మలబద్దకం.. లైట్‌ తీసుకుంటే బోలెడన్ని సమస్యలు | Best Foods To Eat For Constipation Problem | Sakshi
Sakshi News home page

మీ డైట్‌లో ఇవి చేర్చుకుంటే మలబద్దకం నుంచి ఉపశమనం పొందొచ్చు

Published Sat, Dec 2 2023 12:13 PM | Last Updated on Sat, Dec 2 2023 12:50 PM

Best Foods To Eat For Constipation Problem - Sakshi

చాలామంది పైకి చెప్పుకోలేరు కానీ ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్యలలో మలబద్ధకం కూడా ఒకటి. చిత్రం ఏమిటంటే, దానిని అసలు ఒక సమస్యగా కూడా గుర్తించకపోవడం! మలబద్ధకాన్ని సీరియస్‌గా తీసుకోకపోతే మాత్రం శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీర్ఘకాల మలబద్ధకం వల్ల కిడ్నీ సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు, పైల్స్, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత, వికారం, ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలు మొదలవుతాయి. అందువల్ల రోజువారీ మన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటూ డైట్‌లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే.. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

మలబద్ధకంతో బాధపడే వారికి కడుపులో అసౌకర్యంగా... ఇబ్బందిగా ఉంటుంది. మలద్వారం కోసుకుపోవడం, రక్తస్రావం వంటి సమస్యలు ఎదురవుతాయి. కదలకుండా కూర్చునే జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, జంక్‌ ఫుడ్, వేపుళ్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్, తగినన్ని నీరు తాగకపోవడం, ఫైబర్‌ ఎక్కువగా తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, బలహీనమైన జీవక్రియలు, రాత్రిళ్లు ఆలస్యంగా తినడం లేదా అసలే తినకపోవడం వంటి కారణాల వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది.

ఇది దీర్ఘకాలం ఉంటే.. కిడ్నీ సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు, పైల్స్, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత, వికారం, ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలు మొదలవుతాయి. దీనిని నివారించడానికి ఎన్నో చికిత్సలు, ఔషధాలు ఉన్నాయి. మీ డైట్‌లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే.. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. 

ఆహారంలో మెంతులు
మలబద్ధకం సమస్య ఉంటే.. చెంచాడు మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తినండి లేదంటే పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచాడు మెంతిపొడిని కలుపుకుని తాగడం వల్ల తెల్లారేసరికి సుఖ విరేచనం అవుతుంది. 

పండ్లు, కూరగాయలు
ఉదయానే టిఫిన్‌ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనానికి ముందు, సాయంత్రం మీకు ఇష్టమైన కూరగాయలతో చేసిన గ్లాసుడు వెజిటబుల్‌ జ్యూస్‌ తీసుకోవడం వల్ల మలబద్ధకం బారిన పడకుండా ఉంటారు. బచ్చలికూర, టొమాటో, బీట్‌రూట్, నిమ్మరసం, అల్లం కలిపి జ్యూస్‌ను తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తాజాపండ్లు ముఖ్యంగా బొప్పాయి పండు తినడం మంచిది. 

సబ్జానీళ్లు
మలబద్ధకంతో బాధపడేవారు రోజూ ఉదయం నానబెట్టిన సబ్జా గింజలను చెంచాడు ఖాళీ కడుపుతో తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. నానబెట్టిన బాదం పప్పులు, వాల్‌నట్, ఎండు ద్రాక్షలను తీసుకున్నా మంచిది.

అంజీర్‌
అంజీర్‌లో విటమిన్‌ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్‌ ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. రాత్రిపూట నానబెట్టిన అంజీర పండ్లను ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంజీర్‌ పేగు కదలికలను సులభతరం చేస్తుంది.

బొప్పాయి
ప్రతి రోజూ ఉదయం 11 గంటల ప్రాంతంలో, భోజనానికి ముందు కప్పుడు బొప్పాయి ముక్కలు తీసుకుంటే మంచిది. అలాగే జామపండు ముక్కలు, దోసబద్దలు తీసుకున్నా మంచిదే. భోజనానికి అరగంట ముందు గ్లాసు మజ్జిగ, అర స్పూన్‌ అవిసెగింజలు తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది.

ఓట్స్‌
ఓట్స్‌లో బీటా–గ్లూకాన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది కరిగే ఫైబర్, ఇది కడుపు పనితీరును ప్రోత్సహిస్తుంది. ఓట్స్‌ ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో కూడా సహాయపడతాయి. ఓట్స్‌ పేగుల పనితీరును ప్రోత్సహించడంలో, మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో మలబద్ధకం సమస్య త్వరగా తగ్గుతుంది.

నెయ్యి
నెయ్యికి ఉండే.. సహజమైన జిడ్డు తత్త్వం పేగుల కదలికలను వేగవంతం చేస్తుంది. రోజూ ఆహారంలో నెయ్యి వేసుకని తింటే మలబద్ధకం నుంచి విముక్తి పొందచ్చు. జామపండ్లు, దోసకాయ, కాకరకాయ, చిక్కుళ్లు మలబద్ధకాన్ని నివారించడంలో ముందుంటాయి కాబట్టి అవి ఆహారంలో ఉండేలా చూసుకుంటే మంచిది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement