కష్టాలే క్రెడిట్‌లు | Flares community | Sakshi
Sakshi News home page

కష్టాలే క్రెడిట్‌లు

Published Mon, Apr 20 2015 10:59 PM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

కష్టాలే క్రెడిట్‌లు

కష్టాలే క్రెడిట్‌లు

మిణుగురులు
సమాజానికి దివిటీలు

 
తంగిరాల శారద హైదరాబాద్ ఆబిడ్స్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ఈ నెలాఖరులో విధుల నుంచి విరమణ పొందనున్నారు. ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు శారదను చూస్తే అసలేమాత్రం ఆమె అంధురాలనిపించరు! మరి ఇన్నేళ్లుగా ఉద్యోగినిగా కొనసాగుతూ బ్యాంకు అధికారులు, సహోద్యోగుల మన్ననలు పొందడం శారదకు ఎలా సాధ్యమైంది?! ఆమె మాటల్లోనే
 తెలుసుకుందాం.
 
‘‘పాతికేళ్ల క్రితం కంట్లో పిగ్మెంటేషన్ మొదలైంది. ‘చూపు ఎన్నాళ్లుంటుందో చెప్పలేం’అన్నారు డాక్టర్. మసక చూపుతో పనిలో తప్పులు దొర్లితే నాకు చెడ్డపేరు రావడం అంటుంచి, బ్యాంకు పరువు ఏం కానూ? అందుకే... మూడు నెలల పాటు ఎలాంటి వివరణా ఇవ్వకుండానే ఉద్యోగం మానేశాను. కానీ, ఇల్లు గడవడం చాలా కష్టమయ్యేది. నా భర్త ఒక్కరే ఉద్యోగం చేస్తే గడిచేలా లేని జీవితం. మళ్లీ ఉద్యోగం చెయ్యడం తప్పలేదు. అదృష్టవశాత్తూ, అధికారులు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయలేదు. చేస్తున్న ఉద్యోగాన్నే కంటిన్యూ చెయ్యమన్నారు.

ఎప్పుడు ఊపిరి తీసుకున్నానో తెలీదు!

పెళ్లికి ముందే నాకు ఎస్.బి.హెచ్‌లో (ఖమ్మంలో) టైపిస్టుగా ఉద్యోగం వచ్చింది. మావారు ఉద్యోగరీత్యా ముంబయ్‌కు ట్రాన్స్‌ఫర్ కావడంతో నేనూ వెళ్లక తప్పలేదు. ముంబయ్‌లో కాపురం. ఉండేది ఐదో అంతస్తులో. ఉదయం తొమ్మిది గంటలకు బ్యాంకుకు బయల్దేరితే, తిరిగి ఇంటికి చేరేది రాత్రి తొమ్మిది గంటలకే. నేను వచ్చిన గంటకు మా వారు డ్యూటీకెళ్లేవారు. అర్ధరాత్రి నీళ్లు వచ్చేవి. ఈ మధ్యలో పిల్లవాడి బాగోగులు. తిరిగి మూడు గంటలకు లేచి, రెడీ అయితే తప్ప సమయానికి ఆఫీస్‌కు చేరుకునేదాన్ని కాదు. ఆ పదిహేనేళ్లు ఎప్పుడు ఊపిరి తీసుకున్నానో కూడా తెలియదు. చూపు బాగుండి... మసకబారి...  పూర్తిగా చూపుకోల్పోయే దశలో మావారి ట్రాన్స్‌ఫర్ కారణంగా హైదరాబాద్ చేరుకున్నాను.

సహ సిబ్బంది సహకారం

సీతాఫల్‌మండిలో నివాసం. ఆబిడ్స్‌లో ఉద్యోగం. అక్షరాలు పూర్తిగా కనపడటమే మానేశాయి. ఇక టైపింగ్ పనులు చేయలేను అని నిర్ధారించుకున్నాక డ్యూటీని టెలీఫోన్ ఎక్స్ఛేంజ్‌కి మార్పించుకున్నాను. 1991లో క్లర్క్‌గా ఉన్నవారు టెలీఫోన్ ఆపరేటర్‌గా చేరొచ్చు అనే ప్రకటన వెలువడింది. దాంతో పూర్తిస్థాయి టెలీఫోన్ ఆపరేటర్‌గా రికార్డుల్లో చేరాను. ఈ క్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది నాకెంతో అండగా నిలిచారు. వారి మేలు మరువలేను.

 పద్నాలుగు రకాల పనులు  

అంధుల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ (జాస్) ఉందని తెలుసుకొని, దానిని నేర్చుకున్నాను. ఆ తర్వాత నాలాగా చూపు లేని వారు చేసుకోదగిన పనులు బ్యాంకులలో ఏమున్నాయో శోధించాను. అలా చూపుతో పనిలేకుండా ‘రిస్క్ ఫ్యాక్టర్’ లేని 14 పనుల గురించి తెలిసింది. వీటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. చూపులేని ఉద్యోగులు దేశమంతటా ఎంతమంది ఉన్నారో తెలుసుకొని, వారందరికీ పెరంబదూర్‌లో నా పర్యవేక్షణలోనే జాస్ శిక్షణ ఇప్పించారు.

పద్దెనిమిదేళ్ల సోదర బంధం

1998 నాటికి... చీకటి పడగానే కళ్లముందు పూర్తిగా కాంతి మాయమయ్యేది. అందుకని, చీకటి పడకుండానే ఇల్లు చేరేదాన్ని. కానీ, ఆ తర్వాత పగలు కూడా అదే స్థితి. ఓ రోజు సయ్యద్ సుల్తాన్ ఆటో ఎక్కాను. నా పరిస్థితి గమనించి, రోజూ నన్ను ఆఫీస్‌లో దిగబెట్టి, తిరిగి ఇంటికి చేర్చే బాధ్యతను ఒప్పుకున్నాడు. ఇప్పటికి 18 ఏళ్లు. నాటి నుంచి నేటివరకు తమ్ముడిలా నాకు రథసారథ్యం వహిస్తూనే ఉన్నాడు (కృతజ్ఞతగా). ఇక మా అబ్బాయి.  ముంబయ్‌లో ఐఐటి చేసి, పెళ్లి చేసుకొని, ఇప్పుడు అమెరికాలో స్థిరపడ్డాడు. ‘అమ్మ చాలా కాన్ఫిడెంట్’ అంటుంటాడు. నవ్వుతూనే ఆ ప్రశంసలు అందుకుంటాను’’... అంటూ తన జీవితం నిండా చోటుచేసుకున్న మలుపులను, వాటిని ఎదుర్కొన్న తీరును వివరించారు శారద. ఉద్యోగినిగానే కాదు కవయిత్రిగానూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు శారద. సంకల్ప బలం ఉంటే చూపులేకపోయినా సాధనతో విజయం సాధించవచ్చు అనేందుకు శారద చక్కని నిదర్శనం.
 
 శారదమ్మే సాయం చేసింది  నాకు మొదట్లో అద్దె ఆటో ఉండేది.  శారదమ్మ ప్రోత్సాహంతో బ్యాంకు లోను తీసుకొని సొంత ఆటో కొనుక్కున్నాను. నాకు ముగ్గురు ఆడబిడ్డలు. ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లకీ శారదమ్మ సాయం చేసింది.
 - సయ్యద్ సుల్తాన్,  ఆటో డ్రైవర్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement