రెండోవాడు ఏడి? | Family crime story in this week | Sakshi
Sakshi News home page

రెండోవాడు ఏడి?

Published Wed, Oct 31 2018 12:29 AM | Last Updated on Wed, Oct 31 2018 12:29 AM

Family crime story in this week - Sakshi

ప్లాన్‌ సక్సెస్‌ కావాలంటే ఒకే మార్గం.ఫెయిల్యూర్‌ కావాలంటే  వేయి మార్గాలు.2000. ఆగస్టు నెల.‘తప్పదా?’ అంది కళ్యాణి.‘తప్పదు’ అన్నాడు గోవర్ధన్‌.‘బియ్యం వ్యాపారమంటే రిస్క్‌ ఎక్కువ. పోటీ జాస్తి అని మీరే చెప్తుంటారు. ఉన్న ఉద్యోగం మానేసి ఇదేం బుద్ధండీ’...‘ఇక ఇలాగే ఉండిపొమ్మంటావా? పావుకిలో చికెను, క్వార్టర్‌ బాటిల్‌ మందు... ఇలాంటి బతుకు ఇంకా ఎంత కాలమని? మనం బాగుపడక్కర్లేదా?’‘అయితే పొలం అమ్మేస్తారన్న మాట’‘అమ్మేస్తా’‘దేవుడే ఉన్నాడు’‘దేవుణ్ణి కాదు. నన్ను నా బుర్రను నమ్ము’ఇద్దరికీ  పదిహేనేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఖమ్మంలో నివాసముంటున్నారు. ఇద్దరు పిల్లలు. చదువుకుంటున్నారు. శివారులోని రైస్‌మిల్లులో అతడు నిన్నటి వరకు మేనేజర్‌గా పనిచేసేవాడు. మిల్లు ఓనర్‌తో విభేదాలు వచ్చాయి. మానేశాడు. మానేస్తూ చూపిస్తా తడాఖా అనుకున్నాడు. సొంతంగా బిజినెస్‌ చేసి, బాగా సంపాదించి, ఓనర్‌ ముందే దర్జాగా తిరగాలనేది పంతం.  పంతం నెర వేర్చుకునేపనిలో పడ్డాడతడు.

ఏడాది గడిచింది. ఈ ఏడాదిగా గోవర్ధన్‌ సరిగా ఇంటిపట్టునే ఉండటం లేదు. ఎప్పుడో వస్తాడు. ఎప్పుడో వెళతాడు. టెన్షన్‌గా ఉంటాడు. ఒక్కోసారి రాత్రుళ్లు ఇంటికి రాడు.  ఉద్యోగం చేస్తున్న రోజులే బాగున్నాయిఅనిపించింది కళ్యాణికి.వ్యాపారంలో కారు కొన్నాడు.కారు ఉండి భర్త లేని రోజుల కన్నా కారు లేని భర్త ఉన్న రోజులే మేలు అని ఆమె అనుకుంది.ఆగస్టు 19, 2001.తెల్లవారు జాము.హాల్లో ల్యాండ్‌లైన్‌ మోగింది.రాత్రి భర్త ఇంటికి రాలేదు. ఇప్పుడు ఏదైనా చెప్పడానికి చేశాడా?నిద్ర కళ్లతో ఫోన్‌ ఎత్తింది కళ్యాణి.అవతలి మాట వింటూనే భూమి కదిలిపోయినట్లనిపించింది. తేరుకొని, ఉన్నఫళంగా పిల్లలను తీసుకొని బయల్దేరింది.

ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వెళ్లే హైవే.ఖమ్మం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఓ కారు ఆగి ఉంది. అది పూర్తిగా తగలబడిందనడానికి గుర్తు నల్లగా కాలి కనిపిస్తోంది.చేరుకుంటుంటే కళ్యాణికి గుండెదడగా అనిపించింది.కనిపిస్తున్న దృశ్యం అబద్ధమైతే బాగుణ్ణు అనుకుంది. పోలీసులు ఆమెను సమీపించారు.కారు నంబర్, వివరాలు ఆమెకు చెప్పారు.  సగం కాలిన చేతి గడియారం, రెండు ఉంగరాలు ఆమె ముందుంచారు.‘ఇవి మీ భర్తవేనా’వణుకుతున్న చేతులతో వాటిని తడుముతూ ‘అవును సార్‌’ అంది. కారుకు ఎడమవైపున కళ్యాణిని తీసుకెళ్లారు. ఎదురుగా నేల మీద బాగా కాలిపోయి, గుర్తుపట్టడానికి వీల్లేనంతగా ఉన్న ఓ శరీరం. కారులోంచి తీసి బయట పడుకోబెట్టినట్టున్నారు పోలీసులు.ఆ దృశ్యాన్ని చూస్తూనే అక్కడే కుప్పకూలిపోయింది కళ్యాణి.  పిల్లలు బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉన్నారు. కాసేపటికి తెలివి వచ్చింది కళ్యాణికి.‘చూడమ్మా! ఇలాంటప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలం. ధైర్యం తెచ్చుకొని చూడండి. శవాన్ని పోస్టుమార్టంకి తరలిస్తున్నాం’ చెప్పాడు ఎస్సై. కళ్యాణి ఏడుస్తూనే కాలిన ఆ శరీరం వైపు చూసింది.ఆమె చూపు శవం తాలూకు ఎడుమ చేయి దగ్గర ఆగిపోయింది. మణికట్టు వద్ద చర్మం కాలిపోయి, కండరం బైటకు వచ్చి ఎముక కనిపిస్తోంది. ‘సార్‌’ అంది కళ్యాణి ఎస్సై వైపు తిరిగి.ఏంటమ్మా’ ‘సర్‌. ఇతను మా ఆయన కాదు’ఉలిక్కిపడ్డాడు ఎస్‌.ఐ.‘మా ఆయనకు నాలుగేళ్ల క్రితం ఎడమచేతి మణికట్టు వద్ద ఎముక విరిగింది. డాక్టర్లు రాడ్‌ వేశారు. ఈ చేతికి ఎముక కనిపిస్తోంది. రాడ్‌ లేదు’ ఎస్సై భృకుటి ముడిపడింది. సిబ్బంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘స్టీల్‌ రాడ్‌...’ ఆలోచనలో పడ్డాడు ఎస్సై.


పోలీసులు టోల్‌గేట్‌ వద్ద ఉన్న కెమెరాలను పరిశీలించడంలో నిమగ్నమయ్యారు. సంఘటన జరిగిన రోజున ఏయే వాహనాలు టోల్‌గేట్‌ నుంచి వెళ్లాయో కెమెరా ద్వారా పర్యవేక్షించారు. అర్ధరాత్రి 12 గంటల తెల్లవారుజాము వరకు వెళ్లిన కారు నంబర్లన్నీ నోట్‌ చేసుకున్నారు. తెల్లవారుజాము 2:30కు గోవర్ధన్‌ ఉన్న కారు క్రాస్‌ చేసినట్టుగా పోలీసులు కార్‌ నంబర్‌ ఆధారంగా గుర్తించారు. అయితే, అతనితో పాటు ఆ కారులో మరో వ్యక్తి కూడా ఉన్నాడు. కానీ, ప్రమాదం జరిగినప్పుడు మాత్రం కారులో ఒక్కరే ఉన్నారు. అంటే రెండో వాడు ఎవడు? అతనేమైనట్టు?కళ్యాణి నుంచి మరికొన్ని వివరాలు సేకరించారు. కారును గోవర్ధనే స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటాడని, డ్రైవర్‌ లేడని చెప్పింది. అదే నిజమైతే ఆ కారులో ఉన్నదెవరు? చనిపోయిన అతను గోవర్ధన్‌ కాకపోతే గోవర్ధన్‌ ఏమయ్యాడు? కళ్యాణి నుంచి గోవర్ధన్‌ ఫొటోలు తీసుకున్నారు పోలీసులు. ఇంటి మీద నిఘా ఉంచారు. బియ్యం షాప్‌ వద్ద, ఆ చుట్టుపక్కల షాపుల్లోనూ ఎంక్వైరీ చేశారు. గతంలో గోవర్ధన్‌ పనిచేసే చోటులో కూడా కూపీ లాగారు. చాలా వివరాలే తెలిశాయి.గోవర్ధన్‌ బియ్యం వ్యాపారం దివాళా తీసిందని, అప్పుల్లో ఉన్నాడని, ఎవరో స్త్రీతో సన్నిహితంగా ఉంటున్నాడనీ. షాప్‌లో పనిచేస్తున్న మల్లయ్య ఎస్సై వద్దకు వచ్చాడు అయ్యా, ‘మా సార్‌ వద్దకు బానోతు అనే అతను నెలకోసారి వచ్చి వెళ్తుంటాడు. అతను వచ్చిన ప్రతీసారి మా సార్‌ డబ్బులు ఇవ్వడం చూశా. పోయిన నెల సార్‌ డబ్బులు ఇవ్వలేనని అంటే అతను గొడవ పెట్టుకున్నాడు కూడా’ అన్నాడు.‘అతను ఎక్కడివాడో తెలుసా..’ అడిగాడు ఎస్సై‘అతను కాటవరం దగ్గర తండా అని చెప్పాడు సార్‌! వెంటనే పోలీసు జీపులు ఆ తండా వైపుగా కదిలాయి. 

నిందితుడు గోవర్ధన్‌ తల దించుకొని పోలీసుల ఎదురుగా నిల్చున్నాడు. విచారణలో గోవర్ధన్‌ ఒక్కో విషయం చెప్పడం మొదలుపెట్టాడు. ‘నేను రైస్‌మిల్లులో పని చేస్తున్నప్పుడు బిక్కూబాయి కూలీ. ఆమెతో నాలుగేళ్లుగా సంబంధం ఉంది. అది బయటపడటం వల్లే మిల్లులో గొడవపడి ఉద్యోగం మానేసి వ్యాపారం మొదలెట్టాను. కానీ అంతకు ముందే మా సంబంధం  ఆమె భర్త బానోతుకు తెలిసింది. అప్పట్నుంచి నన్ను డబ్బులివ్వమని వేధిస్తున్నాడు. అసలే కొత్త వ్యాపారం మొదలుపెట్టి అప్పులతో ఇబ్బందులు పడుతున్నా ఏదో విధంగా డబ్బులు సర్దుతున్నాను. కానీ, రోజు రోజుకు బానోతును భరించడం కష్టం అనిపించింది. మూడేళ్ల క్రితం 50 లక్షల రూపాయలకు బీమా తీసుకొని ఉన్నాను. బీమా ప్రీమియం చెల్లించే సమయంలో ఒక ఆలోచన వచ్చింది. చనిపోతేనే ఆ బీమా డబ్బు కుటుంబానికి అందుతుంది.చనిపోకుండానే చనిపోయాననే నాటకం ఆడితే డబ్బులు వస్తాయి. అప్పుల బారినుంచి బయటపడచ్చు అనుకున్నాను. అప్పులు తీర్చే మార్గం, బిక్కూబాయి భర్తను వదిలించుకునే మార్గం ఒకటే అనిపించింది.ప్రమాదంలో చనిపోతేనే బీమా డబ్బులు వస్తాయి. అందుకని కారు ప్రమాదం జరిగేలా చూడాలి అనుకున్నాను. డబ్బులిస్తానని చెప్పి ఆ రోజు రాత్రి బానోతును ఖమ్మం రమ్మన్నాను. ఇద్దరం కలిసి  రాత్రి వరకు అక్కడే బాగా తాగాం. బానోతుకు ఇంకా ఎక్కువ తాగించాను. ఇద్దరం కారులో హైదరాబాద్‌ వైపు బయల్దేరాం. బానోతు నా పక్కనే ముందు సీటులో కూర్చొని నిద్రపోతున్నాడు. టోల్‌ గేట్‌ దాటి 50 కిలోమీటర్ల దూరం వచ్చేశాం. రోడ్డుకు ఎడమవైపున కారు ఆపి, బానోతుకు నా ఒంటిమీది వస్తువులు, బట్టలు తగిలించాను. అతని బట్టలు నేను వేసుకున్నాను. డ్రైవింగ్‌ సీట్లో అతడిని కూర్చోబెట్టి, నా ఫోన్‌ కూడా అతని జేబులో ఉంచి కారు డిక్కీలో ముందే ఉంచిన పెట్రోల్‌ తీసి లోపల, బయట అంతా పోసేశాను. కారు అద్దాలు మూసేసి,  లైటర్‌ని వెలిగించి కారుమీద వేశాను. ఖాళీ పెట్రోల్‌ క్యాన్‌ తీసుకొని ఓ చెట్టు చాటుకు వెళ్లి కారు పూర్తిగా తగలబడేవరకు ఉండి, వెళ్లిపోయాను. వారం రోజులు గడిచిపోయాయి. ఎవరికీ అనుమానం రాలేదని, ఇంకొన్ని రోజులకు ఇంటికి వెళ్లచ్చులే అనుకొని ముందుగా బిక్కుబాయి ఇంటికి వెళ్లాను’ అసలు విషయం చెప్పాడు గోవర్ధన్‌.బిక్కుబాయి ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ గోవర్ధన్‌ని పట్టుకొని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కి తీసుకొచ్చారు. ప్లాన్‌ సక్సెస్‌ అవడానికి ఒకటే మార్గం.ఫెయిల్‌ అవడానికి వేయి.
– నిర్మలారెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement