గౌట్‌ సమస్య  తగ్గుతుందా?  | family health counciling | Sakshi
Sakshi News home page

గౌట్‌ సమస్య  తగ్గుతుందా? 

Published Wed, Dec 27 2017 11:46 PM | Last Updated on Wed, Dec 27 2017 11:46 PM

family health counciling - Sakshi

నా వయసు 46 ఏళ్లు. కొద్దిరోజుల నుంచి కాలి బొటనవేలు వాచి, విపరీతమైన సలపరంతో నొప్పి వస్తోంది. వైద్యుడిని సంప్రదిస్తే గౌట్‌ అన్నారు. డాక్టర్‌ సూచనల మేరకు మందులు వాడినప్పటికీ సమస్య పూర్తిగా తగ్గలేదు. ఇటీవలే రక్తపరీక్ష చేయిస్తే రక్తంలో ఇంకా ‘యూరిక్‌ యాసిడ్‌’ స్థాయులు ఎక్కువే ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. నా సమస్యకు హోమియో చికిత్స ఉందా? – ఎమ్‌. శ్రీనాథ్, వరంగల్‌ 
మన శరీరంలో ‘యూరిక్‌ యాసిడ్‌’ జీవక్రియలు సరిగా లేనందువల్ల గౌట్‌ వ్యాధి వస్తుంది. ఇది ఒక రకం కీళ్లవ్యాధి. యూరిక్‌ యాసిడ్‌ రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టమవుతాయి. దాన్ని ‘గౌట్‌’ అంటారు. 

లక్షణాలు: ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. 

నివారణ/జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్‌ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగ, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. 

చికిత్స: హోమియో వైద్యవిధానంలో అందించే అధునాతనమైన కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స ద్వారా గౌట్‌ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది.
- డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

ఆటిజం  అంటే  ఏమిటి? 
మా బాబు వయసు మూడేళ్లు దాటుతోంది. ఇంకా మాట్లాడటం గానీ, పిలిస్తే పలకడం గానీ, పిల్లలతో ఆడటం కానీ చేయడం లేదు. చూడటానికి బాగానే ఉంటాడు. ఎవ్వరినీ కలవడు. శబ్దాలు చేస్తూ తన లోకంలో తానే ఉంటాడు. పిల్లల డాక్టర్‌కు చూపిస్తే ఇది ఆటిజం కావచ్చని అంటున్నారు. హోమియోలో దీనికి చికిత్స ఉందా?  – ఆదిత్య, గుంటూరు

ఆటిజం లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. హోమియోపతిలో దానికి కొంత పరిష్కారం ఉంది. ఆటిజం అనేది ఒక లక్షణం కాదు. దీనిలో వివిధ లక్షణాలు, ఎన్నో స్థాయులు, మరెన్నో భేదాలు ఉంటాయి. ఆటిజం అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ఆటిజం లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీన్ని క్లాసికల్‌ ఆటిజం అంటారు. మరికొంతమందిలో లక్షణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. అది జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపించదు. దీన్ని మైల్డ్‌ ఆటిజం అంటారు. 

లక్షణాలు: ∙ఎదుటివారి మనోభావాలు అర్థం చేసుకోలేకపోవడం ∙నలుగురిలో కలవలేకపోవడం లేదా ఆనందాలు, బాధలు పంచుకోలేకపోవడం ∙చేతులు, కాళ్లు విచిత్రంగా ఆడించడం, కదపడం ∙కొత్తదనానికి త్వరగా అలవాటు పడలేకపోవడం, రొటీన్‌గా ఉండటాన్నే ఇష్టపడటం ∙అలవాటు పడ్డ వ్యక్తులతోనే ఉండటం. 

చికిత్స: ఆటిజం వ్యాధికి హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాధి కోసం కార్కినోసిస్, తుజా, సిక్రెటిన్‌ వంటి మందులను లక్షణాలను ఇవ్వాలి. వ్యాధిని త్వరగానూ, ముందుగానే గుర్తించి ఇస్తే పిల్లల్లో లక్షణాల తీవ్రత పెరగకుండా చూడవచ్చు. ఐక్యూ పెంచవచ్చు. హోమియో చికిత్స తీసుకుంటూ పిల్లలకు బిహేవియర్‌ థెరపిస్టులతో ప్రత్యేక వైద్యవిధానం ద్వారా చికిత్స చేయాల్సి ఉంటుంది.
- డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

యానల్‌ ఫిషర్‌కు  చికిత్స ఉందా?
నా వయసు 65 ఏళ్లు. నేను మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్‌  ఫిషర్‌ అని చెప్పి, ఆపరేషన్‌ అవసరమన్నారు. హోమియో మందులతో తగ్గే అవకాశం ఉందా?   – ఆర్‌. కాంతారావు, నిజామాబాద్‌ 
మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్‌ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఆ పగుళ్లను ఫిషర్‌ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితోపాటు రక్తస్రావం అవుతుంది. ఫిషర్‌ ఏళ్ల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్‌ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టే అవకాశాలు ఎక్కువ. దాంతో ఆందోళన మరింత పెరుగుతుంది. 

కారణాలు: ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం. 

లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం రెండు గంటల పాటు నొప్పి, మంట. 

చికిత్స: ఫిషర్‌ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఆపరేషన్‌ అవసరం లేకుండా, ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ లేకుండా చికిత్స చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది.
-  డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్, డైరెక్టర్, పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement