ఇలా బతకడమేనాకిష్టం! | Exclusive interview sakshi family in R. Narayana Murthy | Sakshi
Sakshi News home page

ఇలా బతకడమేనాకిష్టం!

Published Sat, Aug 31 2013 11:53 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఇలా బతకడమేనాకిష్టం! - Sakshi

ఇలా బతకడమేనాకిష్టం!

నారాయణమూర్తి నడినెత్తి సూరీడు.
 అతడికి పొద్దుల్లేవ్... ఏ హద్దుల్లేవ్!
 భగభగ... భగభగ... భగభగ...
 కణకణ  తీక్షణ, జ్వలించే వీక్షణ...!
 అన్యాయాన్ని చూస్తే అగ్గైపోతాడు.
 అధర్మంపై ఆగ్రహోదగ్రుడౌతాడు.
 సినిమాలూ అంతే... ఫిల్మీ ఇన్‌ఫ్లేమబుల్!
 ఈవారం ‘తారాంతరంగం’లో మీకతడు చల్లగా నవ్వుతూ కనిపించవచ్చు.
 చెప్పలేం, ఆ నవ్వు కూడా ఒక...
 రెవల్యూషనరీ స్టేట్‌మెంట్ కావచ్చు!

 

పోరుబాటలో ఓ వ్యక్తి నడుస్తున్నాడు అంటే... దాని వెనుక కచ్చితంగా ధర్మాగ్రహం ఉండుండాలి...
 ఆర్.నారాయణమూర్తి: నువ్వన్నది నిజం సోదరా... మనిషిని ఉద్యమదిశగా నడిపించేది ధర్మాగ్రహమే. అందుకు నా జీవితమే ఉదాహరణ. మా ఊళ్లో జోగయ్య అనే దళితుడు ఉండేవాడు. ఆయన్ను ‘మామయ్య...’ అని పిలిచేవాణ్ణి. ఊరందరికీ ఆయన సేవ చేసేవాడు. ఊరి జనాలు కూడా ఆయన్ను కలవరించేవారు. కానీ కలవరించేది ప్రేమతోకాదు... అవసరాలు తీర్చుకోడానికి! జనం ఆయనకు అన్నం పెట్టే తీరు హృదయ విదారకంగా ఉండేది. అంటరాని వాడికి పెడుతున్నట్లు ఆమడదూరంలో నిలబడి, గంజి ఎత్తి పోసేవారు. అది చూసి రగిలిపోయేవాణ్ణి. ‘ఊరందరికీ అంత సేవ చేసే ఆయన్ను.. ఇంట్లో కూర్చోబెట్టి ఎందుకు అన్నం పెట్టకూడదు? నూతులు తవ్వేది వాళ్లు... కానీ ఆ నూతుల్లో నీళ్లు తాగే అర్హత వాళ్లకు లేదు. గుళ్లు కట్టేది వాళ్లు... కానీ గుళ్లోకొచ్చి దేవుణ్ణి దణ్ణం పెట్టుకునే యోగం వాళ్లకు లేదు! ఇదెక్కడి న్యాయం?’ ఈ ప్రశ్నలు నా హృదయాన్ని తొలిచేస్తుండేవి. ఓ రోజు నా కన్నతల్లి కూడా ఆయనకు అలాగే అన్నం పెట్టడం చూశాను. చెప్పలేనంత కోపం వచ్చింది. ‘ఏంటమ్మా ఈ పని?’ అని అమ్మను కోపంగా అడిగేశాను. ‘తప్పురా... మనం అతన్ని తాకకూడదు’ అంది అమ్మ. ‘ఎందుకు తాకకూడదు? నువ్వూ మనిషివే, ఆయనా మనిషే! ఏంటీ అంటరానితనం’ అని సూటిగా అడిగేశాను. ఇంతలో నా చెంప ఛెళ్లుమంది. కళ్లు బైర్లు కమ్మాయి. కళ్లు తెరిచి ఎవరో చూశాను. ఎదురుగా నాన్న! సాటి మనిషిని అమ్మానాన్నలే అంటరానివాడిగా చూడ్డం తట్టుకోలేకపోయాను. నాలో అభ్యుదయభావాలకు బీజం పడింది అప్పుడే!  అలాగే... స్కూల్లో కలిగినవారి పిల్లలందరితో... మా పంతుళ్లు  బ్యాడ్మింటన్ ఆడించేవాళ్లు. మాలాంటి పేద పిల్లలు మాత్రం చూస్తూ కూర్చోవాలి. ఇదెక్కడి న్యాయం? అని అడిగా... మళ్లీ నా చెంప చెళ్లు మంది. ఎదురుగా మాస్టర్! ఇది నా రెండో అనుభవం! పెద్దాపురంలో కాలేజ్‌లో చేరాను. అక్కడ సత్రం ప్రెసిడెంట్ అయ్యాను. పెద్దాపురం మహారాణి రాజావత్సవాయి బుచ్చిసీతయ్యమ్మగారు పేద ప్రజానీకానికి రాసిచ్చేసిన ఆస్తిలో ఆ సత్రం ఒకటి. నాలాంటి పేద విద్యార్థులందరూ ఆ సత్రంలోనే భోంచేసేవారు. అన్నం తినేటప్పుడు కూరల్లో పురుగులేమైనా కనిపించినా, అన్నం సరిగ్గా పెట్టకపోయినా... వెంటనే గొడవ పెట్టేసుకునేవాణ్ణి. దేవాదాయ శాఖకు చెందిన చింతపల్లి నరసింహారావుగారని ఓ పెద్దాయన ఉండేవారు. నా గొడవలు పడలేక ఓ సారి ఆయన మా నాన్నను పిలిపించాడు. ‘ఏరా... నువ్వేమైనా గాంధీ అనుకుంటున్నావా?’ అని మా నాన్న సమక్షంలో అడిగాడాయన. ‘నేనంత గొప్పోణ్ణి కాదులేండీ..’ అని దురుసుగా సమాధానం చెప్పాను. ఈ సారి చెంపచెళ్ళుమనడం కాదు... పెద్దాపురం రోడ్ల మీద తన్నుకుంటూ తీసుకెళ్లాడు నాన్న! అన్యాయంపై ఎదురుతిరిగిన ప్రతిసారీ... నాకు దెబ్బలే! అవి నాలో భయాన్ని పెంచాల్సిందిపోయి కసిని పెంచాయి. తప్పు జరిగిందనిపిస్తే... ఎదురున్నది ఎంత పెద్దవారైనా సరే... కడిగిపారేసేవాణ్ణి. .
 
 తొలిసారి ఎర్రకండువా ఎప్పుడు కప్పుకున్నారు?
 ఆర్.నారాయణమూర్తి: ‘కమ్యూనిస్ట్’ అనిపించుకునేంత గొప్పవాణ్ణి కాదు నేను. మనిషిని ప్రేమిస్తాను అంతే. అందుకే చదువుకునే రోజుల్లోనే కుర్రాళ్లమంతా ఓ టీమ్‌గా ఏర్పడి విరాళాలు పోగు చేసి మరీ కాలేజీ కట్టించాం. సత్రాలు నెలకొల్పాం. ఎవరైతే పీడిత ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్నారో, బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తారో..  వారంటే నాకు ఆరాధన. నా సినిమాల్లో హీరోలు కూడా వాళ్లే.
 
 పోరాటాలు సరే... సేవాదృక్పథం ఎలా అలవడింది?

 ఆర్.నారాయణమూర్తి: దానికి ఓ గొప్ప సంఘటన కారణం మిత్రమా! బీహార్ వరద బాధితుల సహాయార్థం మా మిత్రులంతా కలిసి పెద్దాపురంలో ఇల్లు ఇల్లు తిరిగి విరాళాలు వసూలు చేస్తున్నాం. అక్కడ ‘దర్గానగర్’ అనే ఏరియా ఉంది. అది ప్రాస్టిట్యూట్లు ఉండే చోటు. ఇల్లు ఇల్లు తిరుగుతూ... అక్కడకి కూడా వెళ్లాం. ఓ ఇంటిముందు నిలబడి.. ‘బీహార్ బాధితులకు ఏదైనా సాయం చేయండమ్మా’ అని అడిగాను. ఆ ఇంట్లో నుంచి ఓ తల్లి వచ్చింది. ‘నీ పేరేంటి నాన్నా..’ అనడిగింది. ‘నారాయణమూర్తి’ అని చెప్పాను. ‘నారాయణమూర్తి.. ఇదిగో బట్టలు, బియ్యం’ అని జోలెలో వేసింది. ఆమెకు ఓ నమస్కారం పెట్టి వెళ్లబోయాను. ‘నారాయణమూర్తీ.. నాకింకా బేరం రాలేదయ్యా... రాత్రికి కచ్చితంగా బేరాలొస్తాయి. ఆ సొమ్ము మొత్తం బాధితులకు ఇస్తాను.. సరేనా’ అంది. ‘అమ్మా... నీకు వందనం’ అని పాదాభివందనం చేసినంత పని చేశాను. నాలో సేవాదృక్పథాన్ని పెంపొందింపజేసిన సంఘటన అది!
 
 మరి సినిమాలవైపు మీ దృష్టి ఎలా మరలింది?
 ఆర్.నారాయణమూర్తి: సినిమాల్లోకి రాకముందు పలు యూనియన్లకు ప్రెసిడెంట్‌గా పనిచేశాన్నేను. పోరాటాలు నాకు ఓ కన్ను అయితే... సినిమాలు నా రెండో కన్ను. తూర్పు గోదావరిజిల్లా రౌతులపూడి మండలం మల్లంపేట అనే కుగ్రామం మాది. అయితే... రౌతులపూడి మా తాతగారి ఊరవ్వడంతో అక్కడే పుట్టి పెరిగాన్నేను. మా అమ్మపేరు రెడ్డి చిట్టెమ్మ, నాన్నపేరు రెడ్డి చిన్నయ్యనాయుడు. నన్నేమో అందరూ ‘రెడ్డిబాబులు’ అని పిలిచేవారు. అక్కడ టూరింగ్ టాకీస్ ఉండేది. శ్రీవెంకటేశ్వరా థియేటర్. మీరు నమ్మండి బ్రదర్...  టికెట్లు ఇచ్చే ముందు ఆ థియేటర్ నుంచి ‘నమో వెంకటేశా... నమో... తిరుమలేశా...’ అంటూ ఘంటసాలపాట వినిపించేది. అంతే.. థియేటర్ వైపు పరుగు లంకించుకునేవాణ్ణి. వరసపెట్టి అన్ని షోలు చూసేసేవాణ్ణి. డబ్బులు లేవనుకోండీ.. పంది కన్నాల్లోంచి దూరి వెళ్లి దొంగచాటుగా సినిమా చూసేసేవాణ్ణి. అయితే... నటునిగా నన్ను విపరీతంగా ప్రభావితం చేసిన సినిమా మాత్రం అన్నగారి ‘శ్రీకృష్ణ పాండవీయం’ సోదరా! అందులో ఎన్టీఆర్‌గారు చేసిన దుర్యోధనుని పాత్ర నా హృదయంలో గాఢమైన ముద్ర వేసింది. మట్టి దిబ్బనే స్టేజ్‌గా భావించి, ఇటుకరాయి పొడుం, మసి బొగ్గులతో మేకప్ వేసుకొని, దుప్పట్లను వీపుకు కట్టుకొని  ఫ్రెండ్సందరి ముందు దుర్యోధనుని ఏకపాత్రాభినయం చేసేవాణ్ణి. స్వతహాగా అక్కినేని వీరాభిమానినైనా... నటునిగా ఎన్టీఆర్ ప్రభావమే నాపై ఎక్కువ ఉండేది. ఎస్వీఆర్, సావిత్రమ్మ తల్లి,  సూర్యకాంతం, రేలంగి అన్నా కూడా చాలా ఇష్టం.
 
 మద్రాస్‌లో ఎప్పుడు అడుగుపెట్టారు?

 ఆర్.నారాయణమూర్తి: ఇంటర్మీడియట్ అయిపోయింది. ‘సినిమాల్లోకి వెళతా...’ అని అమ్మని బతిమాలి.. ఆమె  దగ్గర ఓ డెబ్భై రూపాయలు తీసుకొని మద్రాస్ రెలైక్కా. ‘వెళ్లగానే.. రామారావుగారు వేషం ఇచ్చేస్తారు. నాగేశ్వరరావుగారు భోజనం పెడతారు’ అని మనసులోనే అమాయకంగా అనుకునేవాణ్ణి. అక్కడ నాలా  వందల మంది పడిగాపులు కాస్తూ ఉంటారని వెళ్లాక గానీ అర్థం కాలేదు. కష్టపడితే పడ్డాను కానీ.. ఆ రోజులు, ఆ అనుభవాలు మరిచిపోలేనివి మిత్రమా!
 
 ఆ అనుభవాలు కొన్ని...
 ఆర్.నారాయణమూర్తి: చెబుతాను మిత్రమా.. అప్పట్లో తిరుపతి వెళ్లే భక్తులందరికీ.. శ్రీవారిని దర్శించాక... అట్నుంచి అటు మద్రాసు వెళ్లి.. ఎన్టీఆర్‌ని చూసే సంప్రదాయం ఉండేది... అలా ప్రతి రోజూ పొద్దున్నే ఎన్టీఆర్ ఇంటికి వందల సంఖ్యలో భక్తులు వచ్చి చేరేవారు. ఆయన కూడా ఎర్లీ అవర్స్‌లో బయటకు వచ్చి వారికి కనిపించేవారు. ‘దర్శనం బాగా అయ్యిందా..’ అని కుశల ప్రశ్నలు వేసేవారు. రామారావుగారిని చూడాలనే కోరిక నాకు బలంగా ఉండేది. అందుకే ఆ భక్తుల్లో ఒకడిగా వెళ్లిపోయి.. ఆయన ముందు నిలుచున్నా. ఆ క్షణం గుర్తొస్తే... ఇప్పటికీ నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఆ ఆనందం కడుపు నింపదుగా. కడుపేమో నకనకలాడుతోంది. స్వతహాగా భోజనప్రియుణ్ణి. రోజుకు ఏడుసార్లు తింటా. జేబులో డబ్బుల్లేవ్. మరో వైపు లాడ్జివాడు ఖాళీ చేయమన్నాడు. వేషాలేమో రాలేదు. ఉంటానికి చోటు లేదు. దాంతో పానగల్‌పార్క్‌లో ఓ రోజు, రామకృష్ణ పార్క్‌లో ఓ రోజు, క్రిసెంట్ పార్క్‌లో ఓ రోజు పడుకునేవాణ్ణి. అన్నం లేకపోయేసరికి ట్యాప్ వాటర్ కడుపు నిండా పట్టించేవాణ్ణి. అష్టకష్టాలు అనుభవించా. కానీ వెనక్కు మాత్రం వెళ్లకూడదని దృఢంగా నిశ్చయించుకున్నా. అలాంటి సమయంలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన పేరు చిన్ని. స్టార్ కమెడియన్ రాజబాబుగారి మేకప్‌మేన్ కృష్ణకు సహాయకుడాయన. మహాలింగపురంలోని ఓ పాడైపోయిన కార్‌షెడ్‌లో చోటు ఇప్పించాడు. రాత్రిళ్లు అక్కడే పడుకునేవాణ్ణి. ఆ మహానుభావుడి దయవల్లే ‘తాతామనవడు’ సెట్‌లోకి అడుగుపెట్టా. నేను ప్రప్రథమంగా సినిమాఫుడ్ తిన్నది ఆ సెట్‌లోనే! అందుకే.. ఆ చిత్ర నిర్మాత ప్రతాప్ ఆర్ట్స్ రాఘవగారికి వందనాలు. నా అదృష్టం.. ఆ సెట్‌లోనే మహానటుడు రంగారావుగారిని, సూర్యకాంతమ్మని, సత్యనారాయణగారిని, అల్లురామలింగయ్యగారిని, రాజబాబుగారిని, రమాప్రభగారిని.. మహామహులందరినీ ఒకేసారి చూసే అవకాశం దొరికింది. ‘నేను నటిస్తానండీ.. వేషం ఇవ్వరా...’ అని డెరైక్ట్‌గా రంగారావుగారినే అడిగేశా. ఆయన సరదాగా ‘ఏది నటించి చూపించు’ అన్నారు. అంతే... ఇక రెచ్చిపోయా. అందర్నీ ఇమిటేట్ చేసేశా. రంగారావుగారు ఒకటే నవ్వు. ‘భలేవాడివిరా అబ్బాయ్. పైకొస్తావ్..’ అన్నారు. నాకు ఆనందం ఆగలేదు.
 
 ఇంతకీ మీ గురువు దాసరిగారిని ఎప్పుడు కలిశారు?
 ఆర్.నారాయణమూర్తి: వస్తున్నాను మిత్రమా, అక్కడికే వస్తున్నా! నా దేవుణ్ణి కలిసే సమయం ఆసన్నమయ్యింది. నేను బొమ్మలు బాగా గీస్తాను. మిమ్మల్ని కూర్చోబెట్టి... యాజిటీజ్‌గా మీ బొమ్మ దించేస్తా. నాలో ఉన్న ఆ కళ కూడా అక్కడ ఉన్నవారికి చూపించాలని ఓ మూల కూర్చొని ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల బొమ్మలు గీసేశాను. అప్పుడే... నా ఆరాధ్యదైవం నా గురువుగారు సెట్‌లోకి అడుగుపెట్టారు. నేరుగా గురువుగారి దగ్గరకెళ్లి నా బొమ్మలు చూపించాను. ‘ఏ ఊరు తమ్ముడూ...’ అని భుజం మీద చేయివేశారు. నా భుజంపై ఉన్నది సాధారణమైన చేయి కాదని, అది నా పాలిటి సాక్షాత్ వరద హస్తమని నాకు అప్పుడు తెలీదు. కానీ ఏదో తెలీని వైబ్రేషన్. ‘సినిమా పిచ్చితో వచ్చాను. వేషం ఇస్తే చేస్తాను’ అని అడిగేశాను. ‘ఏం చదివావ్’ అనడిగారు. ఆ రోజే ఇంటర్మీడియట్ ఫలితాలొచ్చాయి. పాసైపోయా. ఆ విషయమే చెప్పా. ‘చిన్న కుర్రాడివి. అప్పుడే సినిమాలు వద్దు. డిగ్రీ పూర్తి చేసి రా... అప్పుడు తప్పకుండా అవకాశం ఇస్తా’ అన్నారు గురువుగారు. ‘ఎన్టీరామారావు బి.ఏ’లా ‘నారాయణమూర్తి బి.ఏ’ అనిపించుకోవాలని నాక్కూడా ఉండేది. అందుకే గురువుగారి మాట ప్రకారం వెళ్లి డిగ్రీ పూరిరంగారావుగారి ముందు నేను నటించి చూపిస్తున్నప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ సప్లయిర్ శరభయ్యగారు చూశారట. ఆయన నన్ను పిలిపించి, ‘గోల్డెన్‌స్టూడియోకి వచ్చేయ్. నీకు వేషం ఉంది’ అన్నారు. ‘అబ్బడియబ్బ... యాక్టర్‌ని అయిపోయా’. ఇంకేముంది.. నా ఆనందానికి పట్టపగ్గాల్లేవ్. మహాలింగపురం నుంచి ఏడు కిలోమీటర్లు నడిచి గోల్డెన్ స్టూడియోకి చేరుకున్నా. తీరా వెళ్లాక అక్కడ నా వేషం ఏంటనుకుంటున్నారు.. ‘రాముని బంటుని రా... సీతారాముని బంటుని రా...’ అని గుడిముందు కృష్ణగారు డాన్స్ వేస్తుంటారు. ఆయన వెనుక ఎగిరే ఓ నూట డెభ్భైమందిలో నేనూ ఒకణ్ణి. ఆ సినిమా పేరు ‘నేరము-శిక్ష’... కె.విశ్వనాథ్‌గారు దర్శకుడు. కాస్త కనిపించే వేషం వేసి, ఊరెళ్లిపోవాలనేది నా ఆలోచన. అందుకే.. సహాయ దర్శకుడు కృష్ణమూర్తిగారి దగ్గరకెళ్లి, రామారావు, నాగేశ్వరరావుగారిని ఇమిటేట్ చేసి చూపించి, ‘ఏదైనా కనిపించే వేషం ఇవ్వండి సార్’ అనడిగాను. నా బాధను గ్రహించి.. సాక్షిరంగారావు, మాడా తదితర ప్రముఖులు నటిస్తున్న ఓ సన్నివేశంలో... వారి పక్కనే నన్ను కూడా నిలబెట్టాడు. డైలాగ్ అయితే.. లేదు. దక్కిందే దక్కుదల అనుకున్నా. ఆ షూటింగ్ టైమ్‌లోనే మద్రాస్‌లో ప్రథమంగా... నాన్‌వెజ్ తిన్నాను. ఆకలితో మాడీ మాడీ ఉన్న కడుపు కదా. నోరు కూడా బాగా చవిజచ్చిపోయింది. నాన్‌వెజ్ కనిపించగానే రెచ్చిపోయా. ఇంకేముందీ.. తేడా కొట్టేసింది. భయంకరమైన జ్వరం. శరభయ్యగారు ఇంటికి తీసుకెళ్లి, టాబ్లెట్ ఇచ్చారు. పొద్దున్నే జ్వరం తగ్గింది. అరడజను దోసెలు పళ్లెంలో పెట్టి తినమన్నారు. తిన్నాను. ఓ 36 రూపాయలు ఇచ్చారు. నా తొలి పారితోషికం అనమాట! అవి తీసుకొని ఆయనకు కృతజ్ఞత చెప్పి ఊరుకెళ్లే ముందు మళ్లీ మా గురువుగారిని కలిశాను. ‘ఊరు వెళుతున్నాను’ అని చెప్పాను. ‘జాగ్రత్తగా వెళ్లిరా’ అన్నారు. రాజబాబుగారు నాకు టెర్రీకాటన్ బట్టలు కొనిచ్చారు. వారి ఆప్యాయత ఇంకా నా కళ్లముందు కదులుతూనే ఉంది(చమర్చిన కళ్లతో). ముఖ్యంగా మద్రాసు మహాతల్లికి వందనాలండీ. ఆ సాంబారుకి శతకోటి వందనాలు.
 
 ఇంతకీ బి.ఏ పుర్తి చేశారా?
 ఆర్.నారాయణమూర్తి: ఓ వైపు విద్యార్థి ఉద్యమాలు. మరో వైపు చదువు. సినిమా పరిశ్రమలో ఎన్ని కష్టాలుంటాయో ప్రత్యక్షంగా చూశాను కదా. అందుకే... ‘మళ్లీ వెళ్లాలా..’ అనే ఆలోచనలో ఇంకో వైపు. అలాంటి సమయంలో... మా ఊరి టూరింగ్ టాకీస్‌లో ‘నేరము-శిక్ష’ విడుదలైంది. స్క్రీన్‌పై ఎప్పుడైతే నేను కనిపించానో.. ‘అడిగోరా.. రెడ్డిబాబులు’ అని ఒకే కేక పెట్టారు ఊరి జనాలు! నేను ఆ సినిమాలో ఉన్నట్లు చుట్టుపక్క ఊళ్లల్లో స్ప్రెడ్ అయ్యింది. అంతే.. బళ్లు కట్టుకొని మరీ సినిమాకి రావడం మొదలుపెట్టారు జనాలు! అందులో నేను చేసింది జూనియర్ ఆర్టిస్ట్ వేషం. కానీ నన్ను హీరోలా చూడ్డం మొదలుపెట్టారు. ఆ క్రేజ్ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక మద్రాస్ వెళ్ళాల్సిందే.. అని నిశ్చయించుకున్నాను. బి.ఏ. అయిపోగానే.. అమ్మానాన్నల పర్మిషన్ తీసుకొని మద్రాస్ ట్రైన్ ఎక్కేశా. సూటిగా గురువుగారిని కలిశా. వెళ్లీవెళ్లగానే.. అన్నమాట ప్రకారం ‘నీడ’ సినిమాలో సెకండ్ లీడ్ క్యారెక్టర్ ఇచ్చారు. వందరోజులాడింది. నా అభిమాన హీరో అక్కినేని నుంచి షీల్డ్ కూడా తీసుకున్నా!
 
 కెరీర్ తొలినాళ్లలో గుర్తుండిపోయిన సంఘటనలు?
 ఆర్.నారాయణమూర్తి: అబ్బో లెక్కలేనన్ని. మనకు ఎన్టీఆర్ ఎలాగో.. తమిళనాడులో ఎమ్జీఆర్ అలా. బాత్రూమ్ గోడలమీద కూడా ఆయన పేర్లే ఉంటాయి. నేను జూనియర్ ఆర్టిస్‌గా ఉన్న రోజుల్లో సప్లయిర్ సూర్యనారాయణగారు నాకో వేషం ఇప్పించారు. వాహినీ స్టూడియోలో షూటింగ్. అందులో కూడా వందమందిలో ఒకణ్ణే. కాస్ట్యూమ్స్ వాడు అందరికీ ‘పోడుంగో... పోడుంగో...’ అని ఎవరి కాస్ట్యూమ్స్ వాళ్లకు విసురుతున్నాడు. అవి ముక్కిపోయిన వాసన వస్తున్నాయి. ‘ఇదేంటండీ... ఇవి ముక్కిపోయిన కంపు గొడుతున్నాయి. ఎలా తొడుక్కుంటాం’ అని అడిగేశా. ‘ఏయ్... ఉంగళక్కు తెరియుమా.. అంద డ్రస్ యార్ పోటాచ్చో. యమ్జీఆర్ పోటాచ్చి. పోడుంగో’ అని గదిమాడు. వాడన్నదానికి అర్థం ఏంటంటే... ‘నీకు తెలుసా... ఆ డ్రస్ ఎవరు వేసుకున్నారో... ఎమ్జీఆర్ వేసుకున్నారు. తోడుక్కో’ అని! ‘అబ్బ... ఎమ్జీఆర్ వేసుకున్న డ్రస్ వేసుకుంటున్నానా...’ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయా. ఆత్రం ఆత్రంగా ఆ డ్రస్ వేసుకున్నా. నా జీవితంలో మరిచిపోలేని సంఘటన అది. మరో సంఘటన ఏంటంటే... . హైదరాబాద్ సారథీ స్టూడియోలో ‘ఓ మనిషీ తిరిగిచూడు’ షూటింగ్ జరుగుతోంది. మా గురువుగారే దర్శకుడు. ఆ చిత్ర నిర్మాతకి తాగుడు అలవాటుంది. రోజుకు ఒకణ్ణి తిడుతుంటాడు. ఈ దఫా నా వంతు వచ్చింది. నోటికి ఏదొస్తే అది అనేశాడు. రైతు బిడ్డని అవ్వడంతో స్వతహాగా పొగరెక్కువ. దాంతో తిరగబడ్డాను. ఇద్దరం తోసుకున్నాం. ఆ నిర్మాతగారి అహం దెబ్బతినింది. ‘షూటింగ్ క్యాన్సిల్’ అని వెళ్లిపోయాడు. గురువుగారు నా దగ్గరకొచ్చి ‘సారీ చెప్పు’ అన్నారు. ‘నేను చెప్పను’ అని సూటిగా చెప్పేశా! ‘చెప్పకపోతే... నా దగ్గర ఉండవ్’ అన్నారు. ‘ఓకే’ అని మద్రాస్ ట్రైన్ ఎక్కేశా. మళ్లీ రోడ్డుమీద నిలబడ్డా. తర్వాత గురువుగారి మరో సినిమా మద్రాస్‌లో మొదలైంది. అప్పుడు ఆయనే... అసిస్టెంట్ డెరైక్టర్‌ని పిలిచి... ‘నారాయణమూర్తి ఏడయ్యా... కనబడటం లేదు. పాపం.. వాడెక్కడున్నాడో తీసుకురండి’ అన్నారు. కట్ చేస్తే గురువుగారి ముందున్నాను. ఇద్దరం కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ... ‘ఏరా... నేను పొమ్మంటే పోతావురా... నేను నిన్ను ఒక్క మాట అనకూడదా?’ అన్నారు గురువుగారు. నాకు ఏడుపు ఆగలేదు. కాళ్లమీద పడ్డంత పనిచేశాను. అసలు ఆయనకు నన్ను పిలిపించాల్సిన అవసరం ఏంటి చెప్పండి. ఆ రోజుల్లో ఆయన కారు వెళుతుంటే... సీఎం కాన్వాయ్‌లా... వెనుక ఓ పది కార్లు ఫాలో అయ్యేవి. ఆయన కోసం నిర్మాతలు పడిగాపులు కాచేవారు. ఆయన్ను నమ్ముకొని వచ్చిన ఆఫ్ట్రల్‌గాణ్ణి నేను. నా గురించి ఆయన అంతసేపు ఆలోచించడం ఏంటి? నాకు తెలిసి.. ‘గురువు’ అనే పదానికి సరైన నిర్వచనం నా గురువు దాసరే! మరో మరిచిపోలేని విషయం ఏంటంటే... నేను సక్సెస్‌లో ఉన్నప్పుడు నా చుట్టూ ఎప్పుడూ ఓ ఇరవై మంది ఉండేవారు. కోలాహలంగా ఉండేది నా లైఫ్. తర్వాత నా సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం మొదలయ్యాయి. అంతే... ఒక్కసారిగా ఆ కోలాహలం మాయం! జేబులో ఉన్న చిల్లర డబ్బులతో బన్ తిని, టీ తాగి రూమ్‌కొచ్చి పడుకునేవాణ్ణి. ‘ఏంటీ.. ఇలా అయిపోయింది జీవితం..’ తెలీకుండానే కంటి వెంట చెమ్మ. ఇంతలో బుద్ధభగవానుడి పుస్తకం కనిపించింది. పేజీ తిప్పాను. గొప్ప కొటేషన్... ‘నీవు దుఖించిన యడల దుఖము పోయినచో నువ్వు దుఖించుము’ అని. పనిగట్టుకొని ఏడవడం ఎంత దుర్మార్గమో ఒక్కమాటలో చెప్పాడు బుద్ధుడు. నా జీవితాన్ని మార్చిన సంఘటన అది.
 
 సాధారణ పేదరైతు బిడ్డ అయిన మీరు ‘స్నేహ చిత్ర’ పేరుతో నిర్మాణ సంస్థను ఎలా స్థాపించగలిగారు?
 ఆర్.నారాయణమూర్తి: హీరోని కావాలనేది నా యాంబిషన్! నాకేమో చిన్న చిన్న వేషాలొస్తున్నాయి. సో... ఏదో ఒక రిస్క్ చేస్తే తప్ప నేను హీరోని కాను.  ముందు నేను హీరో అవ్వాలంటే... నేనే దర్శకుణ్ణి అవ్వాలి. కానీ నాకెవ్వరూ డెరైక్షన్ చాన్స్ ఇవ్వరు. నేను దర్శకుణ్ణి అవ్వాలంటే.. నేనే నిర్మాతను కావాలి. నేను పేదరైతు బిడ్డను. సినిమా తీసే స్తోమత నాకు లేదు. అలాంటి దశలో నా మిత్రులు సాయం చేశారు. వారి సహకారంతో ఇండో-సోవియట్ష్య్రా మైత్రి చిహ్నాన్ని నా సంస్థకు పెట్టుకొని ‘స్నేహచిత్ర’ సంస్థను స్థాపించా. నా సంస్థలో నేను తీసిన తొలి సినిమా ‘అర్ధరాత్రి స్వతంత్రం’. అది ఏడాది ఆడింది. ఆ తర్వాత ‘‘భూపోరాటం, ఆలోచించండి, అడవి దివిటీలు, దండోరా, ఎర్రసైన్యం, స్వతంత్రభారతం, చీమలదండు, దళం, ఊరుమనదిరా, వేగుచుక్కలు, వీరతెలంగాణ, పోరు తెలంగాణ, పీపుల్స్‌వార్, చీకటి సూర్యులు, అమ్మమీద ఒట్టు, గంగమ్మజాతర’’ ఇలా స్ఫూర్తిని రగిలించే సినిమాలు తీశా. రాబోతున్న  ‘నిర్భయ భారతం’ కూడా నా సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉంటుంది.
 
 కథాపరంగా ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఎవరూ సినిమాలు తీయరు. కానీ మీరు తీస్తారు. ఎందుకు?

 ఆర్.నారాయణమూర్తి: ఒక్కో దర్శకునిదీ ఒక్కో శైలి! శాంతారామ్‌గారి సినిమాలు వాస్తవానికి అద్దం పట్టేలా ఉంటాయి. విశ్వనాథ్‌గారి సినిమాలు, బాపుగారి సినిమాలు కళాత్మకంగా ఉంటాయి. రాఘవేంద్రరావుగారి సినిమాలు మసాలా ఓరియంటెండ్‌గా ఉంటాయి. నా సినిమాలు ఇలా ఉంటాయి. మళ్లీ మా గురువుగారు పద్ధతి వేరు. ఆయన ఎలాంటి సినిమా అయినా తీసేస్తారు.
 
 ఇలాంటి సినిమాలు తీస్తున్నారు కదా. ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదురవ్వలేదా?
 ఆర్.నారాయణమూర్తి: అబ్బో చాలా! నేను తీసిన చాలా సినిమాలు సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పోలీసులైతే కొన్ని సినిమాల ప్రదర్శనలను కూడా అడ్డుకున్నారు. నా సినిమాకు వచ్చే జనాన్ని కూడా సోదా చేసేవారు! ఓసారి ఇంటిలిజెన్స్ ఐజీ నన్ను పిలిపించి ఇంటరాగేట్ చేశారు. ‘ఇలాంటి సినిమాలు తీశావంటే నిన్ను ఎన్‌కౌంటర్ చేస్తా’ అని బెదిరించాడు. ‘మీరు నన్నేం చేయలేరు’ అని మొహం మీదే చెప్పి వచ్చేశా. కొన్నిసార్లు నా సినిమా షూటింగులకు కూడా పర్మిషన్లు వచ్చేవి కావు.
 
 వ్యాపార దృక్పథంతో ఆలోచించకుండా నమ్మిన సిద్ధాంతం ప్రకారం సినిమాలు తీస్తున్న మీకు... ధైర్యంగా స్నేహ హస్తం అందిస్తూ,, సాయం చేస్తున్న ఆ మిత్రులు ఎవరు?

 ఆర్.నారాయణమూర్తి: నా కాలేజ్‌మేట్స్‌తో పాటు, పలువురు చిత్ర ప్రముఖులు కూడా ఉన్నారు. అది పెద్ద లిస్ట్.  
 
 విప్లవాత్మక చిత్రాలే తీయడం వల్ల... నారాయణమూర్తికి నక్సల్స్‌తో సంబంధం ఉందని, ఆయన సినిమాలకు నిధులు అక్కడ్నుంచే వస్తాయని మీపై ఓ టాక్ ఉంది.

 ఆర్.నారాయణమూర్తి: చూడండీ... ఎవరైతే ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసి, ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, అనన్యసామాన్యంగా పోరాటం చేస్తూ... పీడిత ప్రజలకు అండగా నిలుస్తున్నారో... ఆ ఉద్యమకారులంటే నాకెంతో గౌరవం. అందుకే నేను తీసిన కొన్ని సినిమాల్లో వాళ్లు హీరోలయ్యారు. ఒక్క నక్సల్స్‌నే హీరోలను చేసి నేను సినిమాలు తీయలేదు. ఎవరైతే... అన్యాయానికి ఎదురుతిరిగి పోరాటం చేస్తారో... వాళ్లనే హీరోలుగా చేసుకొని సినిమాలు తీశాను. దూబగుంట రోశమ్మ.. నా హీరోయిన్, నిర్భయ.. నా హీరోయిన్, ఢిల్లీలో పోరాడిన యువతరం నా హీరోలు. నేను అందరికీ చెప్పేది ఒక్కటే. బిఫోర్ ఇండిపెండెన్స్.. భగత్‌సింగ్ నా హీరో అయితే... ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఉద్యమకారులు నా హీరోలు. ఇక అన్నల దగ్గర్నుంచి డబ్బులు తీసుకోవడం అంటారా... అది పచ్చి అబద్దం.
 
 వాళ్లతో మీకు ఎలాంటి సంబంధాలు లేవా?
 ఆర్.నారాయణమూర్తి: మీకూ నాకు సంబంధం లేదా? చెప్పండి. నిజానికి ఆ మహానుభావులతో సంబంధం ఉండటం అదృష్టం. అజ్ఞాతంగా యుద్ధం చేస్తున్న ఆ మహనీయులకు మనం రుణపడి ఉన్నాం.
 
 ఇండస్ట్రీకి వచ్చాక ఆస్తులు ఏమైనా కొన్నారా?
 ఆర్.నారాయణమూర్తి: మేం నలుగురు అన్నదమ్ములం. అక్కచెల్లెళ్లు ముగ్గురు. మా ఊళ్లో చింతపల్లి నరసింహారావుగారని ఓ పెద్దాయన ఉండేవాడు. ఆయన పొలాన్నే నాన్న కౌలు చేసేవారు. అందరం కలిసి కష్టపడి, ఇప్పుడు అదే పొలాన్ని కొనుకున్నాం. అదే నా ఆస్తి!
 
 సిల్వర్‌జూబ్లీ సినిమాలు తీశారు. ఆ లాభాలు ఏం చేశారు?
 ఆర్.నారాయణమూర్తి: అనేక చోట్ల కాలేజీలకు ఫండ్లు ఇచ్చా. హస్పిటల్స్, పీపుల్స్ కమిటీ హాల్స్ కట్టించా. బోర్లు వేయించా. ఇదంతా గుచ్చి గుచ్చి అడుగుతున్నారు కాబట్టే చెబుతున్నా. కానీ ఊరు, పేరు మాత్రం చెప్పను. అది నా భావాలకు విరుద్ధం. ప్రజల ద్వారా నాకు సంక్రమించింది ప్రజలకే చెందాలనేది నా అభిమతం! అలాగే... నా మిత్రులు నాకు ఆర్థికంగా చాలాసార్లు సహాయం చేశారు. వారందరి అప్పులూ తీర్చేయాలి. నా ప్రధాన లక్ష్యం ఇప్పుడు అదే.
 
 బాకీలు తీర్చాలంటే మీరు సినిమాలే తీయనవసరం లేదు. బయట చిత్రాల్లో పాత్రలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే.. లక్షలివ్వడానికి దర్శక, నిర్మాతలు రెడీగా ఉన్నారు.
 ఆర్.నారాయణమూర్తి: ఒక్కటి చెబుతా వినండి బ్రదర్. నా రెమ్యునరేషన్ పైసానా, కోటి రూపాయలా అనే విషయాన్ని పక్కన పెట్టండి. యాక్టింగ్ అనేది ఇష్ట ప్రకారం చేసే పని. జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరో స్థాయికి ఎదిగా. మళ్లీ ఒక్కడుగు కూడా వెనక్కు వేయను.  ‘ఆర్.నారాయణమూర్తి ఫిల్మ్’ అనే స్థాయికి వచ్చా. ఆ మార్క్‌ని కాపాడుకోవడమే నా లక్ష్యం. ఇప్పటికి పాతిక సినిమాలు తీశా. అందులో పదిహేను హిట్లు. అది మూములు విషయం కాదు. ఒకానొక దశలో నా సినిమాల బాటలోనే అందరూ నడిచారు. అందుకే జనాలు మొనాటనీ ఫీలయ్యారు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత నా మీదే ఉంది. అందుకే సముద్రం ఈదుతున్నా. కచ్చితంగా ఒడ్డుకు చేరతా.
 
 వామపక్ష భావజాలంతో ఉండే మీరు దేవుడు గుడి కనిపిస్తే మొక్కుతారు. ఈ భిన్నత్వం ఏంటి?
 ఆర్.నారాయణమూర్తి: కారల్ మార్క్స్ అంతటి వారు కూడా దేవుడు లేడని చెప్పలేదు. నేను భారతీయుణ్ణి. ముఖ్యంగా హిందువుని. ఆ సంప్రదాయాల మధ్య పుట్టి పెరిగిన వాణ్ణి. చెట్లలో, పుట్టలలో, గట్టులలో చివరకు విష సర్పాల్లో కూడా దైవాన్ని చూసే గొప్ప సంస్కృతి మనది. ఆ సంస్కృతిని ఆకళింపు చేసుకున్నాను కాబట్టే నాకు దేవుడంటే నమ్మకం. చిన్నప్పుడు మా ఇంటి నుంచి స్కూల్‌కి వెళ్లాలంటే ఏడు కిలోమీటర్లు నడిచేవాణ్ణి. మధ్యలో ఓ కొండ ఉండేది. ఆ కొండపై దెయ్యం ఉందనేవారు. రోజూ భయపడుతూ వచ్చేవాణ్ణి. ఓ రోజు అమ్మ చెప్పింది. ‘కొండ దగ్గరకు రాగానే ‘జై భజరంగబళి’ అనుకో... ఏ భయం ఉండదు’ అని. ఆ కొండ దగ్గరకు రాగానే ‘జై భజరంగబళి’ అనుకునేవాణ్ణి. ఎక్కడలేని ధైర్యం తన్నుకొచ్చేది. ఇంకా మాట్లాడితే... అక్కడ కాసేపు ఆగి... కొండవైపు పొగరుగా చూస్తూ... ‘జై భజరంగబళి’ అనేవాణ్ణి. నిజంగా దెయ్యాలనేవి ఉంటే... నా ధైర్యాన్ని చూసి పారిపోయేవి. ఆ ధైర్యమే దేవుడు.
 
 మీరు పెళ్లెందుకు చేసుకోలేదు?

 ఆర్.నారాయణమూర్తి: బ్రదర్.. వయసొచ్చినప్పట్నుంచీ ఉద్యమాలే ఊపిరిగా బతికా. నడుస్తున్న సూరీడులా ఉండేవాణ్ణి. పెళ్లి విషయంలో కూడా నాకంటూ కొన్ని కచ్చితమైన అభిప్రాయాలుండేవి. అవి నా భావాలకు అనుగుణంగానే ఉండేవి. దానికి పెద్దలు ఒప్పుకోలేదు. నేను అభిప్రాయం మార్చుకోలేదు. చివరకు ఒంటరిగా మిగిలిపోయా.
 
 మరి ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఎవర్నీ ఇష్టపడలేదా?
 ఆర్.నారాయణమూర్తి: అన్నా.. వదిలేసెయ్యే.. ఉహ తెలిసినప్పట్నుంచీ అనేక మంది అమ్మాయిల్ని చూసి ఇష్టపడతాం. అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని చూసి ఇష్టపడతారు. అది కామన్. అయితే.. ఇక్కడ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. కట్టుబాట్లు, ఆచారాలు ఉంటాయి. వాటిని గౌరవించుకోవాలి. గౌరవించకపోతే నేను ‘నిర్భయభారతం’ తీయడంలో అర్థం లేదు.
 
 పెళ్లి అవసరం అప్పటికంటే.. ఇప్పుడే మీకు ఎక్కువ.
 ఆర్.నారాయణమూర్తి: నాకు తెలుసు. కానీ... 60 ఏళ్లు వచ్చేశాయి. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే మనసులో లేదు.
 
 సరే... మరి భోజనం సంగతేంటి?
 ఆర్.నారాయణమూర్తి: హోటళ్లు ఉన్నాయిగా..


 భోజన ప్రియులైన మీరు ఎన్నాళ్లు తింటారు హోటల్లో?
 ఆర్.నారాయణమూర్తి: అలవాటైపోయింది సోదరా...


 మరి బస?
 ఆర్.నారాయణమూర్తి: కృష్ణానగర్‌లో రూమ్ తీసుకున్నా.
 
 వీవీఐపి అయిన మీరు కృష్ణానగర్‌లో. అదీ అద్దె ఇంట్లో...
 ఆర్.నారాయణమూర్తి: మద్రాసులో పాండీబజార్ ఎంత గొప్పదో, హైదరాబాద్‌లో కృష్ణానగర్ అంత గొప్పది సోదరా. ఆ కృష్ణానగర్‌తల్లికి వందనం. వేలాది మంది సినీకార్మికులకు ఆసరాగా నిలిచింది మహాతల్లి. ఒక్కోసారి షేర్ ఆటో ఎక్కుతుంటా. ‘సార్.. మా జన్మ ధన్యమైంది’ అంటుంటారు పక్కన కూర్చున్నోళ్లు. ‘మీ పక్కన కూర్చోవడం వల్ల నా జన్మ ధన్యమైంది...’ అని నేను అంటుంటా. అప్పుడు చూడాలి వాళ్ల ఆనందం.
 
 నిరంతరం జనం బాగుకోసం తాపత్రయపడే మీరు.. రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు?
 ఆర్.నారాయణమూర్తి: అన్నా.... నాకు కాకినాడ నుంచి మూడు సార్లు ఎంపీ ఆఫర్లు వచ్చాయి. తుని నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే ఆఫర్లు వచ్చాయి. కానీ నేను వెళ్లలేదు. ఎందుకంటే... నేను వెళితే... సదరు పార్టీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. అది నాకు చేతకాదు.  అయినా... నేను సినిమాలు తీస్తుంది ప్రజలకోసమే కదా.
 
 మీలాంటి నిస్వార్థపరులు రాజకీయాల్లోకొస్తే.. ప్రజలకు నిజంగా మంచి జరుగుతుంది కదా...
 ఆర్.నారాయణమూర్తి: నీ ప్రేమకు అభిమానానికీ వందనమే... కానీ నేను పాలిటిక్స్‌లోకొస్తే... నాకు లాల్‌బహుద్దూర్ శాస్త్రిగారిలా ఉండాలని ఉంటుంది. పుచ్చలపల్లి సుందరయ్యలా బతకాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు అదెంత సాధ్యమంటారు! అయినా... నాకింకా సినిమా పిచ్చిపోలా!
 
 - బుర్రా నరసింహ
 
 మా గురువుగారు నన్ను పీపుల్స్ స్టార్ అంటారు... అది భారతరత్నకంటే గొప్ప బిరుదు!
 
 గ్లామర్, కరెన్సీ, లగ్జరీ... సినీ సెలబ్రిటీ జీవితం ఇదే. కానీ మీరు అందుకు భిన్నం.
     
 సెలబ్రిటీ అయ్యుండి ఈ సాధారణమైన జీవితం ఏంటి?


 ఆర్.నారాయణమూర్తి: చూడన్నా... బంగళాలు కొనుక్కోవాలన్నా, కార్లల్లో తిరగాలన్నా... మీరంటున్న సోకాల్డ్ లగ్జరీ లైఫ్ అనుభవించాలన్నా నాకది పెద్ద సమస్యేం కాదు. స్విల్వర్ జూబ్లీ సినిమాలు తీసినోణ్ణి నేను. నా సినిమాలు రికార్డులు సృష్టించాయి. అలాంటి నేను అవన్నీ కొనుక్కోలేనా? నేను ఇలా ఓ సాధారణమైన జీవితం గడపడానికి కారణం నా ‘మెంటాలిటీ’. చిన్నప్పట్నుంచీ నేను ఇంతే. నా అభిరుచుల్ని, అభిప్రాయాల్ని, మనోభావాల్ని మార్చుకోలేని అశక్తుణ్ణి. పదిమందీ నన్ను చూసి గొప్పగా చెప్పుకోవాలని నేను ఇలా ఉండను. ఇలా బతకడమే నాకిష్టం. కాలేజీ రోజుల్లో కూడా నాకు రెండే జతల బట్టలుండేవి. ఇప్పటికీ అంతే. నా రూమ్‌లో చాప, దిండు మాత్రమే ఉంటాయి.. వేప పుల్లతో పళ్లు తోముకుంటా. సబ్బుతో స్నానం చేయను. మొహానికి పౌడర్ రాయను. నా స్వభావం ఇది. చెట్లకింద కూర్చోడం, జనంతో మమేకమవ్వడం.. ఇవే నాకు ఆనందాన్నిచ్చేవి. ఎవరో ఏదో అనుకుంటారని నా స్వభావాన్ని మార్చుకోలేను. ఇక గ్లామర్ అంటారా... నాకు గ్లామర్ లేకపోతే... నా ఇంటర్‌వ్యూ మీకెందుకు? ? చెప్పండి. సినీరంగంలో ‘అన్న’ అంటే ఎన్టీఆర్. ఆయన తర్వాత అన్నా అని నన్నే అంటారు. ‘మా ఆకలి బాధల్ని కళ్లకు కడుతున్నావ్ బిడ్డా...’ అంటూ ఈ రోజున తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు నన్ను గుండెలకు హత్తుకుంటున్నారు. ఇంతకు మించిన గ్లామర్ ఏం కావాలి? మా గురువుగారు నన్ను ‘పీపుల్స్ స్టార్’ అన్నారు. నాకు భారతరత్నకంటే గొప్ప బిరుదు అది. ‘జననాట్యమండలి గజ్జ ఆగిన చోట... ప్రజల గళాన్ని వినిపిస్తున్నాయి నారాయణమూర్తి సినిమాలు’ అన్నాడు గద్దరన్న. ఇంతకు మించిన కాంప్లిమెంట్ ఉంటుందా? స్వదేశీ భారతి అనే ప్రఖ్యాత బెంగాలీ రచయిత ఆయన రాసిన ‘ఆరణ్యక్’ బుక్‌పై ముఖచిత్రంగా నా బొమ్మ వేశాడు. పూరిజగన్నాథ్ తన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని నాకు అంకితమిచ్చాడు. ఇంతకు మించిన గౌరవం ఉంటుందా? నాకు ఈ తృప్తి చాలు.
 
 
 ‘దేవుడు నన్ను అన్ని విషయాల్లో కింగ్‌ని చేసి ఆ ఒక్క విషయంలో  అన్యాయం చేశాడు..!


 ఇంటికెళ్లగానే.. ఒంటరితనం కమ్మేస్తుంది. అప్పుడనిపిస్తుంది. ‘నిజంగా తోడు తోడే’ అని. జ్వరం వచ్చినప్పుడు పలకరించే నాథుడు లేకుండా ఒంటరిగా ముడుచుకొని పడుకొని ఉంటాను చూడండీ... అప్పుడనిపిస్తుంది. తోడులేని నా జీవితం కూడా ఓ జీవితమేనా అని. ఏ గోంగూరో, లేక చేపల పులుసో తినాలనిపించినప్పుడు, అవి హోటల్లో దొరకనపుడు... అదే నాకంటూ ఓ భార్య ఉంటే వండి పెట్టేది కదా అనిపిస్తుంది. ‘దేవుడు నన్ను అన్ని విషయాల్లో కింగ్‌ని చేశాడు. ఈ ఒక్క విషయంలో ఎందుకు అన్యాయం చేశాడు’ అనుకుంటుంటా. ఒక్కోసారి ఇంటి టైపై కూర్చుంటా. రెండు పక్షులు ఎగరడం నాకంట పడితే... వాటివంకే చూస్తుంటా. ‘వాటికీ ఓ గూడు ఉండి ఉంటుంది. చివరకు అడవిలో తిరిగే మృగాలకు కూడా తోడూ, నీడా ఉంటాయి. మరి నా కెందుకు లేవు. పిచ్చోణ్ణి... నాకెందుకు ఇంత అన్యాయం చేశాడు దేవుడు’ అని బాధపడ్డ సందర్భాలు కోకొల్లలు. కాబట్టి నేటి యువతకు నేను చెప్పేది ఒక్కటే. ‘మేం సెటిల్ అవ్వలేదు. అయ్యాక పెళ్లి చేసుకుంటాం’ అనే ధోరణి మానండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. చక్కగా పెళ్లి చేసుకోండి. చక్కని సమాజానికి నాంది పలకండి. పేరుప్రఖ్యాతుల కోసం మాత్రమే జీవించేవాడికి మానసిక శాంతి ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement