టూకీగా ప్రపంచ చరిత్ర 53
ఆడ-మగ
‘సెక్స్’ అనే పదానికి తెలుగులో సమానార్థకం లేదు. ఇప్పుడు ఆ ఇంగ్లీషుపదమే పల్లెల్లోనూ వాడుకలో పడిపోయింది గాబట్టి, అనువాదం చేసే ప్రయాసం విరమించి, అందరికీ తెలిసిన ఆ పదాన్నే ఇప్పటి మన అవసరానికి వాడుకోవడం తేలిక. నలుగురు మిత్రులు సరదాగా మాడ్లాడుకునే సమయంలో ‘సెక్స్ అనేది ఎందుకు’ అనే ప్రశ్నే ఉదయిస్తే, సాధారణంగా మనకు వినిపించే వాదనలు రెండు రకాలు. మొదటిది - ‘సంతానం కోసం’ అనే వాదన. రెండవది - ‘సుఖం కోసం’ అనే వాదన. రెండవ కోవకు చెందిన వాదనలో సంతామనేది సెక్స్‌కు యాదృచ్ఛిక ఫలితం (బైప్రొడక్ట్). సంభోగం వల్ల సంతానం కలుగుతుందని ఒకనాటి మానవునికి తెలీనైనా తెలీదు. అయినా సెక్స్‌లో పాల్గొనేవాడు. జంతువులు మచ్చికైన తరువాతగానీ మనిషికి సృష్టిరహస్యం అర్థమైందిగాదు. పశువులు గూడా ప్రాణులే. తను దాటిన కారణంగానే గేదెకు సంతానం కలిగిందని దున్నపోతుకు తెలీదు. పశువులు సంభోగించడంలో సంతానేచ్ఛ మచ్చుకైనా కనిపించదు.
ఈ వాదనే నిజమేనేమోననిపించే ఇతివృత్త మొకటి కృష్ణయజుర్వేదంలో కనిపిస్తుంది. అందులోని ద్వితీయకాండ, పంచమఃప్రశ్నలో -
‘‘త్వష్ట దేవతలకు దారుశిల్పి. అతని కుమారుడు విశ్వరూపుడు దేవతలకు పురోహితుడు. అదే విశ్వరూపుడు అసురులకు మేనల్లుడు. (అసురులకు మేనల్లుడు కావడమంటే, అతని తల్లి అసురుల ఆడబిడ్డై ఉండాలి.) ఆ విశ్వరూపునికి మూడుతలలు. స్వామిద్రోహం చేస్తున్నాడనే అనుమానంతో ఇంద్రుడు అతని తలలు నరికేస్తాడు. ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది. ఆ పాపాన్ని ఎంతోకాలం భరించలేక, దాన్ని మూడు ముక్కలుగా విభజిస్తాడు. వాటిల్లో ఒక ముక్కను, అంటే మూడింటి భాగాన్ని, స్వీకరించమని భూమి అర్థిస్తాడు. అందుకు భూమి, ‘ఓ ఇంద్రుడా, నన్ను మానవులు యదేచ్ఛగా త్రవ్వేస్తున్నారు. ఆ బాధను భరించడం నాకు శక్యంగా లేదు. సంవత్సరం లోపు గుంతలు నిండితే నాకు కొంత ఉపశమనం కలుగుతుంది. (అప్పుడు నీ బాధను నేను పంచుకోగలను.)’ అంటుంది సమాధానంగా. ‘అంతకు పూర్వానివైన గుంతలు గూడా నిండేట్లు వరమిస్తున్నాను’ అన్నాడు ఇంద్రుడు. భూమి మూడింటిభాగం బ్రహ్మ హత్యను స్వీకరించింది. ఆ పాతకమే భూమిమీద ఏర్పడిన చవిటినేలలు.
మరో మూడింటిభాగాన్ని స్వీకరించమని ఇంద్రుడు చెట్లను అర్థించాడు. ‘ఓ ఇంద్రుడా, జనులు మమ్మల్ని యధేచ్ఛగా నరికేస్తున్నారు. అది మాకు తీరని బాధగా ఉంది. (మా ఉనికికి ప్రమాదంగా ఉంది.)’ అన్నాయి చెట్లు. నరికిన చోట అనేక కొత్త మొలకలు ఉద్భేవించేలా ఇంద్రుడు వరమిచ్చాడు. చెట్లు మూడింటిభాగం పాతకాన్ని స్వీకరించాయి. నరికిన చోట జిగురుగా స్రవించేది ఆ పాతకమే.
మిగిలిపోయిన మూడింటిభాగాన్ని తీసుకోమని ఇంద్రుడు స్త్రీలను అర్థించాడు. ‘ఓ ఇంద్రుడా, మేము ఋతుకాలంలో మాత్రమే పురుష సంపర్కానికి అర్హులుగా ఉన్నాము. నిరంతరం పురుషునితో సంభోగించే వరం మాకు ఇవ్వాలి’ అన్నారు స్త్రీలు. అతడు ఆ వరాన్నిచ్చి, చివరి మూడింటిభాగాన్ని స్త్రీలకు బదిలీచేశాడు. ఆ పాతకమే స్త్రీలకు ఋతుస్రావం అయింది.’’
రచన: ఎం.వి.రమణారెడ్డి