అంతులేని ఆత్మవిశ్వాసం | Endless self-confidence | Sakshi
Sakshi News home page

అంతులేని ఆత్మవిశ్వాసం

Published Fri, Apr 4 2014 10:56 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Endless self-confidence

అన్ని సౌకర్యాలు ఉన్నా... చిన్న చిన్న ఆటుపోట్లు ఎదురైతేనే మనలో చాలా మంది నిరాశా నిస్పృహలకు లోనవుతాం. అంగవైకల్యంతో పుట్టినవారు, దురదృష్టవశాత్తు వికలాంగులుగా మారిన వారు ఎలాంటి క్షోభకు గురవుతారో అంచనా వేయలేం. వికలాంగుడిగా జన్మించినంత మాత్రాన చింతించాల్సిన పనిలేదని... పట్టుదల, తపన, ఉక్కులాంటి దృఢసంకల్పం, ఆత్మవిశ్వాసం ఉంటే...  సమాజమే తమను  ఆరాధించేలా  ప్రత్యేక గుర్తింపు లభించేలా తయారుకావచ్చని ఆ యువకుడు నిరూపించాడు.  అతనే అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన 28 ఏళ్ల కైల్ మెనార్డ్. అంతులేని ఆత్మవిశ్వాసంతో ఎలాంటి అవరోధాలనైనా అధిగమించవచ్చని కైల్ నిరూపిస్తున్నాడు.      
 - కరణం నారాయణ
 
కేవలం రెండు అడుగుల ఎత్తు ఉన్న కైల్ తన విన్యాసాలతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఎందరినో ప్రభావితం చేస్తున్నాడు. మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. వికలాంగులు కూడా సాధారణ వ్యక్తులకు ఏమాత్రం తీసిపోరని నిరూపిస్తున్నాడు. పుట్టుకతోనే అవయవ లోపాలతో జన్మించిన కైల్ ఏనాడూ నిరాశ, అసాధ్యం అనే మాటలకు తన జీవిత నిఘంటువులో స్థానం కల్పించలేదు. అకుంఠిత దీక్షతో సాధన చేస్తూ ఎన్నో అద్భుతాలు చేస్తూ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాడు. కైల్ ఆల్‌రౌండర్. తనకు చేతకాని పనిలేదు. క్రీడాకారుడిగా, మోటివేషనల్ స్పీకర్‌గా, రచయితగా అమెరికాలో చాలా ఖ్యాతి సంపాదించాడు.
 
ఆప్యాయత, ఆదరణ...
 
కైల్ మెనార్డ్ పుట్టుకతోనే మోకాళ్లు, మోచేతులు లేకుండా జన్మించాడు. వైద్య పరిభాషలో దీనిని కంజెన్షియల్ అంప్యూటేషన్ (అవయవ లోపాలతో పుట్టడం) అంటారు. కైల్ అవయవ లోపాలతో పుట్టినప్పటికీ అతని తల్లిదండ్రులు స్కాట్ మెనార్డ్, అనిటా మెనార్డ్, కుటుంబ సభ్యులు అతణ్ని ఒక వికలాంగుడిగా భావించలేదు. గర్భంలో ఉన్నపుడే  పుట్టబోయే సంతానం అవయవ లోపాలతో జన్మిస్తాడని, గర్భస్రావం చేయించుకోవాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు.  అయితే తమకు ఆ ఆలోచనే లేదని తాము సంతానానికి జన్మనిస్తామని వారు స్పష్టం చేశారు. ‘చిన్నతనం నుంచే కైల్ శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టాం. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాం. చిన్నప్పటి నుంచే ఎలా తినాలో నేర్పించకపోతే జీవితాంతం అతను ఆహారం కోసమే కాకుండా ప్రతి పనికి ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. కైల్‌కు కష్టాలు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో బాల్యం నుంచే ప్రత్యేక శ్రద్ధతో పెంచడంతో నేడతడు వికలాంగుడైనా సాధారణ వ్యక్తులకు ఏమాత్రం తీసిపోడు’ అని కైల్ తల్లిదండ్రులు చెబుతున్నారు.
 
పట్టుదలతో పోరాటం...

కైల్ మెనార్డ్ ఆరంభంలో కృత్రిమ చేతులు, కాళ్లు అమర్చుకున్నాడు. కొంతకాలానికి అవే అతనికి అడ్డంకిగా మారడంతో వాటిని ఉపయోగించడం మానేశాడు. స్కూల్ ఫుట్‌బాల్ జట్టులో ఎంపికయ్యాక తరచూ గాయాలకు గురికావడంతో ఈ ఆటను మానేసి రెజ్లింగ్‌వైపు దృష్టి సారించాడు. రెజ్లింగ్‌లో వరుసగా 35 పరాజయాలు ఎదురైనా పట్టువిడవలేదు. కోచ్ క్లిఫ్ రామోస్, తండ్రి స్కాట్ ప్రత్యేకంగా కైల్ కోసం కొత్త టెక్నిక్‌లను రూపొందించారు. తీవ్ర సాధన చేసి ఈ టెక్నిక్‌లపై పట్టు సంపాదించిన కైల్ విజయాలబాట పట్టాడు. జార్జియా రాష్ట్ర చాంపియన్‌గా ఎదిగాడు. ‘రెజ్లింగ్ లేకపోతే నేనెక్కడ ఉండేవాడినో నాకే తెలియదు. పోటీపడాలంటే నాకెంతో ఇష్టం. ఎల్లప్పుడూ గెలవాలని ఆరాటపడతాను’ అని కైల్ అంటాడు.
 
నో ఎక్స్‌క్యూజెస్
 
క్రాస్‌ఫిట్ పేరుతో సొంత జిమ్‌ను ఏర్పాటు చేసుకున్న కైల్ ‘నో ఎక్స్‌క్యూజెస్’ పేరుతో తన జీవితచరిత్రను రాశాడు. ఈ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ జాబితాలో చోటు సంపాదించింది. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, రచయితగా, యజమానిగా, క్రీడాకారుడిగా ప్రతి రంగంలో విజయం సాధిస్తున్న కైల్  జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. అవయవ లోపాలతో పుట్టినా అపార ఆత్మవిశ్వాసంతో... జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదల, క్రీడలపై అభిమానం కైల్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి.
 
 ‘నేను వ్యక్తులను ప్రభావితం చేయాలనుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో మనకు ఏ దారీ కనిపించదు. అయితే దారి కోసం మనం పోరాటాన్ని కొనసాగించాలి. సానుకూల దృక్పథం, నిరంతర శ్రమ, పట్టుదల, సవాళ్లకు భయపడని తత్వంతోనే నాకు విజయాలు లభించాయి. ప్రయత్నించకుండానే ఈ పని నేను చేయలేను అని  అనుకోకూడదు. ముందు ప్రయత్నిస్తే మన సామర్థ్యం ఏంటో తెలుస్తుంది’
 - కైల్ మెనార్డ్
 
 ఏయే ఆటల్లో ప్రవేశం...
రెజ్లింగ్, జూడో, వెయిట్ లిఫ్టింగ్, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్, స్విమ్మింగ్, బేస్‌బాల్, స్ట్రీట్ మాకీ, ఫుట్‌బాల్, పవర్ లిఫ్టింగ్, పర్వతారోహణ.
 
 ప్రత్యేకంగా తయారుచేసిన బెంచ్ ప్రెస్‌లో కైల్ 360 పౌండ్లు బరువెత్తి ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు.
     
 జార్జియా రాష్ట్ర రెజ్లింగ్ చాంపియన్‌గా నిలిచాడు.
     
 ఆఫ్రికాలోని ఎత్తయిన పర్వతం కిలిమంజారోను (19, 341 అడుగులు) పది రోజుల్లోనే అధిరోహించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
 
 అన్నీ చేస్తాడు...
 ఎవరి సహాయం లేకుండా ఆహారం తీసుకుంటాడు.
 కారు డ్రైవ్ చేస్తాడు, సెల్‌ఫోన్‌లో మాట్లాడతాడు
 డ్యాన్స్ చేస్తాడు, వీడి యోగేమ్స్ ఆడతాడు.
 కంప్యూటర్‌పై నిమిషానికి 50 పదాలు టైప్ చేస్తాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement