టూకీగా ప్రపంచ చరిత్ర 58 | Encapsulate the history of the world 58 | Sakshi
Sakshi News home page

టూకీగా ప్రపంచ చరిత్ర 58

Published Wed, Mar 11 2015 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

టూకీగా  ప్రపంచ చరిత్ర  58

టూకీగా ప్రపంచ చరిత్ర 58

 ఆడ-మగ
అనుబంధం

ఈ కణ విభజన తేలిగ్గా అర్థమయ్యేందుకు నాలుగే క్రోమోజోములుండే ఒక కణాన్ని ఉదాహరణగా తీసుకుందాం. వీటిల్లో రెండు ‘ఎ’ గనివి, మిగతా రెండు ‘బి’ గనివి. మియాసిస్ విభజన రెండు అంచెలుగా జరుగుతుంది. మొదటి అంచె ప్రారంభంకాగానే, వీటిల్లో ప్రతివొక్కటి నిట్టనిలువుకు చీలి, రెండు పోగులుగా ఏర్పడుతుంది. ఇది మైటాసిస్‌లో ఇదివరకు చూసిందేగానీ, అక్కడికీ ఇక్కడికీ చిన్న తేడావుంది. అక్కడ దేనికదిగా పోగులు పూర్తిగా విడిపోతుండగా, మియాసిస్ పద్ధతిలో అలాకాకుండా. ఒకచోట ‘రివిట్’తో బిగించినట్టు అతుక్కుని, పట్టకారులా విచ్చుకుంటాయి. పట్టకారుకు ఉన్నట్టే ఈ ‘గీ’ ఆకారానికి, రివిట్‌కు (centromere) పైనుండే చేతులు కురుచ, కిందికుండే కాళ్ళు పొడవు. చూసేందుకు ఆ క్రోమోజోములు ఎనిమిదిగా విడిపోయినట్టు కనిపిస్తున్నా, రివిట్‌తో అతుక్కున్న మూలంగా వాస్తవానికి నాలుగే. ఈ దశలో ఎ గుంపు నుండి బి లకూ, బి గుంపు నుండి ఎ లకూ కొంత జన్యుపదార్థం ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ ద్వారా బదిలీ అవుతుంది. ఒక చేతినో, ఒక కాలినో అవతలిగుంపు క్రోమోజోముకు బదిలీచేసి, మారుగా దాన్నుండి అదే మోతాదు పదార్థాన్ని తనకు అతికించుకుంటుంది. ఈ బదిలీ తరువాత కూడా కణంలో ఉండే పోగులు ఎనిమిది, క్రోమోజోములు నాలుగు. వాటినుండి ఎ1, బి1లు ఒక ధ్రువానికి, ఎ2, బి2లు మరో ధ్రువానికి చేరుకుంటాయి. మధ్యకు కణకవచం చొచ్చుకొచ్చి విడదీయడం మూలంగా రెండు వేరువేరు కణాలుగా ఏర్పడుతుంది. ఒక్కొక్క కణంలో ఇప్పుడుండేవి నాలుగు పోగులు, వెరసి రెండు క్రోమోజోములు. అంటే క్రోమోజోముల సంఖ్య సగానికి పడిపోయింది.

రెండవ అంచే పూర్తిగా మైటాసిస్‌ను పోలిందే. క్రోమోజోములోని పోగులు పూర్తిగా విడిపోయి నాలుగుగా ఏర్పడతాయి. ఒక ఎ పోగు, ఒక బి పోగు ఒక ధ్రువానికీ, మిగిలిన రెండూ మరో ధ్రువానికీ చేరుకుని కణం విభజించబడుతుంది. మొదటి అంచె తరువాత ఏర్పడినవి రెండు కణాలుకాగా, రెండవ అంచెలో ఒక్కొక్కటి రెండుగా ఏర్పడడంతో మొత్తం పిల్లల సంఖ్య నాలుగవుతుంది. రెండవ అంచెలో క్రోమోజోముల సంఖ్య తరగనందున, ఒక్కొక్క పిల్లకు రెండేసి క్రోమోజోములుంటాయి. ఏర్పడిన నాలుగు పిల్లల్లో ఏవొక్కటికి జన్యుపరంగా మరొకదాన్ని పోలిందిగాదు. ఇలా ఏర్పడిన కణాలను ‘గ్యామేట్స్’ అంటారు. సెక్స్ కణాలంటే ఇవే. మగ, ఆడ జీవులు దేని గ్యామేట్లను అవి ఉత్పత్తి చేసుకుంటాయి. పురుషగ్యామేట్‌ను బీజం (sperm) అంటారు, స్త్రీగ్యామేట్‌ను అండం (egg) అంటారు. అవి రెండూ సంయోగమైనప్పుడు ఏర్పడేది విశ్వజన్యురాశి (genome). ఆ సగం క్రోమోజోములూ, ఈ సగం క్రోమోజోములు కలిసి, పిండం తిరిగి నాలుగు క్రోమోజోములు కలిగినదై, ఆ స్పీసీస్‌కు ఉండవలసిన క్రోమోజోముల సంఖ్య యదాతథంగా నిలుపుకోవడంతో, స్పీసీస్‌లో మార్పు జరగకుండా నిలుస్తుంది. గ్యామేట్ల కలయికలో ఆరోగ్యకరమైన సంయోగంతో ఏర్పడిన సంతానం పరిసరాల ప్రభావాన్ని తట్టుకుని బలంగా ఎదిగే శక్తిని కలిగుంటుంది.
 
మగ, ఆడ జీవులు దేని గ్యామేట్లను అవి ఉత్పత్తి చేసుకుంటాయి. పురుషగ్యామేట్‌ను బీజం (sperm) అంటారు, స్త్రీగ్యామేట్‌ను అండం (egg) అంటారు. అవి రెండూ సంయోగమైనప్పుడు ఏర్పడేది విశ్వజన్యురాశి  (genome).

రచన: ఎం.వి.రమణారెడ్డి
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement