
టూకీగా ప్రపంచ చరిత్ర 38
కులాసాలు
ఈ కథలు మినహా, ‘మాతృస్వామ్యం’ ఉండేదని నిరూపించే ఆధారాలు మరోరకంగా మనకు దొరకలేదు. పాతరాతియుగం దశలో జీవిస్తున్న ఇప్పటి తెగల్లోనూ ఆ విధానం ఏవొక్క తావునా గోచరించదు. అసలు వాళ్ళ జీవనవిధానంలో ‘స్వామ్యం’ అనేదానికి ఆస్కారమే శూన్యం. స్త్రీల మీద అధికారంగానీ, దౌరన్యంగానీ వాటిల్లో మాటవరుసకైనా కనిపించదు. ఈనాటి సామాజిక విధానాన్ని బుర్రనిండా నింపుకుని, ‘పెత్తనం’ అనేది పుట్టకపూర్వం నివసించిన మానవులకు దాన్ని అసందర్భంగా అంటగడుతున్నామేమోననిపిస్తుంది. ఆ తెగల నడవడికను గమనించిప్పుడు. మైధునానికి జతగట్టే విషయంలోనైనా, పాతరాతియుగం మానవుడు జంతు స్వభావం నుండి సంపూర్ణంగా విడిపోని దశలో ఉన్నాడు. ప్రకృతిలో పశువులనూ, పక్షులనూ గమనిస్తే - ఒక్క పెంపుడు కోళ్ళల్లో తప్ప, పెట్టమీద దౌర్జన్యం మరో పిట్టజాతిలో మచ్చుకైనా కనిపించదు. మిగతావన్నీ రకరకాల విద్యలతో పెట్టను మెప్పించేందుకే ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు, నెమలి తన నాట్యంతో పెట్టను ఆకట్టుకుంటుంది.
గిజిగాడు గూటిని అల్లే నైపుణ్యంతో ఆడపిట్టను ఆకర్షిస్తుంది. మచ్చికకాని జంతువుల్లోనూ పెంటిమీద దౌర్జన్యం ఎక్కడా కనిపించదు. అడవి పొటేళ్ళు గొర్రెమీద హక్కును చావు బతుకుల పోరాటంతో తేల్చుకుంటాయి. ఆ జాతిలో ఏర్పడేది శాశ్వతమైన జంటజీవితం కాకపోయినా, ఆ రుతువులో తనతో దాటేందుకు విజేత కోసమే గొర్రె కాచుకుని నిలుచుంటుంది. ఆఖరుకు వీధికుక్కల్లో కూడా పోటీదారులను దూరంగా తరిమేసే సత్తా కలిగిన మగకుక్కనే ఆడకుక్క అంగీకరిస్తుంది. పిల్లల పోషణ బాధ్యత ఏవిధంగా ‘స్త్రీ’ తత్వానికి ప్రకృతి అప్పగించిందో, అదేవిధంగా శక్తిమంతమైన వారసత్వ లక్షణాలను సృష్టిలో కొనసాగించే బాధ్యత గూడా అది స్త్రీకే అప్పగించింది. ఇద్దరు పురుషులు ఒకే స్త్రీని కోరుకుంటే, ఆ స్త్రీ సమక్షంలో వాళ్ళిద్దరూ కత్తి యుద్ధంలో తేల్చుకోవలసిన సంప్రదాయం క్రీ.శ. 16 వ శతాబ్దం దాకా యూరప్ దేశాల్లో కొనసాగినట్టు బోలెడన్ని గాథలు వెల్లడిస్తున్నాయి. ఇదే విషయాన్ని భారతీయ పురాణాల్లోని ‘స్వయంవరం’ గూడా మనకు స్పష్టం చేస్తుంది. సంపద మీద మగవాడికి ఏర్పడిన పెత్తనాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకునే మనస్తత్వం మనిషికి అలవాటయ్యేదాకా మానవ సమాజంలో స్త్రీల స్వేచ్ఛకు చిన్నమెత్తు అంతరాయం పొడసూపలేదు.
నాగరికత పెరిగిన తరువాత మన దృష్టికొచ్చే మహిళారాజ్యం ‘షీబా.’ ఇది క్రీస్తుకు కొన్ని శతాబ్దాలు మాత్రమే పూర్వానిది. ఉజ్జాయింపుగా దీని విస్తీర్ణం - అరేబియా ద్వీపకల్పంలోని ‘ఎమెన్’, ఆఫ్రికాఖండంలోని ‘ఇథోపియా’లు. రాజధాని నగరం ఎమెన్‌లో ఉండేదని తవ్వకాలు నిరూపిస్తున్నాయి. ఇథోపియాలో చెప్పుకునే ఇతిహాసాల ప్రకారం. ఆ సింహాసనం మీద హక్కు కేవలం ఆ రాజవంశంలోని ఆడవాళ్ళకే. ‘వాళ్ళకు కూడా సంతానమే తప్ప, భర్తలు ఉన్నట్టు కనిపించదు. వాళ్ళల్లో చిట్టచివరిదైన రాణి - ఆమె పేరు ఒక్కోచోట ఒకోరకంగా చెపుతుండడంతో, ప్రస్తుతానికి ‘షీ బా సామ్రాజ్ఞి’ అనుకుంటే చాలు - పనిగట్టుకుని ‘ఇజ్రేల్’ బయలు దేరింది. అనేక తెగల ఒప్పందంతో ఏర్పడిన అప్పటి ఇజ్రేల్ రాజ్యానికి పాలకుడైన ‘సాల్మన్’ (ఉజ్జాయింపుగా క్రీ.పూ. 960నాటి రాజు) మహామేధావిగా ఆ రోజుల్లో ప్రసిద్ధి. మనం ‘మర్యాద రామన్న’ తీర్పులుగా తెలుగులో చెప్పుకునే కథలకు మూలం ఈ సాల్మన్ పేరుమీద పడమటి దేశాల్లో ప్రచారమైన పురాతన గాథలే. అతనితో కలిసేందుకు అంత సుదీర్ఘమైన ప్రయాణాన్ని షీబా సామ్రాజ్ఞి చేపట్టిన కారణం అతన్ని లొంగదీసుకునేందుకో, లేక లొంగిపోయేందుకో నిరూపించే ఆధారాలు చరిత్రకు దొరికేవికాదు.
కథల ఆధారంగా మనకు తెలిసేది షీబా సామ్రాజ్యం చాలా సంపన్నమైందనీ, అక్కడి సంప్రదాయాలూ నమ్మకాలూ ఇజ్రేల్‌కు పూర్తిగా భిన్నమైనవని. ఇజ్రేల్ రాజ్యంలోని తెగలు ‘దేవుడు ఒకటే’ నని నమ్మేవి. ఇజ్రేల్ రాజధాని జెరూసలేంలో షీబా సామ్రాజ్ఞి గడుపుతున్న రోజుల్లో, ఆమె సంప్రదాయానికి సంబంధించిన పండుగొకటి సంభవిస్తుంది. అది మన వసంతోత్సవం లాంటి పండుగ; ప్రేమదేవతకు బిడిబిత్తల నైవేద్యం సమర్పించడం వాళ్ళ ఆచారం. ఆ దేవత ముందు ప్రదర్శించే నృత్యంలో ప్రతిభ ఆధారంగా పురుషులను స్త్రీలు ఎన్నుకుంటారు. అది అంతస్థులకు అతీతమైన ఎంపిక. ఇజ్రేల్ సంప్రదాయాలకు విరుద్ధమైన ఆ పండుగను, సామ్రాజ్ఞి గౌరవార్థం, రాజధానికి దూరంగా ఉన్న కొండ ప్రాంతంలో జరుపుకునేందుకు అతిథులను అనుమతిస్తారు. పండుగ జరిగే సమయంలో ఆ ప్రదేశానికి చేరుకోకుండా సాల్మన్‌రాజు నిగ్రహించుకోలేడు. ఫలితంగా, షీబా సామ్రాజ్ఞికీ సాల్మన్‌కూ మగశిశువు జన్మిస్తాడు. అతడు మొట్టమొదటి సామ్రాట్టుగా షీబా సింహాసనం అధిరోహించడంతో అక్కడ స్త్రీల పరిపాలన అంతరిస్తుంది.
రచన: ఎం.వి.రమణారెడ్డి