విక్టోరియా భవంతి.. ఆసక్తికర విషయాలు
కళలకు, అపురూపమైన శిల్ప సంపదకు అనంతపురం జిల్లా ప్రసిద్ధి చెందింది. జిల్లాలో అలనాటి ఎన్నో అపురూప కట్టడాలు నేటికీ చెక్కుచెదరకుండా నిలిచాయి. నాటి ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా అలరారుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే 75 నుంచి 120 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పురాతన కట్టడాల పరిరక్షణకు పురావస్తు శాఖ సిద్ధమైంది. ఇందులో జిల్లా కేంద్రంలోని పాతూరు సీడీ ఆస్పత్రి ఒకటి. తొలి ప్రసూతి కేంద్రంగా ఖ్యాతి గడించిన ఈ ఆస్పత్రిని అప్పట్లో ‘క్వీన్ విక్టోరియా ఆస్పత్రి’గా పిలిచేవారు. చరిత్రకు సాక్షీభూతమై నిలుస్తూ నేటికీ అదే రాజసాన్ని ఒలకబొస్తున్న ‘ది క్వీన్ విక్టోరియా’ పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సాక్షి, అనంతపురం: అనంత జిల్లా ఏర్పాటు వెనుక సుదీర్ఘ చరిత్రనే ఉంది. అశోకుడి మొదలు.. నొలంబులు, గంగరాజులు, చోళులు, హోయసలలు, యాదవులు, రాయలు, మొఘలలు, నిజాముల వరకూ అందరి పాలనను చవిచూసిన ఈ ప్రాంతాన్ని 1800వ సంవత్సరంలో సైనిక సహకార పద్ధతి కారణంగా బ్రిటీష్ వారికి నిజాం నవాబు అప్పగించారు. అలా బళ్లారి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఈ ప్రాంతంలోని గుంతకల్లు, గుత్తి ప్రాంతాల్లో తొలుత బ్రిటీష్ వారు కాలు పెట్టారు. తర్వాత 1882లో అనంతపురం జిల్లాను ఏర్పాటు చేశారు. వారి హయాంలో నిర్మించిన అపురూప కట్టడాలు ఎన్నో ఈ జిల్లాలో నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయ. అందులో ఒకటి విక్టోరియా ఆస్పత్రి. నేటి తరానికి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ ఆస్పత్రి నిర్మాణంలో దాగి ఉన్నాయి.
జిల్లా కేంద్రంగా ఏర్పాటైన అనంతపురంలో 1901 నాటి వరకు పట్టణ జనాభా కేవలం 8వేలు మాత్రమే ఉండేది. పేరుకు జిల్లా కేంద్రమైనా.. గర్భిణులకు సరైన వైద్య చికిత్సలు అందేవి కావు. పురుడు పోసుకోవాలంటే సరైన ఆస్పత్రులు లేవు. చాలా మంది ఇంటి వద్దనే మంత్రసాని సాయంతో పురుడు పోసుకునేవారు. దీంతో అప్పటి బ్రిటీష్ అధికారి మెక్లాడ్... అనంతపురంలోని చెరువు కట్టకు సమీపంలో ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1903లో నిర్మాణం పూర్తి చేసుకుంది. ఆ రోజుల్లో లేడీ హాస్పిటల్‌గా పిలిచే ఈ భవంతిని అప్పటి గవర్నర్ ఆఫ్ మద్రాస్‌గా ఉన్న హామ్టిల్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికీ లండన్ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. ఎంతో పటిష్టంగా నిర్మించిన ఈ విశాల భవంతి తొలిరోజుల్లో విక్టోరియా జనరల్ హాస్పిటల్‌గా, 1903లో మెటర్నటీ హాస్పిటల్‌గా, 1913లో కోషా హాస్పిటల్‌గా రూపాంతరం చెందుతూ వచ్చింది. ప్రస్తుతం సీడీ హాస్పిటల్ (ప్రస్తుతం తాడిపత్రి బస్టాండు సమీపంలో)గా ఖ్యాతి గడించింది.
ఆయూష్ విభాగానికి కేటాయించిన గదులు, నూటా ఇరవై ఏళ్లు దాటిన చెక్కుచెదరని ఆస్పత్రి పాలక భవనం
1961లో ప్రస్తుతమున్న ప్రభుత్వ సర్వజనాసుపత్రి నిర్మాణం జరిగే వరకూ క్వీన్ విక్టోరియా ఆస్పత్రినే ప్రధాన ఆస్పత్రిగా ఉండేది. తర్వాతి రోజుల్లో దీనిని టీబీ హాస్పిటల్‌గా మార్చారు. ప్రస్తుతం ఇక్కడ జనరల్ ఓపీతో పాటు హోమియో, ఆయూష్ వైద్య సేవలనూ అందుబాటులోకి తీసుకువచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొంత కాలం కోవిడ్ కేర్సెంటర్గానూ సేవలందించారు. ప్రతి రోజూ వంద మంది ఓపీతో రద్దీగా ఉండే ఈ చారిత్రక కట్టడంలో కొంత భాగంలో త్వరలో 60 పడకలతో భారీ హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ప్రధాన పరిపాలన భవంతితో పాటు మిగిలిన పురాతన కట్టడాలకు తన సొంత ఖర్చుతో పూర్వ వైభవాన్ని తీసుకువస్తామంటూ ప్రభుత్వాన్ని చరిత్ర పరిశోధకుడు ఏజీ అనిల్‌కుమార్‌రెడ్డి అభ్యర్థించారు. దీంతో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి పాత కట్టడాల పరిరక్షణకు సిద్దమైంది.
వాసరత్వ సంపదగా 75 నుంచి వందేళ్లు దాటిన చరిత్రాత్మక కట్టడాలు ఎక్కడున్నా అవి పురావస్తు శాఖ పరిధిలోకి వస్తాయి. ఇందులోనూ కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు వేర్వేరుగా పర్యవేక్షిస్తుంటాయి. ఇందులో భాగంగా ఇంటాక్ (భారతీయ వాసరత్వ పరిరక్షణ సంస్థ) ఎంపిక చేసిన కట్టడాల పరిరక్షణకు పురావస్తుశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ప్రభుత్వ శాఖల సమన్వయలోపం కారణంగా రెండేళ్ల క్రితం (గత టీడీనీ ప్రభుత్వ హయాంలో) నగరంలోని ఎంతో చరిత్ర కల్గిన బ్రిటీష్ కాలం నాటి తాలూకా ఆఫీసును ఎన్ఓసీ తీసుకోకుండానే కూల్చేశారు. అప్పటి నుంచి అధికారులు మరింత అప్రమత్తమై ప్రాచీనకట్టడాల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు.
తొలి ఎంపీ వారసుల దాతృత్వం..
1951లో తొలి ఎంపీ (రాజ్యసభ) రహంతుల్లాతో పాటు ఆయన సోదరులు ఖాన్ సాహెబ్ అమాముద్దీన్, అమీరుద్దీన్, ముస్తాఫా సంయుక్తంగా పది ఎకరాల భూమితో పాటు ప్రసూతి కేంద్రం అభివృద్ధికి అవసరమైన రూ.1,250 నగదును విరాళంగా అందజేశారు. ఈ హాస్పిటల్ ఎదురుగా కమ్మూరు గ్రామానికి వెళ్లే చెరువు తూముండేది. ఈ తూము పరిధిలో రహంతుల్లా వారసులకు వందల ఎకరాల భూములు ఉండేవి. అందులో కొంత బ్రిటీష్ వారి కోరిక మేరకు విరాళంగా అందజేసినట్లు ఇప్పటికీ అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో కనిపిస్తోంది.
విక్టోరియా భవంతిని కాపాడుకుంటాం
ప్రాచీన కట్టడాలు, శిల్ప సంపద, శాసనాల పరిరక్షణ బాధ్యత సాధారణంగా పురావస్తుశాఖ, టూరిజం, దేవదాయశాఖ పరిధిలో ఉంటాయి. వారసత్వ ప్రాధాన్యత కల్గిన పురాతన కట్టడాల పరిరక్షణ బాధ్యత ఎక్కడున్నా మేమే తీసుకుంటాం. ఇందులో ప్రభుత్వ శాఖల సహకారం చాలా అవసరం. జిల్లాలోని విక్టోరియా హాస్పిటల్‌కు ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. త్వరలో అధికారికంగా ఈ కట్టడాన్ని మా పరిధిలోకి తెచ్చుకుంటాం. – రజిత, సహాయ సంచాలకులు, పురావస్తుశాఖ