Female-male
-
టూకీగా ప్రపంచ చరిత్ర 58
ఆడ-మగ అనుబంధం ఈ కణ విభజన తేలిగ్గా అర్థమయ్యేందుకు నాలుగే క్రోమోజోములుండే ఒక కణాన్ని ఉదాహరణగా తీసుకుందాం. వీటిల్లో రెండు ‘ఎ’ గనివి, మిగతా రెండు ‘బి’ గనివి. మియాసిస్ విభజన రెండు అంచెలుగా జరుగుతుంది. మొదటి అంచె ప్రారంభంకాగానే, వీటిల్లో ప్రతివొక్కటి నిట్టనిలువుకు చీలి, రెండు పోగులుగా ఏర్పడుతుంది. ఇది మైటాసిస్లో ఇదివరకు చూసిందేగానీ, అక్కడికీ ఇక్కడికీ చిన్న తేడావుంది. అక్కడ దేనికదిగా పోగులు పూర్తిగా విడిపోతుండగా, మియాసిస్ పద్ధతిలో అలాకాకుండా. ఒకచోట ‘రివిట్’తో బిగించినట్టు అతుక్కుని, పట్టకారులా విచ్చుకుంటాయి. పట్టకారుకు ఉన్నట్టే ఈ ‘గీ’ ఆకారానికి, రివిట్కు (centromere) పైనుండే చేతులు కురుచ, కిందికుండే కాళ్ళు పొడవు. చూసేందుకు ఆ క్రోమోజోములు ఎనిమిదిగా విడిపోయినట్టు కనిపిస్తున్నా, రివిట్తో అతుక్కున్న మూలంగా వాస్తవానికి నాలుగే. ఈ దశలో ఎ గుంపు నుండి బి లకూ, బి గుంపు నుండి ఎ లకూ కొంత జన్యుపదార్థం ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ ద్వారా బదిలీ అవుతుంది. ఒక చేతినో, ఒక కాలినో అవతలిగుంపు క్రోమోజోముకు బదిలీచేసి, మారుగా దాన్నుండి అదే మోతాదు పదార్థాన్ని తనకు అతికించుకుంటుంది. ఈ బదిలీ తరువాత కూడా కణంలో ఉండే పోగులు ఎనిమిది, క్రోమోజోములు నాలుగు. వాటినుండి ఎ1, బి1లు ఒక ధ్రువానికి, ఎ2, బి2లు మరో ధ్రువానికి చేరుకుంటాయి. మధ్యకు కణకవచం చొచ్చుకొచ్చి విడదీయడం మూలంగా రెండు వేరువేరు కణాలుగా ఏర్పడుతుంది. ఒక్కొక్క కణంలో ఇప్పుడుండేవి నాలుగు పోగులు, వెరసి రెండు క్రోమోజోములు. అంటే క్రోమోజోముల సంఖ్య సగానికి పడిపోయింది. రెండవ అంచే పూర్తిగా మైటాసిస్‌ను పోలిందే. క్రోమోజోములోని పోగులు పూర్తిగా విడిపోయి నాలుగుగా ఏర్పడతాయి. ఒక ఎ పోగు, ఒక బి పోగు ఒక ధ్రువానికీ, మిగిలిన రెండూ మరో ధ్రువానికీ చేరుకుని కణం విభజించబడుతుంది. మొదటి అంచె తరువాత ఏర్పడినవి రెండు కణాలుకాగా, రెండవ అంచెలో ఒక్కొక్కటి రెండుగా ఏర్పడడంతో మొత్తం పిల్లల సంఖ్య నాలుగవుతుంది. రెండవ అంచెలో క్రోమోజోముల సంఖ్య తరగనందున, ఒక్కొక్క పిల్లకు రెండేసి క్రోమోజోములుంటాయి. ఏర్పడిన నాలుగు పిల్లల్లో ఏవొక్కటికి జన్యుపరంగా మరొకదాన్ని పోలిందిగాదు. ఇలా ఏర్పడిన కణాలను ‘గ్యామేట్స్’ అంటారు. సెక్స్ కణాలంటే ఇవే. మగ, ఆడ జీవులు దేని గ్యామేట్లను అవి ఉత్పత్తి చేసుకుంటాయి. పురుషగ్యామేట్ను బీజం (sperm) అంటారు, స్త్రీగ్యామేట్ను అండం (egg) అంటారు. అవి రెండూ సంయోగమైనప్పుడు ఏర్పడేది విశ్వజన్యురాశి (genome). ఆ సగం క్రోమోజోములూ, ఈ సగం క్రోమోజోములు కలిసి, పిండం తిరిగి నాలుగు క్రోమోజోములు కలిగినదై, ఆ స్పీసీస్‌కు ఉండవలసిన క్రోమోజోముల సంఖ్య యదాతథంగా నిలుపుకోవడంతో, స్పీసీస్లో మార్పు జరగకుండా నిలుస్తుంది. గ్యామేట్ల కలయికలో ఆరోగ్యకరమైన సంయోగంతో ఏర్పడిన సంతానం పరిసరాల ప్రభావాన్ని తట్టుకుని బలంగా ఎదిగే శక్తిని కలిగుంటుంది. మగ, ఆడ జీవులు దేని గ్యామేట్లను అవి ఉత్పత్తి చేసుకుంటాయి. పురుషగ్యామేట్ను బీజం (sperm) అంటారు, స్త్రీగ్యామేట్ను అండం (egg) అంటారు. అవి రెండూ సంయోగమైనప్పుడు ఏర్పడేది విశ్వజన్యురాశి (genome). రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 57
ఆడ-మగ ‘ఎన్ని తరహాల సంతానం ఉత్పత్తి చేసినా, మనుగడ కోసం పోరాటం అనేది నిరంతరం కొనసాగేదేగానీ, ఒకచోట ఆగేదిగాదు. ఉన్నచోటునే ఉండేందుకు పరిగెత్తి పరిగెత్తి ఆయాసం తెచ్చుకున్నట్టుంది ఈ వ్యవహారం’ అనేవాళ్ళు కొందరు. ‘వాతావరణంలో సంభవించే మార్పులు ఎప్పుడు ఎలావుంటాయో తెలిసేందుకు వీలయ్యేవిగాదు. దానికోసమే సెక్సువల్ పద్ధతి ఏర్పడిందనేది నమ్మశక్యంగా లేదు’ అంటూ పెదవి విరిచేవాళ్ళు కొందరు. ‘మార్పును పునాదిగా చేసుకోకపోతే, ఈ భూమిమీద పరిణామమనేది జరిగుండేదే కాదు. అందువల్ల, సెక్స్ ద్వారా జరిగే మార్పుకు కారణం తెలుసుకునేందుకు ఇప్పట్లో కష్టమైనా, ఏదోవొక రోజు తెలుసుకోగలం’ అనే ధీమా కొందరిది. ‘ఒక ఒరిజినల్‌ను ఫొటోకాపీ చేసి, ఆ ఫొటోకాపీని తిరిగి ఫొటోకాపీ చేసి, మళ్ళీమళ్ళీ అలాగే చేసుకుపోతే ఫలితంగా తయారయ్యే చివరికాపీ రాసి (క్వాలిటీ) ఎలా తగ్గుతూపోతుందో అలాంటిది ఎసెక్సువల్ రిప్రొడక్షన్. అందువల్లనే సెక్సువల్ పద్ధతి ఉత్తమమైంది’ అంటారు కొందరు. ‘చెడిపోయిన జన్యుపదార్థం ముక్కను గ్రహించిన ఆడగ్యామేట్లు కొన్ని పక్వదశ చేరకముందే నశిస్తున్నాయి. అలాగే, అండాన్ని చేరుకునే పోటీలో బలహీనమైన మగబీజకణాలు వెనుకబడుతున్నాయి. అడపాదడపా చోటుచేసుకుంటున్న పొరబాట్లను లెక్కలోకి తీసుకుని వెక్కిరించడం కంటే, ఈ పద్ధతి వల్ల మొత్తంగా సమకూరే ప్రయో జనాన్ని మెచ్చుకోవాలి’ అంటూ కొందరు సమర్థిస్తున్నారు. ‘జన్యుపదార్థాన్ని మార్చుకునేందుకు అలవాటుపడిన బ్యాక్టీరియాలు యాంటీబయోటిక్ మందులకు లొంగని ‘డ్రగ్ రెసిస్టెంట్’ సంతానాన్ని పొందగలుగుతున్నప్పుడు, జన్యుమార్పిడిని అనుకూలించే సెక్స్ విధానాన్ని నిరుపయోగమని చెప్పేందుకు వీలులేదు’ అంటున్నారు ఇంకాకొందరు. మానవుని విజ్ఞానానికి ‘ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎవరు, ఏది, ఏ (ఠీజ్ఛి, ఠీజ్ఛిట్ఛ, ఠీజిడ, జిౌఠీ, ఠీజిౌ, ఠీజ్చ్టి, ఠీజిజీఛిజి)’ అనే ఏడు ప్రశ్నలే గురువులు. వీటి సంకలనం జిజ్ఞాస. ఇవి నిరంతరం మెదడును పరిశోధనవైపుకు తరుముతూనే ఉంటాయి; విజ్ఞానంలో ఏర్పడిన సందులను నింపుకునేందుకు ప్రోత్సహిస్తూనే ఉంటాయి. ఈ గురువుల మూలంగా భవిష్యత్తులో ఏ సమాధానం దొరుకుతుందో మరికొంతకాలం వేచిచూద్దాం. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 56
ఆడ-మగ ‘ఎప్పుడు’ అనే ప్రశ్నకు ఇటీవలి కాలంలో సమాధానం దొరికింది. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ వచ్చిన తరువాత, జన్యుపదార్థ నిర్మాణాన్నిబట్టి, జీవులను రెండు తరగతులుగా విభజించారు. మొదటి తరగతి ‘ప్రొకార్యోట్స్ కాగా, రెండవ తరగతి ‘యూకార్యోట్స్. ‘ప్రొకార్యోట్స్’ మొత్తం ఏకకణజీవులే. వీటిల్లో న్యూక్లియస్ ఉండదు; చిక్కటి జన్యుపదార్థం కణం మధ్యలో ఉంటుందేగానీ, దాని చుట్టూ న్యూక్లియార్ మెంబ్రేన్ ఏర్పడివుండదు. యూకార్యోట్లలో ఏకకణజీవులూ ఉన్నాయి, బహుకణజీవులూ ఉన్నాయి. కణాలసంఖ్య ఎంతైనా, ప్రతికణంలోని జన్యుపదార్థం పొరతో ఉండడం కారణంగా, అది న్యూక్లియస్‌గా కనిపిస్తుంది. ఈ తరగతిలోని బహుకణజీవుల్లో జన్యుపదార్థం వేరువేరు గనుల నుండి వచ్చిన మిశ్రమం కావడంతో, కణవిభజనకు ‘మైటాసిస్’నే కాకుండా, పరిమితంగా ‘మియాసిస్ పద్ధతిని గూడా అవలంబించే జీవుల దగ్గర సెక్స్ మొదలౌతుంది. వేరువేరు గనులనుండి పొందిన రెండురకాల జన్యువులు, తమ పదార్థాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవడం ద్వారా వైవిధ్యం సంపాదించుకోవడం మియాసిస్ కణవిభజనలోని ప్రత్యేకత. పొరపాటుకు తావివ్వకుండా ఇక్కడ గుర్తుంచుకోవలసిన కీలకాశం ఏమిటంటే - ఆడ, మగ జీవుల్లో ప్రత్యేకంగా ఏర్పడిన జననేంద్రియాల్లో తయారయ్యే కణాలకు మాత్రమే మియాసిస్ విభజన పరిమితం. దేహంలోని మిగతా కణాలన్నీ పెరిగేదీ, యథాస్థితిని పోషించుకునేదీ మైటాసిస్ విభజన ద్వారానే. (అర్థం చేసుకునేందుకు మియాసిస్ విభజన కొంత కష్టంగా ఉంటుంది గాబట్టి, పాఠకులకు ఇబ్బంది కలగకుండా ఆ వివరణ అనుబంధంగా చేర్చబడింది. తెలుసుకోవాలనే కుతూహలం కలిగినవాళ్ళు ఈ అధ్యాయం చివరిలోని అనుబంధం నుండి తెలుసుకోగలరు) ‘ఇంత తతంగంతో అవసరం ఎందుకు ఏర్పడింది?’ అనే ప్రశ్నకు జవాబుగా ఎవరి ప్రతిపాదన వాళ్ళది. ‘ప్రయోజనం కోసం ఏర్పడింది కాదు. ఏదో సమయంలో సృష్టి పరిణామంలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా ఏర్పడింది మాత్రమే. దీన్ని పట్టుకుని శాస్త్రజ్ఞులు కొందరు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారు’ అనేవాళ్ళు లేకపోలేదు. కానీ, ఎక్కువమంది శాస్త్రజ్ఞులు సృష్టిని అంత తేలిగ్గా తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ‘అది కేవలం యాక్సిడెంటే అయ్యుంటే, సృష్టి దాన్ని పక్కకు తొలగించుకోకుండా రెండువందల కోట్ల సంవత్సరాలుగా ఎందుకు కొనసాగిస్తుంది? కాబట్టి, ఏదోవొక ప్రయోజనం ఉండే ఉండాలి.’ అనేది మిగతావాళ్ళ నమ్మకం. ఇది కూడా తోసిపుచ్చేందుకు వీలులేని వాదనే. మనుగడ నిలుపుకునే విధానంలో జీవి ఎన్నో గాయాలను మాన్పుకోగలుగుతోంది. అవసరం తీరిపోయిన తోకను రాల్చేసింది; సంతానం సంఖ్య పడిపోయిన తరువాత స్తనాల సంఖ్యను కుదించుకుంది; ‘అపెండిక్స్’ను ఖాతరులేని అవయవంగా మూలకు నెట్టేసింది. ప్రయోజనం లేనివాటిని తనకుతానై తొలగించుకోగలిగిన ప్రాణి సెక్స్‌ను వందల కోట్ల సంవత్సరాలు కొనసాగించడం నిరర్థకమని భావించేందుకూ వీలుగాదు. కానీ, ఏమిటి ఆ ప్రయోజనం అనేది మాత్రం స్పష్టంగా తేల్చుకోలేకపోతున్నాం. ‘ఈ తరహా కణవిభజనకు పట్టే కాలం ఎక్కువ, ఖర్చయ్యే శక్తిగూడా ఎక్కువ. సంయోగంలో బలమైన గ్యామేట్లే కలుస్తాయో, బలహీనమైనవి కలుస్తాయే ముందుగా తెలియని లాటరీ ఫలితం వంటిది. ఇంతమాత్రానికి అంత ప్రయాస అవసరమా? పైగా, సెక్స్ లేకుండా పుడుతున్న సంతానం గూడా ఈ రెండువందల కోట్ల సంవత్సరాలుగా కొనసాగుతూనేవుంది గదా’ అంటారు కొందరు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర - 55
ఆడ-మగ జంతుప్రపంచంలో కంటికి కనిపిస్తున్న చీమ మొదలు ఏనుగుదాకా సెక్స్ మూలంగానే సంతానం పొందుతున్నాయి. సెక్స్లేని సంతానోత్పత్తి ఎక్కడైనా ఉందా? ఉంటుందని ‘మైక్రోస్కోప్’ రాకముందు ఎవరూ ఊహించలేదు. వచ్చిన తరువాతగానీ సూక్ష్మజీవుల్లో సెక్స్లేని సంతానోత్పత్తి (్చ ట్ఛ్ఠఠ్చ ట్ఛఞటౌఛీఠఛ్టిజీౌ) జరుగుతుందని జీవశాస్త్రానికి తెలీలేదు. దాని వివరాలు తెలుసుకునేందుకు ‘అమీబా’ అనే ఏకకణజీవిని ఉదాహరణగా పరిశీలిద్దాం. ఒకటే కణమైనా దీనిచుట్టూ కవచం వంటి పొర ఏర్పడి వుంటుంది. ఆ పొరను సెల్ మెంబ్రేన్ అంటారు. పొరలోపల జీవపదార్థం నిండుకోనుంటుంది. పొరకింద అది కాసింత చిక్కగానూ, మిగిలింది పల్చగానూ ఉంటుంది. కణం మధ్యలో మరింత చిక్కటి జీవపదార్థమొకటి కనిపిస్తుంది. దీన్ని న్యూక్లియస్ అంటారు. న్యూక్లియస్‌లో దండలు దండలుగా ఇరికిరికి కనిపించేవి క్రోమొజోములు. ఇవి చెల్లాచెదరు కాకుండా చుట్టూ బిర్రుగా నొక్కిపట్టుకునే మరోపొర న్యూక్లియార్ మెంబ్రేన్. ఎన్నో సందర్భాల్లో మనం వింటున్న మాటొకటుందే ‘జీన్స్’ అనేది, ఆ జీన్స్‌కు స్థావరం ఈ క్రోమొజోములే. జీవి రంగు, ఆకారం, ఆహారం, మనుగడ, పరిమాణం, సంతానోత్పత్తి వంటి జీవకార్యక్రమాల సర్వస్వాన్నీ శాసించేవి ఈ జీనులే. అమీబాకు మిగతా అవయవాలు ఏవీ లేకున్నా ఇతర జంతువుల్లాగే స్థలం మారుతుంది, భోం చేస్తుంది, లక్షణంగా జీవిస్తుంది. సెక్స్ లేదు; అయినా సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆహారం ద్వారా అందే మాంసకృత్తులు (ఞట్ట్ఛౌ్చ) ఏరుకుని, రసాయనిక సంయోగంతో ఈ జీవిలోని జీన్స్ అచ్చంగా తమను పోలిన మరో రూపాన్ని సృష్టించుకుంటాయి. అందుకు తగిన మోతాదులో ప్రొటీన్లు లభించిన వెంటనే న్యూక్లియస్‌లో గుత్తిగా పెనవేసుకున్న క్రోమొజోములు చిక్కును విదిలించుకుని దేనికదిగా విడిపోతాయి. ఈలోపు కణం ఆకారం గుండ్రంగా తయారై, క్రోమొజోములను పట్టిపెట్టిన న్యూక్లియర్ మెంబ్రేన్ కరిగిపోతుంది. క్రోమొజోములు జీవకణం మధ్యకు చేరి, నిలువు గీత మీద పేర్చినట్టు ఒకదాని కింద మరొకటి నిటారుగా నిలబడి, నిట్టనిలువున రెండు సమానభాగాలుగా చీలిపోతాయి. అంటే, ఇదివరకు ఎన్ని క్రోమొజోములు ఉండేవో ఇప్పుడు అన్ని జతలు తయారయ్యాయి. ఈ జతలో ఎడమవైపు నిలిచినవి ఒక గుంపు, కుడివైపువి మరోగుంపు. ఏ గుంపుకాగుంపు పరస్పర విరుద్ధమైన దిశగా జరుగుతూ దూరమవగానే, వాటిచుట్టూ దేనిపొర దానికి పుట్టుకొచ్చి రెండు న్యూక్లియస్లుగా ఏర్పడతాయి. ఈ పరిణామం జరుగుతుండగనే కణం వెలుపలి కవచం ఆ న్యూక్లియస్‌ల మధ్యకు చొచ్చుకొచ్చి కణవిభజనను సంపూర్ణం చేస్తుంది. ఏ ముక్కకాముక్క విడిపోయి రెండు అమీబాలుగా తయారై, దేని బ్రతుకు దానిదౌతుంది. ఈ తరహాలో జరిగే కణవిభజనను ‘మైటాసిస్’ అంటారు. తల్లికణానికి ఎన్ని క్రోమోజోములు ఉంటాయో, ఒక్కొక్క పిల్లకు అన్నే ఉంటాయి తప్ప సంఖ్య మారదు. ఎందుకంటే, ఆ సంఖ్య జీవి జాతిని బట్టి (స్పీసీన్ను బట్టి) ఏర్పడేది, జాతిని నిర్ణయించేదీను. ఆ సంఖ్యే ఏ స్పీసీస్ సంతతికి ఆ స్పీసీస్ జీవికుండే ప్రాథమిక లక్షణాలను కలిగించేది. వీటి సంఖ్య మారితే జాతి అంతరిస్తుంది. ఈ తరహా సంతానోత్పత్తి వేగంగానూ, తేలిగ్గానూ జరగడమే కాక, ఖర్చయ్యే శక్తి (ఎనర్జీ) చాలా తక్కువ. దీనికి ప్రత్యేకమైన పునరుత్పత్తి అవయవాలు అవసరం లేదు. నిరంతరం వాటిని పోషించుకునే భారం లేదు. తోడు వెదుక్కునే తంటా లేదు. దీర్ఘకాలం పిండాన్ని గర్భంలో పోషిస్తూ ప్రసవంకోసం కాచుకునే యాతన లేదు. నల్లపూసంత ప్రయాసలేని ఎసెక్సువల్ సంతానోత్పత్తి విధానాలను వదిలేసి, సెక్స్ జంజాటంలో జీవులు ఎందుకు ఇరుక్కున్నాయి, ఎప్పుడు ఇరుక్కున్నాయి? రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర 54
ఆడ-మగ ‘సంతానం కోసమే సంపర్కమైతే ఏడాదికి ఒక్క ఋతువు చాలదా?’ అన్నదిగాదు ఈ పాఠం నుండి మనం గ్రహించవలసిన అంశం. కంటిముందు కనిపించే ప్రతి వింతకు సమాధానం వెదికే ఆనాటి మానవుని జిజ్ఞాస. ప్రయోజనకారిగా ఉండే నేలమీద మొక్క మొలిచేందుకు వీలులేని చౌటిపర్రు ఎందుకొచ్చింది? కాలో వేలో తెగిన జంతువుకు తిరిగి అది మొలవనప్పుడు చెట్టుకు మాత్రమే ఆ శక్తి ఎలా సాధ్యపడింది? అలాగే - జంతు ప్రపంచంలో ఆడజీవి ఎదకొచ్చిన సమయంలో మాత్రమే సంభోగం జరుగుతూ ఉంది. ఎదకొచ్చే అదను కొన్ని జంతువులకు ఏడాదికాలం పట్టొచ్చు, మరికొన్ని జంతువులకు నాలుగునెలలే పట్టొచ్చు. ఏడాదిలో తడవలు ఎన్నైనా, ఎదకొచ్చిన సమయంలో మాత్రమే ఆడది మగపొత్తును కోరుకుంటుంది, దాటేందుకు అనుకూలిస్తూంది. మిగతా సమయాల్లో వాటికి ఆ ధ్యాసే కనిపించదు. మగజంతువుగూడా ఎదకొచ్చిన వాసనకోసం కాచుకొని ఉంటుందే తప్ప, బలవంతంగా దాటేందుకు ప్రయత్నించడం అరుదు. మానవజాతి సెక్స్ ప్రవర్తన ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఋతుస్రావం రోజుల్లో సంభోగం వలదని తనకుతానుగా ఏర్పాటుచేసుకున్న నియమం తప్ప, సంపర్కానికి వీలులేని రోజంటూ ఉండనే వుండదు. ఈ వైవిధ్యానికి కారణంగా ఏమిటి? - పరిశోధన చేసేందుకు తగిన పరికరాలు అందుబాటుకురాని కాలంలో సమస్యలకు దొరికే జవాబులు అంతకంటే మెరుగ్గా వుండే అవకాశమే లేదు. సుఖం, సంతోషం అనేవి మానసిక అవస్థలు. అవి మెదడున్న జీవికి మాత్రమే సాధ్యపడేవి. మరి మెదడే ఏర్పడని జీవులుగూడా సెక్స్‌ను ఎందుకు ఆశిస్తున్నాయి? సూక్ష్మ ప్రపంచాన్ని అలా వదిలేసి, తాటిచెట్టునే ఉదాహరణగా తీసుకుందాం. వీటిల్లో మగ, ఆడ చెట్లు వేరువేరుగా ఉంటాయి. అవి ఎక్కడెక్కడో దూరందూరంగా ఉంటాయి. మగచెట్టులో తయారయ్యే బీజం (పుప్పొడి) గాలికి ఎగిరొచ్చి ఆడచెట్టులోని అండాన్ని చేరుకుంటుంది. సంభోగం కాదుగదా, కనీసం స్పర్శ గూడా వీటిమధ్య వీలుపడదు. ఏ సుఖానికీ నోచుకోని తాటిచెట్టు సంతానం కోసం సెక్స్‌ను ఎందుకు అనుసరిస్తూంది? సంతానంతో అవసరంలేని జీవి ఉంటుందని మనం ఊహించలేం. ఉనికిని కాపాడుకోవడం, మనుగడకోసం జాతిని వృద్ధి చేయడం ఏ జీవికైనా ప్రాథమిక లక్షణాలు. సెక్స్ లేకుండా జాతిని విస్తరిస్తున్న జీవులు కొల్లలుగా మన ఎదుట కనిపిస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని వృక్షజాతులనే తీసుకుందాం. మల్లె, జాజి, పెరటి గన్నేరు వంటి చెట్లు పువ్వులు పూస్తాయి. కానీ వాటిల్లో అండమూ ఉండదు, బీజమూ ఉండదు. సెక్స్‌తో అవసరమే లేకుండా అవి అంట్ల ద్వారా విస్తరిస్తున్నాయి. ఈ తరహా సంతానోత్పత్తిని ‘వెజిటేటివ్ ప్రొడక్షన్’ అంటారు. సొర, బీర, కాకర వంటి తీగల్లో మగ, ఆడ పువ్వులు ఒకే తీగ మీద వేరువేరుగా పుట్టుకొస్తాయి. సంయోగానికి పుప్పొడి గాలిలో ఎగిరి చేరుకోవలసిందేతప్ప, సుఖం కోసమని తీగెలు పెనవేసుకోవడం లేదు. ఎంతో ఉన్నతమైన సాంకేతిక పరికరాలతో, దాదాపు వెయ్యి సంవత్సరాల తరబడి జరుగుతున్న నిరంతర పరిశోధన తరువాతగూడా, ‘సెక్స్ అనేది ఎప్పుడు మొదలయింది, దాంతో జీవికి అవసరమేమొచ్చింది’ అనే ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలున్నాయి. ఇప్పుడున్న పరికరాల సహాయంతో సూదిమొన కంటే వెయ్యింతలు చిన్నదైన జీవిని చూడగలుగుతున్నాం, అది ప్రాణంతో జీవనచర్యలు సాగించే విధానాన్ని పరిశీలించగలుగుతున్నాం. వాతావరణంలో అంతోయింతో మార్పుల కృత్రిమంగా కల్పించి, మారిన పరిస్థితికి దాని ప్రతిచర్య ఎలావుంటుందో గమనించగలుగుతున్నాం. అయినా, రెండువందల కోట్ల సంవత్సరాలకు ముందు నివసించిన జీవిని ప్రాణంతో చూడనూలేము, అది ఎదుర్కున్న పరిస్థితులను ఊహించుకోవాలే తప్ప, సృష్టించనూలేము. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 53
ఆడ-మగ ‘సెక్స్’ అనే పదానికి తెలుగులో సమానార్థకం లేదు. ఇప్పుడు ఆ ఇంగ్లీషుపదమే పల్లెల్లోనూ వాడుకలో పడిపోయింది గాబట్టి, అనువాదం చేసే ప్రయాసం విరమించి, అందరికీ తెలిసిన ఆ పదాన్నే ఇప్పటి మన అవసరానికి వాడుకోవడం తేలిక. నలుగురు మిత్రులు సరదాగా మాడ్లాడుకునే సమయంలో ‘సెక్స్ అనేది ఎందుకు’ అనే ప్రశ్నే ఉదయిస్తే, సాధారణంగా మనకు వినిపించే వాదనలు రెండు రకాలు. మొదటిది - ‘సంతానం కోసం’ అనే వాదన. రెండవది - ‘సుఖం కోసం’ అనే వాదన. రెండవ కోవకు చెందిన వాదనలో సంతామనేది సెక్స్‌కు యాదృచ్ఛిక ఫలితం (బైప్రొడక్ట్). సంభోగం వల్ల సంతానం కలుగుతుందని ఒకనాటి మానవునికి తెలీనైనా తెలీదు. అయినా సెక్స్‌లో పాల్గొనేవాడు. జంతువులు మచ్చికైన తరువాతగానీ మనిషికి సృష్టిరహస్యం అర్థమైందిగాదు. పశువులు గూడా ప్రాణులే. తను దాటిన కారణంగానే గేదెకు సంతానం కలిగిందని దున్నపోతుకు తెలీదు. పశువులు సంభోగించడంలో సంతానేచ్ఛ మచ్చుకైనా కనిపించదు. ఈ వాదనే నిజమేనేమోననిపించే ఇతివృత్త మొకటి కృష్ణయజుర్వేదంలో కనిపిస్తుంది. అందులోని ద్వితీయకాండ, పంచమఃప్రశ్నలో - ‘‘త్వష్ట దేవతలకు దారుశిల్పి. అతని కుమారుడు విశ్వరూపుడు దేవతలకు పురోహితుడు. అదే విశ్వరూపుడు అసురులకు మేనల్లుడు. (అసురులకు మేనల్లుడు కావడమంటే, అతని తల్లి అసురుల ఆడబిడ్డై ఉండాలి.) ఆ విశ్వరూపునికి మూడుతలలు. స్వామిద్రోహం చేస్తున్నాడనే అనుమానంతో ఇంద్రుడు అతని తలలు నరికేస్తాడు. ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది. ఆ పాపాన్ని ఎంతోకాలం భరించలేక, దాన్ని మూడు ముక్కలుగా విభజిస్తాడు. వాటిల్లో ఒక ముక్కను, అంటే మూడింటి భాగాన్ని, స్వీకరించమని భూమి అర్థిస్తాడు. అందుకు భూమి, ‘ఓ ఇంద్రుడా, నన్ను మానవులు యదేచ్ఛగా త్రవ్వేస్తున్నారు. ఆ బాధను భరించడం నాకు శక్యంగా లేదు. సంవత్సరం లోపు గుంతలు నిండితే నాకు కొంత ఉపశమనం కలుగుతుంది. (అప్పుడు నీ బాధను నేను పంచుకోగలను.)’ అంటుంది సమాధానంగా. ‘అంతకు పూర్వానివైన గుంతలు గూడా నిండేట్లు వరమిస్తున్నాను’ అన్నాడు ఇంద్రుడు. భూమి మూడింటిభాగం బ్రహ్మ హత్యను స్వీకరించింది. ఆ పాతకమే భూమిమీద ఏర్పడిన చవిటినేలలు. మరో మూడింటిభాగాన్ని స్వీకరించమని ఇంద్రుడు చెట్లను అర్థించాడు. ‘ఓ ఇంద్రుడా, జనులు మమ్మల్ని యధేచ్ఛగా నరికేస్తున్నారు. అది మాకు తీరని బాధగా ఉంది. (మా ఉనికికి ప్రమాదంగా ఉంది.)’ అన్నాయి చెట్లు. నరికిన చోట అనేక కొత్త మొలకలు ఉద్భేవించేలా ఇంద్రుడు వరమిచ్చాడు. చెట్లు మూడింటిభాగం పాతకాన్ని స్వీకరించాయి. నరికిన చోట జిగురుగా స్రవించేది ఆ పాతకమే. మిగిలిపోయిన మూడింటిభాగాన్ని తీసుకోమని ఇంద్రుడు స్త్రీలను అర్థించాడు. ‘ఓ ఇంద్రుడా, మేము ఋతుకాలంలో మాత్రమే పురుష సంపర్కానికి అర్హులుగా ఉన్నాము. నిరంతరం పురుషునితో సంభోగించే వరం మాకు ఇవ్వాలి’ అన్నారు స్త్రీలు. అతడు ఆ వరాన్నిచ్చి, చివరి మూడింటిభాగాన్ని స్త్రీలకు బదిలీచేశాడు. ఆ పాతకమే స్త్రీలకు ఋతుస్రావం అయింది.’’ రచన: ఎం.వి.రమణారెడ్డి