ఆ నేతాజీ కోసం ఓ నేతాజీ | for the Netaji | Sakshi
Sakshi News home page

ఆ నేతాజీ కోసం ఓ నేతాజీ

Published Fri, Jan 23 2015 9:17 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఆ నేతాజీ కోసం  ఓ నేతాజీ - Sakshi

ఆ నేతాజీ కోసం ఓ నేతాజీ

‘సాయుధ సంగ్రామమే న్యాయమని... స్వతంత్ర భరతావని మన స్వర్గమని... ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని... హిందు ఫౌజు జైహిందని నడిచాడు... గగనశిగలకెగసి కనుమరుగై పోయాడు...’ ఇది నేతాజీ జీవిత సారాన్ని నాలుగు మాటలలో అందంగా నింపిన సజీవ సాహిత్యం. జాలాది కలం నుండి జాలువారి తెలుగు జాతి మొత్తాన్ని ఉర్రూతలూగించిన ప్రసిద్ధ సినీ గేయం. భారతావని దాస్య శృంఖలాలను తెంచడానికి నేతాజీ ఎన్నుకున్న సాయుధ సంగ్రామాన్ని గుర్తుకు తెస్తూనే... చివరలో ఆయన అంతర్ధానమైపోయిన విషయాన్ని ఆయన మరణం ఓ మిస్టరీ అన్న భావంతో  కవి  నర్మగర్భంగా వినిపిస్తాడు. జాతి యావత్తు ఆరాధనా భావంతో చూసే అతికొద్దిమంది నేతలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముందు వరుసలో ఉంటారు. భారత జాతిని జాగృతం చేస్తూ జీవించిన ఆ సమరయోధుని మరణం ఇప్పటికీ అంతు తెలియని రహస్యంగా మిగిలిపోయింది. నేతాజీ డెత్ మిస్టరీని ప్రశ్నించిన వారు ఉన్నప్పటికీ, ఇక లాభం లేదనుకుని మౌనం దాల్చిన వారే ఎక్కువమంది.  గత ప్రభుత్వాలు కూడా ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నాలు ముమ్మరం చేయకుండా, నేతాజీ మరణించాడని నమ్మబలుకుతూ కథను కంచికి పంపేశాయన అభిప్రాయం ఉంది. అయితే దానిని అంగీకరించని కొంత మంది ఆయన డెత్ మిస్టరీ వీడాలని ఇప్పటికీ నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ కోవకు చెందిన వారే అనంతపురం జిల్లా వాసి నిమ్మల నేతాజీ. యాదృచ్చికంగా నేతాజీ పేరు కలిగి ఉన్న ఈయన గత పన్నెండేళ్లగా సుభాష్ చంద్రబోస్ మరణం ఎలా సంభవించిందో ప్రభుత్వం చేత చెప్పించడానికి అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీకైతే ఏకంగా ఘాటైన లేఖాస్త్రమే సంధించారు.
 
మిస్టరీ వీడాలి
 
మా సొంతూరు అనంతపురం. చదువైపోగానే   బీజేపిలో చేరాను. అనంత  బీజేపి వ్యవస్థాపనలో నా భాగస్వామ్యమూ ఉంది.  ఇక దేశ రాజకీయాల గురించి నాకు నిశ్చిత అభిప్రాయాలే ఉన్నాయి. ఒకరిద్దరు మినహా చాలామంది రాజకీయ వేత్తలు ప్రజలకు దూరంగా బతికారంటే అతిశయోక్తి కాదు. ప్రజలకు తెలియాల్సిన చాలా విషయాలు రహస్యంగా ఉండిపోయాయని నా భావన. భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌నే తీసుకుంటే ఆయన పోరాట పటిమ నిరుపమానం. దేశభక్తి అనన్యసామాన్యం. అంతటి వ్యక్తి చివరి రోజుల గురించి దేశచరిత్రలో సరైన సమాచారం లేకపోవడం పాలకుల బాధ్యతారాహిత్యం అని నా అభిప్రాయం.       
                                                                                                                    
నేతాజీ 1945 ఆగష్టు 17న చివరిసారి బ్యాంకాక్ విమానాశ్రయం వద్ద కనిపించారని, మరుసటి రోజు ఆయన విమాన ప్రమాదంలో చనిపోయారని లోకసభ సచివాలయం వారు ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ఇలా నిర్థారణ కాని చరిత్ర నిర్మాణంతో పెద్దలే ప్రజలను తప్పుదోవ పట్టించారు. అందుకే నేను 2003లో ‘విశ్వమానవ ప్రజా చైతన్య సమితి’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా నేతాజీ మరణ రహస్యంపై కచ్చితమైన వివరాలను వెల్లడించాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నా. అలాగే దేశమంతటా తిరుగుతూ సామాన్యునికి అండగా ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలో ప్రచారం చేస్తున్నా. సత్యాల ఆధారంగా చరిత్ర లిఖించబడాలని, భారతదేశ పునర్నిర్మాణం జరగాలనీ నా ఆకాంక్ష.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement