కేరళ పండగ సంబరానికి వెళ్లొద్దాం...
మహాబలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళవాసులు సంబరం జరుపుకొనే పండగే ఓనమ్. కేరళ ఘనమైన సంస్కృతీ వారసత్వంగా ఈ పండగను పదిరోజుల పాటు జరుపుతారు. సెప్టెంబర్ 10 వరకు జరిగే ఈ పండగ విశేషాలను తిలకించడానికి విదేశీ పర్యాటకులు సైతం కేరళ చేరుకుంటారు. ఇక్కడ నృత్యాలు, విందుభోజనాలు, పులివేషాలు, ప్రాచీన విద్యలు-ఆటలు, పడవ పందేలు కన్నులపండువగా జరుగుతాయి.
వారం రోజులు వేడుకగా..
కేరళ పర్యాటక సంస్థ ఓనమ్ పండగ సందర్భంగా రాష్ట్రరాజధాని అయిన త్రివేండ్రానికి దగ్గరలోని కోవళం గ్రామంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతోంది. దీంట్లో భాగంగా నాటకాలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళలు, ఆహార శాలలు, హస్తకళల కేంద్రాలకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంట్లో చివరి రోజున అలంకరించిన గజరాజుల విన్యాసాలు ఉంటాయి.
విందు భోజనం..
సాంప్రదాయిక కేరళ భోజనం తొమ్మిది రకాల వంటకాలతో నోరూరిస్తుంది. దీనిని ‘వన సద్య’ అంటారు. అదనంగా మరో పదకొండు రుచులను అరిటాకుల మీద వడ్డించడానికి కేరళ రెస్టారెంట్లు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 7న (తిరు ఓనమ్) కేరళలోని అన్ని రెస్టారెంట్లలోనూ విందుభోజనాలు ఉంటాయి.
స్నేక్ బోట్ రేస్...
ఓనమ్ పండగలో ప్రధాన ఆకర్షణ స్నేక్ బోట్ రేస్. అరన్‌ముల బోట్ రేస్ పార్థసారధి దేవాలయం దగ్గర పంపానదిలో సెప్టెంబర్ 10న జరుగుతుంది.
పులి వేషాలు...
శాస్త్రీయ వాద్యపరికరాలను వాయిస్తుండగా పులి వేషాలు కట్టిన వారు ఆ చప్పుళ్లకు నృత్యాలు చేయడమనే ఆచారం ఈ పండగకు మరో ఆకర్షణ. దీనిని ‘పులిక్కలి’ అంటారు. భారతదేశంలోనే అతి ప్రాచీన వేడుకగా దీనికి పేరుంది. సరైన పులివేషధారికి బహుమతులు కూడా ఉంటాయి. త్రిసూర్‌లో ఈ వేడుకలు సెప్టెంబర్ 9న ఘనంగా జరుగుతాయి.
తిరువనంతపురంలో జరిగే బాణాసంచా వేడుక ఆ ప్రాంతాన్ని అద్భుత లోకంగా మార్చివేస్తుంది. కొత్త దుస్తులు, సంప్రదాయ వంటలు, నృత్యం, సంగీతాలతో రాష్ట్రమంతటా పాటించే ఆచారాలు ఈ వ్యవసాయ పండగకు చిహ్నాలు.
ఇలా చేరుకోవచ్చు:
త్రిసూర్ మధ్య కేరళ ప్రాంతంలో ఉంటుంది. కొచ్చి నుంచి రెండు గంటల ప్రయాణం. రైలు, బస్సు ద్వారా చేరుకోవచ్చు. స్వరాజ్ రౌండ్/త్రిస్సూర్ రౌండ్ అని ఇక్కడి ప్రాంతాలకు స్థానిక పేర్లు ఉన్నాయి.
వసతి: ఇక్కడ బస చేయడానికి పేరొందిన చిన్నా, పెద్ద హోటల్స్ ఉన్నాయి.
కేరళ టూర్ ప్యాకేజీ 5 రాత్రుళ్లు/6 పగళ్లు
దేశంలో ఏ ప్రాంతం నుంచైనా కొచ్చిన్ చేరుకోవాలి. కొచ్చిన్‌లో విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్‌లు ఉన్నాయి. కొచ్చిన్ నుంచి మున్నార్, తేక్కడి, కుమరకోమ్, అలెప్పీ సందర్శన. ఎ.సి హౌజ్‌బోట్‌లో షికార్లు. డబల్‌రూమ్ వసతి+ అల్పాహారం+రాత్రి భోజనం, కారులో చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాల సందర్శన. మున్నార్‌లో మిస్టీ మౌంటేయిన్, తేక్కడిలో అరణ్యా నివాస్, కుమరకోమ్‌లో వాటర్‌స్కేప్స్ రిసార్ట్, అలెప్పీలో ఎ.సి డీలక్స్ హౌజ్‌బోట్‌లో వసతి సదుపాయాలు.
ఈ మొత్తం ప్యాకేజీ రూ.34,000/- మరిన్ని వివరాలకు: కేరళ టూరిజమ్ పార్క్ వ్యూ, తిరువనంతపురం
టోల్ ఫ్రీ నెం. 1-800-425-4747
ఫోన్: +4712321132