టూకీగా ప్రపంచ చరిత్ర 57 | Encapsulate the history of the world 57 | Sakshi
Sakshi News home page

టూకీగా ప్రపంచ చరిత్ర 57

Published Wed, Mar 11 2015 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

Encapsulate the history of the world 57

ఆడ-మగ
 
 ‘ఎన్ని తరహాల సంతానం ఉత్పత్తి చేసినా, మనుగడ కోసం పోరాటం అనేది నిరంతరం కొనసాగేదేగానీ, ఒకచోట ఆగేదిగాదు. ఉన్నచోటునే ఉండేందుకు పరిగెత్తి పరిగెత్తి ఆయాసం తెచ్చుకున్నట్టుంది ఈ వ్యవహారం’ అనేవాళ్ళు కొందరు.
 ‘వాతావరణంలో సంభవించే మార్పులు ఎప్పుడు ఎలావుంటాయో తెలిసేందుకు వీలయ్యేవిగాదు. దానికోసమే సెక్సువల్ పద్ధతి ఏర్పడిందనేది నమ్మశక్యంగా లేదు’ అంటూ పెదవి విరిచేవాళ్ళు కొందరు.

 ‘మార్పును పునాదిగా చేసుకోకపోతే, ఈ భూమిమీద పరిణామమనేది జరిగుండేదే కాదు. అందువల్ల, సెక్స్ ద్వారా జరిగే మార్పుకు కారణం తెలుసుకునేందుకు ఇప్పట్లో కష్టమైనా, ఏదోవొక రోజు తెలుసుకోగలం’ అనే ధీమా కొందరిది. ‘ఒక ఒరిజినల్‌ను ఫొటోకాపీ చేసి, ఆ ఫొటోకాపీని తిరిగి ఫొటోకాపీ చేసి, మళ్ళీమళ్ళీ అలాగే చేసుకుపోతే ఫలితంగా తయారయ్యే చివరికాపీ రాసి (క్వాలిటీ) ఎలా తగ్గుతూపోతుందో అలాంటిది ఎసెక్సువల్ రిప్రొడక్షన్. అందువల్లనే సెక్సువల్ పద్ధతి ఉత్తమమైంది’ అంటారు కొందరు.

 ‘చెడిపోయిన జన్యుపదార్థం ముక్కను గ్రహించిన ఆడగ్యామేట్లు కొన్ని పక్వదశ చేరకముందే నశిస్తున్నాయి. అలాగే, అండాన్ని చేరుకునే పోటీలో బలహీనమైన మగబీజకణాలు వెనుకబడుతున్నాయి. అడపాదడపా చోటుచేసుకుంటున్న పొరబాట్లను లెక్కలోకి తీసుకుని వెక్కిరించడం కంటే, ఈ పద్ధతి వల్ల మొత్తంగా సమకూరే ప్రయో జనాన్ని మెచ్చుకోవాలి’ అంటూ కొందరు సమర్థిస్తున్నారు.
 ‘జన్యుపదార్థాన్ని మార్చుకునేందుకు అలవాటుపడిన బ్యాక్టీరియాలు యాంటీబయోటిక్ మందులకు లొంగని ‘డ్రగ్ రెసిస్టెంట్’ సంతానాన్ని పొందగలుగుతున్నప్పుడు, జన్యుమార్పిడిని అనుకూలించే సెక్స్ విధానాన్ని నిరుపయోగమని చెప్పేందుకు వీలులేదు’ అంటున్నారు ఇంకాకొందరు.

మానవుని విజ్ఞానానికి ‘ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎవరు, ఏది, ఏ (ఠీజ్ఛి, ఠీజ్ఛిట్ఛ, ఠీజిడ, జిౌఠీ, ఠీజిౌ, ఠీజ్చ్టి, ఠీజిజీఛిజి)’ అనే ఏడు ప్రశ్నలే గురువులు. వీటి సంకలనం జిజ్ఞాస. ఇవి నిరంతరం మెదడును పరిశోధనవైపుకు తరుముతూనే ఉంటాయి; విజ్ఞానంలో ఏర్పడిన సందులను నింపుకునేందుకు ప్రోత్సహిస్తూనే ఉంటాయి. ఈ గురువుల మూలంగా భవిష్యత్తులో ఏ సమాధానం దొరుకుతుందో మరికొంతకాలం వేచిచూద్దాం.

 రచన: ఎం.వి.రమణారెడ్డి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement