
అల్లం వెల్లుల్లి గ్రైండర్‌లో ఘుమఘుమ.. జీడిపప్పు కొత్తిమీర బాణలిలో ధుమధుమ చికెన్ ముక్క మటన్ పీసు ఇన్ని రొయ్యలు అన్ని చేపలు కనుమరోజు మసాలా మోతెక్కిపోవాలి. ఈ నాన్‌వెజ్ మీ విస్తళ్లలో రుచుల్ని నింపాలి
నాటుకోడి పులావ్
కావలసినవి: నాటుకోడి ముక్కలు – 200 గ్రాములు; బియ్యం – 150 గ్రాములు; ఉల్లిపాయలు – 2 ; దాల్చిన చెక్క – 2 ముక్కలు; నెయ్యి–డాల్డా – 3 టేబుల్ స్పూన్లు; గరం మసాలా (లవంగాలు, యాలకులు) – టీ స్పూన్; పుదీనా ఆకులు – గప్పెడు; అల్లం –వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; ఉప్పు – తగినంత ; పచ్చిమిర్చి – 3 ; బిర్యానీ ఆకు – 2; కరివేపాకు – రెమ్మ; కొత్తిమీర – టీ స్పూన్
తయారి: మందపాటి గిన్నెలో నెయ్యి–డాల్డా వేసి కాగాక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, గరం మసాలా వేసి వేయించాలి. దీంట్లో నిలువున సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించాలి. తర్వాత పుదీనా వేసి, వేగాక ఉప్పు కలిపి, నీళ్లు పోసి మరిగించాలి. దీంట్లో నాటుకోడి ముక్కలు వేసి ఉడికించాలి. ముక్కలు 50 శాతం ఉడికాక అందులో బియ్యం వేసి కలపాలి. అన్నం ఉడికాక మంట తగ్గించి కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి పూర్తిగా అయ్యాక దించాలి.
నాటుకోడి పులుసు
కావలసినవి: నాటుకోడి ముక్కలు – 200 గ్రాములు; గసగసాలు – 150 గ్రాములు; ఎండుకొబ్బరి – 100 గ్రాములు; పచ్చిమిర్చి – 4; నూనె – 4 టేబుల్ స్పూన్లు; అల్లం –వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు; చింతపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి) ; టొమాటో – 1 (సన్నగా తరగాలి); జీలకర్ర – టీ స్పూన్; పచ్చిమిర్చి – 3; కారం – టీ స్పూన్; ఉప్పు – తగినంత; గరం మసాలా – అర టీ స్పూన్; ధనియాల పొడి – అర టీ స్పూన్; ఎండుకొబ్బరి – 100 గ్రాములు; కొత్తిమీర – టేబుల్ స్పూన్
తయారి: గసగసాలు వేయించి ఎండుకొబ్బరి కలిపి ముద్ద చేసి ఉంచాలి. నాటుకోడి ముక్కలలో అల్లం వెల్లుల్లిపేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలిపి అర గంట పక్కనుంచాలి. గిన్నెలో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, నిలువుగా కోసిన పచ్చిమిర్చి వేసి కలపాలి. దీంట్లో కలిపి ఉంచిన నాటుకోడి ముక్కలను వేసి కలపాలి. కొద్దిగా ఉడికాక కారం, ఉప్పు, గసగసాల మిశ్రమం, చింతపండు గుజ్జు వేసి కలపాలి. ముక్క ఉడికాక మంట తగ్గించి గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర చల్లి 3 నిమిషాలు ఉంచి దించాలి.
గోంగూర మటన్
కావలసినవి: మటన్ ముక్కలు – 250 గ్రాములు; గోంగూర – గుప్పెడు ఆకులు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); ఎండుమిర్చి – 4; వెల్లుల్లి – 2 ; జీలకర్ర, ఆవాలు – టీ స్పూన్; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; కారం – టీ స్పూన్ (తగినంత); ధనియాల పొడి – టీ స్పూన్; గరం మసాలా (లవంగ, యాలకులు, దాల్చినచెక్క వేయించి పొడి చేసిదిన) – టీ స్పూన్; ఎండు కొబ్బరి – అర కప్పు; కొత్తిమీర – టీ స్పూన్
తయారి: మటన్ ముక్కలలో పసుపు వేసి 75 శాతం వరకు ఉడికించాలి. మందపాటి గిన్నెలో నూనె వేసి కాగాక అందులో జీలకర్ర, ఆవాలు, గరం మసాలా వేయించాక ఉల్లిపాయలు వేగనివ్వాలి. దీంట్లో అల్లం–వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, మటన్ ముక్కలు వేసి కలపాలి. ఉప్పు, కారం, గోంగూర వేసి ఉడికించాలి. ధనియాల పొడి వేసి మరికాసేపు ఉంచి చివరగా కొత్తిమీర చల్లి దించాలి.
చేపల పులుసు
కావలసినవి: కొరమీనులు – కేజీ (మీడియమ్ సైజులో ముక్కలు చేయాలి); చింతపండు – పావుకేజీ (నానబెట్టి రసం తీయాలి); టొమాటోలు – పావుకేజీ (నాలుగు ముక్కలుగా కట్ చేయాలి); ఉల్లిపాయలు – పావుకేజీ (పెద్ద ముక్కలుగా కట్ చేయాలి); పచ్చిమిర్చి – 50 గ్రాములు (నీలువుగా చీరాలి); మెంతులు – 2 టీ స్పూన్లు; ఆవాలు – టీ స్పూన్; కారం – తగినంత; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; ఎండుకొబ్బరి – 2 టీ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా; నూనె – తగినంత
తయారి: వెడల్పాటి పాన్‌లో నూనె వేసి కాగాక మెంతులు, ఆవాలు వేయించి ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి కలపాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేగాక సరిపడా కారం, చింతపులుసు, ఉప్పు కలిపి ఉడికించాలి. రసం చిక్కబడ్డాక చేప ముక్కలు వేసి మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి దించాలి. గరిటెతో కలిపితే ముక్కలు విరిగిపోతాయి.
వెల్లుల్లి ఖీమా
కావలసినవి: మటన్ ఖీమీ – పావు కేజీ ; వెల్లుల్లి ముద్ద – 100 గ్రాములు; అల్లం – టీ స్పూన్; పచ్చిమిర్చి – 10; కరివేపాకు – 2 రెమ్మలు; ఉల్లిపాయలు – 1 (సన్నగా తరగాలి); టొమాటో – 1 (సన్నగా తరగాలి); ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు; కారం – అర టీ స్పూన్; జీడిపప్పు ముద్ద – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – టీ స్పూన్
తయారి: ముందు ఖీమాను శుభ్రపరిచి, ఉడికించుకోవాలి. కడాయిలో నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేయించుకోవాలి. తర్వాత టొమాటో వేసి వేయించి అల్లం –వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. బాగా వేగిన తర్వాత ఉడికించిన ఖీమా వేసి కలపాలి. దీంట్లో కారం, ఉప్పు, జీడిపప్పు ముద్ద, ధనియాల పొడి, గరం మసాలా వేసి 5 నిమిషాల ఉంచాలి. తర్వాత నెయ్యి వేసి దించాలి. పైన నేతిలో వేయించిన వెల్లుల్లిని అలంకరించాలి.
Comments
Please login to add a commentAdd a comment