అమ్మాయి ‘ఆడ’పిల్ల కాదు మనపిల్లే!
ఆత్మీయం
అమ్మాయి పుట్టగానే ఆడపిల్ల పుట్టిందంటారు. అందులో అనౌచిత్యం లేదు. ఇక్కడ పుట్టిన ఓ మొలక, మరొక వంశవృక్షానికి వేరుగా మారి, వివిధ శాఖలు, కొమ్మలు, పుష్పాలు, ఫలాలతో పదికాలాలు పచ్చగా ఉండడానికి దృఢత్వాన్నిస్తుంది. అందుకే అమ్మాయిని ‘ఆడ’ పిల్ల అంటారు. వివాహసమయంలో పాలికలలో నవధాన్యాలు మొలకెత్తించి నీళ్ళలో వదలడమనే ఆచారం దీనినే సూచిస్తుంది. నీళ్ళలో కలిసిన విత్తనం మరేదో ఒడ్డుకు చేరి, మొక్క మొలిచి, పెద్ద వృక్షమైనట్లే ఇక్కడ పుట్టిన అమ్మాయి, మరొక ఇంటి వంశానికి మూలమవుతుందని అర్థం. మన ఇంటి ఆడపిల్ల మరో ఇంటి వారికి మూలంగా మారడం మనకు కూడా ఆనందదాయకమే.
అయితే, ఆమె మరో ఇంటికి వెళ్లినంత మాత్రాన మన ఇంటికి చెందినది కాకుండా పోదు, ఆమె జీవించి ఉన్నంత కాలం ఫలానా వారి ఆడపడచు అనే అంటారు. ఆడపడచు మన ఇంటికి వచ్చినప్పుడు ఎంతో ప్రేమగా, ఆదరంగా, అభిమానంగా చూసి, చీరా సారే పెట్టి పంపిస్తాం. అది మన కనీస ధర్మం. మర్యాద. మన ఇంటి ఆడపిల్లతో బంధం తెగిపోకుండా ఉండేందుకే గృహప్రవేశానికైనా, మరే శుభకార్యానికైనా ఆమెను తీసుకు వస్తాం. మర్యాద చేస్తాం.