పెళ్లయి ఐదేళ్లయినా పిల్లల్లేరు... కారణాలు ఏమై ఉంటాయి?
నా వయసు 34 ఏళ్లు. నా భార్య వయసు 31 ఏళ్లు. మాకు పెళ్లయి ఐదేళ్లయ్యింది. మూడేళ్లుగా మేము ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులనూ పాటించడం లేదు. అయినా సంతానం లేదు. కారణం ఏమై ఉంటుంది? దయచేసి వివరంగా తెలియజేయండి. – డేవిడ్, నకిరేకల్
పూర్తి ఆరోగ్యవంతులైనప్పటికీ కొందరు దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఇందుకు కారణాలను కనుగొనడానికి దంపతులిద్దరికీ విడివిడిగా కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. మహిళల్లో సంతానలేమికి దారితీసే పరిస్థితులను గుర్తించడానికి ప్రాథమిక పరీక్షగా అండాల విడుదలను పరిశీలిస్తారు. ఇందుకోసం గర్భాశయానికి అల్ట్రాసౌండ్ టెస్ట్, ట్యూబ్ టీబీ, హార్మోన్ పరీక్షలు చేస్తారు.
ఈ పరీక్షల ఫలితాలపై ఆధారపడి, చికిత్సను ప్రారంభించడానికి ముందుగా మరికొన్ని పరీక్షలు చేయాల్సి రావచ్చు. వాటిలో కొన్ని ఎ.ఎమ్.హెచ్, రుబెల్లా 1జీజీ ఎఫ్.టి.3, ఎఫ్.టి.4, బ్లడ్ షుగర్ టెస్ట్, ప్రొలాక్టిన్ టెస్ట్‌లు. అదే సమయంలో పురుషుడి విషయానికి వస్తే... అతడికి వీర్యకణాల పరీక్ష చేయించాల్సి ఉంటుంది. సెమన్ అనాలసిస్ పరీక్షలో పురుష బీజకణాలు తక్కువగా ఉండటం, వాటి రూపంలో లోపం, వాటి కదలికలు సరిపడనంతగా లేకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు ఏమైనా బయటపడితే మరికొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
వాటిలో కొన్ని... అడ్వాన్స్‌డ్ స్పెర్మ్ అనాలిసిస్, టెస్టిక్యులార్ బయాప్సీ, జనెటిక్ టెస్ట్, స్క్రోటల్ అల్ట్రాసౌండ్, కేర్యోటైప్ టెస్ట్ వంటివి. మొదట ప్రాథమిక పరీక్షలు, ఆ తర్వాత దంపతులకు అవసరమైన కొన్ని అడ్వాన్స్‌డ్ పరీక్షలు నిర్వహించి, వారు సంతానాన్ని పొందడానికి ఏయే లోపాలను సరిదిద్దాలో దానికి అనుగుణంగా చికిత్సను చేయాల్సి ఉంటుంది.
శుక్రకణాలు లేవంటున్నారు... పరిష్కారం ఏమైనా ఉందా?
నా వయసు 32. నేను, నా భార్య సంతానం కోసం నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ఇద్దరమూ వైద్యపరీక్షలు కూడా చేయించుకున్నాం. అందులో... నా భార్యకు అంతా మామూలుగానే ఉందని డాక్టర్లు చెప్పారు. అయితే నా వీర్యంలో శుక్రకణాలు లేవని వారు అంటున్నారు. మాకు సంతానం కలిగే మార్గం లేదా? దయచేసి తగిన సలహా ఇవ్వండి. – ఒక సోదరుడు, హైదరాబాద్
మీరు మరోమారు వీర్య పరీక్ష చేయించండి. ఈసారి ఫలితాల్లోనూ మీకు శుక్రకణాలు లేవని తెలిస్తే, అందుకు కారణాలు తెలుసుకోవాలి. దీనికి మీ ఎండోక్రైన్ గ్రంథుల వ్యవస్థ సక్రమంగా లేకపోవడమా, వృషణాల పనితీరు సరిగా లేకపోవడమా లేక నాళంలో ఏవైనా అడ్డంకుల వల్లనా అన్నది మొదట తెలుసుకోవాలి. ఒకవేళ మీ చిన్నతనంలో వృషణం కడుపులోనే ఉండిపోయి, కిందికి జారకపోవడం (అన్‌డిసెండెడ్ టెస్టిస్) జరిగిందా లేదా మీకు చిన్నప్పుడు జననావయవాల దగ్గర ఏ కారణంగానైనా సర్జరీ జరిగిందా అన్న విషయాలను మీరు డాక్టర్లకు తెలపాలి.
మీలో వేరికోసీల్ వంటి సమస్య ఏదైనా ఉందేమోనని కూడా చూడాల్సి రావచ్చు. అలాగే మీకు కొన్ని రక్తపరీక్షలూ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలూ చేయించాల్సి రావచ్చు. మీకు జన్యుపరమైన సమస్యలు ఏవైనా ఉన్నట్లు తేలితే, అప్పుడు జెనెటిసిస్ట్ కౌన్సెలింగ్ కూడా అవసరం కావచ్చు. ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి ఆ తర్వాత వీర్యసేకరణ కోసం అవసరాన్ని బట్టి పలు ప్రక్రియలను అవలంబించాల్సి వస్తుంటుంది.
అలా వీర్యసేకరణ జరిపాక, అందులోని శుక్రకణాలను ఉపయోగించి ఐసీఎస్‌ఐ (ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) అనే ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో శుక్రకణాన్ని, మీ భార్య అండంలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇలా మీరు తండ్రి అయ్యే అవకాశం ఉంది. మీ దంపతులిద్దరూ మరోసారి ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించండి.
పీసీఓఎస్ సమస్య ఉందంటున్నారు... పిల్లలు పుడతారా?
నా వయసు 28 ఏళ్లు. నాకు పెళ్లయి ఐదేళ్లు అవుతోంది. గత మూడేళ్లుగా పిల్లలు కావాలని కోరుకుంటున్నాను. అయితే నాకు పీరియడ్స్ నాలుగైదు నెలలకొకసారి వస్తున్నాయి. డాక్టర్‌ను కలిశాను. పాలీసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని చెప్పారు. నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? – ఒక సోదరి, విశాఖపట్నం
మీకు పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ సమస్య ఉందంటున్నారు కాబట్టి రుతుస్రావం క్రమంగా రాకపోవచ్చు. దాంతో మీలో ఉత్పత్తి అయ్యే అండాల సంఖ్య కూడా బాగా తగ్గవచ్చు. దాంతో మీలో గర్భధారణకు చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది. మీరు ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే... మీరు ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉంటే వ్యాయామాలతో దాన్ని క్రమంగా తగ్గించుకోవాలి. దాంతో మీకు రుతుక్రమం సక్రమంగా రావడం మొదలవుతుంది.
ఇక మీ ఆహారం లో తాజా ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. జంక్‌ఫుడ్‌ను అవాయిడ్ చేయండి. ఈరోజుల్లో మీలో అండం ఉత్పత్తి అయ్యేలా చేసేందుకు మంచి వైద్యప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. మొదట టాబ్లెట్స్‌తో ప్రారంభించి, చికిత్సకు మీరు స్పందిస్తున్న తీరు ఆధారంగా క్రమంగా మీకు గొనాడోట్రాపిన్ ఇంజెక్షన్ ఇవ్వడం వంటివి చేస్తాం. లేదా మందులూ, గొనాడోట్రాపిన్ ఇంజెక్షన్ కలిపి కాంబినేషన్లలో కూడా ఇచ్చే అవకాశం ఉంది.
చాలామంది చాలా ప్రాథమిక చికిత్సకే బాగా స్పందిస్తారు. మంచి ఫలితాలు వస్తాయి. అప్పటికీ ఫలితం కనిపించకపోతే లాపరోస్కోపిక్ ప్రక్రియ ద్వారా ఒవేరియర్ డ్రిల్లింగ్ చేస్తాం. ఐవీఎఫ్ అనే అధునాతన చికిత్స చాలా కొద్దిమందికి మాత్రమే అవసరమవుతుంది. మీరు అప్పుడే అంత నిరాశపడాల్సిన అవసరం లేదు. మీకు పిల్లలు పుట్టేందుకు చాలా అవకాశాలే ఉన్నాయి. ఇక మీకు పీసీఓఎస్ ఉందంటే దీంతోపాటు దీర్ఘకాలంలో డయాబెటిస్, యుటెరైన్ క్యాన్సర్, గుండె సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మొదట మీరు మీ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోండి. దాంతో సమస్యలు వాటంతట అవే చక్కబడతాయి.
- డాక్టర్ లక్ష్మీ కృష్ణలీల ,సీనియర్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్, ,యశోద మదర్ అండ్ ఛైల్డ్ ఇన్‌స్టిట్యూట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment