నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా?
నా వయసు 26 ఏళ్లు. నాకు పెళ్లయి ఐదేళ్లు అవుతోంది. మా దంపతులం గత మూడున్నర ఏళ్లుగా పిల్లలు కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే నాకు పీరియడ్స్ నాలుగైదు నెలలకొకరాసారి వస్తున్నాయి. డాక్టర్‌ను కలిశాను. స్కానింగ్ తీసి పాలీసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని చెప్పారు. నాకు ఎప్పటికైనా పిల్లలు పుడతారా? – సోదరి, హైదరాబాద్
మీకు పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ సమస్య ఉంది కాబట్టి ఇలా రుతుస్రావం క్రమంగా రాదు. దాంతో మీలో అండాలు ఉత్పత్తి అయ్యే సంఖ్య కూడా బాగా తగ్గుతంది. ఫలితంగా మీలో గర్భధారణకు చాలా టైమ్ పట్టవచ్చు. మీరు ఒకవేళ చాలా ఎక్కువ బరువు ఉంటే దాన్ని క్రమంగా తగ్గించుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చేసుకోండి. ఇదే జరిగితే...మీలో రుతుస్రావం క్రమబద్ధంగా రావడం మొదలవుతుంది. ఇక మీ ఆహారం ముదురాకుపచ్చటి తాజా ఆకుకూరలు చాలా ఎక్కువగా ఉండేలా చూసుకోండి. జంక్‌ఫుడ్‌ను పూర్తిగా మానేయండి.
ఈరోజుల్లో మీలో అండం ఉత్పత్తి అయ్యేలా చేసేందుకు చాలా మంది మందులు, వైద్యప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. మొదట టాబ్లెట్స్‌తో ప్రారంభించి, చికిత్సకు మీరు స్పందిస్తున్న తీరు ఆధారంగా క్రమంగా మీకు గొనాడోట్రాపిన్ ఇంజక్షెన్ ఇవ్వడం వంటివి చేస్తాం. లేదా మందులూ, గొనాడోట్రాపిన్ ఇంజెక్షన్ కలిపి కాంబినేషన్లలో కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీలాంటి వారిలో చాలామంది చాలా ప్రాథమిక చికిత్సకే బాగా స్పందిస్తారు. మంచి ఫలితాలు వస్తాయి. అప్పటికీ ఫలితం కనిపించకపోతే లాపరోస్కోపిక్ ప్రక్రియ ద్వారా ఒవేరియర్ డ్రిల్లింగ్ చేస్తాం.
ఐవీఎఫ్ అనే అధునాతన చికిత్స చాలా కొద్దిమందికి మాత్రమే అవసరమవుతుంది. మీరు అప్పుడే అంత నిరాశపడాల్సిన అవసరం లేదు. మీకు పిల్లలు పుట్టేందుకు చాలా అవకాశాలే ఉన్నాయి. ఇక మీకు పీసీఓఎస్ ఉందంటే దీంతోపాటు దీర్ఘకాలంలో డయాబెటిస్, యుటెరైన్ క్యాన్సర్, గుండెసమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మొదట మీరు మీ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోండి. మీరు సరైన చికిత్స తీసుకుంటూ క్రమబద్ధంగా రుతుస్రావం జరిగేలా చూసుకుంటే చాలా సమస్యలు వాటంతట అవే చక్కబడతాయి.
ఒవేరియన్ రిజర్వ్ తగ్గడం అంటే?
నా వయసు 38 ఏళ్లు. నా భర్తకు 39 ఏళ్లు. మా ఇద్దరిదీ లేట్ మ్యారేజీ. పెళ్లయిన నాటి నుంచీ సంతానం కోసం ప్రయత్నిస్తున్నాం. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాం. ఆమె కొన్ని పరీక్షలు చేసి నా అండాశయాల రిజర్వ్ (ఒవేరియన్ రిజర్వ్) తక్కువగా ఉందని అన్నారు. అంటే ఏమిటి? నాకు పిల్లలు పుడతారా? – ఓ సోదరి, నిడదవోలు
ఒవేరియస్ రిజర్వ్ అంటే అండాశయం నుంచి అండాల ఉత్పత్తి తగ్గడం. ఒకే వయసు ఉన్న ఇద్దరు మహిళలకు ఒవేరియన్ రిజర్వ్ అనేది వేర్వేరుగా ఉంటుంది. ఇది పుట్టుకతో వచ్చే తేడా. ఒవేరియన్ రిజర్వ్ కాస్త ఎక్కువగా ఉన్న మహిళలకు తక్కువ మందులతోనే అండాలు ఉత్పత్తి అవుతాయి. ఒవేరియన్ రిజర్వ్ తక్కువగా ఉన్న స్త్రీలకు అండాల ఉత్పత్తి ఆశించినంతగా ఉండదు. పరిమాణం, నాణ్యత (క్వాంటిటీ అండ్ క్వాలిటీ) కూడా తక్కువే.
ఒవేరియన్ రిజర్వ్ కొందరిలో తక్కువగా ఉంటుంది. మరికొందరికి పొగతాగడం, మద్యపానం వల్ల తగ్గుతుంది. క్యాన్సర్‌కు సంబంధించిన మందుల (కీమోథెరపీ)తోనూ, కొన్ని సందర్భాల్లో ఓవరీకి సంబంధించిన శస్త్రచికిత్సలతో కూడా ఒవేరియన్ రిజర్వ్ తగ్గుతుంది. ఒవేరియన్ రిజర్వ్ 30 ఏళ్ల వయసు వరకు బాగా ఉంటుంది. దాని తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తుంది. 33 – 35 ఏళ్ల వయసు వచ్చే వరకు చికిత్సతో దీన్ని సరిచేసుకోవచ్చు. అదే 37– 39 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఒవేరియన్ రిజర్వ్ బాగా తగ్గుతుంది. మందుల మోతాదు కూడా ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. చివరగా మందులు పనిచేయలేని దశలో ఎగ్ డోనర్ ద్వారా చికిత్స అందించవచ్చు.
- డాక్టర్ రత్న దూర్వాసుల, సీనియర్ ఇన్‌ఫెర్టిలిటీ కన్సల్టెంట్, బర్త్ రైట్ బై రెయిన్‌బో, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment