సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే లక్ష్మీ సమేతుడై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం, ఇక్కడ రత్నగిరి పై పంపానదీ తీరాన 128 సంవత్సరాల క్రితం వెలసిన భక్తవరదుడు శ్రీ వీర వేంకటసత్యనారాయణ స్వామి. లక్ష్మీదేవి అంశ అయిన శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుడు ఒకే పానపట్టంపై దర్శనమిచ్చి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా సత్యదేవుని ఖ్యాతి జగద్విదితం. శివ కేశవులకు భేదం లేదని తెలిపే విధంగా విష్ణుమూర్తి శివుడు, శక్తి స్వరూపం అనంతలక్ష్మీ అమ్మవారు పక్కపక్కనే దర్శనమివ్వడం ఇక్కడ విశేషం.
14 నుంచి స్వామివారి దివ్యకల్యాణమహోత్సవాలు
శ్రీ సత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవాలు వైశాఖ శుద్ధ దశమి అనగా మే14 వ తేదీ నుంచి వైశాఖ బహుళ పాడ్యమి 19వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. వైశాఖ శుద్ధ ఏకాదశి, మే 15 రాత్రి తొమ్మిది గంటల నుంచి 11–30 గంటల వరకూ స్వామివారి దివ్య కల్యాణమహోత్సవం ఘనంగా జరుగనుంది. స్వామివారి కల్యాణమహోత్సవం అనంతరం భక్తులకు స్వామివారి తలంబ్రాలు, ప్రసాదాలను కూడా పంపిణీ చే యనున్నారు.ఈసారి స్వామి కల్యాణమహోత్సవాలు ఏడు రోజులకు బదులు ఆరు రోజులు మాత్రమే జరుగుతాయని అధికారులు తెలిపారు.
వైశాఖ శుద్ధద్వాదశి, త్రయోదశి రెండు తిథులు ఒకే రోజు వచ్చినందున ఆ రెండు రోజుల కార్యక్రమాలు ద్వాదశినే నిర్వహిస్తున్నారు.భద్రాద్రి రాముని కల్యాణం తరువాత తెలుగు రాష్ట్రాలలో అంత ప్రాముఖ్యత కలిగిన వేడుక రత్నగిరి శ్రీసత్యదేవుని దివ్యకల్యాణం. ఈ వేడుకకి పెళ్లి పెద్దలుగా శ్రీసీతారాములే వ్యవహరిస్తారు. అన్నవరం క్షేత్రానికి క్షేత్రపాలకునిగా శ్రీరాముడు పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. ఆ హోదాలో ఆ వేడుకలకు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు.
15 నుంచి ‘పంచహారతుల సేవ’
ఈ కల్యాణమహోత్సవాల వేడుకల్లో భాగంగా శ్రీసత్యదేవుడు, అమ్మవారికి నూతనంగా ‘పంచ హారతుల సేవ’ను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం ఈఓ ఎంవీ సురేష్ బాబు తెలిపారు. ఈ సేవకు పెద్దాపురానికి లలితాబ్రాండ్ రైస్ కంపెనీ అధినేతలు మట్టే సత్యప్రసాద్, శ్రీనివాస్ సోదరులు సుమారు 12కిలోల వెండితో చేయించిన ఎనిమిది రకాల ఆకృతులతో వెండిహారతి సామాగ్రి విరాళంగా అందచేస్తున్నారని తెలిపారు. రోజూ రాత్రి ఏడు గంటల నుంచి అర్ధగంట సేపు ఈ సేవ స్వామివారి ప్రధానాలయంలో నిర్వహిస్తారు. రూ.500 టికెట్‌తో రోజూ 20 దంపతులను మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతిస్తారు.
మే 14, వైశాఖ శుద్ధ దశమి మంగళవారం
సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి దేవాలయ ప్రాంగణంలోని అనివేటి మండపంలో శ్రీసత్యదేవుడు, అమ్మవారిని వధూవరులను చేస్తారు. అనంతరం రామారాయ కళావేదిక మీద స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు.
15, వైశాఖ శుద్ధ ఏకాదశి, బుధవారం
రాత్రి తొమ్మిది నుంచి 11–30 గంటల వరకూ కల్యాణవేదిక మీద స్వామి, అమ్మవార్లకు దివ్యకల్యాణమహోత్సవం నిర్వహిస్తారు. 16, వైశాఖ శుద్ధ ద్వాదశి, త్రయోదశి, గురువారం
ప్రధాన స్థాలీపాక హోమాలు, రాత్రి ఏడు గంటలకు అరుంధతి దర్శనం, అనంతరం స్వామి అమ్మవార్లను రాత్రి తొమ్మిది గంటల నుంచి రావణవాహనం మీద, పొన్నవాహనం మీద స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు.
17, వైశాఖశుద్ధ చతుర్దశి, శుక్రవారం
మధ్యాహ్నం 2–30కు అనివేటి మండపంలో పండిత సదస్యం, సాయంత్రం ఐదు గంటలకు కొండదిగువన దేవస్థానం గార్డెన్స్‌లో శ్రీవారి వనవిహారం.
18, వైశాఖ శుద్ధ్ద పౌర్ణమి, శనివారం
ఉదయం 8–30 గంటలకు పంపానదిలో నిర్మించిన పుష్కరిణిలో స్వామివారి ‘శ్రీచక్రస్నానం’. సాయంత్రం 4 గంటలకు రత్నగిరిపై అనివేటి మండపంలో నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన.
19, వైశాఖ బహుళ పాడ్యమి, ఆదివారం
రాత్రి ఏడు గంటలకు స్వామివారి నిత్య కల్యాణమండపంలో శ్రీస్వామి, అమ్మవార్లకు శ్రీపుష్పయోగం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి.
నాగఫణిశర్మ అష్టావధానం
ఈసారి శ్రీసత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవాలలో ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ అష్టావధాన కార్యక్రమం 16వ తేదీ సాయంత్రం ఏర్పాటు చేశారు. నాగఫణిశర్మ 14న ఎదుర్కోలు ఉత్సవంలో, 15న స్వామివారి కల్యాణమహోత్సవాలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు.కాగా పంపలో నీరు లేకపోవడంతో తాత్కాలిక పుష్కరిణి నిర్మించారు. ఆ పుష్కరిణికి ఏలేరు జలాలు తరలించడంతో పుష్కరిణి కళకళ లాడుతోంది. ఈ పుష్కరిణి లోనే 18న సత్యదేవుని చక్రస్నాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
అనిశెట్టి వేంకట రామకృష్ణ
సాక్షి, అన్నవరం,
Comments
Please login to add a commentAdd a comment