మావోగారి చాంచల్యం
పీచేముడ్
ఎర్రదండు నాయకుడిగా, కమ్యూనిస్టు చైనా పాలకుడిగా జగద్విఖ్యాతుడైన కామ్రేడ్ మావోగారు యవ్వనారంభ దశలో చంచల మనస్కుడై, దిశారహితమైన జీవితాన్ని గడిపాడు. మావో తండ్రి నిరుపేద రైతుగానే జీవితం ప్రారంభించినా, మావో పుట్టే నాటికి అతడు భూస్వామిగా ఎదిగాడు. ఆర్థిక ఇబ్బందుల్లేని వాతావరణంలో పెరిగిన మావో, యవ్వనారంభ దశలో ఎక్కువకాలం అభూత కల్పనలతో నిండిన కథలు చదువుతూ, పగటి కలలు కంటూ బద్ధకంగా కాలక్షేపం చేసేవాడు. అలాంటి రోజుల్లోనే తన తండ్రిని ఒప్పించి కాలేజీలో చేరాడు. కాలేజీలో తనలాంటి కులాసారాయుళ్లను పోగేసుకొని నానా కాలక్షేపం కార్యక్రమాలు సాగించేవాడు. పద్దెనిమిదేళ్ల వయసులో విప్లవ సైన్యంలో చేరాడు. అయితే, అందులో శారీరక శ్రమ తప్పనిసరి కావడంతో, కొద్దిరోజుల్లోనే సైన్యం నుంచి బయటకు వచ్చేశాడు. కాలేజీకి వెళ్లే వయసులో మావో ఏ సబ్జెక్టునూ స్థిరంగా చదువుకోలేదు.
తరచు సబ్జెక్టులు మారేవాడు. కాలేజీలో ఉండగా, పోలీసు అకాడమీ ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నాడు. అందులో చేరక ముందే మనసు మార్చుకుని, సబ్బుల తయారీ కోర్సులో చేరాడు. అందులో పూర్తిగా కొనసాగకుండానే లా స్కూల్‌లో చేరాడు. చివరకు బిజినెస్ స్కూల్‌లో చేరాడు. అందులో బోధన ఇంగ్లిష్‌లో సాగేది. ఇంగ్లిష్ సరిగా రాకపోవడంతో నెల్లాళ్లకే ఆ కోర్సునూ మానేశాడు. కోర్సు నుంచి కోర్సు మారుతూనే మొత్తానికి చదువు పూర్తయిందనిపించుకొని, టీచర్‌గా మారాడు. చదువులో స్థిరం లేకుండా తిరుగుతున్న దశలోనే మావో వామపక్ష బృందాలకు చేరువయ్యాడు. చివరకు తానే ఎర్రదండుకు అధినేతగా ఎదిగాడు.