టూకీగా ప్రపంచ చరిత్ర 54
ఆడ-మగ
‘సంతానం కోసమే సంపర్కమైతే ఏడాదికి ఒక్క ఋతువు చాలదా?’ అన్నదిగాదు ఈ పాఠం నుండి మనం గ్రహించవలసిన అంశం. కంటిముందు కనిపించే ప్రతి వింతకు సమాధానం వెదికే ఆనాటి మానవుని జిజ్ఞాస. ప్రయోజనకారిగా ఉండే నేలమీద మొక్క మొలిచేందుకు వీలులేని చౌటిపర్రు ఎందుకొచ్చింది? కాలో వేలో తెగిన జంతువుకు తిరిగి అది మొలవనప్పుడు చెట్టుకు మాత్రమే ఆ శక్తి ఎలా సాధ్యపడింది? అలాగే - జంతు ప్రపంచంలో ఆడజీవి ఎదకొచ్చిన సమయంలో మాత్రమే సంభోగం జరుగుతూ ఉంది. ఎదకొచ్చే అదను కొన్ని జంతువులకు ఏడాదికాలం పట్టొచ్చు, మరికొన్ని జంతువులకు నాలుగునెలలే పట్టొచ్చు. ఏడాదిలో తడవలు ఎన్నైనా, ఎదకొచ్చిన సమయంలో మాత్రమే ఆడది మగపొత్తును కోరుకుంటుంది, దాటేందుకు అనుకూలిస్తూంది. మిగతా సమయాల్లో వాటికి ఆ ధ్యాసే కనిపించదు. మగజంతువుగూడా ఎదకొచ్చిన వాసనకోసం కాచుకొని ఉంటుందే తప్ప, బలవంతంగా దాటేందుకు ప్రయత్నించడం అరుదు. మానవజాతి సెక్స్ ప్రవర్తన ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఋతుస్రావం రోజుల్లో సంభోగం వలదని తనకుతానుగా ఏర్పాటుచేసుకున్న నియమం తప్ప, సంపర్కానికి వీలులేని రోజంటూ ఉండనే వుండదు. ఈ వైవిధ్యానికి కారణంగా ఏమిటి? - పరిశోధన చేసేందుకు తగిన పరికరాలు అందుబాటుకురాని కాలంలో సమస్యలకు దొరికే జవాబులు అంతకంటే మెరుగ్గా వుండే అవకాశమే లేదు.
సుఖం, సంతోషం అనేవి మానసిక అవస్థలు. అవి మెదడున్న జీవికి మాత్రమే సాధ్యపడేవి. మరి మెదడే ఏర్పడని జీవులుగూడా సెక్స్‌ను ఎందుకు ఆశిస్తున్నాయి? సూక్ష్మ ప్రపంచాన్ని అలా వదిలేసి, తాటిచెట్టునే ఉదాహరణగా తీసుకుందాం. వీటిల్లో మగ, ఆడ చెట్లు వేరువేరుగా ఉంటాయి. అవి ఎక్కడెక్కడో దూరందూరంగా ఉంటాయి. మగచెట్టులో తయారయ్యే బీజం (పుప్పొడి) గాలికి ఎగిరొచ్చి ఆడచెట్టులోని అండాన్ని చేరుకుంటుంది. సంభోగం కాదుగదా, కనీసం స్పర్శ గూడా వీటిమధ్య వీలుపడదు. ఏ సుఖానికీ నోచుకోని తాటిచెట్టు సంతానం కోసం సెక్స్‌ను ఎందుకు అనుసరిస్తూంది?
సంతానంతో అవసరంలేని జీవి ఉంటుందని మనం ఊహించలేం. ఉనికిని కాపాడుకోవడం, మనుగడకోసం జాతిని వృద్ధి చేయడం ఏ జీవికైనా ప్రాథమిక లక్షణాలు. సెక్స్ లేకుండా జాతిని విస్తరిస్తున్న జీవులు కొల్లలుగా మన ఎదుట కనిపిస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని వృక్షజాతులనే తీసుకుందాం. మల్లె, జాజి, పెరటి గన్నేరు వంటి చెట్లు పువ్వులు పూస్తాయి. కానీ వాటిల్లో అండమూ ఉండదు, బీజమూ ఉండదు. సెక్స్‌తో అవసరమే లేకుండా అవి అంట్ల ద్వారా విస్తరిస్తున్నాయి. ఈ తరహా సంతానోత్పత్తిని ‘వెజిటేటివ్ ప్రొడక్షన్’ అంటారు. సొర, బీర, కాకర వంటి తీగల్లో మగ, ఆడ పువ్వులు ఒకే తీగ మీద వేరువేరుగా పుట్టుకొస్తాయి. సంయోగానికి పుప్పొడి గాలిలో ఎగిరి చేరుకోవలసిందేతప్ప, సుఖం కోసమని తీగెలు పెనవేసుకోవడం లేదు.
ఎంతో ఉన్నతమైన సాంకేతిక పరికరాలతో, దాదాపు వెయ్యి సంవత్సరాల తరబడి జరుగుతున్న నిరంతర పరిశోధన తరువాతగూడా, ‘సెక్స్ అనేది ఎప్పుడు మొదలయింది, దాంతో జీవికి అవసరమేమొచ్చింది’ అనే ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలున్నాయి. ఇప్పుడున్న పరికరాల సహాయంతో సూదిమొన కంటే వెయ్యింతలు చిన్నదైన జీవిని చూడగలుగుతున్నాం, అది ప్రాణంతో జీవనచర్యలు సాగించే విధానాన్ని పరిశీలించగలుగుతున్నాం. వాతావరణంలో అంతోయింతో మార్పుల కృత్రిమంగా కల్పించి, మారిన పరిస్థితికి దాని ప్రతిచర్య ఎలావుంటుందో గమనించగలుగుతున్నాం. అయినా, రెండువందల కోట్ల సంవత్సరాలకు ముందు నివసించిన జీవిని ప్రాణంతో చూడనూలేము, అది ఎదుర్కున్న పరిస్థితులను ఊహించుకోవాలే తప్ప, సృష్టించనూలేము.
రచన: ఎం.వి.రమణారెడ్డి