కండరాలు పట్టేస్తున్నాయి... కారణమేమిటి?  | family health counciling | Sakshi
Sakshi News home page

కండరాలు పట్టేస్తున్నాయి... కారణమేమిటి? 

Published Wed, Mar 21 2018 12:47 AM | Last Updated on Wed, Mar 21 2018 12:47 AM

family health counciling - Sakshi

న్యూరాలజీ కౌన్సెలింగ్‌
నా వయసు 36 ఏళ్లు. గత కొంతకాలంగా నాకు కాళ్లూ, చేతుల కండరాలు  బిగుసుకుపోయినట్లుగా పట్టుకుపోతున్నాయి. తీవ్రమైన నొప్పి వస్తోంది. కొన్నిసార్లు కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు, మరికొన్నిసార్లు నిద్రలో ఇలా జరుగుతోంది. నిద్రలో ఇలా జరిగినప్పుడు అకస్మాత్తుగా నిద్ర లేచి కుంటుతూ నడుస్తుంటాను. నాకు ఈ సమస్య ఎందుకు వస్తోంది. దీని నుంచి బయట పడటానికి మార్గం చెప్పండి.  – సుధాకర్‌రావు, నల్లగొండ 
తరచూ కాళ్లు, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టేయడానికి (క్రాంప్స్‌కు), నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. కొందరిలో తమ శరీరంలోని నీటి పాళ్లు  తగ్గినా (సాధారణ డీహైడ్రేషన్‌ వల్ల ) కూడా మీరు చెప్పిన లక్షణాలు వ్యక్తమవుతాయి. మీరు తీవ్రమైన అలసటకు గురైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు వ్యాయామం చేయని కారణంగా కండరాలు బలహీనమైపోయి, తీవ్రమైన అలసట కలగడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరిగే పరిణామం. దీనివల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో సాధారణంగా పిక్కలు పట్టేస్తాయి. ఇలాంటివారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మీ కండరాలను బలపరచుకోవాల్సి ఉంటుంది. ఇక కొందరిలో సోడియమ్, పొటాషియమ్, చక్కెరపాళ్లు, క్యాల్షియమ్, మెగ్నీషియమ్‌ వంటి ఖనిజ లవణాలు తగ్గడం గానీ లేదా పెరగడం గానీ జరిగినా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొందరిలో కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొందరిలో విటమిన్‌ బి12, విటమిన్‌ డి తగ్గడం వల్ల, థైరాయిడ్, అడ్రినల్‌ గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఇవే లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. కొందరిలో కొన్నిసార్లు సాధారణ ఆర్థరైటిస్‌ వచ్చినప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపించవచ్చు. అలాగే కొందరిలో పెరిఫెరల్‌ నర్వ్స్‌ అనే నరాలు, వెన్నెముక లోపాలతోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజిస్ట్‌ను కలిసి, విపులంగా రక్త పరీక్షలు చేయించుకొని, లక్షణాలకు అసలు కారణాన్ని కనుక్కోవాలి. సమస్య ఏమిటన్నది కనుగొంటే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది.

కొన్నేళ్లుగా తీవ్రమైన తలనొప్పి... తరచూ ఎందుకిలా? 
నా వయసు 32. గత 12 ఏళ్లుగా నాకు తరచూ తలనొప్పి వస్తోంది. ఒక్కోసారి అది నెలలో నాలుగైదుసార్లు కూడా వస్తోంది. దీని తీవ్రత ఎంతగా ఉంటుందంటే నేను నా రోజువారీ పనులేవీ చేసుకోలేకపోతున్నాను. ఇది తగ్గేదెలా?  – వసుంధర, మహబూబ్‌నగర్‌ 
తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్‌ కావచ్చు. మీకు మైగ్రేన్‌ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్‌పోజ్‌ కావడం, ఘాటైన వాసనలు, పర్‌ఫ్యూమ్స్‌ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే ఆ పదార్థాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే 
టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్‌ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. 

 పక్షవాతానికి స్టెమ్‌సెల్‌ థెరపీ అందుబాటులో ఉందా?
నేను గత తొమ్మిదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాను. ఇటీవల వార్తాపత్రికలు చదువుతూ పెరాలసిస్‌కు మూలకణ చికిత్స (స్టెమ్‌సెల్‌ థెరపీ) అందుబాటులోకి వచ్చినట్లు తెలుసుకున్నాను. నేను ఈ చికిత్స తీసుకోదలిచాను. ప్రస్తుతం ఇది ఎక్కడ లభ్యమవుతోంది, దీనికి ఎంత ఖర్చవుతుంది, దాని ఫలితాలెలా ఉన్నాయనే వివరాలు విపులంగా తెలియజేయండి. – ఎల్‌. జీవన్‌రెడ్డి, కర్నూలు 
ఒకసారి మెదడులోని కణాలు చనిపోతే అవి శాశ్వతంగా చనిపోయినట్టే. అది పక్షవాతం వల్ల చనిపోయినా లేదా మెదడుకు గాయం కావడం వల్ల చనిపోయినా  మెదడులోని కణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరుజ్జీవించలేవు. కానీ ఒక ఆశారేఖ ఉంది. మెదడు కణాలు చనిపోయిన సమయంలోనే ఆ కణాలలో నిక్షిప్తం అయి ఉన్నదాన్ని మనం తిరిగి పొందాలంటే దెబ్బతిన్న కణాలకు పక్కనే ఉండే కణాలు తోడ్పడతాయి. మన మెదడుకు ఉన్న ఈ అద్భుతమైన శక్తిని ‘న్యూరోనల్‌ ప్లాస్టిసిటీ’ అని వ్యవహరిస్తారు. ఇలా మనం 80 శాతం మేరకు కోలుకోడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధి పడుతుంది. ఇక మూలకణాల విషయానికి వద్దాం. మూలకణాలతో చికిత్స అంటే... ఇవి మన శరీరంలోని ఎలాంటి కణాలుగానైనా మారేశక్తి ఉన్న కణాలన్నమాట. పక్షవాతానికి మూలకణాలతో చికిత్స చేసే ప్రక్రియలో విషయంలో రెండు రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాం. మొదటిది... మెదడులోనే చెడిపోయి ఉన్న కణాలను కొన్ని మందుల ద్వారా మళ్లీ ప్రేరేపించి పనిచేయించేలా చూడటం; ఇక రెండోది... బయటి నుంచి మూలకణాలను శరీరంలోకి పంపడం. అంటే ఉదాహరణకు చెడిపోయిన మూలగ స్థానంలో కొత్త కణాలు పంపి, కొత్త మూలగను రూపొందించేలా చేయడం అన్నమాట. ఇక చనిపోయిన మెదడుకణాల స్థానంలో మూలకణాలను ప్రవేశపెట్టడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇందులో మూలకణాలు పాతకణాలతోనూ, న్యూరాన్ల దారులతో అనుసంధానితం అయి, అక్కడి రసాయన చర్యలకు అనుగుణంగా స్పందిస్తూ ఉండటానికి చాలా కాలం పడుతుంది. ఇందుకు కొన్నేళ్ల వ్యవధి కూడా పట్టవచ్చు. ఇవ్వాళ్టికీ ఈ విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి వచ్చిన ఫలితాలైతే అంత సంతృప్తికరంగా లేవు. కాబట్టి ప్రస్తుతానికి మూలకణ చికిత్స అన్నది పరిశోధన దశలోనే ఉంది. పరిస్థితి ఇంకా ఆసుపత్రిలో చికిత్స అందించే వరకు రాలేదు.
డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌ రెడ్డి, 
చీఫ్‌ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, 
రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement