రాగి రగస్యాలు | family food special | Sakshi
Sakshi News home page

రాగి రగస్యాలు

Published Sat, Mar 10 2018 12:53 AM | Last Updated on Sat, Mar 10 2018 12:53 AM

family food special - Sakshi

రాగిలో చాలా దాగి ఉన్నాయి... ఆరోగ్యం,  ఆస్వాదనం, సంబరం, సంతోషం... ఇవే మరి రాగి రగస్యాలు...

ఆపిల్‌ రాగుల పిండి హల్వా
కావలసినవి: రాగుల పిండి – 2 టేబుల్‌ స్పూన్లు; ఆపిల్స్‌ – 2; బెల్లం పొడి – ఒక టేబుల్‌ స్పూను; నెయ్యి – అర టీ స్పూను; నీళ్లు – ముప్పావు కప్పు.
తయారి: ∙ఆపిల్స్‌ను శుభ్రంగా కడిగి (తొక్క, గింజలు వేరు చేసి) చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి ∙ ఒక బాణలిలో రాగుల పిండికి, ముప్పావు కప్పు నీళ్లు జత చేసి ఉండలు లేకుండా బాగా కలిపి, స్టౌ మీద సన్నని మంట మీద ఆపకుండా కలుపుతూ బాగా ఉడికించాలి ∙ ఉడుకుతున్న రాగుల పిండిలో... ఆపిల్‌ గుజ్జు, బెల్లం పొడి, నెయ్యి వేసి బాగా కలపాలి ∙ సుమారు నాలుగైదు నిమిషాలు బాగా ఉడికి, దగ్గర పడిన తరవాత దింపేయాలి ∙ చల్లారాక బౌల్స్‌లో అందించాలి.

రాగులు పల్లీల  లడ్డు
కావలసినవి: రాగుల పిండి – ఒక కప్పు; పల్లీలు – 2 కప్పులు; బెల్లం పొడి – ఒకటిన్నర కప్పులు; పాలు – అర కప్పు; నువ్వులు – అర కప్పు;
తయారి: ∙ స్టౌ మీద బాణలి వేడయ్యాక, మంట తగ్గించి, రాగుల పిండి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి (సుమారు పది నిమిషాల సమయం పడుతుంది) వేరే పాత్రలోకి తీసుకుని పక్కన ఉంచాలి ∙ అదే బాణలిలో పల్లీలు, వేసి వేయించి, మరో పాత్రలోకి తీసుకుని, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి ∙అదే బాణలిలో నువ్వులు కూడా వేసి వేయించి, వేరే పాత్రలోకి తీసుకుని, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ ఒక గిన్నెలో రాగుల పిండి, పల్లీల పొడి, నువ్వుల పొడి, బెల్లం పొడి వేసి, బాగా కలపాలి ∙పాలు జత చేస్తూ చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చేసుకోవాలి ∙ గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

రాగి కోకోనట్‌ కుకీస్‌
కావలసినవి: ఎండు కొబ్బరి తురుము – ముప్పావు కప్పు; రాగుల పిండి – ముప్పావు కప్పు; గోధుమ పిండి – అర కప్పు; అన్‌ సాల్టెడ్‌ బటర్‌ – 150 గ్రా; పంచదార పొడి – 150 గ్రా.; పంచదార – ఒక టేబుల్‌ స్పూను; వెనిలా ఎసెన్స్‌ – 2 టీ స్పూన్లు; కోడి గుడ్డు – 1 (చిన్నది);
తయారి: ∙ఒక పాత్రలో బటర్, పంచదార పొడి వేసి బాగా కలిసేవరకు గిలకొట్టాలి ∙కోడి గుడ్డుసొనలు, వెనిలా ఎసెన్స్‌ జత చేసి మరోమారు గిలకొట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ పంచదార జత చేసి నెమ్మదిగా కలిపి, మూత పెట్టి సుమారు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి ∙కుకర్‌లో ఇసుక పోసి స్టౌ మీద ఉంచి, బాగా వేడయ్యాక మంట తగ్గించాలి ∙ కుకర్‌ వేడెక్కేలోపు, ఫ్రిజ్‌లో నుంచి రాగుల పిండి మిశ్రమం బయటకు తీసి, చిన్న చిన్న ఉండలుగా చేసి, చేతితో ఒత్తి, అల్యూమినియం ట్రేలో దూరం దూరంగా ఉంచి, కుకర్‌లో పెట్టాలి (విజిల్‌ పెట్టకూడదు) ∙ సుమారు పావు గంట తరవాత స్టౌ మీద నుంచి దింపేయాలి ∙ కొద్దిగా చల్లారాక ఒక ప్లేట్‌లోకి తీసి, అందించాలి.

రాగి బ్రెడ్‌
కావలసినవి: రాగుల పిండి – అర కప్పు; గోధుమ పిండి – ఒక కప్పు; పాల పొడి – అర కప్పు; అరటిపండ్లు – 3 (బాగా పండినవి); రిఫైన్డ్‌ ఆయిల్‌ – అర కప్పు; తేనె – పావు కప్పు; బేకింగ్‌ పౌడర్‌ – అర టీ స్పూను; బేకింగ్‌ సోడా – ఒక టీ స్పూను; దాల్చిన చెక్క పొడి – ఒక టీ స్పూను; జాజి కాయ పొడి – అర టీ స్పూను; ఉప్పు – చిటికెడు; డ్రై నట్స్‌ పొడి – అర కప్పు (బాదం పప్పులు + వాల్నట్స్‌)

తయారి: ∙ఒక పాత్రలో గోధుమపిండి, రాగుల పిండి, దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి, ఉప్పు, బేకింగ్‌ పౌడర్, బేకింగ్‌ సోడా వేసి బాగా కలిపి, రెండుమూడు సార్లు జల్లెడ పట్టాలి ∙మరొక పాత్రలో తొక్క తీసిన అరటిపండ్లను వేసి మెత్తటి గుజ్జులా చేసాక – తేనె, రిఫైన్డ్‌ ఆయిల్‌ జత చేసి మరోమారు కలిపాక, బీటర్‌ (కవ్వం) సహాయంతో బాగా గిలకొట్టాలి ∙ పాల పొడి జత చే సి, మరోమారు గిలకొట్టాలి ∙ రాగుల పిండి మిశ్రమం జత చేస్తూ, ఉండ కట్టకుండా బాగా కలపాలి  డ్రై నట్స్‌ పొడి జత చేయాలి ∙నలు చదరంగా ఉన్న అల్యూమినియం ట్రేకి నెయ్యి పూసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో పోసి, సమానంగా పరిచి పక్కన ఉంచాలి ∙కుకర్‌లో అంగుళం మందంలో ఇసుక పోసి స్టౌ మీద ఉంచి వేడయ్యాక, మంట బాగా తగ్గించాలి ∙ సిద్ధంగా ఉంచుకున్న అల్యూమినియం ట్రేను కుకర్‌లో ఉంచి, మూత పెట్టాలి. (విజిల్‌ పెట్టకూడదు) ∙ సుమారు 40 నిమిషాలయ్యాక దింపాలి ∙కొద్దిగా చల్లారాక ట్రేను బయటకు తీసి, వేరే ప్లేటులోకి మార్చుకోవాలి ∙చాకుతో బ్రెడ్‌ మాదిరిగా కట్‌ చేసి అందించాలి.

రాగి ఆలు మేథీ పరాఠా
కావలసినవి: రాగుల పిండి – పావు కప్పు; గోధుమ పిండి – పావు కప్పు; మిరప పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; గరం మసాలా – పావు టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను; ఆలు గడ్డ – 1; మెంతి ఆకుల తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు.

తయారి: ∙ఆలుగడ్డను ఉడికించి, తొక్క తీసి పక్కన ఉంచాలి  బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, మెంతి ఆకుల తరుగు వేసి, పచ్చి వాసన పోయేవరకు వేయించి తీసేయాలి ∙ ఒక పాత్రలో తొక్క తీసిన ఆలు గడ్డ వేసి చేతితో మెత్తగా అయ్యేలా చిదిమాక, వేయించి ఉంచుకున్న మెంతి ఆకులు, గోధుమ పిండి, రాగి పిండి, మిరప పొడి, గరం మసాలా, ఉప్పు, తగినన్ని నీళ్లు జతచేసి చపాతీ పిండిలా కలపాలి ∙ టీ స్పూను నూనె జత చేసి బాగా కలిపి సుమారు గంటసేపు పక్కన ఉంచాక, పెద్ద పెద్ద ఉండలు చేయాలి ∙ ఒక్కో ఉండను పరాఠాలుగా ఒత్తాలి ∙ స్టౌ మీద పాన్‌ వేడయ్యాక, ఒక్కో పరాఠాను వేసి రెండు వైపులా నూనె వేసి, దోరగా కాల్చి తీసేయాలి ∙ వేడివేడిగా అందించాలి.

బాగా ఎండలు పెరిగాక మార్కెట్‌లో మెంతి కూర దొరకదు కదా. మరి ఆ సీజన్‌లో కూడా మెంతికూర తినాలంటే ఏం చేయాలి?
ఎండలు పెరిగేకొద్దీ మెంతికూర ధర  బాగా పెరుగుతుంది. అంతేకాదు, లేతగా తాజాగా ఉండే మెంతి కూర దొరకడం కూడా కష్టమే. అందువల్ల ఇంకా ఎండలు బాగా ముదరకుండా, ఇప్పుడే ఎక్కువ మెంతి కూర కొని, తెచ్చుకోవాలి. ఆకులు తెంపి, శుభ్రంగా కడగాలి. పొడి వస్త్రం మీద, నీడలో ఆరబెట్టాలి. పూర్తిగా తడి పోయిన మెంతి ఆకులను గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ ఆకులను వంటలో వాడుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement