
ప్రతీకాత్మక చిత్రం
‘‘మొదటిసారి ఫోన్ మాట్లాడుతూ ‘దొరికితే’ పంచాయతీ విధించిన జరిమానా చెల్లించాలి.
రెండవసారి దొరికితే మాత్రం నలుగురిలో సిగ్గుతో తలదించుకొని ఏ శిక్షకైనా సిద్ధపడాలి’’
‘‘మహిళల రక్షణ కోసమే మేమీ నిర్ణయం తీసుకున్నాం. వాళ్లు ఫోన్లో మాట్లాడటం వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి’’ అంటున్నారు షూపూర్ జిల్లాలోని సహారియా గిరిజన తెగ పెద్దలు!
మధ్యప్రదేశ్‌లోని షూపూర్ జిల్లాలో సహారియా తెగకు చెందినవి 27 గ్రామాలున్నాయి. ఈ తెగకు ఒచా గ్రామ పంచాయతీగా ఉంది. ఈ పంచాయతీ భోపాల్‌కి 400 కిలోమీటర్ల దూరం ఉండగా, సరిహద్దు రాష్ట్రం రాజస్థాన్. ఒచా గ్రామ పంచాయతీలోని 27 గ్రామాలలోని మహిళలు ఎవరైనా మొబైల్ ఫోన్లలో మాట్లాడుతున్నట్టు పంచాయతీకి తెలిస్తే శిక్షలు విధిస్తారు! అయితే అవి ఎలాంటి శిక్షలో ముందుగా చెప్పరు. ‘‘మొదటిసారి ఫోన్ మాట్లాడుతూ ‘దొరికితే’ పంచాయతీ విధించిన జరిమానా చెల్లించాలి. రెండవసారి దొరికితే మాత్రం నలుగురిలో సిగ్గుతో తలదించుకొని ఏ శిక్షకైనా సిద్ధపడాలి’’ అంటాడు రస్వరప్ అనే ఆదివాసి. ఇతను ఒచా గ్రామ పెద్ద.
ఇక బైస్‌రామ్ అనే మరో ఆదివాసి పెద్ద ఏమంటున్నారో వినండి. ‘‘మా సహారియా తెగ అమ్మాయిలు బయటి వారితో మాట్లాడటం, వాళ్లను పెళ్లి చేసుకోవడం జరుగుతోంది. బయటి వారు మా తెగలోకి రావడం వల్ల మా భూముల మీద హక్కులు మేం కోల్పోయే పరిస్థితి వస్తోంది. అందుకే మా తెగ కాని వారిని పెళ్లి చేసుకోనివ్వకూడదని మేమీ నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఆ కుటుంబం పంచాయతీ విధించిన శిక్షకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది’’ అంటున్నారు బైస్‌రామ్. పంచాయతీ పెద్దలు ఈ విషయం గురించి ఇంకాస్త చెబుతారు. ‘‘కావాలంటే మహిళలు ఫోన్లో మా ముందు ఎవరితోనైనా మాట్లాడచ్చు. మమ్మల్ని దాటి మాత్రం ఎవరూ మాట్లాడకూడదు’’ అని నిషేధాజ్ఞలు విధించారట! షూపూర్ కలెక్టర్ పి.ఎల్.సోలంకి ఈ విషయంపై స్పందించడానికి పెద్దగా ఏమీ లేనట్లుంది! ‘‘నాకూ ఈమధ్యే తెలిసింది. మహిళల్ని ఫోన్‌ల నుంచి దూరం చెయ్యడం సరికాదు. అయితే, అక్కడ ఎవరూ ఈ నిషేధాన్ని తప్పు పట్టడం లేదు. గిరిజనుల్లో అవగాహన ఏర్పడటానికి ప్రయత్నిస్తున్నాం’ అని మాత్రం అంటున్నారు!
–ఎన్.ఆర్
Comments
Please login to add a commentAdd a comment