ఫిక్సింగ్ వనంలో...మిస్టర్ ‘క్లీన్’
క్రికెట్‌లో ఫిక్సింగ్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది పాకిస్థాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ నుంచి స్పాట్‌ఫిక్సింగ్ దాకా అన్ని రకాల అక్రమాల్లోనూ పాక్ క్రికెటర్లే అగ్రగణ్యులు. ఫిక్సింగ్‌కు పాల్పడి జరిమానాలకు గురైన వారు, నిషేధం ఎదుర్కొన్న వారు, చివరికి జైలు శిక్షలు కూడా అనుభవించిన వారు ఆ దేశ క్రికెటర్లలో ఉన్నారు. సలీం మాలిక్‌ను మొదలుకొని నిన్న మొన్నటి మహ్మద్ ఆమిర్, సల్మాన్ భట్, ఆసిఫ్‌ల దాకా పాక్ క్రికెటర్ల వ్యవహారం తెలిసిన విషయమే.
ఆ స్థాయిలో మలినమైన పాకిస్థాన్ క్రికెట్‌లో... గంజాయి వనంలో తులసి మొక్కలా నిలిచాడు ఆ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్. 1992-2003 మధ్య కాలంలో పాక్ జట్టు తరపున 37 టెస్టులు, 166 వన్డేలు ఆడిన లతీఫ్.. 6 టెస్టులు, 25 వన్డేల్లో జట్టుకు సారథ్యం కూడా వహించాడు. అయితే తాను ఆడుతున్న రోజుల్లోనే క్రికెటర్ల ‘లాలూచీ’లను పసిగట్టిన లతీఫ్ ఆనాడే వాటి గురించి వ్యాఖ్యానించాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక పాక్ క్రికెటర్ల ఫిక్సింగ్ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ వస్తున్నాడు.
అంతేకాదు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు చీఫ్ ప్యాట్రన్‌గా ఆ దేశాధ్యక్షుడు జర్దారీ ప్రకటించుకోవడాన్ని లతీఫ్ తప్పుబట్టాడు. ఈ విషయంపై కోర్టునూ ఆశ్రయించాడు. ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన మాజీ లెగ్‌స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్‌ను జాతీయ క్రికెట్ అకాడమీలో పదవికి ఎంపిక చేయడంపైనా కోర్టుకెళ్లాడు. ఆటగాళ్ల ఫిక్సింగ్ వ్యవహారంపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశాడు. లతీఫ్ వ్యవహారశైలిపై పీసీబీకి ఆగ్రహం కలిగినా.. అతని ఆరోపణల్లో నిజముండడంతో కిమ్మనలేకపోయింది.
సొంతంగా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసి యువ క్రికెటర్లకు శిక్షణనిస్తూ పీసీబీ నుంచి ఎటువంటి పదవులూ ఆశించకుండా నిజాయితీగా నిలబడ్డాడు. లతీఫ్‌లోని నిజాయితీని గమనించిన పీసీబీ.. చివరికి అతనికి వర్ధమాన క్రికెటర్లు ఫిక్సింగ్ వంటి అడ్డదారులు తొక్కకుండా చైతన్య పరిచే బాధ్యతను అప్పగించింది. తన పని తాను చేస్తూనే అక్రమాలపై ఎలుగెత్తడం మాత్రం లతీఫ్ మానలేదు. దీంతో కొద్ది కాలానికే తన పదవిని కోల్పోవాల్సివచ్చింది.
మళ్లీ తాజాగా లతీఫ్‌కు జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి చేపట్టాల్సిందిగా ఆహ్వానం అందింది. అయితే దీనిని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఫిక్సింగ్‌కు ఆరోపణలున్నవారు, అవినీతిలో కూరుకుపోయినవారు పీసీబీలో, సెలక్షన్ కమిటీలో ఉన్నారని, అటువంటి వారితో కలిసి తాను పనిచేయబోనని లతీఫ్ కుండబద్దలు కొట్టారు. నిత్యం వివాదాల్లో ఉండే పాకిస్థాన్ క్రికెట్‌లో మచ్చలేని వ్యక్తిగా నిలిచిన లతీఫ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.