టూకీగా ప్రపంచ చరిత్ర - 55
ఆడ-మగ
జంతుప్రపంచంలో కంటికి కనిపిస్తున్న చీమ మొదలు ఏనుగుదాకా సెక్స్ మూలంగానే సంతానం పొందుతున్నాయి. సెక్స్‌లేని సంతానోత్పత్తి ఎక్కడైనా ఉందా? ఉంటుందని ‘మైక్రోస్కోప్’ రాకముందు ఎవరూ ఊహించలేదు. వచ్చిన తరువాతగానీ సూక్ష్మజీవుల్లో సెక్స్‌లేని సంతానోత్పత్తి (్చ ట్ఛ్ఠఠ్చ ట్ఛఞటౌఛీఠఛ్టిజీౌ) జరుగుతుందని జీవశాస్త్రానికి తెలీలేదు. దాని వివరాలు తెలుసుకునేందుకు ‘అమీబా’ అనే ఏకకణజీవిని ఉదాహరణగా పరిశీలిద్దాం. ఒకటే కణమైనా దీనిచుట్టూ కవచం వంటి పొర ఏర్పడి వుంటుంది.
ఆ పొరను సెల్ మెంబ్రేన్ అంటారు. పొరలోపల జీవపదార్థం నిండుకోనుంటుంది. పొరకింద అది కాసింత చిక్కగానూ, మిగిలింది పల్చగానూ ఉంటుంది. కణం మధ్యలో మరింత చిక్కటి జీవపదార్థమొకటి కనిపిస్తుంది. దీన్ని న్యూక్లియస్ అంటారు. న్యూక్లియస్‌లో దండలు దండలుగా ఇరికిరికి కనిపించేవి క్రోమొజోములు. ఇవి చెల్లాచెదరు కాకుండా చుట్టూ బిర్రుగా నొక్కిపట్టుకునే మరోపొర న్యూక్లియార్ మెంబ్రేన్. ఎన్నో సందర్భాల్లో మనం వింటున్న మాటొకటుందే ‘జీన్స్’ అనేది, ఆ జీన్స్‌కు స్థావరం ఈ క్రోమొజోములే. జీవి రంగు, ఆకారం, ఆహారం, మనుగడ, పరిమాణం, సంతానోత్పత్తి వంటి జీవకార్యక్రమాల సర్వస్వాన్నీ శాసించేవి ఈ జీనులే.
అమీబాకు మిగతా అవయవాలు ఏవీ లేకున్నా ఇతర జంతువుల్లాగే స్థలం మారుతుంది, భోం చేస్తుంది, లక్షణంగా జీవిస్తుంది. సెక్స్ లేదు; అయినా సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆహారం ద్వారా అందే మాంసకృత్తులు (ఞట్ట్ఛౌ్చ) ఏరుకుని, రసాయనిక సంయోగంతో ఈ జీవిలోని జీన్స్ అచ్చంగా తమను పోలిన మరో రూపాన్ని సృష్టించుకుంటాయి. అందుకు తగిన మోతాదులో ప్రొటీన్లు లభించిన వెంటనే న్యూక్లియస్‌లో గుత్తిగా పెనవేసుకున్న క్రోమొజోములు చిక్కును విదిలించుకుని దేనికదిగా విడిపోతాయి.
ఈలోపు కణం ఆకారం గుండ్రంగా తయారై, క్రోమొజోములను పట్టిపెట్టిన న్యూక్లియర్ మెంబ్రేన్ కరిగిపోతుంది. క్రోమొజోములు జీవకణం మధ్యకు చేరి, నిలువు గీత మీద పేర్చినట్టు ఒకదాని కింద మరొకటి నిటారుగా నిలబడి, నిట్టనిలువున రెండు సమానభాగాలుగా చీలిపోతాయి. అంటే, ఇదివరకు ఎన్ని క్రోమొజోములు ఉండేవో ఇప్పుడు అన్ని జతలు తయారయ్యాయి. ఈ జతలో ఎడమవైపు నిలిచినవి ఒక గుంపు, కుడివైపువి మరోగుంపు. ఏ గుంపుకాగుంపు పరస్పర విరుద్ధమైన దిశగా జరుగుతూ దూరమవగానే, వాటిచుట్టూ దేనిపొర దానికి పుట్టుకొచ్చి రెండు న్యూక్లియస్‌లుగా ఏర్పడతాయి.
ఈ పరిణామం జరుగుతుండగనే కణం వెలుపలి కవచం ఆ న్యూక్లియస్‌ల మధ్యకు చొచ్చుకొచ్చి కణవిభజనను సంపూర్ణం చేస్తుంది. ఏ ముక్కకాముక్క విడిపోయి రెండు అమీబాలుగా తయారై, దేని బ్రతుకు దానిదౌతుంది. ఈ తరహాలో జరిగే కణవిభజనను ‘మైటాసిస్’ అంటారు. తల్లికణానికి ఎన్ని క్రోమోజోములు ఉంటాయో, ఒక్కొక్క పిల్లకు అన్నే ఉంటాయి తప్ప సంఖ్య మారదు. ఎందుకంటే, ఆ సంఖ్య జీవి జాతిని బట్టి (స్పీసీన్‌ను బట్టి) ఏర్పడేది, జాతిని నిర్ణయించేదీను. ఆ సంఖ్యే ఏ స్పీసీస్ సంతతికి ఆ స్పీసీస్ జీవికుండే ప్రాథమిక లక్షణాలను కలిగించేది. వీటి సంఖ్య మారితే జాతి అంతరిస్తుంది.
ఈ తరహా సంతానోత్పత్తి వేగంగానూ, తేలిగ్గానూ జరగడమే కాక, ఖర్చయ్యే శక్తి (ఎనర్జీ) చాలా తక్కువ. దీనికి ప్రత్యేకమైన పునరుత్పత్తి అవయవాలు అవసరం లేదు. నిరంతరం వాటిని పోషించుకునే భారం లేదు. తోడు వెదుక్కునే తంటా లేదు. దీర్ఘకాలం పిండాన్ని గర్భంలో పోషిస్తూ ప్రసవంకోసం కాచుకునే యాతన లేదు. నల్లపూసంత ప్రయాసలేని ఎసెక్సువల్ సంతానోత్పత్తి విధానాలను వదిలేసి, సెక్స్ జంజాటంలో జీవులు ఎందుకు ఇరుక్కున్నాయి, ఎప్పుడు ఇరుక్కున్నాయి?
రచన: ఎం.వి.రమణారెడ్డి
రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com