టూకీగా ప్రపంచ చరిత్ర 43
నేరం
ఇలాంటిదే మహాభారతంలో కూడా ఒక ఇతివృత్తం కనిపిస్తుంది. మనువుల్లో ఒకడైన వైవసత్వుడు స్నానం పూర్తిజేసుకుని కొలనుగట్టున నిలుచోనుంటాడు. ఒక చేప అతనికి దగ్గరగా వచ్చి, ‘అయ్యా, నేను చాలా చిన్న చేపను. ఈ కొలనులో ఉన్న పెద్ద చేపలతో నాకు భయంగా ఉంది. అపాయంలేని చోటికి నన్ను చేర్పించ’మని ప్రార్థిస్తుంది. వైవసత్వుడు దాన్ని తీసుకెళ్ళి ఒక నూతిలో విడుస్తాడు. కొద్దిరోజులకు ఆ చేప పెద్దదిగా పెరిగి, ‘అయ్యా, నీ దయవల్ల నా శరీరం పెరిగింది. ఇప్పుడు నుయ్యి నాకు చాలడం లేదు.’ అంటూ మొరపెట్టుకుంది. వైవసత్వుడు దాన్ని బావిలోకి మార్చాడు. అక్కడగూడా ఇమడనంతగా పెరగ్గానే పెద్ద మడుగులోకీ, ఆ తరువాత సముద్రానికీ దాన్ని మారుస్తాడు. అప్పుడు ఆ చేప వైవసత్వునితో, ‘నువ్వు నాకు చాలా ఉపకారం చేశావు. నీకు నేను ప్రత్యుపకారం చేస్తాను. వ్యవధి పెద్దగా లేదు; సముద్రాలు పొంగి ఏకం కాబోతున్నాయి. జీవరాసులన్నీ తుడిచిపెట్టుకుని పోనున్నాయి.
తొందరగా నువ్వొక పెద్ద నౌకను తయారుజేసుకో. అందులో అన్ని విధాలైన ధాన్యాలనూ విత్తనాలనూ నింపుకుని, సప్తఋషులతో కలిసి సముద్రం ఒడ్డుకొచ్చి నన్ను తలుచుకో. కొమ్ముండే చేపగా నేను ప్రత్యక్షమౌతాను.’ అంటూ కటాక్షించింది. వైవసత్వుడు ఆ చెప్పినవి ఆచరించి చేపను తలుచుకోగానే, తలపైన పెద్ద కొమ్ముడే చేప ఒడ్డు దరికి వస్తుంది. ఆ చేపకొమ్ము కొసకు పొడవాటి మోకుతో నౌకను కట్టివేయగా, అచ్చెరువు కలిగించే వేగంతో అది ఆ నౌకను సముద్ర మధ్యానికి లాక్కుపోతుంది. ఆ నౌకమీదినుండి వైవసత్వుడు చూస్తుండగానే సముద్రాలుపొంగి, ప్రపంచమంతా ఒకే సముద్రంగా మారిపోతుంది. కొన్ని వేల సంవత్సరాలకు ఆ వరద తగ్గుముఖం పట్టగా, ఆ చేప వాళ్ళ నౌకను హిమాలయ పర్వత శిఖరం దాపునకు చేర్చి, ‘మీ నౌకను ఈ శిఖరానికి బంధించండి.’ అంటుంది. అలా చేసిన తరువాత, ‘ఈ ప్రళయం నుండి మిమ్ములను కాపాడాను. ఇక మీకు భయం లేదు. ఈ వైవసత్వమనువు చరాచర ప్రపంచాన్ని సృష్టిస్తాడు. నా దయవల్ల అతనికి పరమజ్ఞానం కలుగుతుంది’ అని చెప్పిన చేప అంతర్ధానమౌతుంది.
పురాణాలను వదిలేసి, మరోసారి భౌగోళం సంఘటనలకు తిరిగొస్తే, సముద్రాల పొంగును నిగ్రహించుకోలేక మునిగిపోయిన నేలలు కొన్నైతే, భూగర్భంలో ఏర్పడిన ఒత్తిడికి సముద్రాల అడుగున్నుండి కొత్తగా పుట్టుకొచ్చిన నేలలుగూడా ఎన్నోవున్నాయి. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది దక్షిణ రష్యా (ఒకప్పటి యు.ఎస్.ఎస్.ఆర్.). అక్కడుండే కాస్పియన్, ఎరల్ సముద్రాలు ఒకప్పుడు నల్లసముద్రంతో కలిసి విస్తారమైన అంభోరాసిగా ఉండేదట. సింధూనది కేవలం జలప్రవాహంగా కాక, ఆ రష్యన్ జలరాసిని హిందూ మహాసముద్రంతో కలిపే జలసంధిగా ఉండేదట. బహుశా అందుకేనేమో దానికి ‘సింధువు’ (సముద్రం) అనే పేరు అలాగే మిగిలిపోయింది. పొంగుకొచ్చిన లావాతో ఆ స్వరూపం మారిపోయి, రష్యాలోని సముద్రాలు దేనికదిగా విడిపోవడమే కాక, హిందూ మహాసముద్రంతో ఉన్న సంబంధం మూసుకుపోయి, మధ్య ఆసియా ప్రాంతాలకు (ఇప్పటి తుర్క్‌మెనిస్థాన్, తాజ్‌కిస్థాన్, ఉజబెకిస్థాన్‌లకు) దక్షిణదిశగా ఆఫ్గనిస్థాన్, ఇరాన్‌లతో అదివరకున్న సంబంధాలకు తోడు, ఉత్తర దిశగా ఓల్గా తీరాలతోనూ, ఈశాన్యంగా సైబీరియాతోనూ భూమార్గ సంబంధం ఏర్పడిందట. పూర్వం జలసంధిగా ఉన్న సింధువు కేవలం ‘సింధూనది’గా ఆధునిక చరిత్రకు మిగిలిపోయిందట.
రచన: ఎం.వి.రమణారెడ్డి