భుజం దగ్గర ఉండేది కీలకమైన కీలు. పైగా నిద్రసమయంలో తప్ప... దాదాపుగా కదులుతూ ఉండే భాగం కావడంతో దానికి గాయమయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక ఆటల సమయంలోనైతే భుజం, అక్కడి కీలు నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. అందుకే భుజానికి గాయాలవడానికీ, దాంతో అనేక రకాల సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ.
ఉదాహరణకు భుజం గూడ తప్పడం (షోల్డర్ డిస్‌లొకేషన్), రొటేటర్ కఫ్ టేర్, స్లాప్ టేర్స్, టెండనైటిస్, టెండన్ రప్చర్స్ వంటివి. సాధారణంగా ఆటల్లో భుజం తాలూకు గూడ తప్పడం అనే సమస్య ఎక్కువగా వస్తుంటుంది. ఇలా జరిగినప్పుడు దాన్ని సరైన స్థానంలో అమర్చాల్సి ఉంటుంది. దాంతో పరిస్థితి చక్కబడుతుంది. ఇక గూడ తొలగడం అనే ఆ సమస్య నిత్యం జరుగుతూ ఉంటే ‘ఆర్థోస్కోపీ స్టెబిలైజేషన్’ అనే శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఆ శస్త్ర చికిత్స ద్వారా ఈ సమస్యను నిపుణులు చక్కదిద్దుతారు.
భుజానికి వచ్చే సాధారణ సమస్యల నివారణ కోసం...
►క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల భుజం కండరాలు బలంగా మారి భుజానికి వచ్చే అనేక సమస్యలు నివారితమవుతాయి
►వ్యాయామంలో తన వీపు భాగంలో ఉండేవీ, వెనకవైపు కండరాలపై కూడా దృష్టిపెట్టడం కూడా అవసరం. చాలా మంది శరీరానికి ముందువైపు ఉన్న కండరాలు బలంగా రూపొందడానికీ, అవి అందంగా మంచి షేప్‌తో కనిపించడానికి తగిన ప్రాధాన్యమిస్తుంటారు. ఆ మేరకే వ్యాయామాలు చేస్తుంటారు.
►అయితే భుజం విషయంలో మాత్రం చేతులకు వెనకవైపున ఉండే కండరాలు కూడా బలంగా రూపొందే వ్యాయామాలు చేయాలి. అప్పుడే భుజం చాలాకాలంపాటు ఆరోగ్యంగా ఉంటుంది
►మధుమేహ వ్యాధిగ్రస్తులకు ‘ఫ్రోజెన్‌షోల్డర్’ అనే బాధాకరమైన కండిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకునేందుకు, ఫ్రోజెన్‌షోల్డర్‌ను నివారించుకునేందకు అవసరమైన వ్యాయామాలు చేయడం మంచిది
►కంప్యూటర్‌పై పనిచేసేవారు, వీడియోగేమ్స్ ఆడేవారు, టీవీ చూసేవారు, డ్రైవింగ్ చేసేవారు సరైన భంగిమలో కూర్చోవాలి. వారు నిటారుగా కూర్చొని పనిచేయడం వల్ల కండరాలపైనా, ఇరువైపుల ఉన్న భుజాలపైన సమంగా భారం పడుతుంది. అంతే తప్ప ఒకవైపు ఒంటి పనిచేయడం సరికాదు>
►భుజాలు బెణకడం వంటివి జరిగినప్పుడు అది తగ్గే వరుకు వ్యాయామాలు ఆపేసి, వేడినీటి కాపడం, ఐస్ కాపడం పెట్టాలి. ఇలా చేశాక రెండు రోజుల తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను కలవాలి.
Comments
Please login to add a commentAdd a comment