ఖర్చు అదుపు తప్పితే...రాణికైనా కష్టమే.. | Except ... ranikaina difficult to control the cost .. | Sakshi

ఖర్చు అదుపు తప్పితే...రాణికైనా కష్టమే..

Published Fri, Feb 7 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆమె మహారాణి. కానీ ఇపుడు ఆమె కుటుంబానికీ కష్టాలొచ్చాయి. ఖర్చులు తలకుమించిన భారంగా మారటంతో ఉన్న నిధులన్నీ కరిగిపోతున్నాయి.

బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆమె మహారాణి. కానీ ఇపుడు ఆమె కుటుంబానికీ కష్టాలొచ్చాయి. ఖర్చులు తలకుమించిన భారంగా మారటంతో ఉన్న నిధులన్నీ కరిగిపోతున్నాయి. క్వీన్ ఎలిజబె త్ కుటుంబానికి ఏటా కోట్ల పౌండ్ల ఆదాయం వస్తున్నా.. ఖర్చు దానికన్నా ఎక్కువ ఉంటోంది. దాంతో ఏమవుతోందో తెలుసా?
 
రాజభవనాలు శిధిలమైపోతున్నా రిపేరు చేయించటం లేదు. బకింగ్‌హామ్ ప్యాలెస్, విండ్సర్ క్యాజిల్ లాంటి భవంతులు పాడై... వర్షాలు కురిసినపుడల్లా కారిపోతున్నాయి. ఆ ప్యాలెస్‌లలో విలువైన కళాకృతులుండటంతో అవి చెడిపోకుండా వర్షాలు పడినప్పుడల్లా బకెట్లతో నీళ్లు పట్టి బయట పోస్తున్నారట. పాతకాలం నాటి బాయిలర్ల మెయింటెనెన్స్ ఖర్చులే ఏడాదికి 8 లక్షల పౌండ్ల దాకా ఉంటున్నాయట.

2012-13లో రాణిగారి కుటుంబ బడ్జెట్ 31 మిలియన్ పౌండ్లు కాగా... ఆమె సిబ్బంది మాత్రం ఏకంగా 51 మిలియన్ పౌండ్లు ఖర్చు చేశారట. దీంతో.. లోటు పూడ్చడానికి రాణిగారి రిజర్వ్ నిధిలోంచి మిగతా డబ్బు తీశారు. ఇలా ఏటా తీసేస్తుండటంతో 35 మిలియన్ పౌండ్లుండే రిజర్వ్ నిధి 1 మిలియన్ పౌండ్లకు తగ్గిపోయింది. ఈ లెక్కలన్నీ చూసిన బ్రిటన్ అకౌంట్ల కమిటీ... ఖర్చులు తగ్గించుకోకుంటే అంతే సంగతులంటూ క్వీన్ కుటుంబాన్ని హెచ్చరించింది.
 
మీ ఖర్చులు చూసుకోండి...


ఆర్థిక సలహాదారులు సరైన సలహాలివ్వకపోవడం వల్లే బ్రిటన్ రాణికి ఈ పరిస్థితి ఎదురైందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. మరి బ్రిటన్ రాణికే ఆర్థిక కష్టాలు తప్పనప్పుడు... సామాన్యులు అందుకు భిన్నం కాదు కదా!!. కావాలంటే రాణిగారిని బ్రిటన్ ప్రభుత్వం ఆదుకుంటుంది. కానీ మనల్ని ఏ ప్రభుత్వమూ ఆదుకోదు. తప్పదనుకుంటే తోబుట్టువులో, బంధుమిత్రులో కొంత సర్దుతారు. లేదంటే అదీ ఉండదు. కాబట్టి... రాబడి, ఖర్చుల లెక్కలు చేతిలో పెట్టుకుని మనం చూడాల్సిందేంటంటే...
 

  •  నా సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నానా?
  •  అత్యవసరమైతే నా దగ్గర కనీసం 3 నెలలకు సరిపడా డబ్బులున్నాయా? లేదా?
  •  కాస్త కష్టపడితే అదనంగా ఆర్జించే మార్గాలేమైనా ఉన్నాయా?
  •  ఖర్చులు తగ్గించుకునే అవకాశాలేమైనా ఉన్నాయా?
  •  మునుపటి కన్నా ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉందా లేదా.?
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all
Advertisement