబ్దకాలంలో వెలితిలేని మానవచరిత్ర నిర్మాణం కావచ్చు.
రచన: ఎం.వి.రమణారెడ్డి