హోమియో కౌన్సెలింగ్స్
నా వయసు 56 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? – ఎమ్. రామానుజమూర్తి, ఒంగోలు
మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది.
కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్వు సమయం మెడను వంచి ఫోన్‌లలో మాట్లాడటం ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
లక్షణాలు: ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ∙నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు.
హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్‌టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు.
- డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
సంతానలేమి సమస్యకూ చికిత్స ఉంటుందా?
నా వయసు 33 ఏళ్లు. వివాహమై తొమ్మిదేళ్లు అవుతోంది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అని చెప్పారు. అంటే ఏమిటి? దానికి కారణాలు ఏమిటి? హోమియోలో నా సమస్యకు పరిష్కారం ఉందా? – ఆర్. శైలజ, కందుకూరు
ఇటీవల చాలా మందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు.
స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు: ∙జన్యుసంబంధిత లోపాలు ∙థైరాయిడ్ సమస్యలు ∙అండాశయంలో లోపాలు; నీటిబుడగలు ∙గర్భాశయంలో సమస్యలు ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు ∙డయాబెటిస్ ∙గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం.
పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు: హార్మోన్ సంబంధిత సమస్యలు ∙థైరాయిడ్ పొగతాగడం ∙శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం
సంతానలేమిలో రకాలు: ∙ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ
ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ : అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ: మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సంభవిస్తుంది.
గుర్తించడం ఎలా: తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు.
చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్‌స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యను పరిష్కరించేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.
- డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
పేను కొరుకుడుకు పరిష్కారం సూచించండి
మా అమ్మాయి వయసు 27 ఏళ్లు. ఈమధ్య తలలో ఒకే దగ్గర వెంట్రుకలు రాలిపోతున్నాయి. అందరూ పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో దీనికి పరిష్కారం సూచించండి. – పుష్పవల్లి, కర్నూలు
ఈ సమస్యను వైద్యపరిభాషలో అలొపేషియా అంటారు. ఈ కండిషన్‌లో ఒక నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, నున్నగా మారుతుంది. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. అలాంటప్పుడు చాలాసార్లు తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడంతో వచ్చే సమస్య ఇది. తలలో, గడ్డంలో, మీసంలో... ఎక్కడైనా రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఇది కనిపించదు.
కారణాలు: ∙మానసిక ఆందోళన ∙థైరాయిడ్ సమస్య ∙డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువ ∙వంశపారంపర్యంగా ∙కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది.
లక్షణాలు: ∙తలపై మొత్తం జుట్టు ఊడిపోయి, బట్టతల లక్షణాలు కనిపిస్తాయి. ∙తలపై అక్కడక్కడ గుండ్రంగా ప్యాచ్‌లలా జుట్టు ఊడిపోతుంది ∙సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతితో ఈ ప్యాచ్‌లు ఉంటాయి.
నిర్ధారణ: ఈ సమస్య నిర్దిష్టంగా ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్ పరీక్షలు, పిగ్మెంట్ ఇన్‌కాంటినెన్స్ వంటివే మరికొన్ని పరీక్షలు అవసరమవుతాయి.
చికిత్స: పేనుకొరుకుడు సమస్యకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు వ్యాధి కారణాలు, లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు. దీనికి హోమియోలో యాసిడ్ ఫ్లోర్, సల్‌ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలీనియమ్, సొరినమ్, తుజా వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
- డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment